భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఎందరో మహనీయులు కృషి చేస్తూ వచ్చారు, చేస్తూనే ఉన్నారు. వారిలో చిత్రకళా రంగంలో తన వంతు ప్రయత్నం చేసిన వ్యక్తి చిత్రకారుడు రాజా రవి వర్మ. ఆయన కేరళ రాష్ట్రంలోని త్రివేండ్రంకు దగ్గరలో ఉన్న కిలమానూరు సంస్థానాన్ని పరిపాలించిన రాజ వంశంలో జన్మించారు. ఆయన పరిపాలనకు దూరంగా ఉండి చిత్రకళలో ఎంతో కృషిచేసి భారతదేశంలో ప్రప్రథమ స్థానంలో నిలిచి ప్రతి ఇంటి పూజ గదిలో దీపం వెలిగేలా చేశారు. భక్తితో జీవించే ప్రజలందరూ వారి చిత్రించిన చిత్రాలే దేవతామూర్తులుగా నేడు దర్శనమిస్తున్నాయి. క్రీస్తు రూపాలు ప్రపంచవ్యాప్తంగా కనిపించడానికి లియనార్డో డావెన్సీ, మైకేల్ యాంజిలో వంటి వారు ఎంత కారకులో ఆ విధంగా హిందువుల దేవతలైన త్రిమూర్తులు లక్ష్మీ, సరస్వతి, పార్వతి, కాళీ వంటి దైవ స్వరూపాలను సృష్టించి భారతీయ సంస్కృతి తరతరాలు నిలిచేటట్టు కృషి చేసిన మహనీయుడు రాజా రవివర్మ. వారి జీవిత విశేషాలను ప్రత్యక్షంగా చూసి క్షుణ్ణంగా వివరాలు సేకరించి వచ్చి చేసిన రచన, ఈ “చిత్రకళా తపస్వి రాజా రవి వర్మ” పుస్తకం. రంగుల చిత్రాలతో 284 పేజీలతో ముద్రించిన ఈ పుస్తక పరిచయం ఇది.
ఆచార్య తుమ్మపూడి కోటేశ్వరరావు గారు ఈ పుస్తక రచనా వైశిష్యం గురించి ఆయన చెప్పిన రీతి భాషా శైలి గురించి చెబుతూ పాఠకులందరూ ఆయా సందర్భాలలో తాము ఉన్నట్లు, ఆ బొమ్మలు చూస్తున్న అనుభవం కల్పించడం వీరి శైలీ రమ్యతగా కనబడుతుంది అంటారు. ప్రతి సాహితీ కళా విద్యార్థి అవశ్యం పఠించి తెలుసుకోవలసిన ‘అనంత కళా రహస్య ప్రపంచ నిధిగా వ్రాసిన పుస్తకం’ అని కూడా ప్రశంసించారు.
అమెరికాలోని మిడిల్ టెన్నిస్ స్టేట్ యూనివర్సిటీలో పనిచేస్తున్న చాల్స్ ఆర్ జాన్సన్ అనే మహనీయుడు ‘స్టడీయింగ్ ఆర్ట్ హిస్టరీ’ అనే పుస్తకంలో ‘చిత్రకారుడు వేసిన చిత్రాన్ని ఆస్వాదించే ప్రేక్షకుడు ఎన్ని కోణాల్లో పరిశీలించి పరిశోధించాలో చాలా వివరణాత్మకంగా రాశారు. వాటికి ఈ గ్రంథంలో సింగంపల్లి సత్యనారాయణ స్థానం కల్పించారు. అలాగే ఒక చిత్రకారుడు ఉన్నత శిఖరాలు ఎక్కి శ్రేష్టమైన స్థాయికి రావాలంటే ఎటువంటి సాధన చేయాలి అనే అంశంపై ఇర్విన్ గ్రీన్ బర్గ్ సూచించిన 89 సూత్రాలను కూడా ఈ చిత్రకళా నిధిలో నిక్షిప్తం చేశారు.
రవివర్మ జీవిత విశేషాలను తెలిపే అధ్యాయంలో ఝాన్సీ లక్ష్మీబాయిని వివాహమాడిన వ్యక్తికి దగ్గర బంధువు వాలియ కోయిల్ తంపురన్, రవివర్మను బాల్యంలో చిత్రకళవైపు ప్రోత్సహించిన వ్యక్తి. 9 సంవత్సరాల వయసులో చిత్రకళా సాధన ప్రారంభించాడు రవివర్మ. తన ఆత్మ సాక్షిగా మహా వజ్ర భైరవ తంత్రంలో చెప్పినట్లు నడుచుకునేవాడు. కోపానికి అతీతంగా నిదానంగా ఎంతో పవిత్రంగా జీవనం సాగించాడు. విగ్రహం ఎదురుగా ఉంటే మనసుకు నిగ్రహం ఉంటుందని ఆలోచించారు మన పూర్వీకులు. ఆ’ అంటే సర్వేశ్వరుడు, లయం అంటే తాను అందులో లీనం కావడం. అలా భగవంతుని చూసే శక్తి మనిషికి లేనందున ఒక రూపంలో నిర్మాణం చేసుకొని అందులో తాను ఆరాధించే దైవ శక్తిని ప్రతిష్టించుకుని ఆలయ నిర్మాణం చేసుకొని దేవుని ఆరాధిస్తున్నాడు మానవుడు. ‘ఆనందాన్ని తాను అనుభవించి దానిని ఇతరులకు పంచే ప్రయత్నమే కళా సృష్టి’ అంటారు లియోటాల్ స్థాయి. పరిశీలన అనుభూతి సృజన తరువాత తనకు నచ్చిన మాధ్యమంలో ఆవిష్కరణ పొందే అభివ్యక్తే కళగా మారుతుంది. ఇలా చిత్రకారుడు చిత్రం వేయటానికి మూడు విధాలు ఉంటాయి. అవి వ్యక్తీకరణ నైపుణ్యం కౌశలం. ఇతరులను ఆకర్షించే రసాత్మక స్వరూపంగా మారుతుంది ఆ అభివ్యక్తీకరణ. దీనివల్ల స్పందన ప్రేరణ అనుశీలన జరుగుతుంది. మూకాంబికా దేవి దర్శనం తర్వాత రవి వర్మ తన వ్యక్తిగత సామర్థ్యాన్ని పెంచుకున్నాడు. అంతకుముందు గమ్యం తెలియక అయోమయ స్థితిలో ఆవేదన చెందుతున్న రవివర్మకు మార్గ నిర్దేశం చేసిన దేవతగా మూకాంబికా దేవిని చెబుతారు.
భారతదేశ సంస్థానాధీశుల పూజా మందిరాల్లోకి క్రైస్తవ మేరీ మాత చిత్రాలు శిల్పాలు ప్రవేశింప చేయాలని యూరోపియన్ దేశాల నుండి వందల మంది చిత్రకారులు శిల్పుల్ని రప్పించారు అప్పటి ఆంగ్ల పాలకులు.అలాంటి వారిలో ఇ.వి హావెల్ ఒకరు. ఆయన ముంబై దగ్గర ఉన్న ఎలిఫెంటా గుహలకు వెళ్లి అక్కడ త్రిమూర్తి శిల్పాన్ని చూసిన ఆయనలో భారతీయ ఉత్కృష్టమైన మహోన్నత ఆలోచనతో ఈ త్రిమూర్తి విగ్రహాన్ని తయారు చేస్తే.. ఈ భావాలకు మూలమైన సంస్కృతి జాతీయత ఆధ్యాత్మిక సంపద ఎంత ఉన్నతమైనదో తెలిసి భారతీయుల ధర్మాన్ని ముట్టుకునే అర్హత తనకు లేదనుకుంటూ ఈ దేశంలోని సనాతన ధార్మికతను నాశనం చేసే హక్కు విదేశీయులకు లేదు అని ఆ చిత్రకారులను వెనక్కు పంపించేసాడట.
వియన్నా దేశంలో ప్రపంచ చిత్రకళా ప్రదర్శనకు రవివర్మ మద్రాస్ లో ప్రథమ బహుమతి పొందిన ‘నాయరు యువతి’ చిత్రాన్ని పంపించారు. అక్కడి న్యాయనిర్నేతలు దానిని ఉత్తమ చిత్రంగా నిర్ణయించి ప్రథమ బహుమతివ్వగా అలా ఆయన పేరు ప్రపంచ చిత్రకళా జగత్తులో మారుమ్రోగి పోయింది. కాళిదాసు శాకుంతలాన్ని మోనియర్ విలియమ్స్ ఆంగ్ల భాషలోకి అనువదించారు. ఆ పుస్తకానికి ముఖచిత్రంగా రవివర్మ చిత్రించిన ‘శకుంతల’ చిత్రాన్ని స్వీకరించడంతో ఆ చిత్రం విశ్వవ్యాప్తం కావడానికి దారితీసింది.
1881 వ సంవత్సరంలో బరోడా మహరాజ్ శివాజీ రావు కోరిక మీద నాలుగు నెలలు కష్టించి లక్ష్మీ సరస్వతి నలదమయంతులు సైరంద్రి సీతా స్వయంవరం మొదలైన విలువైన ఆకర్షణీయమైన చిత్రాలను రవివర్మ చిత్రించి ఇచ్చారు.
భారతీయ సంస్కృతికి ప్రతిరూపం, వేదవేదాంగాలు చదివిన మహనీయుడు, రామాయణ భారత పురాణాల్లోని ఎన్నో విశేషాలను ప్రధాన ఘట్టాలను చిత్ర రచనకు అనుగుణంగా ఉండేటట్లు వివరించి చెప్పినవారు.. ఆయన చిన్నాన్న రాజరాజ వర్మ. అలా భారతీయ ఋషుల శక్తి సామర్ధ్యాలను ఆగ్రహించిన ఆయన పవిత్ర ఆత్మ చిత్రకళ భాషై రసానందపు మహా ఘోషై కాన్వాస్ పై తూలికను నర్తింపజేసే ఉత్తుంగ శ్లేషై నిరుత్సాహం నిస్పృహలు నిరాశక్తత నిర్వీర్యం నిండిన భారతీయ సమాజంలో కొత్త ఊపిరులు అందించడానికి జన్మించిన ఒక కారణజన్ముడు’ అంటారు సింగంపల్లి
కేరళ ప్రాంతం గురించి చెప్పిన సందర్భంలో సింగంపల్లి, కెర అంటే కొబ్బరి. ఆలం అంటే భూమి. చేర వంశస్థులు పరిపాలించడం చేత చేర.. కీర కేరళ గా మారింది అని అంటారు. మలయాళం అనే పదం మలై అంటే కొండలు. పశ్చిమ కనుమలతో నిండిన ప్రాంతం కాబట్టి మలయాళం అయిందని చెబుతారు. కేరళ ను ప్రమీల పరిపాలించింది. నాటి ప్రమీలార్జునీయం కథ మనకు తెలిసిందే!
బరోడా మహారాజు కోరికపై 14 పౌరాణిక చిత్రాలు చిత్రించడానికి పురాణాల అధ్యయనంతో పాటు ఉత్తర భారత దేశ పర్యటన చేసి రాజులు రాణులు వారి వస్త్రధారణ అలంకారాలు ఆభరణాలు భవనాలు వాహనాలు వాతావరణం మొదలైన విషయాలు గ్రహించడానికి తన సోదరుడైన రాజరాజ వర్మతో కలిసి భారతదేశంలోని ప్రముఖమైన రాజ సంస్థానాలు పురాతన చారిత్రక నగరాలైన ఢిల్లీ ఆగ్రా లాహోర్ అయోధ్య కాశీ మధురా చిదంబరం శృంగేరి మదురై మొదలైన ఆధ్యాత్మిక రాచరికపు నగరాలు సాంస్కృతిక ప్రదేశాలు పుణ్యక్షేత్రాలు నదులు పర్వతాలు వివిధ ప్రాంతపు ప్రజల ఆచార వ్యవహారాలు పండుగలు సంబరాలు జాతరలు ఉత్సవాలు ఊరేగింపులు ప్రాంతాలవారి ఆచారాలు గృహాలంకరణలు హస్తకళ నైపుణ్యాలు యోగులు వివిధ కళాకారులను సందర్శించారు రవివర్మ.
‘వివేకానంద- రవి వర్మ’ అన్న అధ్యాయంలో మనకు వివేకానందుని గురించి, రవివర్మ గురించి, వారిద్దరి సాన్నిహిత్యం గురించిన ఎన్నో వివరాలు వెలుగులోకి తెచ్చారు సింగంపల్లి తన ఈ పుస్తకం ద్వారా.
రవి వర్మ తన 14 ఏట నుండి 58వ సంవత్సరం వరకు (చనిపోయేంతవరకు) ఆయన చేసిన చిత్రకళా సృష్టిని గమనిస్తే రవివర్మ ఒక క్షణం కూడా నిద్రించి ఉండడు అనిపిస్తుంది అంటారు సింగంపల్లి.
రవివర్మకు 5 మంది సంతానం ఇద్దరు కుమారులు ముగ్గురు కుమార్తెలు. పెళ్లయ్యాక భార్యతో పాటు ఎక్కువ కాలం వాళ్ళ అమ్మగారి ఊర్లోనే తాను గడిపాడు. చిత్రకళ రాజభవనాలకు ప్రదర్శనశాలలకు ధనవంతుల గృహాలకు మాత్రమే పరిమితం కాకూడదు. సామాన్య ప్రజలకు కూడా అందు అందుబాటులో ఉండాలని భావించి జర్మనీ నుంచి అచ్చు యంత్రాలను తెప్పించారు. బరోడా మహరాజు 50 వేల రూపాయలు రవి వర్మ చిత్రించిన చిత్రాలుగాను ఇచ్చిన వాటిని ఎంతో పొదుపుగా జాగ్రత్తగా ఖర్చుపెట్టినా, అప్పు చేయక తప్పలేదు. ముద్రణ విషయంలో సహకరించే జర్మనీ దేశస్థులకు సంస్కృత భాష నేర్పించి వారిచే కావ్యాలు చదివించారు. అలా అయితేనే చిత్రాల భావం సందర్భం వారికి తెలిసి వస్తుందని తన స్నేహితుడైన స్క్లెవిజర్ అనే సన్నిహితుని ద్వారా రవివర్మ కూడా జర్మన్ భాష నేర్చుకున్నారట.
వివేకానంద చికాగో పర్యటనలో ఉన్నప్పుడు వారిరువురి కలయిక, రవివర్మలో ఒక కొత్త దృష్టి కోణాన్ని సమకూర్చింది. కృష్ణుడు బోధ చేస్తుంటే నిరుత్సాహంతో చతికిలబడిన అర్జునుడిని కాక కృష్ణుడు గమ్యం చూపిస్తుంటే అటువైపే విల్లును ఎక్కుపెట్టి ఏకాగ్రతతో బాణాన్ని ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్న అర్జునుడిని చిత్రించాలి’ అనే సలహా ఇచ్చారట వివేకానంద.
చికాగోలో జరిగే చిత్ర ప్రదర్శనలో ప్రదర్శించడానికి 1892-93 మధ్యకాలంలో 10 చిత్రాలు పంపించడానికి సమాజంలో ఉన్న అన్ని స్థాయిలలోని స్త్రీలను రవివర్మ ఎంచుకున్నారట. స్త్రీల వేషధారణ అలంకరణ వారు అనుసరించే ఆచార వ్యవహారాలు పురుషులకంటే స్త్రీలలోనే బహిర్గతం అవుతాయనే భావనతో స్త్రీమూర్తుల చిత్రాలు చిత్రించారట రవి వర్మ. చికాగో నగరంలో నిర్వహించబడి ప్రపంచ ప్రసిద్ధ చిత్రకళా ప్రదర్శనలో రవివర్మ ప్రథమ బహుమతిని పొందటమే కాక పంపినవన్నీ, అక్కడకు వచ్చిన చిత్రాలన్నిటికంటే ఎక్కువ ప్రశంసలు పొందడం గొప్ప విషయం’ అంటూ మలయాళ మనోరమ పత్రిక రాయటం జరిగింది.
రవివర్మ చిత్రకళపై విమర్శలు చేసిన వారు, ఆ చిత్రాల నకళ్ళను తయారుచేసి రవి వర్మ సంతకాన్ని అనుకరించి అశ్లీల చిత్రాలు వేసి సొమ్ము చేసుకున్న వారు కూడా ఆ కాలంలో లేకపోలేదు.
రవివర్మ చిత్ర నిర్మాణం ప్రారంభించిన 1870 సంవత్సరం నుండి ఆయన కీర్తిశేషులు అయ్యేంతవరకు అంటే 1906 సంవత్సరం వరకు ఇంచుమించు 40 సంవత్సరాలు ఆయన చిత్రకళా సామ్రాజ్యంలో ఏకైక చిత్రకళా చక్రవర్తిగా గుర్తింపు పొందారు. వివేకానంద ఒక సందర్భంలో ఆయనపై విమర్శలను తిప్పుకోడుతూ తప్పులు వెతకడం కష్టం కాదు. చాలా తేలిక. దానికోసం గొప్ప ప్రతిభక్కర్లేదు. ఎంత ఊహాశక్తి సృజనాత్మకత ఉంటేనే అనుకున్నది అనుకున్నట్లు చిత్రించగల పరిజ్ఞానంతో ఎంతో స్పష్టతతో చిత్రించడం జరగాలి. అది ఎంత కష్టమో మనం గ్రహించి అప్పుడు విమర్శించాలి’ అంటారు. 1892వ సంవత్సరంలో వివేకానంద బరోడా సంస్థానంలోని ప్రదర్శనశాలలో రవివర్మ చిత్రాలు చూసి ప్రశంసించారని హరిదాస్ విహారి దాస్ అనే పాత్రికేయుడు రాశారు. వివేకానంద దక్షిణ భారతదేశంలో ఉన్నప్పుడు కేరళలోని త్రివేండ్రం వెళ్లడం, అప్పటి యువరాజు అయిన అశ్వత్ తిరునాళ్ రవి వర్మ చిత్రాలను చూపినట్లు కూడా చరిత్ర చెబుతోంది.
రవి వర్మ తన జీవితకాలంలో తిరువనంతపురం నుండి బయలుదేరి ఎన్నో క్షేత్రాలను దర్శించుకుంటూ ఐదు నెలల కాలంలో 7300 మైళ్ల ప్రయాణం చేసిన క్రమంలో ఆయన ఆంధ్రప్రదేశ్లోని గుత్తి ప్రాంతాన్ని సందర్శించారట. రవి వర్మ కూడా ఒక రకమైన సంఘసంస్కర్తే! ఆయన కుల వివక్షను వ్యతిరేకిస్తూ దేవాలయ ప్రవేశము ధర్మాచరణతో పాటు సమాజ బహిష్కరణ వంటి వాటిని నిరసించారు. తన ఆదాయంలో ఒక్క రూపాయి కూడా ముట్టకుండా తాను సంపాదించిన డబ్బును వసంత కాలంలో తన చిన్నాన్నకు ఇచ్చి అది కుటుంబ సభ్యులు దగ్గర బంధువులకు పంచమని చెప్పి, పుణ్య కార్యాలకు ఉపయోగించమని కోరేవారట. అంతకుమించి ఏ సందర్భంలోనూ డబ్బును ముట్టుకోలేదట.
స్వాతంత్రోద్యమ కాలంలో ఉద్యమ స్ఫూర్తిని నింపడం కోసం రవివర్మ చిత్రకళ ద్వారా తన పాత్రను పోషించారు. చత్రపతి శివాజీ బాలగంగాధర్ తిలక్, రాణా ప్రతాప్ చిత్రాలు ఇందుకు ఉదాహరణగా ఉన్నాయి. 1903వ సంవత్సరంలో మద్రాసు లలిత కళా సంస్థ నిర్వహించిన చిత్రకళా ప్రదర్శన హైదరాబాదులో జరుగుతున్నప్పుడు వేసిన రిటైర్డ్ సోల్జర్ చిత్రం, హుస్సేన్ సాగర్ చిత్రం, అక్కడ ప్రదర్శించారు. ఈ చిత్రాలు అక్కడి ప్రదర్శనలో ప్రథమ స్థానంలో నిలిచాయి. రమానంద్ చటర్జీ- రవివర్మ జీవిత చరిత్రను ‘ఇండియన్ ఆర్ట్’ అనే పుస్తకంలో వివరంగా రాశారు. ఈ పుస్తకంలో రవివర్మ గుణగణాలను కూడా ప్రశంసిస్తూ ఆయన స్వభావసిద్ధంగా ఉత్తముడు సాధుస్వభావి దయార్థ హృదయుడు పేద గొప్ప అనే భేదం లేనటువంటి వాడు, అన్నార్తులను ఆదుకునే వారు. తాను గొప్ప చిత్తకారుడనని గర్వ పడని వారు, తన కీర్తి ప్రతిష్టల కంటే చిత్రకళా సాధనకే ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చేవారు. భారతదేశంలో ఉన్నత శిఖరాలు అందుకున్న చిత్రకారునిగా భావించుకుంటూనే, ఇంకా తాను చాలా నేర్చుకోవాలని, చాలా సాధన చేయాలని భావించేవారు’ అని రాశారు.
ఈ పుస్తకం ద్వారా ఉస్మానియా ప్రాంతానికి అప్పట్లో గవర్నర్ అయిన సర్ అత్తర్ హెలాక (వీరు ఒకప్పుడు మద్రాస్ ప్రాంతానికి కూడా గవర్నర్) రవివర్మకు ఉత్తరం రాస్తూ.. మహనీయులు వ్రాసిన కావ్యాలలోని ప్రేమ తత్వాన్ని అసభ్యతకు తావివ్వకుండా కావ్యార్థం చెడిపోకుండా భారతీయ పవిత్ర విలువలు కాపాడుతూ శృంగారాన్ని సున్నితంగా చూపించడం మీలోని ప్రత్యేకత” అని ప్రశంసించారట.1904వ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం రవివర్మకు ‘కైజర్ హింద్’ బిరుదు ప్రదానం చేశారు. అలాగే ‘రాజ’ అన్న బిరుదు కూడా! అటు తరువాత రాజా రవి వర్మగా ఆయన పేరు ప్రచారం అయింది.
కాదంబరి చిత్రాన్ని గీస్తూ రవి వర్మ ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది. 1906వ సంవత్సరం అక్టోబర్ నెల రెండవ తారీకు మధ్యాహ్న సమయంలో ఆయన తుది శ్వాస విడిచారు.
ఇలా సింగంపల్లి సత్యనారాయణ గారు ఒక దశాబ్ద కాలం పాటు తన పఠనం పరిశోధన పర్యటన ద్వారా అనేక విషయాలను ఈ పుస్తకం ద్వారా వెలుగులోకి తెచ్చి ఈ తరం వారికి రాజా రవివర్మ జీవితాన్ని ఆయన జీవిత సమకాలీన విషయాలను ఇప్పటి తరం వారికి తెలియజెప్పే ప్రయత్నం బహుదా ప్రశంసనీయం.
మల్లేశ్వరరావు ఆకుల (7981872655)
ప్రతులకు:
చిత్రకళా తపస్వి రాజా రవివర్మ
పేజీలు : 284 వెల: రూ.390/-
రచయిత: సింగంపల్లి సత్యనారాయణ (9177040578 / 9888528999)
