సినీ అభిమానుల కోసం ఈ ఏడాది ద్వితీయార్ధంలో రాబోవు సినిమాల గురించి…
సకారాత్మక దృక్పథం మంచే చేస్తోంది. ఏమి జరుగుతుందో తెలియని సందర్భాలలో పాజిటివ్ యాటిట్యూడ్తో మేలు జరిగే ఆస్కారం ఉంటుంది. ఆ రకంగా చూసినప్పుడు ఈ యేడాది సినిమా రంగంలో ప్రథమార్ధంతో పోల్చితే ద్వితీయార్ధం బాగుంటుందనే అనిపిస్తోంది. ఎందుకంటే యువ కథానాయకుల చిత్రాలు అనేకం ఈ ఆరు నెలల్లో జనం ముందుకు రాబోతున్నాయి.
ఈ యేడాది తొలి అర్ధభాగం చివరిలో ‘కల్కి 2898 ఎ.డి.’ వంటి సినిమాతో థియేటర్లు కళకళలాడాయి. ఆ సినిమా మీద వచ్చిన విమర్శలను పక్కన పెడితే (ఓ రకంగా ఆ విమర్శలన్నీ సినిమా ప్రచారానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో దోహదం చేశాయి) ఈ యేడాది జాతీయ స్థాయిలో రూ. 1,000 కోట్ల గ్రాసన్ను వసూలు చేసిన సినిమాగా ‘కల్కి’ నిలిచింది. అలా వెయ్యి కోట్ల గ్రాసన్ను అందుకున్న రెండు సినిమాలు ప్రభాస్ ఖాతాలో జమ అయ్యాయి. ‘బాహుబలి-2’ తర్వాత ఆ రేర్ రికార్డ్ ను ‘కల్కి’ సాధించింది.
అయితే మొత్తంగా ప్రథమార్ధంలో లభించిన విజయాలు నిరాశను కలిగించేవే. ఈ నేపథ్యంలో యువతను ఆకట్టుకునే చిత్రాలు, తమిళ అనువాద చిత్రాలు రాబోతున్న ద్వితీయార్ధంపై అందరూ ఆశలు పెట్టుకుంటున్నారు. అలా ద్వితీయార్ధం తమిళ డబ్బింగ్ సినిమా ‘భారతీయుడు–2’ మొదలైంది. కమల్ హాసన్, సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రధారులుగా సుభాస్కరన్ నిర్మించిన ఈ సినిమాను శంకర్ డైరెక్ట్ చేశారు. 28 సంవత్సరాల క్రితం వచ్చిన ‘భారతీయుడు’కు ఇది సీక్వెల్. ఇది తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదలైంది. జూలై 26న రిలీజ్ కాబోతున్న మరో తమిళ డబ్బింగ్ సినిమా ‘రాయన్’. ధనుష్ హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సందీప్ కిషన్, అపర్ణ బాలమురళి, దుషార విజయన్ ప్రధాన పాత్రలు పోషించారు. దీనిని సూర్య పిక్చర్స్ సంస్థ నిర్మించగా, ఎ.ఆర్. రెహమాన్ సంగీతాన్ని అందించారు.
రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ‘ఇస్మార్ట్ శంకర్’ సీక్వెల్ ‘డబుల్ ఇస్మార్ట్’ ఆగస్ట్ 15న రాబోతోంది. ఇందులో సంజయ్ దత్ ప్రతి నాయకుడిగా నటించాడు. ఇదే రోజున హీరో రవితేజ, డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న మూడో చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ వస్తుందని తెలుస్తోంది. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. విక్రమ్ నటిస్తున్న తమిళ అనువాద చిత్రం ‘తంగలాన్’ సైతం ఆగస్ట్ 16న ఆగస్ట్ 16న విడుదల కావాల్సి ఉంది. ఇదే నెల 29న నాని నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘సరిపోదా శనివారం’ వస్తోంది. ‘హాయ్ నాన్న’ తర్వాత నాని నటించిన ఈ యాక్షన్ డ్రామాను వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించారు.
తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాలు ఇప్పుడు తమిళంతో పాటు తెలుగులోనూ ఒకే రోజున వస్తున్నాయి. పైగా విజయ్ ఇటీవలే తెలుగులో ‘సార్’ మూవీలోనూ నటించాడు. అతని తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (గోట్) మూవీ సెప్టెంబర్ 5న విడుదల అవుతోంది. దీనిని రెండు తెలుగు రాష్ట్రాలలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ విడుదల చేస్తోంది. మలయాళ కథానాయకుడు దుల్కర్ సల్మాన్ ‘మహానటి, సీతారామం’ చిత్రాలతో తెలుగు వారికి చేరువయ్యాడు. ఇటీవల వచ్చిన ‘కల్కి’లోనూ అతిథి పాత్రలో మెరిశాడు. దుల్కర్ హీరోగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ‘లక్కీ భాస్కర్’ అనే సినిమా నిర్మిస్తోంది. మీనాక్షి చౌదరి నాయిక. ఈ సినిమాను మొదట సెప్టెంబర్ 27న విడుదల చేయాలని అనుకున్నారు, కానీ ఇప్పుడు ప్రీ పోన్ చేసి సెప్టెంబర్ 7న రిలీజ్ చేస్తున్నారు. ఇది దుల్కర్ సల్మాన్ తండ్రి, ప్రముఖ నటుడు మమ్ముటి పుట్టినరోజు కావడం విశేషం. అదే నెలాఖరులో 27న ఎన్టీయార్ నటిస్తున్న ‘దేవర’ సినిమా విడుదల కాబోతోంది. ‘ట్రిపుల్ ఆర్’ తర్వాత వస్తున్న ఎన్టీయార్ సినిమా ఇదే. ఈ మూవీతోనే శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తెలుగు చిత్రసీమలోకి అడుగుపెడుతోంది. ఈ సినిమా విడుదల కాకముందే ఆమె రామ్ చరణ్ తేజ్ కొత్త సినిమాలోనూ కథానాయికగా ఎంపికైంది.
అక్టోబర్ మాసంలోనూ అనువాద చిత్రాలు హంగామా సృష్టించబోతున్నాయి. ఆ నెల 10వ తేదీన సూర్య పాన్ ఇండియా మూవీ ‘కంగువా’, రజనీకాంత్ ‘వేట్టయాన్’ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. అన్నీ అనుకూలిస్తే… శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ తో దిల్ రాజు నిర్మిస్తున్న’గేమ్ ఛేంజర్’ కూడా అదే నెలలో రావాలి. నవంబర్ మాసంలో విడుదలయ్యే సినిమాల వివరాలు ఇంకా తెలియ రాలేదు. డిసెంబర్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ అవుతుందని అంటు న్నారు. ఏపీలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరిం చారు. పాలన కాస్తంత గాడిలో పడిన తర్వాత సెట్స్ మీద ఉన్న సినిమాలను పూర్తి చేస్తానని నిర్మాతలకు హామీ ఇచ్చారాయన. ఆ రకంగా సెప్టెంబర్, అక్టోబర్ నాటికి ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ పూర్తయ్యే ఆస్కారం ఉంది. డిసెంబర్ మాసంలోనే అల్లు అర్జున్ ‘పుష్ప-2’ రాబోతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దీనితో పాటు అదే నెల 20న నితిన్ నటిస్తున్న ‘రాబిన్ హుడ్’ మూవీ విడుదల కానుంది. మొత్తం మీద యువతను ఆకట్టుకునే యువ కథానాయకులు, తమిళ అనువాద చిత్రాలు ఈ ఆరు నెలల్లో చాలానే రాబోతున్నాయి. రెగ్యులర్ గా వచ్చే అప్ కమింగ్ హీరోల సినిమాలు ఉండనే ఉంటాయి. వాటిల్లో ఏ కొన్ని విజయం సాధించినా చిత్రసీమ కాస్తంత ఊపిరి పీల్చుకుంటుంది.
–ఓంప్రకాష్, సీనియర్ జర్నలిస్ట్