చింతకిందికి ‘రావిశాస్త్రి ‘ సాహితీ పురస్కారం

కళింగాంధ్ర కథ తీరే వేరు. దాని నడక, దాని తీవ్రత, దాని వెటకారం, దాని సామాజిక ఆదర్శం అన్నీ ప్రత్యేకమే. గుగ్గురువు గురజాడ నుంచి మొదలు పెట్టుకుంటే వర్తమానం వరకూ ఉత్త రాంధ్ర మట్టిలోనే ఏదో మహత్తు ఉన్నట్టుగా ఇక్కడి కథకులు చెలరేగిపోతుంటారు. చాసో, రావిశాస్త్రి, కారామాస్టారు, పతంజలి.. ఇలా చెప్పుకుంటూ వెళితే ఎందరో మహానుభావులు. తెలుగు ప్రజల హృదయాల్లోకి వాస్తవికతలను బలంగా ప్రసారం చేసినవారు. రచనల ద్వారానే కాదు. సృష్టించిన పాత్రల ద్వారానూ వీరెప్పటికీ చదువరుల మనస్సుల్లో చిరస్థాయిగా కొలువై ఉంటారు.

రావిశాస్త్రి అనే పొట్టి పేరుతో పాఠకులు ప్రేమగా పిలుచుకునే రాచకొండ విశ్వనాథ శాస్త్రి నిజానికి భూగోళం పట్టనంతటి పెద్ద రచయిత. విశాఖపట్నంలోని యాసలన్నింటికీ తన కలంకారీతనంతో ఆయన అమితమైన వైభోగాన్ని తెచ్చిపెట్టారు. రచయిత ఎవరిపక్షం వహించాలి, ఎవరిని ప్రేమించాలి, ఎందుకోసం రచనలు చేయాలి? ఏ సమాజాన్ని స్వప్నించాలి వంటి ప్రశ్నలకు ఆయన సృజించిన సాహిత్యమే సజీవ-సాక్ష్యం. ఆయన రాసిన అల్పజీవి, సొమ్ములు పోనాయండీ, గోవులొస్తున్నాయి. జాగ్రత్త తదితర నవలలు, రుక్కులు, ఆరు సారా కథలు సహా ఆయన కథా సంపుటాలు సామాజిక ప్రయోజనం ఆశించే అక్షర చిత్రాలు.

రావిశాస్త్రి బాణీలో రచనలు చేసే వారికి ఆయన పేరిట పురస్కారం ఇచ్చేందుకే విశాఖ కేంద్రం గా ఏర్పాటైంది రావిశాస్త్రి ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ ప్రతియేటా ఒక సుప్రసిద్ధ రచయితకు రావిశాస్త్రి సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేస్తూ, జూలై 30న రావిశాస్త్రి జయంతి సందర్భంగా ప్రతిషాత్మకమైన ఈ పురస్కారానికి తాను ఎంపిక చేసిన రచయిత పేరును ప్రకటిస్తోంది. ఈ ఏడాదికిగానూ ప్రముఖ రచయిత, సీనియర్ జర్శలిస్ట్ డాక్టర్ చింతకింది శ్రీనివాసరావును ఎంపిక చేసింది. రావిశాస్త్రి అక్షర సరళిని అందిపుచ్చుకుని ఆయన చూపిన మార్గంలో రచనలు చేసే చింతకిందికి ఈ ఏడాది రావిశాస్త్రి పురస్కారాన్ని అందించనున్నట్లు ప్రకటనచేసింది. చింతకింది శ్రీనివాసరావు రాసిన కథా సంకలనం దాలప్ప తీర్థం, పాలమ్మ, వానతీర్పు, కాన్పుల దిబ్బ, కప్ప స్తంభం, బుగతలనాటి చుక్కపల్లి, ఔటర్ హార్బర్ నవలలు ఇందుకు ప్రబల నిదర్శనం. రావిశాస్త్రి పురస్కారానికి ఎంపికైన సందర్భంగా చింతకింది శ్రీనివాసరావుకు శుభాభినందనలు, రావిశాస్త్రికి అక్షరాంజలులు.

(నేడు రావిశాస్త్రి జయంతి. రావిశాస్త్రి పురస్కారాన్ని ప్రముఖ కథారచయిత చింతకింది శ్రీనివాసరావు కు ప్రకటించిన సందర్భంగా)

SA: