ప్రేక్షకులను రాజమౌళి నిరాశ పరిచాడా ?

రాజమౌళి దర్శకత్వం వహించిన ‘బాహుబలి-2’ దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకుంది. మరీ ముఖ్యంగా తెలుగులో అయితే ఏ సినిమా వసూళ్ల గురించి చెప్పాల్సి వచ్చినా ‘నాన్ బాహుబలి’ అని ప్రత్యేకంగా పేర్కొనే పరిస్థితి ఏర్పడింది. అలాంటి నేపథ్యంలో ‘మహా సంగ్రామం’ మూవీ తర్వాత తిరిగి రియల్ మల్టీ స్టారర్ గా రూపు దిద్దు కుంది ‘ట్రిపుల్ ఆర్’. అంతవరకూ సోలో హీరోలతో సినిమాలు తీసి రికార్డులను సొంతం చేసుకున్న రాజమౌళి తొలిసారి జూనియర్ ఎన్టీయార్, రామ్ చరణ్ ‘ఆర్.ఆర్.ఆర్. తీస్తున్నారని తెలియగానే అంచనాలు అంబరాన్ని తాకాయి. దానికి తోడు చరిత్రలో ఎప్పుడూ కలునుకోని అల్లూరి, కొమరం భీమ్ కలిసి బ్రిటిష్ వారిపై పోరాటం చేస్తే ఎలా ఉంటుందో చూపే చిత్రమని రాజమౌళి చిత్ర ప్రారంభోత్సవం నాడు ప్రకటించడంతో ఆనందంతో పాటు అనుమానాలు కలిగాయి. సృజనాత్మక స్వేచ్ఛ పేరుతో రాజమౌళి బృందం చరిత్రను వక్రీకరించదు కదా! అనే సందేహాన్ని కూడా కొందరు వ్యక్తం చేశారు. దానికి తోడు జూ. ఎన్టీయార్ కి సంబంధించిన గ్లింమ్స్ ను విడుదల చేసినప్పుడు ఆయన నెత్తిన ముస్లిం టోపీ పెట్టడంపై పలువురు అభ్యంతరం వ్యక్తంచేశారు. రకరకాల అనుమానాలకు, సందేహాలకు తెరదించుతూ ‘ట్రిపుల్ ఆర్’ సినిమా జనం ముందుకు మార్చి 25న వచ్చేసింది.

కథ విషయానికి వస్తే ఇది 1920లోని ఇద్దరు యువకులకు సంబంధించింది. అదిలాబాద్ అడవుల్లో గోండులకు కాపరిగా ఉంటాడు భీమ్ (ఎన్టీయార్). ఓసారి ఢిల్లీ నుండి గూడేనికి వచ్చిన గవర్నర్ స్కాట్ భార్య అక్కడ మల్లి అనే గోండు పాపకు పచ్చబొట్టు వేయడంలోని నైపుణ్యంచూసి ముగ్ధురాలై, తమతో తీసుకెళ్లిపోతుంది. మల్లిని తిరిగి తల్లి చెంతకు చేర్చే బాధ్యతను భీమ్ భుజానికి ఎత్తుకుంటాడు. తన బృందంతో కలిసి ఢిల్లీ బయలు దేరతాడు. ఇక ఉత్తరాంధ్రకు చెందిన రామరాజు (రామ్ చరణ్) తెల్లవారికి వ్యతిరేకంగా తన తండ్రి చేసిన పోరాటాన్ని కొనసాగించాలని భావిస్తాడు. ఉద్యమకారులందరికీ ఆయుధాలు సమకూర్చుతానని తండ్రికి మాట ఇస్తాడు. అందుకోసం బ్రిటిషర్స్ దగ్గర పోలీస్ అధికారిగా ఉద్యోగం సంపాదిస్తాడు. ఎలాగైనా ఆయుధాగారం అధికారిగా నియమితుడై, అక్కడి ఆయుధాలను కొల్లగొట్టి ఉద్యమకారులకు అందించాలన్నది రామ్ అసలు ఆలోచన. గవర్నర్ పై దాడిచేసి మల్లిని తీసుకెళ్లడం కోసం భీమ్ బృందం ఢిల్లీ వచ్చిందని అధికారులకు తెలుస్తుంది. అతన్ని పట్టుకునే పని రామ్ కు అప్పచెబుతారు. బ్రిటిషర్స్ కన్నుకప్పడం కోసం ముస్లిం వేషంలో తిరుగుతుండే భీమ్ తో రామ్ కు స్నేహం ఏర్పడుతుంది. అతనే భీమ్ అని రామ్ కు గానీ, రామ్ బ్రిటిష్ సైన్యంలో పనిచేస్తూ తనను వెతుకుతున్నాడని భీమ్ కు గానీ తెలియదు. వాస్తవం తెలిసిన తర్వాత ఇద్దరి మధ్య వైరం ఏర్పడుతుంది. అపార్థాలతో గొడవకు దిగుతారు.

తర్వాత తప్పు తెలుసుకుని ఒకరిని ఒకరు రక్షించుకుని, ఇద్దరూ కలిసి బ్రిటిషర్స్ మీద ఎలా ప్రతీకారం తీర్చుకున్నారన్నది మిగతా కథ.
కొమరం భీమ్, అల్లూరికి సంబంధించిన చరిత్రను స్ఫూర్తిదాయకంగా తెర మీద రాజమౌళి చూపించబోతున్నాడనే భావనతో థియేటర్లకు వెళ్లిన వారికి పూర్తి స్థాయిలో నిరాశ కలుగుతుంది. ప్రజల దృష్టిని ఆకట్టుకోవడానికి రాజమౌళి కొమరం భీమ్, అల్లూరి పేర్లను వాడుకున్నాడేమోననే సందేహం ఏర్పడుతుంది. అదే సమయంలో ఎందుకొచ్చిన వివాదాలు అనే భయంతోనూ ఆయన కథను మార్చుకుని, వారిద్దరి పేర్లు మాత్రమే వాడుకుని ఓ ఫిక్షనల్ స్టోరీగా దీనిని మార్చేసి ఉండొచ్చుననీ అనిపిస్తుంది. ప్రచార సమయంలో రాజమౌళి ఈ విషయాన్ని నొక్కి మరీ చెబుతూ వచ్చారు. ఇందులో బ్రిటిషర్స్ పై ఇద్దరు యువకులు చేసే పోరాటం కంటే వారి మధ్య స్నేహం, మధ్యలో ఏర్పడే అపార్థాలు, తిరిగి ఒక్కటి కావడం.. వీటి మీదనే దర్శకుడు ఎక్కువ దృష్టి పెట్టాడు. వారిద్దరికీ సాధారణ శత్రువు బ్రిటిషర్స్ కాబట్టి వారిపై పోరాటం చేసినట్టు చూపించారు.

ఇదో ఊహాజనిత కథ అని దర్శకుడు స్పష్టం చేశాక వాస్తవాల గురించి చర్చించడం సమంజసం కాదు. రామరాజును బ్రిటిషర్స్ దగ్గర పనిచేసే వాడిగా చూపించారనే విమర్శకు బలం చేకూరదు. అదే సమయంలో తన సినిమా ప్రచారం కోసం, దానిని జనబాహుళ్యంలోకి తీసుకెళ్లడం కోసం ఇద్దరు మహోన్నతులకు సంబంధించిన ఊహాజనితమైన కథ అని దర్శకుడు చెప్పడం కూడా సమంజసం కాదు.
కొమరం భీమ్, రామరాజు పేర్లు ఉపయోగించకుండా రాజమౌళి ఈ సినిమాను తీసి ఉంటే…. గొడవే ఉండకపోయేది! ఇన్ని వివాదాలు, విమర్శలకు ఈ సినిమా కేంద్రంగా మారి ఉండకపోయేది. సినిమా చివరిలో సీతారామరాజు గెటప్లో రామ్ చరణ్ ను చూపించడం బాగానే ఉంది. రాముడి విగ్రహం నుండి శరాన్ని తీసుకుని, బ్రిటిషర్స్ మీదకు బాణాలను సంధించడం ప్రేక్షకులను ఉత్తేజపరిచే సన్నివేశమే. అయితే విశ్రాంతికి ముందు బ్రిటిషర్స్ కోటలోకి ఎన్టీయార్ క్రూరమృగాలను తీసుకెళ్లి దాడి చేయడం మరీ సినిమాటిక్ గా ఉంది. భీమ్ తన గూడేనికి చెందిన మల్లి కోసం పోరాటం చేస్తే, రామ రాజు ఈ మట్టికోసం పోరాడినట్టు చూపించారు. దాంతో సహజంగానే ఆ పాత్రకు ప్రాధాన్యం పెరిగింది. నటీనటులు, సాంకేతిక నిపుణులంతా సంపూర్ణ ప్రతిభను ప్రదర్శించారు. మనం తెరపై చూస్తోంది కొమరం భీమ్, అల్లూరిని పోలిన పాత్రలు అనే భావన మనసులోంచి తీసేసి చూస్తే ట్రిపుల్ ఆర్’ ఆసక్తిదాయకమైన చిత్రం అనే చెప్పొచ్చు. కానీ మూడు గంటలకు పైగా నిడివి ఉన్న ఈ సినిమా కొన్ని సందర్భాల్లో సహనానికి పరీక్ష పెట్టే అవకాశమూ ఉంది. ఏదేమైనా ప్రచారం మీద పెట్టిన శ్రద్ధ కథ మీద పెట్టి ఉంటే మరింత మెరుగైన చిత్రంగా ‘ట్రిపుల్ ఆర్’ రూపుదిద్దుకునేది!

-ఒక అభిమాని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap