నడుస్తున్న నాటక విజ్ఞాన సర్వస్వానికి ఈ రోజు 72 వ పుట్టిన రోజు.
నాటకం గురించి తప్ప మరే ఇతర విషయం గురించైనా, ఒక్కమాట కూడా.. గ్రూపుల్లో రాయకూడదని నా నమ్మకం. విశ్వాసం.అయితే నా నియమాన్ని భంగం చేసుకొని, ఒక వ్యక్తి గురించి రాయడంలో..
ఆ వ్యక్తికి శుభాకాంక్షలు అందించడంలోని ఔచిత్యం..ఏమిటంటే..ఆయనే తెలుగు నాటకానికి నడుస్తున్న విజ్ఞాన సర్వస్వం లాంటి వ్యక్తి.
తెలుగు నాటకం ఎంతో గొప్పది. దాదాపుగా 162 ఏళ్ల ఘన చరితకు సాక్షి తెలుగు నాటకం. ఎన్నో గొప్ప నాటకాలు, ఎందరో గొప్ప దర్శకులు, ఎందరో గొప్ప నటీనటులు, గొప్ప సాంకేతికులు ఈ తెలుగు నాటక చరిత్రలో అడుగడుగునా కన్పిస్తారు. వారందరి కథలూ, వారందరి చరిత్రలూ చిరస్మరణీయమైనవి. వీటినే నాటక విజ్ఞాన సర్వస్వం అని పిలుస్తాము. అది ఒక గొప్ప గ్రంథం. అలా పుస్తకరూపంలో ఉన్న నాటక విజ్ఞానమంతా, ఒక వ్యక్తి దగ్గర ఉంటే, అప్పుడా వ్యక్తిని నడుస్తున్న నాటక విజ్ఞాన సర్వస్వం అంటాం. తెలుగునాటకానికి సంబంధించిన అనేక విషయాల గురించి ఆయనకు తెలుసు. తెలుగు నాటకంలోని అనేక మంది దర్శకుల గురించి ఆయనకు తెలుసు. తెలుగు నాటకంలోని వందలాది మంది నటీనటుల గురించి, సాంకేతికుల గురించి ఆయనకు తెలుసు. కేవలం తెలియడమేకాదు, తనకు తెలిసిన కథల్ని, తాను సేకరించిన చరిత్రని లోకానికి పంచడంలో.. ఎన్నో ఏళ్ళుగా నిరంతరం శ్రమిస్తూన్న వ్యక్తి ఆయన.
ఈనాడు తెలుగు నాటకం గురించి ఎవరికి ఏది కావలసినా అసలైన చిరునామా ఆయనే. సిసలైన నాటక నిధి ఆయనే.. ఆయనే రాఘవాచారి. తిరుపతిలో ఉండే రాఘవాచారి. వీరవల్లి శ్రీనివాస రాఘవాచారి. 1951వ సంవత్సరం సెప్టెంబర్ తేదీన జన్మించిన రాఘవాచారి ఈ రోజు తన 72వ ఏట అడుగుపెడుతున్నారు.
అందుకే ఇది..నడుస్తున్న నాటక విజ్ఞానసర్వస్వం యొక్క 72వ పుట్టినరోజు. 1961లో పదోఏట, శ్రీకాళహస్తి పాఠశాలలో బడిపంతులు పాత్రతో రంగస్థల ప్రవేశం చేసిన రాఘవాచారి ఈ ఏట తన 62 ఏళ్ల నాటక పుట్టిన రోజుని, తన 72 ఏళ్ల జీవిత పుట్టిన రోజుని జరుపుకొంటున్నారు.ఎన్నో నాటకాలలో..ఎన్నో పాత్రలు నటించారు.
వందకుపైబడిన ప్రదర్శనలకు స్పెషల్ లైటింగ్ సమకూర్చి, విజయవంతం చేశారు. దీనికన్నా మరొక గొప్ప విషయం..ఆయన నిర్వహించిన “కళాదీపిక” నాటక పత్రిక.
నాటకానికి అదొక వరం.
నెలనెలా నాటక వెలుగుల్ని పండించిన పత్రిక అది. 1990లో పక్షపత్రికగా మొదలై.. 2004లో మాసపత్రికై 2017 వరకూ నడిచి ఆగిపోయింది. తెలుగు నాటకానికి అసలైన వెలుగు నింపిన పత్రిక అది.
అంత అందంగా, అంత నాణ్యతతో, అంతటి నిబద్ధతతో నిర్వహించబడిన నాటక పత్రికలు చాలా తక్కువ. అయితేనేం, ఆ నాటక పత్రిక నిర్వహణలో ఆయన ఆర్థికంగా దెబ్బతిన్నారు. మరోదారి లేక కళా దీపిక నాటక పత్రిక ఆగిపోయింది. ఇది నిజంగా తెలుగు నాటకరంగ దురదృష్టం.
కళా దీపికలో వచ్చిన మంచివ్యాసాలతో 2015లోనూ, 2017లోనూ రెండు సంచికలు ప్రచురించారు. 2016 రంగస్థల నటీమణుల జీవన రేఖల్ని పరిచయం చేసే పుస్తకాన్నీ ప్రచురించి, అందించారు.
పద్మశ్రీ నాటక సంస్థను స్థాపించి, నిర్వహించారు. గరుడ అవార్డుల నిర్వహణలో ఎన్నో ఏళ్లురాఘవాచారి… అవిశ్రాంతంగా శ్రమించారు. నాటకాలకు ఆయన గుణనిర్ణేతగా… నిష్పాక్షికతకు నిలువెత్తు నిదర్శనంగా
నిలిచారు. ఈనాటికీ ఆధునిక విజ్ఞాన మాధ్యమంలో నాటకాన్ని అర్చిస్తూనే ఉన్నారు.ఇలా జీవన ప్రయాణమంతా నాటకం తో ముడిపడి సాగుతున్న రాఘవాచారి ఇంకెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలి. నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా జీవించాలి.
నాటకం వర్ధిల్లాలి. తెలుగు నాటకం మరింతగా వర్ధిల్లాలి.
ప్రేమతో..
సదా మీ
వాడ్రేవు సుందర్రావు
*కళాదీపిక* రాఘవాచారి కళారంగ *దిక్సూచి*
72వ *జన్మదిన శుభాకాంక్షలు*