ప్రతినాయక ‘రాజ’నాల

(విలన్ రాజనాల వర్ధంతి సందర్భంగా షణ్ముఖాచారి గారి వ్యాసం)

(నీరాజనం: రాజనాల కాళేశ్వరరావును కావలిలో అందరూ ‘కల్లయ్య’ అని పిలిచేవారు. కావలి తంబళ్లగుంట వద్దగల జిల్లా బోర్డు స్కూల్ (నేటి జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల)లో రాజనాల మా పెద్ద అన్నయ్యకు సహవిద్యార్థి. కావలి విశ్వోదయ ఓపన్ ఎయిర్ థియేటర్ లో పులిగండ్ల రామకృష్ణయ్య రచించిన‘తుపాను’ నాటక ప్రదర్శనలు ఎక్కువగా జరిగేవి. మద్రాసులో బిజీ ఆర్టిస్టుగా వుంటూ కూడా, రాజనాల పనికట్టుకొని వచ్చి ఆ నాటకంలో నెల్లూరు మాండలికంలో డైలాగులు చెప్పే రాఘవరెడ్డి పాత్రను రక్తి కట్టించేవారు. రాజనాలకు మా మూడవ అన్నయ్య మేకప్ చేసేవారు. కావలికి ఎప్పుడు వచ్చినా తెల్లని గ్యాబార్డిన్ వులన్ ప్యాంట్, తెల్లని టెర్లిన్ షర్టు వేసుకొని చామంతి రంగులో మెరిసిపోవేవారు. నేను అప్పుడు విశ్వోదయ హైస్కూల్ లో 8 వతరగతి చదుకుంటూ వుండేవాడిని. మా అన్నయ్య మేకప్ చేసేవారు కనుక ఆయనవెంట నేను గ్రీన్ రూమ్ కు తేలిగ్గానే వెళ్లగలిగేవాణ్ణి. రాజనాలతో మాట్లాడే అవకాశం కలిగించిన మా అన్నయ్యకు సదా కృతజ్ఞుణ్ణి.)

అతడు సినిమాలలో ఎన్నో కాపురాలు కూల్చిన క్రూరుడు. సాధుజనులను హింసించిన పాపాత్ముడు. దైవాన్ని ధిక్కరించిన దుష్టుడు, కంటిచూపుతోనే ప్రేక్షకులను భయపెట్టిన వాడు. ఇదంతా తెలుగు వెండితెరమీద రాజనాల విలన్ గా చేసిన విన్యాసం. తెలుగు చలనచిత్ర రంగంలో ప్రతినాయకుడు వేషంలో రెండు దశాబ్దాలపాటు అప్రతిహతంగా ఓ వెలుగు వెలిగిన అసమాన నటుడు రాజనాల. అతడు సినిమాలలోకి వచ్చాక సాత్వికులైన విలన్ పాత్రధారులకు కాలం చెల్లింది. రాజనాల వచ్చాక విలనిజం కు నూతన నిర్వచనం చెప్పారు. హీరోలకు ధీటుగా నిలిచే విలన్ గా రాజనాల యెదిగారు. అది జానపదం కావచ్చు, పౌరాణికం, సాంఘిక సినిమా కూడా కావచ్చు. రాజనాల లేకుండా ఆ సినిమాలు నడవలేదు. రాజనాల 1300 సినిమాలకుపైగా నటించారు. రాజనాల విద్యాధికుడు. జోతిషశాస్త్రాన్ని ఆపోశన పట్టినవాడు. క్రమశిక్షణాపరుడు. సంస్కృతి సంపన్నుడు, హనుమాన్ భక్తుడు. పుస్తకప్రియుడు. ఇంగ్లిష్ నాటకాలు, ముఖ్యంగా షేక్ స్పియర్ నాటకాలను వేసిన అనుభవశాలి. పట్టుదల కలవాడు. అది నెరవేరేదాకా విశ్రమించేవాడు కాదు. అందుకు చిన్న ఉదాహరణ…. కావలి పట్టణంలో ప్రాధమిక పాఠశాలలో చదువుతున్నప్పుడు రాజనాలకు జబ్బుచేసింది. దాంతో బడికి వెళ్ళడం కుదరలేదు. జబ్బునుండి తేరుకున్నతరవాత మరలా స్కూలుకు వెళ్లలేదు. ఇంటివద్దనే చదువుకుంటూ ప్రవేశ పరీక్ష రాసి సరాసరి బోర్డు స్కూల్ లో ఎనిదవ తరగతిలో చేరిన పట్టుదలగల విద్యార్థిగా ఆరోజుల్లోనే రాణించినవాడు రాజనాల. SSLC పరీక్షలో ఉత్తీర్ణుడై ఇంటర్మీడియట్ చదివి రెవెన్యూ శాఖలో గుమాస్తాగా వుద్యోగం సంపాదించారు. ఉద్యోగం చేస్తూ చదువు మీద వున్న శ్రద్ధతో డిపార్టుమెంటల్ పరీక్షలు వ్రాసి ఇనస్పెక్టర్ గా పదోన్నతి పై ముత్తుకూరులో వుద్యోగం చేస్తూవచ్చారు. అప్పుడే రాజనాల నెల్లూరులో ‘నేషనల్ ఆర్ట్ థియేటర్’ పేరుతో ఒక నాటక సమాజాన్ని స్థాపించి, ఆ సమాజం తరఫున నెల్లూరు పురమందిరంలో నాటక ప్రదర్శనలు ఇస్తూ వుండేవారు. కుస్తీలు పట్టే రాజనాల మిస్టర్ ఇండియా గా కూడా పేరు తెచ్చుకున్నారు.

ప్రభుత్వ ఉద్యోగానికి స్వస్తి

ఒకసారి ఆచార్య ఆత్రేయ రచించిన ‘ఎవరు దొంగ’ అనే నాటకాన్ని రాజనాల నెల్లూరు పురమందిరం (టౌన్ హాల్)లో ప్రదర్శించారు. ఆ ప్రదర్శనకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆ నాటకంలో లంచగొండి తనాన్ని గురించి పదునైన డైలాగులున్నాయి. అవి వింటున్న కలెక్టర్ కు మనస్తాపం కలిగింది. తన రెవెన్యూ శాఖలోనే పనిచేసే ఉద్యోగి నిర్వహించిన నాటకమని తెలిసి విస్తుబోయాడు కలెక్టర్. కొంతకాలం తర్వాత ఒక గ్రామంలో ‘ప్రగతి’ అనే నాటకాన్ని రాజనాల ప్రదర్శించారు. అందులో రాజనాలది ఒక పెట్టుబడిదారుని పాత్ర. ఆ నాటకాన్ని ప్రేక్షకులు బాగా మెచ్చుకోవడం కొందరు సహోద్యోగులు విని, విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకొనివెళ్లారు (ఆరోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులెవరూ ప్రభుత్వ అనుమతి లేకుండా నాటకాల వంటి వినోద కార్యక్రమాలలో పాల్గొనరాదు అనే నిబంధ కూడా వుండేది). అసలే కలెక్టర్ కు రాజనాలమీద ఉక్రోషం వుండడంతో, లంచగొండితనాన్ని తూర్పారపట్టడం, బ్లాక్ మార్కెటింగ్ ను నిరసించడం వంటి పనులు చేస్తున్నాడని రాజనాలను మూడునెలలపాటు ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. అభ్యుదయ భావాలు కలిగిన రాజనాలకు తను పనిచేసే డిపార్టుమెంట్ లోనే వేళ్లూనిన లంచగొండి తనాన్ని వ్యతిరేకించడంతో తన ఉద్యోగాన్నే బలి ఇవ్వవలసి వచ్చింది. తన ఉద్యోగం గొడవల్లో వున్నా రాజనాల నాటక ప్రదర్శనలను నిర్వహించడం మాత్రం మానుకోలేదు. సస్పెన్షన్ లో వున్న కాలంలో రాజనాల ‘ఎవరు దొంగ’, ‘ప్రగతి’, ‘అదాప్రపంచం’ వంటి అభ్యుదయ నాటకాలను ప్రదర్శిస్తూనే వచ్చారు. ప్రభుత్వ వుద్యోగం మీద విరక్తి కలిగింది. సినిమాలలో ప్రయత్నిదామని మద్రాసు వెళ్లారు.

మీసాల పులితో పరిచయం…

1951లో రాజనాల మద్రాసు వెళ్లారు. మీసాల పులిగా పేరుగాంచిన రోహిణీ ఫిలిమ్స్ నిర్మాత హెచ్.ఎం. రెడ్డిని కలిసి తన నాటక అనుభవాలన్నీ చెప్పుకునారు. హెచ్.ఎం. రెడ్డి అప్పుడే నిర్మించిన నూతన స్టూడియోలో తక్కువ బడ్జట్ లో సినిమా తీద్దామని ‘ప్రతిజ్ఞ’ సినిమా స్క్రిప్టు రెడీ చేసుకొన్నారు. కొత్తనటీనటులను పరిచయం చేయాలని హెచ్.ఎం. రెడ్డి రాజనాలకు స్క్రీన్ టెస్ట్ చేయించి సంతృప్తి చెందారు. ఉత్తరం రాస్తానని హెచ్.ఎం. రెడ్డి చెప్పగానే రాజనాల నెల్లూరు చేరుకొని మరలా వుద్యోగంలో చేరారు. ఒకరోజు రాజనాల మిత్రులతో కలిసి నెల్లూరు ట్రంక్ రోడ్డులో కూల్ డ్రింక్ త్రాగుతూ కులాసా కబుర్లు చెప్పుకుంటూ వుంటే, అతని సహోద్యోగి ఒక టెలిగ్రామ్ పట్టుకొచ్చాడు. మద్రాసుకు బయలుదేరి రమ్మని హెచ్.ఎం. రెడ్డి పంపిన తంతి అది. 1952 జనవరిలో రాజనాల ‘ప్రతిజ్ఞ’ సినిమాలో నటించేందుకు అగ్రిమెంట్ రాశారు. ఆ ఒడంబడిక ప్రకారం రోహిణీ బ్యానర్ మీద హెచ్.ఎం.రెడ్డి నిర్మించే సినిమాలలో తప్ప వేరే సినిమాలలో నటించకూడదు. తనతోబాటు కాంతారావు కూడా ‘ప్రతిజ్ఞ’ చిత్రంలో నటించేందుకు ఎంపికయ్యారు. అందులో రాజనాల విలన్ పాత్రను ధరించారు. సినిమా హిట్టై రాజనాలకు విలన్ గా మంచి పేరు తెచ్చిపెట్టింది. తరవాత ‘బీదల ఆస్తి’ అనే చిత్రంలో తండ్రి పాత్ర పోషించి మెప్పించారు. అయితే రాజనాల విలన్ పాత్రలకు బాగా పనికివస్తాడనే మాట చిత్రపరిశ్రమలో నాటుకుపోయింది. అగ్రిమెంట్ సడలించాక రాజనాల కన్యాదానం, జయసింహ, రేణుకాదేవి మాహాత్మ్యం, ఇనస్పెక్టర్, రాజగురువు, నాగపంచమి చిత్రాలలో నటిస్తూ కొందరికి డబ్బింగ్ కూడా చెప్పారు. రాజనాల జయసింహ చిత్రంలో ఎన్.టి.ఆర్ తో నటించేందుకు కత్తి యుద్ధం లో శిక్షణ తీసుకున్నారు. తరవాత కార్తవరాయని కథ, వినాయక చవితి, దేవసుందరి, దొంగలున్నారు జాగ్రత్త, అక్కచెల్లెళ్లు, దొంగల్లోదొర, కృష్ణమాయ, ప్రేమే దైవం, రాజనందిని వంటి సినిమాలలో నటిస్తూ బాగా బిజీ విలన్ గా పేరుతెచ్చుకున్నారు. రాముడు-భీముడు, హరిశ్చంద్ర, పిడుగురాముడు, జగదేకవీరుని కథ, ఖైదీ కన్నయ్య, చాణక్య శపథం, దొరికితే దొంగలు, రహస్యం, సుపుత్రుడు, వంటి అనేక సినిమాలు రాజనాలకు మంచిపేరు తెచ్చినవే. ఆరోజుల్లో తెలుగులో వచ్చిన పలు జానపద సినిమాలు తమిళంలో డబ్ అయ్యేవి. దాంతో తమిళనాట కూడా రాజనాల విలన్ గా బాగా పాపులర్ అయ్యారు. ఆంజనేయుడుగా నటించినప్పటినుంచి రాజనాల హనుమాన్ భక్తుడైపోయారు. ఎన్.టి.ఆర్ కు ‘వద్దంటే డబ్బు’ చిత్రంలో నటించినప్పటినుంచి రాజనాల అంటే విపరీతమైన అభిమానం. ఎన్.టి.ఆర్ రాజనాలను ‘మామాజీ’ అంటూ పిలిచేవారు. రామారావు సొంత సినిమాలలో రాజనాలకు తప్పకుండా వేషం వుండేది. కుటుంబంతో సహా రాజనాలను తన ఇంటికి పిలిచి విందు ఇచ్చేవారు ఎన్.టి.ఆర్. ‘జయసింహ’ సినిమా శతదినోత్సవం విజయవాడలో జరిగినప్పుడు, ఎన్.టి.ఆర్ రాజనాలను తన సొంతవూరు నిమ్మకూరుకు తీసుకొనివెళ్లి అతితిమర్యాదలు కూడా చేశారు.

పదనిసలు…

రాజనాలకు మద్రాసులో రెండు పెద్ద బంగళాలు వుండేవి. ఆయన సంపాదనకు కొదువలేదు. కానీ డబ్బు విపరీతంగా ఖర్చు చేసేవారు. దానధర్మాలు చెయ్యడం, బంధువులను ఆర్ధికంగా ఆదుకోవడం, వారికి ఇండ్లు కట్టించి ఇవ్వడం రాజనాల దినచర్యల్లో ముఖ్యభాగం. అభాగ్యులకు ఆదరణ కలిపించే ఆశ్రమంగా రాజనాల ఇల్లు వుండేది. స్వయంగా సాహిత్య అభిమాని కావడంతో మద్రాసులో ఒక గ్రంధాలయాన్ని ఏర్పాటుచేసి గొప్ప సాహిత్యం అందుబాటులోకి తెచ్చారు. కానీ… రోజులన్నీ ఒకేరకంగా వుండవుగా! రాజనాల భావిష్యత్తును దృష్టిలో వుంచుకోలేదు. ముందుచూపు లేకపోవడమే అందుకు కారణం. భార్య కనకదుర్గ (శోభ) 1969లో మరణించడం రాజనాలను క్రుంగదీసింది. ఆసక్తుడైనారు. 1971లో భూదేవిని ద్వితీయ వివాహం చేసుకున్నారు. ఆరోగ్యం కూడా క్షీణించింది. సినిమాలలో అవకాశాలు తగ్గిపోయాయి. కార్లు, భూములు, ఇండ్లు కరిగిపోయాయి. దాంతో 1993 ప్రాంతంలో హైదరాబాద్ కు మకాం మార్చారు. ‘తెలుగువీర లేవరా’ సినిమా షూటింగ్ అరకు వ్యాలీలో జరుగుతుండగా రాజనాల కాలుకు గాయమైంది. అప్పటికే రాజనాలకు మధుమేహం ఇబ్బంది వుండేది. దాంతో ఒక కాలు పూర్తిగా తీసివేయవలసి వచ్చింది. అప్పుడు ఎన్.టి.ఆర్ ముఖ్యమంత్రిగా వున్నారు. ప్రభుత్వ ఖర్చుతో రాజనాలకు వైద్యం అందించారు. కొంత ఆర్ధిక సహాయం చేశారు. కొందరు సినిమా దాతలు ఆర్ధిక సహాయం చేస్తే ఆ డబ్బుతో కాలం వెళ్ళబుచ్చారు. అయితే దాతలు ఇచ్చే సహాయాన్ని రాజనాల మద్యపానం కోసం వెచ్చించేవారు. ఈ సంగతి తెలిసిన ఎన్.టి.ఆర్ కూడా ఆర్ధిక సహాయాన్ని నిలిపివేశారు. ఒక కుమారుడు మూర్ఛ వ్యాధితో మరణించగా మరొక కుమారుడు బొంబాయి వెళ్ళి తిరిగిరాలేదు. అతని ఆచూకీ కూడా తెలియలేదు. జోతిష శాస్త్రం తెలిసినవాడు కనుక తనకు మృత్యువు ఎప్పుడు వస్తుందో ముందుగానే తెలుసుకున్నారు. సముద్రతీరంలో మరణించాలని ఆశించారు. అలాగే తన కూతురు పావని ఆహ్వానం మీద మద్రాసు చేరుకొని., అక్కడ జబ్బున పడి మరణించడం విధి విలాసం.

-ఆచారం షణ్ముఖాచారి
(94929 54256)

1 thought on “ప్రతినాయక ‘రాజ’నాల

  1. రాజనాల మీద రాసిన వ్యాసం విశేషంగా ఫొటోలు బాగున్నాయి. సిగరెట్ తాగుతున్న ఫొటో అప్పట్లో ‘విజయ చిత్ర ‘ లో చూసాను. అప్పటి వారంతా చరిత్రలు ష్రుష్టించిన వారే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap