జర్నలిజంలో విలువలు కలిగిన పాత్రికేయుడు మూడు దశాబ్దాలు పైబడి విశాలాంధ్ర దినపత్రికకు, సంపాదక బాధ్యతలు నిర్వహించిన చక్రవర్తుల రాఘవాచారి ది.29-10-2019న ఎనభై ఏళ్ళ వయస్సులో కిడ్నీ క్యాన్సర్ తో మరణించడం జీర్ణించుకోలేని విషాదం. రాఘవాచారిని దగ్గరగా చూచినవాళ్ళకి, అతని ఉపన్యాసాలు విన్నవారికి అత్యంత విలువలు కలిగి పాత్రికేయుడు, సంపాదకుడు మాత్రమే కాదు, ఏ విషయం పైన అయినా సాధికారంగా, అవగాహనతో మాట్లాడే వ్యక్తిగా తారసపడతారు.
వరంగల్ తన పుట్టిన ఊరిలో సాహిత్య మిత్ర మండలి ద్వారా సాహిత్య అభినివేశం పెంచుకొని కాళోజి నుండి స్పూర్తి పొంది, అలాంటి చైతన్యాన్ని జీవితమంతా కొనసాగించిన ఆలోచనాపరుడు. అందుకనే జాన్సన్ చోరగుడి అన్నట్లు రాఘవాచారి అంతిమయాత్రలో రెండు తెలుగురాష్ట్రాల శ్రేయోభిలాషుల, మిత్రుల, సహచరుల నివాళి ఒక అరుదైనది అనడం రాఘవాచారిలో విలక్షణతను తెలియజేస్తుంది. వరంగల్ ఊపిరితీసుకున్న నేల అయినా ఆయన జీవితమంతా విజయవాడ నగరంతో ముడిపడి వుంది. దాదాపు అయిదు దశాబ్దాల సృజనాత్మక ప్రయాణంలో సాంస్కృతిక, రాజకీయ పరమైన, గుర్తింపు కలిగిన నగరంలో రాఘవాచారి నిర్వహించిన సాహిత్య సాంస్కృతిక భూమిక నగరం యొక్క చలనశీలతలో మమేకమయిన తీరు, నూత్న సాంస్కృతిక ఆలోచనలకు కేంద్రమయిన వ్యక్తిగా రాఘవాచారిని అంచనా వేయవచ్చు.
భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ) నిర్వహిస్తున్న పత్రికకు సంపాదకత్వం వహిస్తూ దానియొక్క పరిమితిని గుర్తిస్తూనే, రెండోవైపు భారతీయ సమాజం అణగారిన ప్రజలు వారి ఆకాంక్షలు, వారి ఆశలు, అవి నెరవేరే క్రమంలో పాలక పక్షాల అనుసరిస్తున్న విధానాలు, ఒక పరిశీలకునిగా తను విశ్లేషించే సందర్భాలు లేదా మానవీయత కలిగిస్తున్న వ్యక్తి తనను బాధించే అంశాలు. బహుశా ఇవన్నీ రాఘవాచారిలో కలగలసి పోయాయి. ఇక్కడ రచయితలో ఉపన్యాసకునిలో అంతర్లీనం కావడమంటే తన లోపల రగులుతున్న అసంతృప్తికి, వ్యక్తీకరణగా ప్రసంగాలు ఉండేవి. సంప్రదాయ ఉపన్యాసకునిగా ప్రచారం ఉన్నప్పటికీ, ఎక్కడో ఒకచోట పాలకపక్షాల దుర్నీతిని ప్రశ్నించడంలో ముందు భాగాన నిలిచేవారు. రాఘవాచారిలో చూడవలసిన ప్రధాన అంశం. ఒక్క నిర్మాణంలో పనిచేస్తున్న ఆలోచనాపరుడు లేదా అధ్యయనశీలి, సంపాదకుడు. ఏ స్థాయి అయినా అది క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఆయన దాన్ని స్వీకరించారు.
నిజానికి రాఘవాచారి వ్యక్తిత్వంలో అనేక అంశాలు ముడిపడి వున్నాయి. సంస్కృత, ఇంగ్లీషు భాషల పట్ల లోతయిన అవగాహన వున్నవాడు. ఒకే సమయంలో సంప్రదాయ, ఆధునికతను అదేకాలంలో అభ్యదయ ఆలోచనలను ప్రోదిచేసుకుంటూ కొత్తతరానికి విలువల చట్రంలో ఏవైపు నిలబడాలో అనే ఒక నమూనాను తనకు తానుగా రూపొందించుకోవడమే కాదు. సాహిత్యం , చరిత్ర, రాజకీయం, పనివిధానం పాత్రికేయులు ఎంతో కొంతమేర అవగాహన కలిగి వుండాలని పాత్రికేయ కుటుంబం, రాజ్యాంగంలోని నాలుగో స్తంభానికి పూర్తి న్యాయం చేయాలని సూచించేవారు. రాఘవాచారి దగ్గర నేర్చుకోవాల్సిన అంశం. విషయ పరిజ్ఞానం, ఎక్కడా ఆవేశపడని స్వరం అదే సమయాన ఏదయినా విమర్శించాల్సిన సందర్భం వచ్చినప్పుడు చాలా సూటిగా స్పష్టంగా చెప్పేవారు. సమకాలీన రాజకీయ అంశాలపట్ల చాలా లోతయిన విశ్లేషకుడిగా వుండేవారు. వామపక్ష భావజాలంతో వస్తున్న విశాలాంధ్ర దినపత్రికను ప్రజల గొంతుగా తీర్చిదిద్దడంలో అత్యంత నిజాయితీ కలిగి, కాలగర్భంలో కలిసిపోయిన సంపాదకుల వరుసన రాఘవాచారి ఉంటారు. అధికార మార్పిడి జరిగి ఏడు దశాబ్దాల కాలం గడిచింది. స్వేచ్ఛ సమానత్వం అనేది నానాటికి ఎండమావిగానే కల్పిస్తున్నాయి. జర్నలిజంలో పనిచేయడం భారత స్వతంత్ర పరిణామ క్రమాన్ని, దానిచుట్టూ ఏర్పరచుకున్న అమానవీయతను ప్రశ్నించడంలో, విశ్లేషించడంలో రాఘవాచారి ముందు వరుసలో నిలుస్తారు. బ్రాహ్మణీయ, భూస్వామ్య, మూలాల నుండి వచ్చి వాటిని తృణప్రాయంగా తృణీకరించి అసమానతల తలంలో సుదీర్ఘకాలం పనిచేయడం, ప్రజాస్వామిక భావనతో ఉండటం, అన్ని రకాల ఆధిపత్యాలను నిరసించి సామాన్యుని వైపు దృష్టి సారించడం, సంపాదకునిగా వ్యాఖ్యాతగా రాఘవాచారి చూపిన చొరవ తర్వాత తరానికి విలువలు చట్రంలో రూపొందుతున్న తరానికి, సృజన, మేధోరంగాలలో కృషిచేస్తున్న వారందరికి దారి దివ్వె. ఇటీవల కాలంలో ఎప్పుడు కలిసినా భీమాకోరేగాం కుట్రకేసులో అరెస్టులు అయిన వారి గురించి అడిగేవారు. సాయిబాబా ఆరోగ్య పరిస్థితి నుంచి ఆరా తీసేవారు. భిన్న దృక్పథాలు కలిగిన వారమే అయినా వరవరరావు నిర్బంధం గురించి మాట్లాడుతూనే ఒకనాటి వరంగల్ సాహితి మిత్రమండలి సమావేశాలు అందులో వరవరరావు కన్వీనర్ గా చూపిన చొరవను,
జ్ఞాపకం చేసుకునేవారు అక్రమ నిర్బంధంలో ఉన్నవారంతా విడుదల కావాలని. ఆయన బలంగా కోరుకునే వారు.
ఒక జీవిత కాలం పాత్రికేయ వృత్తిలో వుంటూ కొన్ని విలువలు ప్రకారం జీవించిన రాఘవాచారి పత్రికా సంపాదకునిగా చాలాకాలం పనిచేసినా జర్నలిజంలో ఉన్నత విలువలకు కట్టుబడిన వ్యక్తి. ఇవాళ పాత్రికేయ ప్రపంచం రాఘవాచారి అంతిమ యాత్రలో పాల్గొని నివాళి అర్పించడమంటే తమ వృత్తిలో మరికొంత విలువలు చట్రంలో వారిగా ఉండటమే. పాత్రికేయత్వం నానాటికి మసకబారుతున్నప్పుడు, వార్త వాణిజ్యపు సరుకుగా పరిఢవిల్లుతున్నప్పుడు రాఘవాచారి వంటి వ్యక్తుల జీవితం నుండి స్ఫూర్తి పొందవలసిన సందర్భం ఇవాళ ఏర్పడింది. జర్నలిజం కాదు ఇవాల్టి సంకుచిత సమయంలో బ్రాహ్మణీయ ఆధిపత్యం సవాల్ విసురుతున్న కాలంలో రాఘవాచారి వంటి వ్యక్తిత్వం కలిగిన పాత్రికేయ, సంపాదకతరం, భౌతికంగా దూరం కావడం, ఒక ఖాళీ ఇవాళ ఈ ఖాళీలను పూరించడం వర్తమాన ఆలోచనాపరులకు ఒక బాధ్యతై వుండాలి.
– అరసవిల్లి కృష్ణ