బాలీవుడ్ సప్నోం కి జహాపనా… రాజేష్ ఖన్నా

(రాజేష్ ఖన్నా వర్ధంతి సందర్భంగా ఆచారం షణ్ముఖాచారి గారి వ్యాసం..)

కుర్రకారుకి అతడంటే క్రేజ్. అతడి హెయిర్ కట్ ను అనుకరింఛడం కాలేజి కుర్రాళ్ళకు క్రేజ్. ఆడపిల్లలకు అతడో డ్రీమ్ బాయ్. రక్తంతో అతనికి ప్రేమలేఖలు పుంఖానుపుంఖాలుగా రాయడం వారికి థ్రిల్. కారు కనపడితే దుమ్మును ముద్దాడటం వారి అభిమానానికి పరాకాష్ట. లిప్ స్టిక్ తో కారు అద్దాలకు ముద్దులు పెట్టడం వారికి ఆత్మానందం. దేవానంద్ తరవాత అంతటి స్టైల్ గా, గ్లామరస్ గా కనిపించిన ఆ హీరో కి కుర్రకారు ఫిదా అయిపోయేవాళ్ళు. అప్పటిదాకా బాలీవుడ్ లో “సూపర్ స్టార్” అనే పదానికి చోటులేదు. ఈ హీరో రాకతోనే ఆ బిరుదుకు సార్ధకత చేకూరింది. అతడు నటించిన 17 సినిమాలు వరసగా సూపర్ హిట్లయ్యాయి. సంపన్నకుటుంబంలో పుట్టిన ఆ కుర్రహీరో కాలేజీ రోజుల్లోనే స్పోర్ట్స్ కారులో తిరిగేవాడంటే అతడి స్థాయిని అర్ధం చేసుకోవచ్చు. ఇన్ని ప్రత్యేకతలున్న ఆ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా. బాలీవుడ్ లో అడుగుపెడుతూనే సూపర్ స్టార్ గా ఓ వెలుగు వెలిగిన రాజేష్ ఖన్నా వర్ధంతి సందర్భంగా ఆ సప్నోం కి రాజా విశిష్టతలు ఒకసారి గుర్తు చేసుకుంటే….

జితిన్ గా తొలి రోజుల్లో:
రాజేష్ ఖన్నా అసలుపేరు జితిన్ ఖన్నా. పుట్టింది లాలా హీరానంద్ ఖన్నా, చంద్రాణి దంపతులకు 29 డిసెంబర్ 1942న అమృతసర్ లో. తండ్రి బురేవాలా (పాకిస్తాన్) పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేసేవారు. సంతు కలగని హీరానంద్ రక్తసంబంధీకులు చున్నీలాల్ ఖన్నా, లీలావతి దంపతులు చిన్నప్పటినుంచే జతిన్ ను పెంచుకున్నారు. వారిది ఉన్నత కుటుంబం. చున్నీలాల్ బొంబాయిలో రైల్వే కాంట్రాక్టరుగా గిర్గామ్ లో నివాసం ఉండేవాడు. సెయింట్ సెబాస్టియన్ పాఠశాలలో జితిన్ చదువుకునే రోజుల్లో రవి కపూర్ అనే సహాధ్యాయి ఉండేవాడు. ఇద్దరూ మంచి స్నేహితులు. తదనంతర కాలంలో ఆ రవి కపూరే హీరో జితేంద్రగా అవతారమెత్తాడు. జితిన్ అటు పాఠశాల లోను, ఇటు కళాశాల లోను నాటకాలు వేస్తూ చాలా బహుమతులు గెలుచుకున్నాడు. ‘అంధా యుగ్’ అనే ఒక నాటకంలో గాయపడిన సైనికుని వేషం కట్టిన జతిన్ నటనా ప్రతిభను మెచ్చుకుంటూ, ఆనాటకానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఓ పెద్దమనిషి జితిన్ ను “సినిమాల్లో నటిస్తే బాగా రాణిస్తావు” అని దీవించాడు. దీంతో జితిన్ కు సినిమాల మీద ఆసక్తి పెరిగింది. కాలేజీలో చదివే రోజుల్లోనే జితిన్ కు ఎమ్.జి. స్పోర్ట్స్ కారు వుండేది. ఆ కారులో స్టూడియోల చుట్టూ వేషాలకోసం తిరిగేవాడు. జితిన్ కు గురుదత్, మీనాకుమారి, గీతాబాలి అంటే యెంతో ఇష్టం. దిలీప్ కుమార్ అంటే అంకిత భావం, రాజకపూర్ యదేచ్ఛ, దేవానంద్ శైలి, షమ్మికపూర్ లయ జతిన్ కు స్పూర్తిగా నిలిచాయి. మిత్రుడు జితేంద్రకు సినిమాలో నటించే అవకాశం వచ్చినప్పుడు ‘ఆడిషన్’ కు తీసుకెళ్ళింది జితినే! సినిమాలలో నటించాలనే అభిలాష తెలుసుకున్న జితిన్ మేనమామ అతని పేరుని ‘రాజేష్ ఖన్నా’ గా మార్పుచేశాడు.

రాజేష్ ఖన్నా గా హిందీ వెండితెర మీద:

1965లో యునైటెడ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ వారు ఫిలింఫేర్ వారి ఆధ్వర్యంలో ‘ట్యాలెంట్ హంట్’ నిర్వహించారు. దానికి పదివేలమంది ఔత్సాహిక యువకులు పోటీ పడ్డారు. చివరికి ఎనిమిదిమందిని భావితరం నటులుగా ఎంపిక చేశారు. వారిలో రాజేష్ ఖన్నా ఒకడు. ఈ ఎంపిక చేసినవారు బి.ఆర్. ఛోప్రా, బిమల్ రాయ్, జి.పి. సిప్పీ, హెచ్. ఎస్. రావైల్, నాజిర్ హుసేన్, శక్తి సామంత, జె. ఓంప్రకాష్, సుబోద్ ముఖర్జి, మోహన్ సైగల్ వంటి అగ్రశ్రేణి నిర్మాతలు. వెంటనే రాజేష్ ఖన్నా కు సినిమాలో నటించే అవకాశం వచ్చింది. హిమాలయా ఫిలిమ్స్ వారు చేతన్ ఆనంద్ దర్శకత్వంలో నిర్మించిన ‘ఆఖ్రీ ఖత్’ (1966)లో హీరోగా ఇంద్రాణి ముఖర్జీ సరసన రాజేష్ నటించాడు. సినిమా గొప్పగా ఆడలేదు. కానీ, మనదేశం తరఫున ఈ చిత్రం ఆస్కార్ నామినేషన్ కు ఎంపికైంది. రవీంద్ర దేవ్ దర్శకత్వంలో జి.పి. సిప్పీ నిర్మించిన ‘రాజ్’ (1967) సినిమా, హీరోగా రాజేష్ ఖన్నా కు ‘బ్రేక్’ ఇచ్చింది. అందులో రాజేష్ సరసన బబిత హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో రాజేష్ ఖన్నా ద్విపాత్రాభినయం చేయాల్సి వచ్చినప్పుడు ఆ రెండు పాత్రల వైవిధ్యాన్ని ఎలా చూపాలో దర్శకుడు రవీంద్రదేవ్ చక్కగా తర్ఫీదు ఇచ్చాడు అని రాజేష్ ఖన్నా ఒకానొక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అదే సంవత్సరం నాసిర్ హుసేన్ నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన ‘బహారోం కే సప్నే’ సినిమాలో ఆశా పరేఖ్ సరసన హీరోగా నటించాడు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు విషాదాంతంగా ముగిసే ఆఖరి ఘట్టాన్ని మార్చి సుఖాంతం చెయ్యమని పలు విజ్ఞప్తులు చెయ్యడంతో, రెండవ వారంలో ఆ చిత్ర ముగింపును మార్చారు. రాజేష్ ఖన్నా స్టార్డం అందుకోవడానికి ఈ చిత్రం తొలి మెట్టుగా నిలిచింది. తరవాత వరసగా జెమినీ అధిపతి ఎస్.ఎస్. వాసన్ నిర్మించిన ‘ఔరత్’లో రెండవ హీరో గా ఫిరోజ్ ఖాన్ తో కలిసి నటించాడు. ఆ తరవాత శక్తి సామంత నిర్మాణ దర్శకత్వంలో విడుదలైన ‘ఆరాధనా’ (1969) సినిమా రాజేష్ ఖన్నా నటజీవితాన్నే మార్చేసింది. షర్మీలా టాగూర్, ఫరిదా జలాల్, సుజిత్ కుమార్ లు నటించిన ‘ఆరాధనా’ సినిమా ఫిలింఫేర్ వారిచే ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. డార్జిలింగ్ కొండల్లో ట్రైన్ ప్రక్కనే ఓపన్ జీపును సమాంతరంగా నడుపుతూ పాడిన “మేరే సప్నోం కి రాణి కబ్ ఆయేగీ తూ” పాట దేశం మొత్తంలోని కుర్రకారును ఒక ఊపు ఊపేసింది. ఇక “రూప్ తేరా మస్తానా” పాటలో రాజేష్, షర్మీలా ఇద్దరూ వర్షంలోతడిచిన అరకొరక బట్టల్లో నిప్పుల నెగడు చుట్టూ తిరుగుతూ పాడుతుంటే సినిమా హాళ్ళలో కూర్చున్న యువతరం ఎగిరి గంతేశారు. “రూప్ తేరా మస్తానా” పాట మొత్తాన్ని సింగిల్ టేక్ లో ‘ఒకే’ చేసిన ఘనత కూడా రాజేష్ ఖన్నాదే! ఆ సంవత్సం విడుదలైన సినిమాలలోకెల్లా ‘ఆరాధనా’ చిత్రం అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచి రాజేష్ ఖన్నా ఉన్నతికి కారణభూతమైంది. తెలుగులో ఈ చిత్రాన్ని ‘కన్నవారికలలు’ పేరుతో, తమిళంలో ‘శివగామియిన్ సెల్వన్’ గా నిర్మించగా అక్కడకూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఆరాధనా సినిమా రాజేష్ ఖన్నాను తొలి ‘సూపర్ స్టార్’ గా ఎదిగేందుకు సోపానంగా నిలిచింది. నెల తరవాత విడుదలైన మరొక చిత్రం ‘దోరాస్తే’ ఆరాధనాతో సమానంగా యాభై వారాలు ఆడింది. వాటి తరవాత విడుదలైన సినిమా యాష్ చోప్రా దర్శకత్వంలో బి.ఆర్. చోప్రా నిర్మించిన ‘ఇత్తేఫాఖ్’. ఒక్క పాట కూడా లేకుండా నడచిన ఈ సినిమాకూడా విజయవంతమై రాజేష్ ఖన్నా నటనాపటిమను ద్విగుణీకృతం చేసింది. 1969-71 మధ్య కాలంలో రాజేష్ ఖన్నా నటించిన 15 సినిమాలు వరసగా సిల్వర్ జూబిలీలు చేసుకున్నాయి. ఇవి కాకుండా రెండవ హీరోగా నటించిన మరో రెండు సినిమాలు ‘మర్యాదా’, ‘అందాజ్’ సినిమాలు కూడా సిల్వర్ జూబిలీలు ఆడాయి. ఆ జాబితాలో వున్న చిత్రాలు వరసగా, ఆరాధనా (శక్తి సామంత), దో రాస్తే (రాజ్ ఖోస్లా), బంధన్ (నరేంద్ర బేడి), డోలి (ఆదుర్తి సుబ్బారావు), కామోషి (అసిత్ సేన్), ఇత్తేఫాఖ్ (యాష్ చోప్రా), సఫర్ (అసిత్ సేన్), కటీ పతంగ్ (శక్తి సామంత), ది ట్రైన్ (రవికాంత్ నగాయిచ్), సచ్చా ఝూటా (మన్మోహన్ దేశాయ్), ఆన్ మిలో సజనా (ముకుల్ దత్), మెహబూబ్ కి మెహంది (హెచ్.ఎస్. రావైల్), అందాజ్ (రమేష్ సిప్పీ), మర్యాదా (అరవింద్ సేన్), ఆనంద్ (హృషికేష్ ముఖర్జీ), హాతీ మేరే సాథీ (ఎం.ఎ. తిరుముగం), చోటి బహు (కె.బి. తిలక్). ఈ విజయాలతో రాజేష్ ఖన్నా ఏ నటుడికీ అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. ఈ రికార్డు నేటికీ చెక్కు చెదరకుండా వుంది. ఈ పదిహేడు సూపర్ హిట్లతో రాజకపూర్, దేవానంద్, దిలీప్ కుమార్ వంటి హీరోలకు కూడా లభించని ‘సూపర్ హీరో’ స్టేటస్ రాజేష్ ఖన్నాకు దక్కింది. ఆ హోదాను దక్కించుకున్న తొలి బాలీవుడ్ హీరో రాజేష్ ఖన్నా.

సూపర్ స్టార్ హోదా ఇచ్చిన కిక్కు:

బొంబాయి ఒపేరా హౌస్ లో ఆరాధనా సినిమా విజయవంతంగా ఆడుతున్నప్పుడు, ప్రేక్షకుల మధ్య కూర్చొని చూడాలని రాజేష్ ఖన్నా సినిమా హాలుకు వెళ్ళాడు. ప్రేక్షకులకు ఆ సంగతి తెలిసింది. హాలు బయట జనం తండోపతండాలుగా వచ్చి రాజేష్ ను దగ్గరనుంచి చూసేందుకు పోటీ పడ్డారు. ఆడపిల్లలు రాజేష్ ఖన్నా కారు దుమ్మును నుదుట రాసుకున్నారు. కారుకు లిప్ స్టిక్ తో ముద్దులు అద్దారు. ఇక వాహినీ స్టూడియోలో ‘హాతీ మేరే సాథీ’ సినిమా షూటింగు కోసం రాజేష్ మద్రాసు వస్తే అభిమానులు అత్యధిక సంఖ్యలో పోగయ్యారు. వారందరికీ సొంత ఖర్చుతో శీతల పానీయాలు తెప్పించి ఇచ్చి తన అభిమానులను సంతృప్తి పరచాడు రాజేష్ ఖన్నా. ఆడపిల్లలకు కలలరేడుగా నిలిచాడు. కొన్ని సినిమాలైతే సంవత్సరం పైగానే ఆడాయి. అందాజ్ సినిమాలో అసలు హీరో షమ్మికపూర్. కానీ పావుగంట సేపు మాత్రమే వుండి “జిందగీ ఎక్ సఫర్ హై సుహానా” అంటూ గంగవెర్రులెత్తించిన రాజేష్ ఖన్నా వలన ఆ సినిమా గోల్డన్ జూబిలీ చేసుకుంది. రాజేష్ ఖన్నా హెయిర్ స్టైల్ కొత్తరకంగా ఉండడంతో ఆ రోజుల్లో కుర్రకారు అదేరకంగా క్రాపులు చేయించుకునేవారు. రాజేష్ ఖన్నా చరిస్మా ను ఆరోజుల్లో జితేంద్ర, రాజకపూర్, దేవానంద్, దిలీప్ కుమార్ లు కూడా అందుకోలేకపోయారు. కాస్తో కూస్తో పోటీలో నిలిచింది ధర్మేంద్ర ఒక్కడే! దిలీప్ కుమార్ ను ట్రాజెడీ కింగ్ అని కీర్తించిన ప్రేక్షకులు ‘ఆనంద్’, ‘సఫర్’, ‘అమర్ ప్రీమ్’ చిత్రాలతో ఆ బిరుదును రాజేష్ ఖన్నా కోటుకు తగిలించేశారు. దేవానంద్ కూడా కాస్త వెనకబడ్డాడు. ‘ఆనంద్’ సినిమాలో రాజేష్ ఖన్నా ప్రక్కన నటించే అవకాశం వచ్చిందని అప్పుడే తెరంగేట్రం చేసిన అమితాబ్ బచన్ తెగ ఆనందపడిపోయాడు. బాలీవుడ్ అంటే రాజేష్ ఖన్నానే అనే పేరు మారుమ్రోగింది. అమితాబ్ బచన్ కూడా ఒక దశలో సూపర్ స్టార్ అంటే రాజేష్ ఖన్నా నే అని అంగీకరించాడు.

తిరోగమనం దిశగా సూపర్ స్టార్:

రాజేష్ ప్రక్కన చేరిన కాకా రాయుళ్ళు అతన్ని ఎక్కవేశారు. అతడు లేకుంటే హిందీ సినీ పరిశ్రమే లేదన్నారు. పొగడ్తలతో ముంచెత్తారు. దాంతో రాజేష్ ఖన్నాలో కించిత్ గర్వం, ఇగో లక్షణాలు పెరిగాయి. ఉదయం షూటింగ్ షెడ్యూలు వుంటే మద్యాహ్నం దాకా వెళ్ళేవాడు కాదు. అదే అమితాబ్ బచన్ విషయానికొస్తే, అతడు ఠంచనుగా షూటింగుకు హాజరయ్యేవాడు. సమయపాలనకు ప్రాధాన్యం ఇచ్చేవాడు. ఇదే విషయాన్ని కొందరు పాత్రికేయులు ఖన్నా వద్ద ప్రస్తావించగా “గుమాస్తాలు ఆఫీసులకు టైమ్ ప్రకారం రావాలి. ఆ నిబంధన నాకు వర్తించదు” అంటూ అవహేళన చేశాడు. దానికి అమితాబ్ బాధపడలేదు సరికదా “నేను సినిమాల వైపు ఆకర్షితుణ్ణవటానికి రాజేష్ ఖన్నా నాకు ప్రేరణ” అంటూ తన పెద్దమనసును చాటుకున్నాడు. కాకారాయుళ్ళ మాటలు వినడంతో రాజేష్ ఖన్నా తిరోగమనం ఆరంభమైంది. రాజేష్ ఖన్నా నటించిన దాదాపు ఎనిమిది సినిమాలు వరస వైఫల్యాలు నమోదు చేశాయి. అంజు మహేంద్రు తో సహజీవనం మొదలు పెట్టాడు. ఆమెను పెళ్లాడదామని అనుకున్నాడు. కానీ ఎందుకో ఫలవంతం కాలేదు. ఆమె ఇంతియాజ్ ఖాన్ ను పెళ్ళిచేసుకుంది. ‘బాబీ’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న డింపుల్ కపాడియా కు అప్పుడు కేవలం పదహారేళ్ళు. ఆ సినిమా ఇక ఎనిమిది నెలల్లో విడుదల కానుందనగా రాజేష్ ఖన్నా డింపుల్ ను వివాహమాడాడు. దాంతో ‘బాబీ’ సినిమా నిర్మాణాంతర పనులు వెనక్కు జరిగాయి. ఇద్దరూ కలిసి ‘జై జై శివ శంకర్’ అనే సినిమాలో నటించాలనుకున్నారు. కారణాంతరాలవలన ఆ సినిమా వెలుగు చూడలేదు. డింపుల్ కపాడియాను పెళ్ళాడక ముందే రాజేష్ ఖన్నా హీరో రాజేంద్ర కుమార్ కు చెందిన పెద్ద బంగళాను కొనుగోలు చేశాడు. ఆ బంగళా రాజేంద్ర కుమార్ కు కలిసి రాకపోవడంతో ఖన్నా కు అమ్మడం జరిగింది. అంత పెద్ద బంగళాను ఖన్నా మరమ్మత్తులు, ఆధునీకరణ చేయించి దానికి ‘ఆశీర్వాద్’ అనే పేరు పెట్టాడు. ఇద్దరు పిల్లలు పుట్టాక డింపుల్ తో కలహాలు పోటెత్తాయి. ఆమెను కవ్వించాలని టీనా మునీం తో కాపురం పెట్టాడు. దీంతో కినుక వహించిన డింపుల్ విడాకులు తీసుకుంది. ఈలోగా అమితాబ్ బచన్ రాజేష్ ఖన్నా కు గట్టి పోటీదారుడైనాడు. ప్రఖ్యాత జంట రచయితలు ‘సలీం-జావేద్’ కు రాజేష్ ఖన్నా నటించిన ‘హాథీ మేరె సాథీ’ (1971) సినిమాతో మంచి బ్రేక్ ఇచ్చినా తరవాతి సినిమాలకు వారు రాజేష్ ఖన్నాతో పని చేయడానికి ఇష్టపడలేదు. పైగా ఆ జంట రచయితలు అమితాబ్ బచన్ కు ‘జంజీర్’, ‘మజబూర్’, ‘దీవార్’, ‘షోలే’, ‘త్రిశూల్’, ‘డాన్’, ‘దోస్తానా’, ‘క్రాంతి’ వంటి సూపర్ హిట్లు అందించారు. తోడీ సి బేవఫా, అమర్ దీప్, అగర్ తుమ్ న హోతే, అవతార్, సౌతేన్ వంటి సినిమాలు అడపాదడపా రాజేష్ ఖన్నాకు విజయాలు అందించాయి. టీనా మునీం కూడా రాజేష్ ను వదలి అంబానీ వంశానికి కోడలుగా వెళ్ళిపోయింది. రాజేష్ ఖన్నా ఏకాకిగా మిగిలాడు. సినిమాలు విజయవంతం కాకపోవడంతో రాజేష్ ఖన్నా రాజకీయాలవైపు మొగ్గు చూపాడు. 1991 ఎన్నికల్లో న్యూఢిల్లీ పార్లమెంట్ సీట్ కోసం ఎల్.కె.అద్వానీ తో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేసి 1589 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. మరలా 1992 లో వచ్చిన ఉప ఎన్నికల్లో శత్రుఘ్నసిన్హా మీద పోటీచేసి పాతిక వేల మెజారిటీతో అదే నియోజక వర్గం నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యాడు. తరవాత మరలా పోటీ చెయ్యలేదు. జీవితంలో ఎత్తుపల్లాలు సమానంగా వీక్షించిన రాజేష్ ఖన్నా క్యాన్సర్ బారిన పడి 18 జూలై 2012 లో తన 69 వ ఏట మరణించాడు.

మరిన్ని విశేషాలు:

రాజేష్ ఖన్నా తన పాతిక సంవత్సరాల నటజీవితంలో మొత్తం 153 సినిమాల్లోను, 11 లఘు చిత్రాల్లోనూ నటించాడు. వాటిలో 101 సినిమాలలో అతడే ‘సోలో’ హీరో. మిగతావి మల్టి స్టారర్ సినిమాలు. తన రెండవ ఇన్నింగ్స్ (1985) లో ఖన్నా నటించిన 11 సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో 7 సినిమాలు బ్లాక్ బస్టర్లు గా నిలవగా మిగిలిన నాలుగు సినిమాలు శతదినోత్సవం చేసుకునాయి. వాటిలో ‘హమ్ దోనో, బెవఫాయి, మాస్టర్జి, బాబు, ఆఖిర్ క్యోం, జమానా, ఇన్సాఫ్ మై కరూంగా’ సినిమాలున్నాయి. దర్శకుడు హృషికేష్ ముఖర్జీ మీద తనకున్న గౌరవంతో అతడు నిర్మించిన ‘ఆనంద్’, ‘నమక్ హరామ్’, ‘నౌకర్’ వంటి సిమాలకు ఖన్నా సగం పారితోషికాన్ని మాత్రమే స్వీకరించాడు. హీరోయిన్ ముంతాజ్ ప్రక్కన నటించిన ఎనిమిది సినిమాలు బ్లాక్ బస్టర్లు కాగా, హేమామాలినితో రాజేష్ కన్నా అత్యధికంగా 15 చిత్రాల్లో జోడీగా నటించాడు. వాటిలో అందాజ్, ఫ్రేమ్ నగర్, బందిష్, దర్ద్, ఖుద్రత్ వంటి బ్లాక్ బస్టర్లు వున్నాయి.

బాలీవుడ్ లో అడుగు పెట్టిన తొలిరోజుల్లో రాజేష్ ఖన్నాను ‘ఫాల్తూ హీరో’ అని వ్యవహరించేవారు. తదనంతర కాలంలో, ముఖ్యంగా ‘ఆరాధానా’ సినిమా సూపర్ హిట్ అయ్యాక అతని హోదా మారిపోయి సూపర్ స్టార్ గా ఎదిగాడు. ‘మిస్టర్ ఇండియా’ లో హీరో పాత్రను రాజేష్ ఖన్నాకు దర్శకుడు శేఖర్ కపూర్ ఇవ్వజూపితే, కథ నచ్చక రాజేష్ ఖన్నా తిరస్కరించాడు. బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఆ సినిమాలో హీరో వేషం అనిల్ కపూర్ కి దక్కింది.

1970-79 మధ్యకాలంలో హిందీ చలనచిత్ర రంగంలో అత్యధిక పారితోషికాన్ని తీసుకున్న హీరో గా రాజేష్ ఖన్నా రికార్డు సృష్టించాడు. అయితే 1980-87 మధ్యకాలంలో అమితాబ్ బచన్ స్టార్డం వలన అతనితో సమానంగా పారితోషికం తగ్గించి తీసుకోవలసి వచ్చింది. రాజేష్ ఖన్నాకు సంగీతమంటే యెంతో ఇష్టం. మ్యూజిక్ సిట్టింగులలో స్వయంగా కూర్చొని మంచి సలహాలు ఇచ్చేవాడు. ఈ జిజ్ఞాసే రాహుల్ దేవ్ బర్మన్, కిషోర్ కుమార్ లను ఖన్నాకు మంచి స్నేహితులుగా నిలిపింది. కిషోర్ కుమార్ రాజేష్ ఖన్నాకు 91 సినిమాలలో పాటలు పాడాడు. ఈ రికార్డు ఈ నాటికీ చెక్కు చెదరలేదు.

రాజేష్ ఖన్నా ఫిలింఫేర్ వారి ఉత్తమ నటుడు బహుమతికి 14 సార్లు నామినేట్ కాగా మూడు సార్లు ఆ బహుమతి గెలుచుకున్నాడు. అలాగే బెంగాల్ జర్నలిస్ట్ ఫిలిం అవార్డ్స్ కమిటీ 27 సార్లు ఉత్తమనటుడిగా నామినేట్ చెయ్యగా నాలుగు సార్లు ఆ బహుమతి దక్కించుకున్నాడు.

బొంబాయి విశ్వవిద్యాలయం వారు ప్రచురించిన కాలేజి పుస్తకంలో ‘ది ఛరిస్మా ఆఫ్ రాజేష్ ఖన్నా’ అనే మకుటంతో పాఠ్యాoశాన్ని ప్రవేశపెట్టారు. 2003 లో భారత ప్రభుత్వం రాజేష్ ఖన్నా తపాలా బిళ్ళను విడుదల చేసి తన గౌరవాన్ని చాటుకుంది. బాంద్రా ‘బ్యాండ్ స్టాండ్’ లో రాజేష్ ఖన్నా కాంస్య విగ్రహాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించింది. అతడు తొలిరోజుల్లో నివసించిన గిర్గామ్ లోని ఒక కూడలికి “సూపర్ స్టార్ రాజేష్ చౌక్” అనే పేరు పెట్టారు. మరణానంతరం 2013 లో రాజేష్ ఖన్నాకు భారత ప్రభుత్వం ‘పద్మ భూషణ్’ పురస్కారాన్ని ప్రకటించింది. దాదా సాహెబ్ ఫాల్కే అకాడమీ అవార్డుల సందర్భంగా 2013లో మరణానతరం రాజేష్ ఖన్నా కు “ఫస్ట్ సూపర్ స్టార్ అఫ్ ఇండియన్ సినిమా” పురస్కారం ప్రకటించారు. అత్యధిక సినిమాలలో హీరోగా నటించినందుకు రాజేష్ ఖన్నా కు 1991లో “ఫిలింఫేర్ ప్రత్యేక అవార్డు” అందజేశారు. 2005లో ఫిలింఫేర్ వారు రాజేష్ ఖన్నా కు “లైఫ్ టైమ్ అఛీవ్మెంట్ అవార్డు” ప్రదానం చేశారు.

ఆచారం షణ్ముఖాచారి (94929 54256)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap