మంచి మనసున్న మారాజు డాక్టర్ పి.వి.జి. రాజు దాతృత్వానికి ప్రతీక – పూసపాటి అశోక్ గజపతి రాజు
డాక్టర్ పి.వి.జి. రాజు మంచి మనసున్న మహారాజు అని, దాతృత్వానికి నిలువుటద్దమని, అలాంటి కుటుంబంలో జన్మించే అవకాశం కలగడం భగవంతుడు అందించిన వరం అని పూర్వ కేంద్ర మంత్రివర్యులు పి. అశోక్ గజపతి రాజు పేర్కొన్నారు. బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈనెల 17వ తేదీ మంగళవారం గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో డాక్టర్ పి.వి.జి. రాజు శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యఅతిథిగా విచ్చేసిన పూర్వ కేంద్ర మంత్రివర్యులు పూసపాటి అశోక గజపతిరాజు మాట్లాడుతూ ఎదిగే కొద్ది అహం పెంచుకోవద్దని, సమయ పాలన పాటించమని చెబుతూ సాధారణ వ్యక్తులుగా క్రమశిక్షణతో పెరగాలని తన తండ్రి చెప్పిన మాటలను గౌరవిస్తూ జీవిస్తునానన్నారు. ప్రాథమిక విద్య మాతృ భాషలో ఉండాలని, పర భాష వ్యామోహంలో పడరాదని, ప్రపంచ దేశాలన్నీ ప్రాథమిక విద్యను మాతృభాషలోనే కొనసాగిస్తున్నాయని గుర్తు చేశారు. గత ప్రభుత్వం ప్రాథమిక విద్యలో మాతృభాషను తొలగించడం వలన 10 లక్షల మంది బాలబాలికలు విద్యకు దూరమైనారని, వేలాది పాఠశాలలు మూత పడ్డాయన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర రాజధానిని తాకట్టు పెట్టిందని, ప్రపంచంలో మరి ఏ దేశమూ ఇలాంటి దుర్మార్గమైన పని చేపట్టలేదన్నారు. ఓట్లను అమ్మకానికి పెట్టరాదని, మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని, తద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్నారు. ఒట్టి మాటలకే పరిమితమైన రాజకీయ వ్యవస్థను నిర్మూలించాలన్నారు. ప్రజల్లో అసహనం ఉండరాదని, దేవుడిచ్చిన ఆలోచన శక్తిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
అవనిగడ్డ శాసనసభ్యులు ఆంధ్ర భాషోద్యమ నేత డాక్టర్ మండలి బుద్ధ ప్రసాద్ ప్రసంగిస్తూ బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి దాతృత్వం గల మహోన్నతమైన వ్యక్తి అని, వారి నేతృత్వంలో డాక్టర్ పి.వి. జి. రాజు శత జయంతి వేడుకలు జరుపుకోవటం అభినందనీయమన్నారు. పూసపాటి వంశీయులు మర్యాదకి మారు పేరు అని కొనియాడారు. డాక్టర్ పి.వి.జి. రాజు ఐదు సార్లు ఎమ్మెల్యేగా, నాలుగు సార్లు లోక్ సభ సభ్యునిగా, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా కృషి చేశారని, భారతదేశంలో కెల్ల గొప్ప దాత అని కొనియాడారు. డాక్టర్ పి.వి.జి. రాజు భోగరాజుగా కాకుండా త్యాగరాజుగా జీవితాన్ని కొనసాగించారన్నారు. బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ప్రసంగిస్తూ ఉత్తర కోస్తా జిల్లాలలో విజయనగర రాజుల నుండి ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని మేలు పొందని వారు లేరన్నారు. డాక్టర్ పి.వి.జి.రాజు తన కోటలను, ప్యాలెస్ లను విద్యాసంస్థలకు అందించారని, దాదాపు 17 వేల ఎకరాలు సింహాచలం దేవస్థానానికి బహుకరించారన్నారు. సోషలిస్ట్ పార్టీకి జాతీయ అధ్యక్షులుగా పనిచేస్తూ సోషలిస్టు మహారాజుగా పేరుగాంచినారన్నారు. సభకు అధ్యక్షత వహించిన జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి ప్రసంగిస్తూ నేడున్న రాజకీయ నేతలు పి.వి.జి. రాజును ఆదర్శంగా తీసుకుని నిరాడంబరంతో, నిజాయితీతో పనిచేయాలన్నారు. పి.వి.జి రాజు స్వాతంత్ర్య ఉద్యమంలో జైలు జీవితాన్ని అనుభవించారని, జయప్రకాష్ నారాయణ, మధులిమాయే లాంటి సోషలిస్ట్ నేతలతో కలిసి పనిచేశారన్నారు. విలువలు కలిగిన విద్యావేత్త, రాజకీయ వేత్త, మానవత్వం మూర్తీభవించిన మహా మనిషి పి.వి.జి. రాజు ఆశయాలను, సిద్ధాంతాలను, సేవలను స్మరించుకోవటానికి సమాజంలో ధాతృత్వాన్ని పెంపొందించడానికే పి.వి.జి. రాజు శత జయంతి వేడుకలను నిర్వహిస్తున్నామని తెలిపారు.
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి 15 సంవత్సరాల క్రితమే ఐదు కోట్ల రూపాయల విరాళం ఇచ్చిన డాక్టర్ పొదిల ప్రసాద్ ప్రసంగిస్తూ సంపాదించిన మొత్తంలో కొంతమేరకు తిరిగి సమాజానికి చెల్లించాలని కోరారు. జింఖానా ఆధ్వర్యంలో 100 కోట్ల రూపాయల విరాళంతో మాత శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించబోతున్నామని, డాక్టర్ పొదిల ప్రసాద్ సూపర్ స్పెషాలిటీ బ్లాక్ పైన మరో రెండు అంతస్తులు నిర్మించి పేద రోగులకు తోడ్పడుతున్నామన్నారు. డాక్టర్ పి.వి.జి. రాజు దాతృత్వంతో పోలిస్తే మేము చేసే త్యాగాలు తక్కువే అన్నారు. హీల్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ కోనేరు సత్య ప్రసాద్ మాట్లాడుతూ 16000 మంది అనాధ పిల్లలకు అత్యున్నత విద్యను అందించామని, ప్రస్తుతం మరో నాలుగు వేల మంది అనాధ పిల్లలకు వివిధ ప్రాంతాలలో విద్యను అందిస్తున్నామన్నారు. ప్రముఖ గాయకులు గజల్ శ్రీనివాస్ ప్రసంగిస్తూ డాక్టర్ పి. వి.జి. రాజు 250 ఎకరాల విస్తీర్ణంలో గల తన ప్యాలెస్ ను కోరుకొండ సైనిక్ స్కూల్ కి విరాళంగా ఇచ్చి భారతదేశంలో మొదటి సైనిక్ స్కూల్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారన్నారు. డాక్టర్ పి.వి.జి రాజు తన చివరి జీవితాన్ని సింహాచలం దేవాలయ సమీపంలో నిరాడంబరంగా ఆధ్యాత్మిక సేవలో గడిపారన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ పి.వి.జి రాజు విద్యా పురస్కారాలను శారదానికేతన్ వ్యవస్థాపకులు ఉన్నవ లక్ష్మీనారాయణ, లక్ష్మీబాయమ్మ దంపతుల వారసురాలు వి. హేమ, శ్రీ పాటిబండ్ల సీతారామయ్య హై స్కూల్ వ్యవస్థాపకులు పాటి బండ్ల సీతారామయ్య మనువడు పాటిబండ్ల విష్ణువర్ధన్ కు, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ ( హీల్ ) వ్యవస్థాపకులు డాక్టర్ కోనేరు సత్యప్రసాద్ లకు పూర్వ కేంద్ర మంత్రివర్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు చేతులు మీదుగా ప్రధానం చేశారు. ఈ సందర్భంగా పెనుమెత్స నాగరాజు సహకారంతో ప్రచురించిన పూసపాటి రాజుల యొక్క పూర్వోత్తరం చారిత్రిక గ్రంధాన్ని పి. అశోక్ గజపతిరాజు ఆవిష్కరించారు. తొలుత పి.వి.జి.రాజు చిత్రపటానికి పూలమాలలు వేసి అతిధులందరూ ఘనంగా నివాళులు అర్పించారు. సభ ప్రారంభంలో ఆర్. రాజేష్, పి.వి.రమణ ల బృందం నేతృత్వంలో నిర్వహించిన అభ్యుదయ గేయలాపన సభికులలో ఆలోచనను రేకెత్తించింది. ఈ కార్యక్రమంలో మానవత నేతలు పావులూరి రమేష్, టి. ధనుంజయ రెడ్డి, రెడ్ క్రాస్ డిస్ట్రిక్ ఫీల్డ్ ఆఫీసర్ షేక్ జానీ రసూల్, బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, శాసన మండలి సభ్యులు కె.ఎస్. లక్ష్మణరావు, మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్, ఇండియన్ టొబాకో అసోసియేషన్ కార్యదర్శి యార్లగడ్డ చౌదరి తదితరులు ప్రసంగించారు.
-వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి