*విజయవాడ పుస్తక ప్రపంచానికి తీరని లోటు: ‘బెల్లపు బాబ్జీ’ కన్నుమూత
*విజయవాడ బుక్ ఫెస్టివల్ విజయాల్లో కీలక పాత్ర
*మరణంలోనూ ఆదర్శం.. ఆశ్రం మెడికల్ కళాశాలకు భౌతికకాయం దానం
విజయవాడను అక్షర నగరంగా, పుస్తకాల రాజధానిగా నిలబెట్టడంలో విశేష కృషి చేసిన ప్రముఖ పబ్లిషర్, విజయవాడ పుస్తక మహోత్సవ సంఘం (VBFS) పూర్వ అధ్యక్షులు బెల్లపు బాబ్జీ (78) గారు గురువారం (జూలై 16, 2026) ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా కాలేయ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన అస్తమయం విజయవాడ సాంస్కృతిక, సామాజిక మరియు పుస్తక ప్రపంచానికి తీరని లోటు అని పుస్తక రంగ ప్రముఖులు, పాఠకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
బుక్ ఫెస్టివల్‌కు మూలస్తంభం:
విజయవాడ బుక్ ఫెస్టివల్‌కు బాబ్జీ గారు ఒక మూలస్తంభం లాంటివారు. 2015-16, 2016-17 సంవత్సరాల్లో విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ అధ్యక్షునిగా సేవలందించిన ఆయన, 2018 నుండి 2024 వరకు గౌరవాధ్యక్షులుగా ఉంటూ పుస్తక ప్రదర్శన విజయవంతం కావడానికి నిరంతరం దిశానిర్దేశం చేశారు. ఎన్నో ఏళ్లపాటు బుక్ ఫెస్టివల్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న స్వరాజ్య మైదానం నుండి వేదికను ప్రభుత్వ పాలిటెక్నిక్ మైదానానికి, ఆపై ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకు మార్చాల్సి వచ్చిన క్లిష్ట పరిస్థితుల్లో ఆయన చూపిన నాయకత్వ పటిమ అమోఘం. తన అద్భుతమైన చాణక్యంతో, నిర్వహణా నైపుణ్యంతో ప్రదర్శన ఏమాత్రం వైభవాన్ని కోల్పోకుండా చూశారు.
‘న్యూ స్టూడెంట్స్ బుక్ సెంటర్’తో దశాబ్దాల అనుబంధం:
“పుస్తకాల కోసమైతే హలో… న్యూ స్టూడెంట్ బుక్ సెంటర్‌కే చలో..” అనే క్యాప్షన్‌తో విజయవాడ ఏలూరు రోడ్డులో వెలసిన ‘న్యూ స్టూడెంట్స్ బుక్ సెంటర్’కు దశాబ్దాల చరిత్ర ఉంది. బాబ్జీ గారి తండ్రి గోపాలరావు గారు స్థాపించిన ఈ సంస్థను, తుదిశ్వాస విడిచే వరకు బాబ్జీ గారు మూతపడకుండా విజయవంతంగా నడిపారు. విద్యార్థులకు, పుస్తక ప్రియులకు జ్ఞానాన్ని చేరవేయడమే కాకుండా, వైద్య విద్యా పుస్తకాలకు (Medical Books) ఈ సంస్థను పెట్టింది పేరుగా మార్చారు. ఒకప్పుడు కొత్తకొత్త మోడల్స్‌లో పుస్తకాల మీద అంటించుకునే లేబుల్స్, ప్రముఖ చిత్రకారుడు బాపు గారి చేత ప్రత్యేకంగా వేయించిన గ్రీటింగ్ కార్డ్స్ ఈ షాపులో లభించేవి.
నిస్వార్థ సేవ.. తండ్రికి తగ్గ తనయుడు:
పుస్తక రంగంలోనే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ బాబ్జీ గారు ముందుండేవారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడలో సీనియర్ సభ్యుడిగా అనేక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆయన తండ్రి గోపాలరావు గారి నిజాయితీ, నిస్వార్థ సేవలను ఇప్పటికీ పలువురు గుర్తుచేసుకుంటారు. ఎవరి దగ్గరా పైసా ఆశించకుండా ఇతరులకు ఇళ్లు కట్టించిపెట్టిన గోపాలరావు గారి లక్షణాలే బాబ్జీ గారికి కూడా అబ్బాయి. ఆత్మీయులను సొంత మనుషుల్లా పలకరించడంలో, సహాయం చేయడంలో బాబ్జీ గారు ఎప్పుడూ ముందుండేవారు.
మరణంలోనూ ఆదర్శం:
బాబ్జీ గారు మరణంలోనూ సమాజానికి ఆదర్శంగా నిలిచారు. మరణానంతరం కూడా తన దేహం సమాజానికి ఉపయోగపడాలనే గొప్ప సంకల్పంతో, భౌతికకాయాన్ని వైద్య విద్యార్థుల పరిశోధనల నిమిత్తం ఏలూరులోని ‘ఆశ్రం మెడికల్ కళాశాల’ ఆసుపత్రికి అప్పగించాలని నిర్ణయించారు. ఇది ఆయనకున్న ఉన్నతమైన సామాజిక స్పృహకు, సేవా నిరతికి నిదర్శనం.
బాబ్జీ గారికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆయన భౌతిక కాయాన్ని సందర్శకుల కోసం రామవరప్పాడు సమీపంలోని వైస్ ఎల్ వీ అమరావతీగ్రాండ్-1 లోని ఆయన స్వగృహంలో ఉంచనున్నారు. విజయవాడ అక్షర చరిత్రలో బెల్లపు బాబ్జీ గారి పేరు ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతుంది.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, వారి కుటుంబ సభ్యులకు మా గాఢ సానుభూతి.
–సుంకర నాగభూషణం
