అంతులేని దీక్షతో … మొక్కవోని నిబద్దతతో నాటకరంగంలో … పత్రికా రంగంలో కృషిచేసిన వి.యస్.రాఘవాచారి గారి 73వ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక వ్యాసం…
జీవన ప్రయాణంలో 73వ ఏట అడుగుపెడుతూ.. నాటకరంగం లో 63ఏళ్ల ప్రయాణాన్ని పూర్తిచేసుకొంటున్న… నిస్వార్థ నాటక యాత్రికుడికి..పుట్టినరోజు శుభాకాంక్షలు.
నటుడిగా, రంగస్థల సాంకేతిక నిపుణుడిగా, ప్రయోక్తగా, పద్మశ్రీ నాట్యమండలి తిరుపతి వ్యవస్థాపకుడిగా, నిర్వాహకుడిగా రాఘవాచారి నాటకరంగంతో సాగించిన బంధం, సాగిస్తున్న అనుబంధం చిరస్మరణీయాలు. సుప్రసిద్ధ నాటకపరిషత్ అయిన శ్రీ వేంకటేశ్వర నాట్యపరిషత్ తిరుపతితో నాలుగు దశాబ్దాలకు పైబడిన అనుబంధం వారిది. గరుడ అవార్డుల విజయానికి రాఘవాచారి చేసిన కృషి అపూర్వం. అనితరసాధ్యం.
రాఘవాచారి మంచి నటుడు. 1961లో బడిపంతులు పాత్రద్వారా శ్రీకాళహస్తిలో 10వ ఏట నాటకరంగంలో ప్రవేశించిన రాఘవాచారికి… నాటకరంగంలో… ఈ ఏటికి 63 ఏళ్ళు. ఇది ఆయన నాటకరంగ షష్టిపూర్తి సంవత్సరం. అనేక సాంఘిక నాటికలు, నాటకాలు, చారిత్రక నాటకాల్లో రాఘవాచారి ఎన్నో పాత్రలు నటించారు.
నాటక సంస్థ వ్యవస్థాపకుడు:
1970లో పద్మశ్రీ నాట్యమండలిని స్థాపించి దానిని 1977లో శ్రీ వేంకటేశ్వర నాట్యకళాపరిషత్‌కు అనుబంధ సంస్థగా గుర్తింపును అందించి, 1980లో రిజిష్టర్డ్ సంస్థగా రూపొందించారు. 50 పైచిలుకు నాటికలు, నాటకాలను ఒక క్రమపద్ధతిలో ప్రదర్శించిన మంచి నాటకసంస్థ పద్మశ్రీ నాట్యమండలి.
సమర్ధుడైన సాంకేతిక నిపుణుడు:
నాటకాలకు లైటింగ్ అందించే సాంకేతిక నిపుణుడుగా రాఘవాచారి పాత్ర ఎంతో ప్రశంసనీయం. శతాధిక నాటక ప్రదర్శనలకు లైటింగ్ ఎఫెక్ట్ అందించారు. రాఘవాచారి రంగస్థలాన్ని తేజోవంతం చేసిన నాటికలు అన్నీ విజయవంతం అయ్యాయి. కోస్తా, రాయలసీమల్లో అనేక సాంఘిక నాటికలకు, నాటకాలకు, చారిత్రక నాటకాలకు విజయాన్ని అందించడం వెనుక రాఘవాచారి చేసినకృషి..పడిన శ్రమ..చూపిన శ్రద్ధ చాలా గొప్పవి.
దాదాపుగా 63 నాటకాలలో 1961 నుండి 2007 వరకూ రాఘవాచారి నటజీవితం కొనసాగింది. 1981 నుండి 2000 వరకూ 111 నాటకాలకు, నాటికలకు రాఘవాచారి స్పెషల్ లైటింగ్ ఎఫెక్ట్ అందించి, రంగస్థలాన్ని శోభాయమానం చేసి, అద్భుతమైన విజయాలను అందుకొన్నారు.
ఇక తిరుమల తిరుపతి దేవస్థాన అనుబంధ సంస్థ అయిన శ్రీ వేంకటేశ్వర నాట్యకళా పరిషత్‌కు శ్రీ రాఘవాచారి అందించిన సహకారం నిరుపమానం. 63 ఏళ్ళ పరిషత్ ప్రయాణంలో 43 ఏళ్ళ కాలం రాఘవాచారి ఘనమైన పాత్ర ఉంది. ‘‘గరుడ అవార్డు’’ నిర్వహణలో దరఖాస్తు స్వీకరణ నుండి మొదలుపెట్టి. ముగింపు ఉత్సవం వరకూ, అన్నిటా తన శాయశక్తులా సేవలందించారు రాఘవాచారి.
ఒక సామాన్య కార్యకర్తగా పరిషత్‌లో ప్రవేశించి పరిషత్ కార్యదర్శి వరకూ నిర్విరామమైన ప్రయాణాన్ని సాగించారు. విమర్శకు, వివాదాలకు అతీతంగా శ్రీ వేంకటేశ్వర నాట్యపరిషత్‌ను విజయవంతంగా నిర్వహించి.. గరుడ అవార్డులకు గొప్ప గౌరవం తెచ్చిన కృషీవలుడు శ్రీ వి.ఎస్.రాఘవాచారి.‘‘కళాదీపిక’’ పత్రిక ప్రారంభం :
రాఘవాచారి నాటకరంగానికి చేసిన కృషిలో ఒక మైలురాయి వంటిది ‘‘కళాదీపిక’’ పత్రిక స్థాపన. అది నాటక పత్రికగా 1999, జూలై 1న ప్రారంభమైంది. అది తొలిరోజుల్లో పక్షపత్రిక. 2004, జనవరి నుండి మాసపత్రిక అయ్యింది. తెలుగు నాటకానికి ఒక గొప్పవరం ‘‘కళాదీపిక’’ పత్రిక. నాటకరంగ పత్రిక ‘‘కళాదీపిక’’ కోసం వారు చేసిన కృషి చాలా గొప్పది. వర్తమాన తెలుగు నాటకరంగాన్ని తెలుగు నేలకు పరిచయం చేసి, వివరించి, విశ్లేషణ చేయడంలో వారు కళాదీపిక పత్రిక ద్వారా ఎంతో గొప్ప ప్రయత్నం చేశారు. భారతదేశంలో ఉన్న తెలుగు సంఘాలు అన్నింటికి ‘‘కళాదీపిక’’ ఎంతో విలువైన నాటక సమాచారాన్ని అందించింది. భారత నాటకరంగాన్నే కాక ప్రపంచ నాటకరంగాన్ని కూడా తెలుగు ప్రజకు దగ్గర చేసింది ఈ ‘‘కళాదీపిక’’. నాణ్యత విషయంలో రాజీపడకుండా నాటక పత్రిక నిర్వహించి రాఘవాచారి ఆర్థికంగా దెబ్బతిన్నారు కూడా. ఆర్థికపరమైన కారణాల వల్ల అది ఆగిపోయినా, ఈ రోజుకీ రాఘవాచారి వాట్సాప్‌లో ‘‘కళాదీపిక’’ గ్రూపును నిర్వహిస్తూ, నాటకరంగ విశేషాలను ఎప్పటికప్పుడు అందరికీ పంచుతూనే ఉన్నారు.పుస్తక ప్రచురణ:
నాటకరంగం, ఇతర కళారంగాలకు సంబంధించిన ఎన్నో గొప్ప వ్యాసాలతో రెండు గ్రంథాలను ప్రచురించారు రాఘచావారి. తెలుగు నాటకాన్ని గొప్పగా నిలబడేలా చేయడంలో ఆ పుస్తకాల పాత్ర చాలా గొప్పది. అంతేకాదు తెలుగు నటీమణుల ఎన్నో వివరాలను సేకరించి వాటితో, నటీమణు జీవనరేఖల్ని ఒక పుస్తకంగా ప్రచురించి రంగస్థల నటీమణులకు ఎనలేని గౌరవం తెచ్చారు.
ఈ విధంగా నాటకరంగానికి వి.యస్. రాఘవాచారి చేసిన కృషి చాలా… చాలా గొప్పది. నటుడిగా, లైటింగ్ నిపుణుడిగా, పద్మశ్రీ నాట్యమండలి స్థాపకుడిగా, ‘‘కళాదీపిక’’ నిర్వాహకుడిగా, నాటక గ్రంథప్రచురణకర్తగా, నాటకరంగ వ్యాస రచయితగా, శ్రీ వేంకటేశ్వరా నాట్యకళాపరిషత్ కార్యదర్శిగా శ్రీ వి.యస్.రాఘవాచారి చేసిన కృషి ఎంతోగానో ప్రశంసనీయం.
నాటకం కోసం కొవ్వత్తిలా కరిగిపోయిన రాఘవాచారికి ఇంతకాలం గడిచిపోయినా… రావాల్సినంత గుర్తింపూ రాలేదు. లభించాల్సినంత గౌరవమూ లభించలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రాష్ట్రస్థాయి పురస్కారం కూడా రాలేదు. అయినా ఆయనకు ఏమీ చింతలేదు. ఎటువంటి గుర్తింపు కోసం ఆయన పని చేయలేదు.
నాటకం కోసమే కష్టపడ్డారు. నాటకం కోసమే ఈనాటికీ తపిస్తున్నారు.
-వాడ్రేవు సుందర రావు
( ‘గరుడ అవార్డు’ గ్రహీత)
mob: 9396473287
కళాదీపిక పత్రిక గురించి తెలిసిన దగ్గరనుండి అది మూత పడేవరకూ తెప్పించుకున్నాను. పోయినవి పోగా ఒ పది సంచికలు మిగిలాయి నాదగ్గర. కళాదీపిక ప్రచురణల లో తెలుగునాట రంగస్థల నటీమణుల చిరునామాలతో తెచ్చిన ఒక సంచిక ఎంతో ప్రత్యేకం. దాన్ని మాత్రం దాచుకోగలిగాను.
Thanq sir
కళాదీపికపై మీ ఆసక్తి అభినందనలు.
కళాదీపిక ఆగిపోలేదు. సాగుతూనే వుంది.
ఆయన ఇప్పుడు పలు రంగాలపై వాట్సాప్ గ్రూపులు నడుపుతున్నారు.
కళాదీపిక గ్రూప్ కూడా వాటిలో ఒకటి.
ఆయనను సంప్రదిస్తే ఆ లింక్స్ పంపిస్తారు.
కళాదీపికపై మీ ఆసక్తి అభినందనలు.
కళాదీపిక ఆగిపోలేదు. సాగుతూనే వుంది.
ఆయన ఇప్పుడు పలు రంగాలపై వాట్సాప్ గ్రూపులు నడుపుతున్నారు.
కళాదీపిక గ్రూప్ కూడా వాటిలో ఒకటి.
ఆయనను సంప్రదిస్తే ఆ లింక్స్ పంపిస్తారు.