అంగర అక్షరాల పల్లకీలో “పురిపండా వైభవం”

కొన్ని జీవితాలు చరిత్రలుగా మారినప్పుడు, ఆ చరిత్రలోని ప్రతి అధ్యాయం వర్తమాన జీవితాలకు పాఠాలు బోధించే తరగతి గదుల్లా మారిపోయి, ప్రతివాక్యం ఒక అధ్యాపకుడై అవసరమైన పాఠాలకు రోజు సందర్భాలు, ఆ చరిత్రను చదివే పాఠకుల్ని ఆలోచింపజేసి, అనుభూతి పరంపర పొఆరల్లోకి లాకెళ్లి, తాదాత్మ్యం చెందే స్థాయిని కానుకలుగా అందించే జీవితచరిత్ర రచనలు, ఎప్పటికీ వెలిగే దీపాలుగా నిలిచిపోతాయి. ఆ స్థాయిలో తన స్థానాన్ని పదిలం చేసుకున్న మహెూత్తర పుస్తకరూపం కీ.శే. అంగర సూర్యారావు కలం నుండి వెలువడిన “60 ఏళ్ల ఆంధ్ర సాహిత్య చరిత్రలో పురిపండా“.

అంగర సూర్యారావు సుప్రసిద్ధ నాటక రచయిత, కథకులు, చరిత్రకారులు, విశాఖ రచయితల సంఘం వ్యవస్థాపకులు. పురిపండా అప్పలస్వామి జగమెరిగిన ఖ్యాతిగాంచిన సాహితీవేత్త, స్వాతంత్య్ర సమరయోధుడు, వ్యావహారిక భాషోద్యమకారుడు, బహుభాషాప్రవీణుడు, అద్వితీయ మేథావి, అన్నిటికీమించి గొప్ప స్నేహశీలి. అంగర సూర్యారావు, పురిపండా జీవితాన్ని వ్రాయడమంటే… ఒక ఆకాశం వచ్చి, మరో ఆకాశంతో కరచాలనం చేసినట్లుగా వుంది. ఒక మహాసముద్రం వచ్చి, మరో మహాసముద్రాన్ని ఆలింగనం చేసుకున్నట్లుగా వుంది. ఒక సాహిత్యశిఖరం, మరో సాహిత్య శిఖరంతో కలిసి విశాఖ సముద్రతీరాన తనవితీరా విహరించినట్లుగా వుంది. అంగర సూర్యారావు అందించిన ఈ గ్రంథంలో కేవలం 60 ఏళ్ల ఆంధ్ర సాహిత్య చరిత్రలో పురిపండా జీవితం, సాహిత్య విశేషాలు మాత్రమే చోటు చేసుకోలేదు. ఈ పుస్తకం నిండా 60 ఏళ్లపాటు నడిచిన దేశచరిత్ర, సాహిత్య చరిత్రలు పోటీపడి మనల్ని పలకరిస్తున్నాయి. వీటితో పాటు అప్పటి సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక, స్వాతంత్య్ర, వ్యావహారిక భాషోద్యమ నేపథ్యాలు సైతం మనముందు హాజరుపట్టికలో సంతకాలు పెడుతున్నాయి. ఈ పుస్తకంలో చోటుచేసుకున్న ఛాయాచిత్రాల విలువను లెక్కకట్టడానికి గణితశాస్త్ర సంఖ్యలు చాలటంలేదు. వెరసి ఈ తరం వారికి తెలియని ఎన్నో ఉపయుక్తమైన అంశాలు, పాఠకుల జ్ఞాన సంపద ఖాతాలో చేరటానికి ఈ పుస్తకం ద్వారా పోటీపడుతున్నాయి.

అంగర సూర్యారావు హృదయనాడుల నుండి పురుడుపోసుకున్న ఈ పుస్తకం రెక్కలనిండా పురిపండా జీవిత, సాహిత్య విశేషాల స్వర్ణమెరుపులు, ప్రతి సందర్భంలోనూ మనల్ని తాకి ఉక్కిరిబిక్కిరి చేయటం ఈ రచనలోని విశేషం. ఈ పుస్తకంలోని భావాలతో మన మనసులు చాలా ఇష్టంగా స్నేహం ఏర్పరచుకున్నప్పుడు, నేరుగా ఈ పుస్తక కథానాయకుడు పురిపండా అప్పలస్వామి మనముందు సజీవంగా నిలబడుతారు. మనతో మాట్లాడుతారు, మనతో కరచాలనం చేసి, మనల్ని సమావేశపరచి, అప్పటి తన కవితా సమితి సభ్యులందరిని సమావేశపరచి, సాహిత్య గోష్ఠులు నిర్వహిస్తారు. తన అనర్ఘలమైన వాగ్ధాటితో మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తూ తన ప్రసంగాలు కొనసాగిస్తారు. ఉన్నత చదువులు లేకపోయిన, అంతులేని కృషితో, అత్యంత ప్రతిభావంతమైన బహుభాషావేత్తగా, కవిగా, రచయితగా, పరిశోధకుడుగా, వ్యావహారిక భాషోద్యమకారుడుగా, పురిపండా తనను తాను ఒక అద్భుత శిల్పంగా మలచుకున్న తీరును అంగర సూర్యారావు అందించిన రచనా వైభవం ఒక శాశ్వత శిలాఫలకంగా మారిన సత్యానికి నిలువెత్తు సంతకమే ఈ పుస్తకం.

పురిపండా అప్పలస్వామి ఒక పేద కుటుంబంలో 1904 నవంబరు 13వ తేదీన సాలూరులో వెంకటస్వామి, జయమ్మ దంపతులకు జన్మించారు. తెలుగుతోపాటు చిన్నతనంతోనే ఒడియా భాషతో ఆయనకు అనుబంధం ఏర్పడింది. పురిపండాకు బాల్యంనుండే సాహిత్యం మీద ఆసక్తి కలగటానికి కారకుడు కర్రి ధర్మయ్య. ఆయన నేతృత్వంలోనే పురిపండా అనేక కావ్యాలు, గ్రంథాలను పఠించి, ఛందోబద్ధమైన పద్యాలు రాయటం ప్రారంభించారు. పదిహేనేళ్ల వయసులోనే అనేక పత్రికలకు పద్యాలు, వ్యాసాలు పంపటం, ప్రతి ఒక్కటి ఆయా పత్రికల్లో అచ్చుకావటం, పురిపండా పేరు అందరికీ పరిచయం కావటం వెనక ఆయన ప్రజ్ఞాపాటవాల పరిణితి ఏ స్థాయిలో పతాకంలా ఎగిరిందో ఆ విశేషాలను ఆకర్షనీయంగా అందించిన అంగర సూర్యారావు అభినందనీయులు. పురిపండా తొలి గ్రంథం ‘రాట్నపతాకం’. అప్పటికి ఆయన వయసు 17 సంవత్సరాలు. సాహిత్య సాధనచేస్తూనే 1926లో వడ్డాది సీతారామాంజనేయులు, శ్రీశ్రీ గార్లతో కలిసి పురిపండా,’కవితా సమితి’ని స్థాపించి, ఆ సంస్థద్వారా ఎన్నో విశిష్టమైన కార్యక్రమాలను చేపట్టారు. 1933లో రవీంద్రనాథ్ ఠాగూర్ విశాఖను సందర్శించినప్పుడు, విశ్వకవిని ‘కవితా సమితి’ కి ఆహ్వానించి సత్కరించిన విశేషాలతో పాటు, 1973 నుండి అభ్యుదయ రచయితల సంఘానికి గౌరవ అధ్యక్షులుగా పురిపండా వారు అందించిన సేవలు మనముందు కదలాడుతూ మనల్ని సైతం ఆ సన్నివేశాలలో భాస్వాముల్ని చేయటం అంగర రచనా చమత్కారానికి హారతులు పట్టినట్లుగా వుంది.

1928లో భీమునిపట్నంలో జరిగిన అఖిలాంధ్ర కవిసమ్మేళనానికి ముఖ్య కార్యకర్త పురాపండా. ఈ కార్యక్రమానికి గిడుగువారు పాల్గొన్న ఆ సందర్భంలోనే వ్యావహారికా భాషోద్యమ నిర్వహణమీద ఇద్దరిమధ్య అనేక చర్చలు జరిగి, ఆ చర్చలు వెంటనే కార్యరూపంలోకి రావటానికి పురిపండా పోషించిన పాత్ర తాలూకు విశేషాలు ఎంతో ప్రేరణగా మన భుజాలు తడుతున్నాయి. కవిత్రయం మాహాభారతాన్ని తెలుగులో రచించారు. కానీ ఆ గ్రంథాలు గ్రాంథిక భాషలో వుండటంవల్ల సామాన్య ప్రజల పఠనకు అవి ఆమడ దూరంలో వుండటం గమనించిన పురిపండా, అందరికీ అర్థమయ్యేలా వ్యావహారిక భాషలో ఆంధ్ర మహాభారత రచన సాగించి శాశ్వతమైన కీర్తిని తన ఖాతాలో జమచేసుకున్నారు. ఆ తరువాత పురిపండా వాల్మీకి రామాయణం, భాగవత గ్రంథాలను సైతం అదే మార్గంలో నడిపించారు. రెండవ ప్రపంచ యుద్ధసమయంలో కవిత్వంలో ఉప్పెనలా వచ్చిపడిన ‘అధివాస్తవిక ధోరణీ’ ప్రభావంతో పురిపండా రాసిన కవితల పరిచయం మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. ఒకచోట పురిపండా… “రెండు వైపులా వెలిగించాను కొవ్వొత్తిని / అది శ్రీశ్రీ లా వెలుగుతోంది…’ అంటారు. కొద్దికాలంలోనే అధివాస్తవిక ధోరణి, విప్లవ కవిత్వంలో కలిసిపోయాక, పురిపండా విప్లవధోరణిలో రాసిన కవితల్ని సైతం అంగర ఈ పుస్తకంలో సమర్థవంతంగా పరిచయం చేశారు.

పురిపండా రచనల్లో ముఖ్యమైనవి… మహమ్మద్ చరిత్ర, సౌదామిని, ఒరియా పాటలు, విశ్వకళావీధి, హంగేరీ విప్లవం, దేవీ భాగవతం, వంగ సాహిత్య చరిత్ర, ఒరియా సాహిత్య చరిత్ర, మొదలైనవి. వీటితోపాటు అనువాద గ్రంథాలుగా ప్రశంసలు అందుకున్న అమృత సంతానం, మట్టిమనుష్యులు…ఉన్నతశ్రేణి సాహిత్య నీలాకాశంలో మెరిసిన మెరుపుల సమాచారాన్ని అంగర కలం అందించిన విధానం అపూర్వమైన రీతిలో కొనసాగింది. ఈ సందర్భంగా పురిపండా కలంనుండి వెలువడిన ‘పులిపంజా’ గ్రంథానికి సంబంధించిన ఉత్సాహపూరితమైన విషయాలు, ఈ గ్రంథం శిఖరాగ్రస్థాయికి చేరటానికి దోహదపడింది. గూటాల కృష్ణమూర్తి ఆహ్వానం అందుకుని శ్రీశ్రీతో కలిసి పురిపండా జరిపిన లండన్ యాత్రా విశేషాలు, చాలాకాలం పాఠకుల జ్ఞాపకాల్లో సందడి చేస్తూనే వుంటాయి. శ్రీశ్రీతో పురిపండా స్నేహం అద్వితీయమైన రీతిలో ఈ పుస్తకంలో వర్ణించబడింది. వ్యక్తిత్వపరంగా పురిపండా పూజనీయ స్థానంలో కొనసాగిన సన్నివేశాల మేళవింపు, మంగళవాయిద్యాల మ్రోతగా ఈ పుస్తకంలో మిగిలిపోవటం అంగర కలానికి ఉన్న బలానికి బంగారుపతకాన్ని బహూకరించినట్లుగా వుంది. నెలకు 30 రూపాయల జీతంతో విశాఖపట్నం ఖాదీభాండారం మేనేజర్ గా సేవలందించడమే కాదు, ఖాదీ ఉద్యమంలో సైతం తన పాత్రను ప్రశంసనీయంగా పోషించి, తన చివరి శ్వాసదాకా తన వొంటిమీద ఖద్దరు తప్ప మరి ఏ ఇతర వస్త్రాలను ధరించని పురిపండా జీవిత విశేషాలు మనల్ని నిబద్ధత రహాదారుల వెంట సగౌరవంగా నడిపించటం ఒక విశేషంగా ఈ పుస్తకంలో ప్రకాశిస్తోంది.

నవంబరు 18, 1982 తేదీన ఉదయం 9 గంటల 45 నిమిషాలకు పురిపండా అప్పలస్వామి అనే ఒక సాహిత్య ఘనాపాటి శ్వాస పడమటివైపుకు వాలిపోయిన క్షణాలను, అంతిమయాత్రా దృశ్యాలను ఒక చలనచిత్ర రూపంలో అంగర అందించిన విధానం, పాఠకులచేత కంటతడి పెట్టిస్తోంది. చనిపోవటానికి ముందురోజు తన డైరీలో ‘రేపటి ప్రయాణానికి సిద్ధపడటం…’ అంటూ పురిపండా రాసుకున్న వాక్యాలు మన కనురెప్పలమధ్య విషాదానికి గుడారాలై నిలుస్తున్నాయి. ఆ సందర్భంలో పురిపండా మరణానికి, తన దుఃఖాన్ని ఆపుకోలేక అంగర సూర్యారావు కార్చిన కన్నీళ్లే అక్షరాలై ఈ అధ్యాయాన్ని లిఖించాయని సాక్ష్యం చెప్పటానికి కాలం తన పత్రాలతో సిద్ధపడుతోంది. ’60 ఏళ్ల ఆంధ్ర సాహిత్య చరిత్రలో పురిపండా’ అనే గ్రంథం ఇంత అద్వితీయంగా అంగర సూర్యారావు కలంనుండి వెలువడటానికి, 30 సంవత్సరాలుగా పురిపండావెంట తాను నడవడమే కాకుండా, ఆయన ప్రతి కదలికను తన మనసు తాళపత్రాల మీద నమోదు చేసుకోవటానికి కారణమైన ఒక గొప్ప సంకల్పం ఈ పుస్తకంలోని ప్రతిపేజీలో ఒక పతాకమై ఎగురుతోంది. కీర్తిశేషులైన అంగర, పురిపండా అనే రెండు సాహితీశిఖరాలు సజీవంగా మనముందు కదలాడే సందర్భాలకు తల్లిగర్భంగా మారిన ఈ గ్రంథ రచనకు పాఠకుడిగా పాదాభివందనం చేస్తున్నాను.

డాక్టర్ కె.జి. వేణు, 98480 70084

(ముద్రణ: జులై, 2024, మూల్యం: రూ. 150/-
ప్రతులకు: అంగర కృష్ణారావు, విశాఖపట్నం, 77804 78710
అంగర వెంకట్, మండపేట, 98858 67426)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap