జయదేవ స్వరమణి… రఘునాథ్ పాణిగ్రహి

( ఈరోజు పాణిగ్రహి జయంతి. ఈ గొప్ప సంగీత విద్వాంసుడు మరణించడానికి కేవలం మూడునెలల ముందు భువనేశ్వర్ లో వారి స్వగృహంలో కలిసి నేను జరిపిన ఇంటర్వ్యూలో పాణిగ్రహి వెల్లడించిన కొన్ని మధుర స్మృతుల సారాంశాన్ని మీకు అక్షర రూపంలో సమర్పిస్తున్నాను.)

పద్మశ్రీ పండిట్ రఘునాథ్ పాణిగ్రహి పేరు తెలుగు సినీ ప్రేమికులకు 1956లో వచ్చిన ‘ఇలవేలుపు’ సినిమా ద్వారానే తెలుసు. యోగానంద్ దర్శకత్వంలో లక్ష్మి ప్రొడక్షన్స్ పతాకం మీద నిర్మాత ఆనంద్ నిర్మించిన ఈ చిత్రంలో సంగీత దర్శకుడు సుసర్ల దక్షిణామూర్తి పాణిగ్రహిని గాయకుడిగా ప్రచారంలోకి తీసుకొచ్చారు “ఏనాడు కనలేదు ఈ వింత సుందరిని నాలో ఆశలు రేపే అందాల రాచిలుక, ననుచూచి తనలోన నవ్వుకొనునదేమో” అనే యుగళ గీతాన్ని పాణిగ్రహి సుశీలతో కలిసి ఆలపించారు. అయితే ఈ చిత్రంలో హిట్ అయిన పాట పాణిగ్రహి సుశీల, లీలతో కలిసి ఖరహరప్రియ రాగంలో పాడిన త్రిగళగీతం “చల్లని రాజా ఓ చందమామా నీ కథలన్నీ తెలిశాయి ఓ చందమామా నా చందమామా” అనేది. సరళమైన సాహిత్యం, వినసొంపైన సంగీతం జమిలిగా ఆ తరాన్ని ఈ పాట ఆకట్టుకుంది. చందమామ పాటల విషయం చర్చకువస్తే ముందుగా స్మృతిపథంలో నిలిచేది “చల్లనిరాజా ఓ చందమామా” పాటే. పాణిగ్రహి పాడిన ఈ పాట రాసింది వడ్డాది కాగా “ఏనాడు కనలేదు” పాటను రాసింది అనిసెట్టి. పాణిగ్రహి భార్య పద్మశ్రీ సంయుక్తా పాణిగ్రహి ప్రఖ్యాత ఒడిస్సీ నాట్యకళాకారిణి. పాణిగ్రహి ప్రత్యేకించి హిందుస్తానీ సంప్రదాయ సంగీతంలో నిష్ణాతులు. భక్త జయదేవుని ‘గీత గోవిందం’ కు ముఖ్య ప్రచారకులు.

సంగీత కుటుంబంలో విద్యార్థిగా…

రఘునాథ్ పాణిగ్రహి స్వస్థలం ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లాలో వున్న గుణుపురం గ్రామం. అతని తండ్రి నీలమణి పాణిగ్రహి జేపూర్ (జైపూర్ కాదు) మహారాజా వారి ఆస్థానంలో ప్రధానమంత్రిగా వుండేవారు. ఆయన తన పద్నాల్గవ ఏటనే పవిత్ర పూరీ పుణ్యక్షేత్రంలో తొలి సంగీత కచేరి నిర్వహించారు. రఘునాథ్ పాణిగ్రహి తల్లి కుందమణి ది శ్రీకాకుళం దగ్గర వున్న పర్లాకిమిడి పట్టణం. తల్లి ద్వారానే పాణిగ్రహి కి తెలుగు చదవడం, రాయడం వచ్చింది. పాణిగ్రహి తండ్రికి సర్వేపల్లి రాధాకృష్ణ, తెన్నేటి విశ్వనాథం వంటి స్వాతంత్ర్య సమరయోధులతో మైత్రీబంధం వుండేది. ఆరోజుల్లో బరంపురం, కటక్ వరకు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో వుండడం చేత పాణిగ్రహి నానగారు తరచూ మద్రాసు వెళ్లి వస్తుండేవారు. అలా పాణిగ్రహి కూడా వారి నానగారితో కలిసి ఎన్నోసార్లు మద్రాసు వెళ్ళారు. అందుచేత మద్రాసు నగరం పాణిగ్రహికి కొత్తకాదు. హిందుస్తానీ సంప్రదాయ సంగీతాన్ని తల్లి ప్రోత్సాహం తోనే పాణిగ్రహి సాధన చేశారు. తనకు ఏడేళ్ళు వున్నప్పుడే పండిట్ బిశ్వనాథ్ దాస్, పండిట్ నర్సింగ్ నందా లవద్ద శిష్యరికం చేసి సంప్రదాయ సంగీతంలో మెళకువలు నేర్చుకున్నారు. అప్పట్లో ఒడిశా కు ప్రత్యేక సంగీత శైలి వుండేది. దానిని కూడా పాణిగ్రహి ఆపోశన పట్టారు. పాణిగ్రహికి కర్ణాటక సంగీతం మీద మక్కువ వుండేది. 1948 ప్రాంతంలో విజయనగరం వెళ్లి ముద్దా పాపారావు వద్ద కర్ణాటక సంగీత ప్రాధమిక సూత్రాలను అభ్యసించారు. అప్పుడే సంప్రదాయ సంగీత కచేరీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని హెచ్.ఎం.వి రికార్డింగ్ కంపెనీ వారు గ్రామఫోను రికార్డుగా విడుదల చేశారు. ముఖ్యంగా జయదేవుని ‘గీతగోవిందం’ ను పాణిగ్రహి అద్భుతంగా ఆలపించేవారు. పాణిగ్రహి కార్యక్రమాలు నిరంతరం ఒడిశా రేడియోలో ప్రసారమవుతూ ఉండేవి. అతి పిన్న వయసులోనే భారతీయ సంగీతం గురించి ఒడిశా రాష్ట్రంలో ప్రచారకార్యక్రమాలను నిర్వహించారు. పాణిగ్రహి దృష్టిలో సామవేదం సంగీతానికి మూలమని అభిప్రాయం. ఆ వేదభాషలోనే వాది-సంవాది, ఆరోహణ-అవరోహణ, మంద్ర-తారాస్థాయి వంటి ప్రక్రియలు విస్పష్టంగా గోచరిస్తాయని పాణిగ్రహి తన ప్రచారంలో భారతీయ సంగీతంలోని ప్రాచీన మూలాలను గుర్తుచేసేవారు. పాణిగ్రహికి కర్ణాటక సంగీతమంటే మక్కువ. కారణం ఆ సంగీతం నాదబ్రహ్మకు చిహ్నం అని పాణిగ్రహి భావన. హిందుస్తానీ సంగీతంలో పర్షియన్, ఇస్లామిక్ సంగీత ప్రభావం ఎక్కువగా వుంది…. కానీ కర్ణాటక సంగీతం స్వచ్చమైన వేదమూలాలు కలదని నమ్మిన వాళ్ళలో పాణిగ్రహి కూడా ఒకరు. అందుకే పాణిగ్రహి మద్రాసు వెళ్లి కర్ణాటక సంగీతాన్ని సంపూర్ణంగా నేర్చుకోవాలని ఉవ్విళ్ళూరారు.

కర్ణాటక సంగీత అభ్యాసానికి మద్రాసుకు…

కర్ణాటక సంగీతంలో మెళకువలు నేర్చుకుందామని రఘునాథ్ పాణిగ్రహి 1952లో మద్రాసు వెళ్ళారు. ప్రముఖ మరాఠీ సంగీత విద్వాంసుడు పండిట్ పులస్కర్ వద్ద మొదట హిందుస్తానీ సంగీత మెళకువలు, తరవాత కర్ణాటక సంగీత పాఠాలు నేర్చుకున్నారు. పాణిగ్రహి ప్రముఖ న్యాయవాది సుబ్బరాయ అయ్యర్ గారి ఇంటిలో వుండేవారు. అప్పుడే ప్రముఖ గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు కూడా హిందూస్తానీ సంగీతం నేర్చుకోవాలని పండిట్ పులస్కర్ వద్దకు వస్తుండేవారు. అక్కడే పాణిగ్రహి కి ఘంటసాల మాస్టారుతో పరిచయమైంది. రఘునాథ్ పాణిగ్రహి మద్రాసులో జయదేవుని గీతగోవింద సంగీత కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమానికి సంగీత దర్శకులు ఆర్. గోవర్ధనం, ఆర్. సుదర్శనం సోదరులు రావడం జరిగింది. పాణిగ్రహి కంఠస్వరం విని తెలుగు సినిమాలలో పాటలు పాడమని సలహా ఇచ్చారు. అప్పట్లో వారు ఎ.వి.ఎం. స్టూడియోలో ఆస్థాన సంగీత దర్శకులుగా వుండేవారు. 1954 లో ఎ.వి.ఎం వారు ‘సంఘం’ సినిమాని ద్విభాషా చిత్రంగా నిర్మిస్తున్నప్పుడు సంగీత దర్శకులు ఆర్. సుదర్శనం రఘునాథ్ పాణిగ్రహికి కబురంపారు. అందులో పాటలన్నీ తోలేటి వెంకటరెడ్డి రాశారు. “ఆడదంటే అలుసదేలా అవనిలో దేవతే” అంటూ సాకీతో మొదలై “ఆడదంటే అలుసు కాదోయ్ అవనిలో దేవతోయ్… అరసి చూడగ లేదు భేదం అతివ మన సమభాగినీ” అనే పాటను గోవర్ధనం రఘునాథ్ పాణిగ్రహితో పాడించి హీరో ఎన్.టి. రామారావు మీద చిత్రీకరించారు. రెండు మూడు టేకుల్లోనే ఆ పాట ఓకే అయింది. అతి తక్కువ వాద్యాలతో ఈ పాటను రికార్డు చేశారు. రచయిత తోలేటి వెంకటరెడ్డితో కూడా స్టూడియోలోనే పరిచయమైంది. ఇదే పాణిగ్రహి తెలుగులో పాడిన మొదటిపాట. తొలి పాటే పెద్ద హీరోకు పాడడం పాణిగ్రహి తన అదృష్టంగా భావిస్తారు.

Raghunath Panigrahi

అమరసందేశంలో గాయకునిగా…

సాహిణీ సంస్థ వారు ఆదుర్తి సుబ్బారావుని నూతన దర్శకునిగా పరిచయం చేస్తూ ‘అమర సందేశం’(1954) సినిమా చెయ్యాలని తలపెట్టారు. అది హిందీలో వచ్చిన ‘బైజూ బావరా’ లాంటి ఒక సంగీత ప్రధానమైన చిత్రం. ఇందులో హీరో అమర్ నాథ్ ది కూడా ఒడిసా రాష్ట్రమే. అందులో సంగీత దర్శకుడు కేల్కర్ తన సహచర సంగీత దర్శకుడు ప్రసాదరావుకు పాణిగ్రహిచేత కూడా ఒక పాట పాడిద్దామని ప్రతిపాదించారు. అది ఎస్.భావనారాయణ, డి.బి. నారాయణలు సంయుక్తంగా తీసిన సినిమా. అమర్ నాథ్ కూడా సరేననడంతో పాణిగ్రహి రేవతి స్టూడియోలో కృష్ణయ్యర్ రికార్డు చెయ్యగా రెండు పాటలు పాడారు. “మానస లాలస సంగీతం.. మధుమయ జీవన సంతోషం” అనే శ్రీశ్రీ విరచిత ద్విగళగీతం చాలాబాగా పాపులర్ అయింది. ఏ.ఎం. రాజా పాణిగ్రహితో గళం కలిపిన పాట ఇది. అందులోనే మరొక పాట “నువ్వెందుగలవయ్యా” ని రికార్డు చేసినా, ఎందుకో సినిమాలో ఆ పాటను వాడలేదు. అప్పుడే దర్శకుడు కె.ఎస్. ప్రకాశరావు, జి. వరలక్ష్మి లతో పాణిగ్రహికి పరిచయమైంది. అదే సమయంలో వారు తీస్తున్న ‘అంతే కావాలి’(1955) సినిమాలో పాణిగ్రహిచేత “నీకోసం నీకోసం దాచియుంటి నాఅందం వేచియున్న దానందం అంతులేని ఈ అమర సుఖం” అనే యుగళగీతాన్ని కె. రాణి తో కలిసి పాడారు. ఈ పాటను జగ్గయ్య, మాలతి మీద చిత్రీకరించారు. పెండ్యాల ఈ సినిమాకు సంగీత దర్శకుడు. కె. రాణితో కలిసి మరొక యుగళగీతం కూడా పాణిగ్రహి ఇందులో పాడారు. అది “ఒకటి రెండు మూడు పండినదెవరో చూడు… దొంగకు గంటలు కట్టు, నను మోసం చేస్తే ఒట్టు” అంటూ నడిచే స్టేజి మీద పాట.

సంచలనం సృష్టించిన ఇలవేలుపు పాట…

లక్ష్మి ప్రొడక్షన్స్ వారు అక్కినేని, అంజలి, జమునలతో యోగానంద్ దర్శకత్వంలో ‘ఇలవేలుపు’ (1956) సినిమా నిర్మించారు. సంగీత దర్శకులు సుసర్ల దక్షిణామూర్తి పాణిగ్రహిచేత అక్కినేనికి రెండు పాటలు పాడించారు. అందులో “చల్లని రాజా ఓ చందమామా నీ కథలన్నీ తెలిశాయి ఓ చందమామా నా చందమామా” పాటను లీల, సుశీల తో కలిసి త్రిగళ గీతంగా పాణిగ్రహి ఆలపించారు. ఆ పాట పాణిగ్రహికి యెంతో మంచిపేరు తెచ్చిపెట్టింది. అందులోనే అక్కినేనికి మరో పాట “ఏనాడు కనలేదు ఈ వింత సుందరిని నాలో ఆశలురేపే అందాల రాచిలుక” కూడా పాణిగ్రహి చేతే సుసర్ల పాడించారు. ఇదికూడా “చల్లని రాజా” అంత పాపులర్ అయ్యింది. ఇవి కాక సాధనా వారి ‘సంకల్పం’ (1957) లో పిఠాపురం నాగేశ్వరరావుతో “తప్పుడు పనులెప్పుడు మనకొద్దుర బావొద్దుర బాబూ” అనే పాటను, ఎన్టీఆర్ కు “వెన్నెల చెలికాంతులలో…చల్లగాలి దారులలో నను వలచీ, మైమరచీ నాట్యమాడు మొహినితో” అనే సోలో గీతాన్ని సుసర్ల దక్షిణామూర్తి సంగీత దర్శకత్వంలో పాణిగ్రహి పాడారు. ‘ప్రేమే దైవం’(1957) చిత్రంలో “ప్రేమయే దైవం ఈ ఇలలో” అనే టైటిల్ సాంగ్ ని ఎన్టీఆర్ కోసం హెచ్.ఆర్. పద్మనాభశాస్త్రి పాణిగ్రహితో పాడించారు. ముంగమూరు బ్రదర్సు వారు, పెండ్యాల సంగీతం సమకూర్చిన ‘గంగా గౌరీ సంవాదం’(1958) సినిమాలో నారదుని కోసం “నిరుపమ సుగుణాలయ హరా.. కరుణారస నిలయా” అనే పాటను, ఇంద్రసభలో రంభ నాట్యం చేసే సందర్భంగా వచ్చే పాటగా పాడించారు. “బలే బలే పెళ్లి జరుగదిది ఇలలో మళ్ళీ” అనే పాటను శివగంగల పెళ్లి సందర్భంగా బెస్తలు చేసే నృత్యగానంలో భాగంగా వచ్చే పాటగా పాణిగ్రహి చేత పాడించారు. ఇక ‘జయభేరి’ (1959) చిత్రంలో ఘంటసాల, పి.బి.శ్రీనివాస్ లతో కలిసి “మది శారదాదేవి మందిరమే.. కుదురైన నీమమున కొలిచేవారి” పాటగురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మల్లాది రాసిన ఈ పాటకు పెండ్యాల సంగీతం అమోఘం. ఇంకో విశేషమేమిటంటే ఈ చిత్రంలో పాణిగ్రహి ఒక చిన్న పాత్రలో నటించారు కూడా! చలన చిత్రరంగానికి పరిచయమైన అనతికాలంలోనే ఎన్టీఆర్, ఏయన్నార్ వంటి అగ్రశ్రేణి హీరోలకు పాడటం పాణిగ్రహికి మరో మధురానుభూతిగా మిగిలిపోయింది.

ఒరియా చిత్రసీమలో…

ఒరియా చిత్రాలు ‘శ్రీశ్రీ పతిత పావన్’, ‘సిందూర బిందు’, ‘ముక్తి’ చిత్రాలకు పాణిగ్రహి నేపథ్య గానం అందించాను. ‘అభినేత్రి’ అనే చిత్రానికి నేపథ్యగానం తోబాటు నృత్యదర్శకత్వం కూడా నిర్వహించారు. ‘అహల్య’ చిత్రానికి సంగీత దర్శకత్వం నిర్వహించారు. కన్నడ హీరో రాజకుమార్, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ఎమ్జీఆర్ తో పాణిగ్రహికి సత్సంబంధాలున్నాయి. ‘సంతానం’ సినిమాలో లతామంగేష్కర్ “నిదురపోరా తమ్ముడా” అనే పాట పాడటంలో ఆమెకు తెలుగులో పాడటం నేర్పేపనిని సుసర్ల పాణిగ్రహికి అప్పగించారు. ఆమెకు సంస్కృతం మీద పట్టుండటం చేత ఉచ్చారణ దోషాలు లేకుండా పాడగలిగింది. సినీ సంగీత అధ్యాయంలో పాణిగ్రహి అనిల్ బిస్వాస్, వసంత దేశాయిలను గురువులుగా భావిస్తారు. హిందుస్తానీ సంగీత ప్రజ్ఞావంతుడు మన్నాదే పాణిగ్రహికి సన్నిహిత మిత్రుడు. ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం భువనేశ్వర్ వెళితే పాణిగ్రహిని కలవకుండా వెళ్లరు. సంయుక్తా పాణిగ్రహితో రఘునాథ్ వివాహం 1960లో జరిగింది. వివాహం తరవాత పాణిగ్రహి మద్రాసు విడిచిపెట్టి భువనేశ్వర్ లో స్థిర పడ్డారు. ఆమె మంచి ఒడిస్సీ నాట్యకారిణి. 1997లో చనిపోయేదాకా ఒడిస్సీ నృత్యరీతుల్లో ఎంతోమందికి శిక్షణ ఇచ్చింది. ఆమె సేవలను గుర్తించి పద్మశ్రీ పురస్కారమిచ్చి కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. సంయుక్తా మరణా నంతరం పాణిగ్రహి ట్రస్ట్ పెట్టి “నాట్యకళ”అనే సంస్థ పేరిట ఉపకారవేతనాలిచ్చి, అవార్డులిచ్చి, ఒడిస్సీ నృత్యాన్ని ప్రోత్సహిస్తూవచ్చారు. 1967-88 మధ్య కాలంలో భారతదేశం తరఫున రష్యా, ఫిలిప్పీన్స్, జపాన్, నేపాల్ దేశాల్లో సంయుక్తా బృందంతో పర్యటించి సంప్రదాయ సంగీత, నాట్య కార్యక్రమాలను పాణిగ్రహి నిర్వహించారు. గీత గోవిందాన్ని ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, డెన్మార్క్, నార్వే, స్వీడన్, జర్మనీ, హాలెండ్, సింగపూర్ దేశాల్లో ఆలపించి, సంయుక్తా బృందం చేత నర్తింపజేసి జయదేవుని రచనలకు విస్తృత ప్రచారం చేశారు.

పురస్కారాలు…

1970లో ఫ్రెంచ్ ప్రభుత్వం గీతగోవిందం ను ప్రచారం చేసినందుకు పాణిగ్రహిని ఘనంగా సత్కరించింది. ఆ ప్రభుత్వం చేత సత్కరింపబడిన తొలి ఒడియా కళాకారుడు పాణిగ్రహి. 2010లో భారత ప్రభుత్వం పాణిగ్రహిని పద్మశ్రీ బిరుదుతో సత్కరించింది. సంగీతానికే తన జీవితాన్ని ధారపోసిన పాణిగ్రహికి 1968లో ‘సుర్ మణి’ బిరుదు ప్రదానం చేశారు. 1976లో జాతీయ సంగీత నాటక అకాడమీ సత్కారం, 1993లో రాష్ట్ర సంగీత అకాడమీ బహుమతి పాణిగ్రహి అందుకున్నారు. 2008లో జయదేవ సమ్మాన్ బహుమతి స్వీకరించారు. ఓడిశాలోని రావెంషా విశ్వవిద్యాలయం, బరంపురం విశ్వవిద్యాలయం, ఉత్కల్ విశ్వవిద్యాలయాలు పాణిగ్రహి కి గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. తన 82వ ఏట పాణిగ్రహి భువనేశ్వర్ లో 25 ఆగస్టు 2013న పరమపదించారు.

… ఆచారం షణ్ముఖాచారి
(94929 54256)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap