పూరీ జగన్నాథ్ @ 20 ఇయర్స్ ఇండస్ట్రీ

-‘బద్రి’ సినిమా రిలీజ్అయి నేటికి 20 యేళ్ళు..
-ఇరవైయేళ్ళలో 33 సినిమాలకు దర్శకత్వం..
తెలుగు సినీ ఇండస్ట్రీ లో తక్కువ టైంలో సినిమా తీయగల డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సినీ ప్రస్థానం నేటితో 20ఏళ్ళు పూర్తిచేసుకుంది. 2000 సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీన తన తొలి చిత్రం ‘బద్రి’ సినిమాని రిలీజ్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రేణు దేశాయ్, అమీషా పటేల్ హీరోయిన్స్ గా విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్ బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది. 33 యేళ్ళ వయస్సులో తొలి చిత్రంతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న పూరీ అదే ఉత్సాహంతో జగపతిబాబుతో ‘బాచి’ సినిమా తీసి ఓ మోస్తరు విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు.
ఆ సినిమా తర్వాత మాస్ మహారాజ్ రవితేజ హీరోగా ఇట్లు ‘శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మానాన్న తమిళ అమ్మాయి’ వంటి వరుస సూపర్ హిట్లతో అంచెలంచెలుగా ఎదిగి 2006లో మహేష్బాబు హీరోగా తెరకెక్కించిన ‘పోకిరి‘ సినిమాతో ఇండస్ట్రీ లో సరికొత్త ట్రెండ్ సృష్టించాడు.
ఈ సినిమా పాత రికార్డులని చెరిపేసి బాక్సాఫీస్ బాద్షాగా వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. ఆ తర్వాత అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కించిన ‘దేశముదురు’ కూడా భారీ విజయం అందుకుంది. ఇక రాంచరణ్ ను హీరోగా పరిచయం చేస్తూ రూపొందించిన ‘చిరుత‘ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ప్రభాస్ తో బుజ్జిగాడు, మహేష్ బిజినెస్ మ్యాన్, ఎన్టీఆర్ టెంపర్ వరకు పూరీ ప్రభంజనం కొనసాగిందని చెప్పాలి. ఆ తర్వాత ఆయన తెరకెక్కించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇక గత ఏడాది ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ సినిమా తెరకెక్కించారు.

ఆ సినిమాతో ఇస్మార్ట్ హిట్ కొట్టి మళ్లీ హిట్ ట్రాక్ లోకి వచ్చారు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండతో ఫైటర్ అనే భారీ పాన్ ఇండియా మూవీ తీస్తున్నారు పూరి. ఈ సినిమా ఈ ఇయర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. సినిమా దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా బహుముఖ రంగాల్లో రాణిస్తున్న పూరీ తొలుత టీవీ సీరియల్స్ కు దర్శకత్వం వహించి తర్వాత రాంగోపాల్ వర్మ దగ్గర దర్శకత్వశాఖలో పనిచేసాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా పూరీ జగన్నాథ్ది సెపరేట్ స్టైల్ అని చెప్పాలి. ఒక కన్నడ, ఒక హింది సినిమాతో కలిపి ఇప్పటి వరకు 33 సినీమాలు డైరెక్ట్ చేసాడు. ఒకవైపు దర్శకుడిగానే కాకుండా ‘వైష్ణో అకాడెమి’ బేనర్ని స్థాపించి మంచి సినిమాలు నిర్మిస్తున్నాడు పూరీ. ఒకసారి ఫిలింఫేర్ అవార్డ్, మూడు సార్లు నంది అవార్డ్ లు అందుకున్నాడు.
అలానే షార్ట్ ఫిలిం కాంటెస్ట్ ద్వారా ఎంతో మంది యువ దర్శకులకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు. తెలుగు చిత్రాలతో పాటు హిందీ సూపర్ స్టార్ ‘బిగ్ బి’ అమితాబ్ బచ్చన్తో కలసి బుడ్డా హోగ తేరా బాప్, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ని సినిమారంగానికి పరిచయం చేస్తూ అప్పులాంటి విజయవంతమైన చిత్రాల్ని తీశారు.
‘143’ సినిమా ద్వారా తమ్ముడు సాయిరాం శంకర్ని, కొడుకు ఆకాష్ ని ‘మెహబూబా’ సినిమా ద్వారా వెండితెరకు హీరోలుగా పరిచయం చేసాడు.
ఈ సందర్భంగా పూరీ జగన్నాథ్ కి 64కళలు.కాం శుభాకాంక్షలు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap