విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో పరిచయం చేయాలన్న సంకల్పంతో 64కళలు.కాం సమర్పిస్తున్న “ధృవతారలు” రెగ్యులర్ ఫీచర్లో ఆయా మహానుబావుల జన్మదిన సందర్భాలలో వారిని జ్ఞాపకం చేసుకుందాం.
ధృవతారలు – 8
కల్పనకు సహజ రూపకల్పన కలిగిస్తూ అపు రూపమైన రచనలు ఆంగ్లభాషలో చేసిన ప్రముఖ భారతీయ రచయిత ఆర్.కె. నారాయణన్ తమిళ నాట జన్మించాడు. తొలిగా ఉపాధ్యాయునిగా జీవితం
ప్రారంభించి, అది నచ్చక ప్రపంచ పాఠకులు అతని రచనల వెంటపడేలా చేసి, రచనా రంగంలో ఆరి తేరిన ఆంగ్ల రచయిత ఇతడు. ఈయన తొలి నవల స్వామి అండ్ ఫ్రెండ్స్. అంచెలంచెలుగా ఎదిగి, నేటికీ విజయవంతంగా నడుస్తున్న ఇండియన్ థాట్ పబ్లికేషన్ సంస్థ స్థాపనకు దారి తీసింది. 1942 లో మాల్గుడి డేస్ అనే ప్రఖ్యాత నవలను ప్రచురించాడు. తదుపరి ఇంగ్లీష్ టీచర్, మిస్టర్ సంపత్ వంటి నవలలలో తన ఆధునిక భావాలను ప్రదర్శించాడు. నవలలే కాక పలు వ్యాసాలు కూడా రచించాడు. ఈ వ్యాసాలన్నీ “నెక్స్ట్ సండే” పేరిట సంకలనమయ్యాయి. ఈయన రచించిన గైడ్ నవల హిందీ, ఇంగ్లీష్ భాషలలో సినిమాలుగా చిత్రీకరించబడి అఖండ విజయాలను చవిచూశాయి.
ఆర్.కె. నారాయణన్ విదేశాలలో విస్తృతంగా పర్యటించి, ఇంగ్లండులోని యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్ నుంచి తొలి డాక్టరేట్ ని అందుకున్నాడు. రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన ఆర్.కె. నారాయణన్ మన భారతీయ విద్యావిధానంలో పలు మార్పులకు సిఫార్సులు చేశాడు. పద్మవిభూషణ్, సాహిత్య అకాడమీ అవార్డులు, ఎసిబెన్సన్ మెడల్, పద్మభూషణ్ వంటి మహోన్నతమైన అవార్డులెన్నో అందుకున్న నవలాకారుడు ఆర్.కె. నారాయణన్ నేటికీ మన ధృవతార !
(ఆర్.కె. నారాయణన్ జన్మదినం అక్టోబర్ 10, 1906)