(సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఫాల్కే పురస్కార ప్రదానం జరిగిన సందర్భంగా)
సినిమా ప్రగతికి అవిరళ కృషిచేసిన వ్యక్తులకు ప్రదానంచేసి గౌరవించే అత్యున్నత దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని సూపర్ స్టార్ రజనీకాంత్ కు భారత ప్రభుత్వం ఏప్రిల్ 1, 2021న ప్రకటించింది. 2018లో అమితాబ్ బచన్ కు ఈ పురస్కారం ప్రదానం చేసిన తర్వాత దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో గత రెండేళ్లుగా ఈ పురస్కారాన్ని భారత ప్రభుత్వం ఎవరికీ ప్రకటించలేదు. తమిళనాడులో శాసనసభకు సాధారణ ఎన్నికలు జరుగనున్న తరుణంలో బి.జె.పి ప్రభుత్వం లబ్ది పొందేందుకే రజనీకాంత్ కు ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించిందని AIADMK సహా అన్నీ ప్రతిపక్షాలు గోలపెట్టాయి. పైగా ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తానని ప్రకటించి ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆ విషయాన్ని ఉపసంహరించుకున్న నేపథ్యంలో, రజనీకాంత్ అభిమానులంతా AIADMK-BJP సంకీర్ణ భాగస్వామ్య పార్టీకి లబ్ది చేకూర్చుతారని భావిస్తూ, విమర్శలు కురిపించారు. అయితే ఈ పురస్కారానికి అన్నివిధాలా రజనీకాంత్ అర్హుడనే విషయాన్ని ఎవ్వరూ వ్యతిరేకించలేదు… కాకుంటే ఈ పురస్కార ప్రకటన వెలువడిన సమయం సమంజసం కాదని మాత్రం సినీ అభిమానులు భావించారు. 2014లో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఇండియాలో జరిగినప్పుడు రజనీకాంత్ కు ‘సెంటెనరీ అవార్డ్ ఫర్ ఫిల్మ్ పర్సనాలిటీ’ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించిన విషయాన్ని మనం గుర్తుచేసుకోవాలి. రజనీకాంత్ 2016 లోనే అత్యుత్తమ పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. 2019లో ‘గ్లోబల్ జూబిలీ అవార్డ్’ ను IFFI అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో రజనీకాంత్ అందుకున్నారు. వ్యక్తిగతంగా అతని దాతృత్వ ధోరణిని రెండవ కంటికి తెలియనీయని వ్యక్తిత్వం రజనీకాంత్ ది. అన్నా హజారే ప్రకటించిన అవినీతి నిరోధక ఉద్యమానికి మద్దతు పలికి సహకరించినవాడు రజనీకాంత్. 2015లో వచ్చిన వరదలకు పారిశుద్ధ కార్మికులకు ఆశ్రయం కల్పించి వారి బాగోగులు నెలరోజులపాటు చూసుకున్న వ్యక్తి రజనీకాంత్. ఇక చలనచిత్ర పరిశ్రమలోని కార్మికులకు రజనీకాంత్ చేసిన సేవలు అపారం. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని భారత ఉపరాష్ట్రపతి చేతులమీదుగా అక్టోబర్ 25 న రాజధాని లోని విజ్ఞాన్ భవన్ లో స్వీకరించి, ఆ అవార్డ్ ను తను సినిమాలలో చేరేందుకు ప్రోత్సాహమిచ్చి సహకరించిన సహచర బస్ డ్రైవరు రాజబహదూర్ కు అంకితమిచ్చి ‘స్నేహబంధం’ విలువను పెంచిన రజనీకాంత్, సినిమా ప్రగతికి అందించిన సేవలతోబాటు, వ్యక్తిగతంగా అతడు ఎంతటి ఉన్నత సంస్కారం కలవాడో తెలియజెప్పేందుకే ఈ వ్యాసం
పూర్వాశ్రమంలో …
రజనీకాంత్ పుట్టింది డిసెంబర్ 12, 1950 న బెంగుళూరులో…పెరిగింది బెంగుళూరులోని హనుమంతనగర్ లో. రజనీకాంత్ తల్లిదండ్రులు మహారాష్ట్రలోని పుణే పట్టణానికి చెందిన జిజాబాయి, రామోజీరావు గైక్వాడ్. రజనీకాంత్ కు తల్లిదండ్రులు పెట్టిన పేరు శివాజీరావు గైక్వాడ్. తండ్రి పోలీసు శాఖలో కానిస్టేబుల్ గా పనిచేసేవారు. నలుగురు సంతానంలో రజనీ అందరికన్నా చిన్నవాడు. రజనీకి తొమ్మిదేళ్ల వయసున్నప్పుడే తల్లి కాలంచేసింది. గవిపురం ప్రభుత్వ పాఠశాలలో రజనీకాంత్ ప్రాధమిక విద్యను అభ్యసించాడు. చదువులో చురుగ్గా, చేష్టల్లో పోకిరిగా వుండే రజనీకాంత్ ని వాళ్ళ అన్నయ్య రామకృష్ణ మిషన్ లో చేర్చారు. అక్కడే రజనీ వేదాధ్యయనం, ఇతిహాసాలను అభ్యసించాడు. ఒక నాటకంలో ఏకలవ్య పాత్రను అద్భుతంగా పోషించి మన్ననలు పొందాడు. ఆ నాటకాన్ని వీక్షించిన ప్రముఖ కన్నడ కవి డి.ఆర్. బెంద్రే రజనీకాంత్ ను మెచ్చుకుంటూ ఆశీర్వదించారు. తర్వాత ఆచార్య పబ్లిక్ పాఠశాల, భన్నారగట్టలో పాఠశాల విద్యను, ప్రీయూనివర్సిటీ విద్యను పూర్తిచేశాడు. అక్కడవుండగా పాఠశాల వార్షికోత్సవాలలో అనేక నాటికలు, నాటకాలలో వేషాలు కట్టాడు. చదువు పూర్తిచేసిన తర్వాత ఉద్యోగ ప్రయత్నం చేశాడు. చిన్నచిన్న కూలిపనులు కూడా చేసేందుకు వెనుకాడలేదు. 1969 లో బెంగుళూరు రవాణా సర్వీస్ లో బస్ కండక్టర్ గా ఉద్యోగం వచ్చింది. శ్రీనగర్-మెజెస్టిక్ రూట్ సిటీ బస్సులో కండక్టర్ గా పనిచేస్తున్నప్పుడు ఆ బస్ రూటుకు డ్రైవర్ రాజబహదూర్. వారిద్దరి మధ్య స్నేహబంధం రెక్కలు తొడిగింది. రాజబహదూర్ ప్రోత్సాహంతో రజనీకాంత్ బెంగుళూరు రవాణా సర్వీస్ నాటకరంగ కళాకారుల బృందంలో చేరి పౌరాణిక నాటకాల్లో కర్ణుడు, దుర్యోధనుడు వంటి మంచి పాత్రలు పోషిస్తూ పేరు తెచ్చుకున్నాడు. రజనీ నటనలో వున్న ప్రత్యేకమైన శైలిని చూసి రాజబహదూర్ సినిమాలలో ప్రయత్నించమని సలహా ఇచ్చాడు. ఉద్యోగానికి గుడ్ బై చెప్పడానికి ఇష్టపడని రజనీకాంత్ ని రాజబహదూర్ ఒప్పించాడు. ఒకవేళ సినిమాల్లో అవకాశాలు రాకపోతే తన కుటుంబం నడిపే పాల డెయిరీ లో పనిచేయవచ్చని ధైర్యం నూరిపోశాడు. అప్పుడే మద్రాసు అడయార్ లో క్రొత్తగా ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ప్రారంభమైంది. స్నేహితుని ప్రోద్బలంతో రజనీ చెన్నై వెళ్ళి అక్కడ యాక్టింగ్ స్కూల్ లో చేరాడు. అప్పట్లో రాజబహదూర్ కు జీతం నెలకు రూ.400. అందులోనుంచి ప్రతి నెలా రెండు వందల రూపాయలు రాజబహదూర్ రజనీకి మనియార్డర్ చేసేవాడు. అంతేకాదు, ఎప్పుడైనా డబ్బులు పంపలేకపోతే తాకట్టుకు వుపయోగపడేందుకు తన బంగారు గొలుసు రజనీ చేతిలో పెట్టాడు. యాక్టింగ్ స్కూలులో తర్ఫీదు పూర్తయింది. రజనీ దశ తిరిగి బాలచందర్ చేతిలో పడ్డాడు.
సినీరంగ ప్రవేశం…
1975లో బాలచందర్ దర్శకత్వం వహించిన ‘అపూర్వ రాగంగళ్’ (తెలుగు సినిమా ‘తూర్పు పడమర’లో శ్రీవిద్య భర్త మోహన్ బాబు పోషించిన శ్రీవిద్య భర్తపాత్ర)లో నటించాడు. ఆ చిత్రానికి మూడు జాతీయ పురస్కారాలు దక్కాయి. హిందూ జాతీయ పత్రిక ఈ సినిమా మీద సమీక్షరాస్తూ ‘క్రొత్త నటుడైన రజనీకాంత్ గౌరవప్రదమైన, మనోజ్ఞమైన నటనను ప్రదర్శించాడు’ అని ప్రశంసించింది. 1976లో కన్నడ దర్శక నిర్మాత పుట్టణ్ణ కనగళ్ నిర్మించిన ‘కథా సంగమ’ చిత్రంలో ఒక పొగరుబోతు గ్రామీణ యువకుడుగా నటించి రాణించాడు. అదే సంవత్సరం బాలచందర్ నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన ‘అంతులేని కథ’ చిత్రంలో రజనీకాంత్ సహాయపాత్ర పోషించి మెప్పించారు. 1974లోబాలచందర్ నిర్మించిన ‘అవళ్ ఒరు తొడర్ కథై’ తమిళ చిత్రానికి ఈ చిత్రం రీమేక్. బాలచందర్ మరొక చిత్రం ‘మూణ్డ్రు ముడిచ్చు’ వంటి ప్రయోగాత్మక సినిమాలతో గుర్తింపు అందుకున్నాడు. ఈ చిత్రంతోనే శ్రీదేవి హీరోయిన్ గా పరిచయమైంది. ఇది 1973లో తెలుగులో విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఓ సీత కథ’ చిత్రానికి రీమేక్. తర్వాత రజనీకాంత్ బాలచందర్హ్ నిర్మించిన ‘అవర్ఘళ్’ (1977), భారతీరాజా నిర్మించిన ‘పత్తినారు వయత్తినిలే’ (1977) (తెలుగులో పదహారేళ్ళ వయసు) సినిమాలలో నటించి స్టార్దం పెంచుకున్నారు. రజనీకాంత్ తెలుగులో తొలిసారి హీరో పాత్రను పోషించిన సినిమా 1977లో ప్రముఖ చిత్రకారుడు, బాలచందర్ కు సహాయకుడుగా పనిచేసిన ఈరంకి శర్మ దర్శకత్వం వహించిన ‘చిలకమ్మ చెప్పింది’. దర్శకుడు ఎస్.పి. ముత్తురామన్ నిర్మించిన ‘భువన ఒరు కెల్వి కురి’ చిత్రంలో రజనీకాంత్ చూపిన అద్భుత నటన వెంటవెంటనే ఆయనకు 24 సినిమాలలో నటించే అవకాశాన్ని కల్పించింది. 1978 లో రజనీకాంత్ తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో నిర్మితమైన 20 సినిమాలలో నటించారు. తర్వాత రజనీకాంత్ ‘సూపర్ స్టార్’ స్థాయికి చేరుకున్న విషయం అందరికీ తెలిసిందే! రజనీ యాక్టింగ్ శైలే వేరు అన్నది కూడా అందరికీ తెలిసిన విషయమే!!
నిజమైన స్నేహానికి నిలువెత్తు ఆదర్శం…
ఎంత ఎదిగినా తనను ప్రోత్సహించి, డబ్బుపంపి ఆదుకున్న రాజబహదూర్ ని, ఆ స్నేహబంధాన్ని మాత్రం రజనీ మరువలేదు. ఇప్పటికీ తరచూ బెంగుళూరు వెళతాడు. రాజబహదూర్ తో వారం, పది రోజులు గడుపుతాడు. కలిసి విద్యార్థి భవన్ లో నేతి దోశలు కట్టించుకొని ఎంచక్కా కృష్ణారావు పార్కులో కూర్చొని ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ తింటారు. ఇద్దరూ ఎం.జి.రోడ్డు, బ్రిగేడ్ రోడ్లవెంట పబ్లిక్ గా తిరుగుతారు. ఎక్కడంటే అక్కడ కూర్చొని కబుర్లాడుకుంటూ, జోకులు పేల్చుకుంటూ ఎంజాయ్ చేస్తారు. అయితే అంతపెద్ద సూపర్ స్టార్ అంత పబ్లిక్ గా తిరగడం ఎలా సాధ్యం అనే ప్రశ్న మనకు తలపించక మానదు. కానీ రజనీ సాధ్యం చేసి చూపాడు. బెంగుళూరు నడిబొడ్డున రజనీకి ఫ్లాట్ వుంది. ఆ ఫ్లాట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అరవై యేళ్ళ వృద్ధుడులాగానో లేక ఎనభై యేళ్ళ వృద్ధుడిలాగానో తన వేషం మార్చుకుంటాడు. తర్వాత రాజబహదూర్ వచ్చి రజనీ ని కలుస్తాడు. ఇద్దరూ కలిసి రజనీ మొదట్లో వున్న ఆద్దె ఇంటివైపు వెళ్తారు. గుట్టళ్లి ప్రాంతంలో ఒక బజ్జీకొట్టులో వేడివేడి బజ్జీలు, బోండాలు కొని వాటిని పార్సిల్ కట్టించుకొని వెళ్ళి ఉమా థియేటర్ దగ్గరలోవున్న మెట్లమీద కూర్చుంటారు. వచ్చేపోయే వారిని చూస్తూ వాటిని ఆరగిస్తూ కబుర్లు చెప్పుకుంటారు. తరవాత ఆ పక్కనే వుండే టీ పాకలో స్టాంగ్ కాఫీ తాగుతారు. కాసేపు అటూ ఇటూ పచార్లు చేసి, మళ్ళీ నడక సాగించి బళేపేట రామన్న హోటల్ లో బిరియాని పొట్లం కట్టించుకొని గంగాధర పార్కులో కూర్చొని ఆ బిరియానీ ఆరగిస్తారు. ఒకసారి అలా వెళుతూ వుంటే ఒక వృద్ధురాలు కట్టెలమోపు నెత్తికి యెత్తుకోలేక అవస్థ పడుతూ వుండడం రజనీ గమనించాడు. వెంటనే వెళ్ళి ఆ మోపును ఆ వృద్ధురాలి నెత్తిమీదకు చేర్చాడు. ఆమెవెంట కొంచెం దూరం నడిచి ఎవరూ గమనించడం లేదని రూఢి పరచుకున్న తరవాత జేబులోనుంచి చేతికి వచ్చినంత డబ్బులు తీసి ఆమె చీర కొంగుకు కట్టాడు. ఆమె ఆశ్చర్యపోయింది. ఇంటికి వెళ్ళిన తరవాత కొంగుముడి విప్పమని చెప్పి రాజబహదూర్ తో అదృశ్యమయ్యాడు. ఆ కొంగుముడిలో రజనీ వదలిన డబ్బుతో ఆమె ఒక ఇల్లు కొనుక్కోవచ్చు. అది అంత పెద్ద మొత్తం! అలా ఒకరికి కాదు తోపుడు బండిని తోయలేక అవస్థపడుతున్న వృద్ధుడికి, చిత్తు కాగితాలు యేరుకునే నిరుద్యోగికి, నిస్సహాయ స్థితిలో వున్న వృద్ధురాలికి అలా డబ్బు ఇచ్చుకుంటూ పోతున్న రజనీ ని చూసి రాజబహదూర్ కళ్ళలో నీళ్ళు తిరుగుతుంటాయి. తరవాత రాజబహదూర్ ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకొని అతని భార్యా బిడ్డలకు డబ్బు, బహుమతులు పంచి, రాజబహదూర్ తోడురాగా ఒక ఆటోలో తన ఫ్లాట్ కు చేరుకుంటాడు. అలా వారంరోజులు గడిపి చెన్నైకి కారులో వెళ్ళిపోతాడు. మెల్లగా లిఫ్టులోకి వెళ్తున్న రజనీకాంత్ ని చూసి రాజబహదూర్… ‘’ఓహో రజనీ బెంగుళూరు వచ్చి రోడ్లవెంట, పార్కుల వెంట నాతో తిరిగేది ఇందుకా’’ అనుకోవడం పసిగట్టిన రజనీ ‘’అవును మిత్రమా… నువ్వు నేర్పిన విద్యేగా నీరజాక్షా. బస్సును నువ్వు రోడ్లవెంట తిప్పుతుంటే టికెట్లు తెంచే కండక్టర్ గా ఆ మాత్రం నేను కూడా ఆస్వాదించొద్దూ! అన్నార్తులను ఆదుకోవద్దూ!!’’ అని నవ్వుతూ బదులిస్తూ లిఫ్ట్ లోకి వెళ్తాడు స్నేహితుడికి గుడ్ బై చెబుతూ … ఎంత ఎత్తుకెదిగినా రజనీకాంత్ మాత్రం ఇసుమంత కూడా మారలేదు. అదే శివాజీరావ్ గైక్వాడ్… అదే… ఆ సూపర్ స్టార్… ‘మెజెస్టిక్’ అండ్ ‘మాగ్నానిమస్’!!
మరిన్ని విశేషాలు…
రజనీకాంత్ కు ప్రపంచవ్యాప్తంగా లక్షా యాభైవేల అభిమాన సంఘాలున్నాయి. వాటిలో అరవై లక్షలకు పైగా అభిమానులున్నారు. వారికోసం రజనీ అభిమానులు మిచిగన్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ జోయోజీత్ పాల్ సారధ్యంలో ఈ సూపర్ స్టార్ మీద ‘ఫర్ ది లవ్ ఆఫ్ ఎ మ్యాన్’ పేరుతో ఒక అద్భుతమైన డాక్యుమెంటరీని తయారుచేశారు. ఈ డాక్యుమెంటరీ ప్రీమియర్ ని వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శనకు వుంచారు.
రజనీకాంత్ ఒక సినిమాను పూర్తిచేయగానే బ్రేక్ తీసుకొని హిమాలయా పర్వత శ్రేణువులవద్దకు వెళ్తాడు. అక్కడ ధ్యానం, యోగా చేస్తూ కొంతకాలం గడుపుతాడు. తిరిగి చెన్నై చేరుకుంటాడు. రజనీకాంత్ జన్మదిన వేడుకలు చాలా ఘనంగా చెన్నైలో జరిగేవి. 22 సంవత్సరాల క్రితం జరిగిన జన్మదిన వేడుక సందర్భంగా రజనీ అభిమానులు ముగ్గురు వేడుక తర్వాత తిరిగివెళ్తూ ప్రమాదానికి గురై మరణించారు. ఈ సంఘటన తర్వాత రజనీకాంత్ జన్మదినాన్ని చెన్నైలో జరుపుకోవడం నిలిపివేశారు. ఇప్పుడు కూడా చాలా నిరాడంబరంగా చెన్నై నగరానికి దూరంగా జన్మదినం జరుపుకుంటారు. అది కూడా తన అభిమానులను ఆనందపరచేందుకే! రజనీకాంత్ నటనకు తీసుకునే పారితోషికం ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద మొత్తం. జాకీ చాన్ తరవాతి స్థానం రజనీకాంత్ దే. రజనీ పారితోషికం పాతిక కోట్ల రూపాయలకు పైమాటే అని చెప్పుకుంటూవుంటారు! ప్రపంచం మొత్తంమీద 2010 లో విడుదలైన టాప్ 50 సినిమాల జాబితాలో రజనీ నటించిన తమిళ సినిమా ‘ఎంథిరన్’ (తెలుగులో ‘రోబో’ పేరుతో డబ్ చేశారు) చోటుచేసుకోవడం విశేషం. ఈ చిత్రాన్ని IIM పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు వ్యాపార పురోగతి సబ్జెక్ట్ లో కేస్ స్టడీగా సిలబస్ లో చేర్చడం మరో విశేషం. ‘మూన్డ్రు మూగం’ అనే తమిళ సినిమాలో రజనీకాంత్ త్రిపాత్రాభినయం చేశారు. అందులో నటనకు రజనీకాంత్ ఉత్తమనటునిగా తమిళనాడు ప్రభుత్వ బహుమతి అందుకున్నారు. తెలుగులో 1981లో విడుదలైన ‘చట్టానికి కళ్లులేవు’ సినిమా ను ‘అంధా కానూన్’ పేరుతో తాతినేని రామారావు దర్శకత్వంలో హిందీలో పునర్నిర్మించినప్పుడు అందులో రజనీకాంత్ తొలిసారి నటించారు. 1988లో ‘బ్లడ్ స్టోన్’ అనే ఇంగ్లిష్ చిత్రంలో రజనీ నటించారు. రజనీ ‘వల్లి’ అనే తమిళ చిత్రానికి స్క్రీన్ ప్లే రాశారు. అందులో అతిథిపాత్రలో కనిపించారు కూడా! 1995లో వచ్చిన ‘బాషా’ చిత్రం అనేక రికార్డులను తిరగరాసి, బ్లాక్ బస్టర్ గా నిలిచి రజనీని సూపర్ స్టార్ చేసింది. రజనీకాంత్ నటించిన ‘ముత్తు’ సినిమా జపాన్ దేశంలో విజయదుందుభి మ్రోగించి, అనేక మంది అభిమానులను కూడగట్టింది.
1980లో ఎతిరాజ్ మహిళా కళాశాల కు చెందిన లతా రంగాచారి అనే విద్యార్థిని రజనీకాంత్ ను తమ కళాశాల మాగజైన్ కోసం ఇంటర్యూ చేసింది. తర్వాత 26 ఫిబ్రవరి1981 న రజనీకాంత్ ఆ అమ్మాయినే తిరుపతిలో పెళ్లిచేసుకున్నారు. వీరికి ఐశ్వర్య, సౌందర్య అనే ఇద్దరు కుమార్తెలు. రజనీ భార్య లతా ‘ది ఆశ్రమ్’ అనే పేరుతో ఒక పాఠశాలను నడుపుతోంది.
తమిళనాడు ప్రభుత్వం రజనీకాంత్ కు ఆరుసార్లు ఉత్తమ నటుని బహుమతి ప్రదానం చేసింది. 1984లో రజనీకాంత్ ను తమిళనాడు ప్రభుత్వం ‘కలైమామణి’ అవార్డుతోను, 1989లో ఎం.జి.ఆర్ అవార్డుతోను సత్కరించింది. భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో ‘పద్మభూషణ్’, 2016లో ‘పద్మవిభూషణ్’ పురాస్కారాలను రజనీకాంత్ కు ప్రదానం చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం ‘రాజ్ కపూర్ అవార్డ్’ తో సత్కరించింది. ప్రపంచ ప్రసిద్ధ ఫోర్బెస్ సంస్థ రజనీకాంత్ ను అత్యంత ప్రజాదరణగల భారతీయునిగా ఎంపికచేసింది. ఇప్పుడు భారతప్రభుత్వం జాతీయ ఫిల్మ్ బహుమతుల ప్రదానోత్సవంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘దాదాసాహెబ్ ఫాల్కే’ పురస్కారంతో రజనీకాంత్ ను సత్కరించింది.
శివ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన ‘అన్నాత్తే’ సినిమా దీపావళి కానుకగా విడుదల కాబోతోంది. కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో డబ్ చేశారు. అన్న-చెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది. కీర్తి సురేశ్ ఇందులో రజనీకాంత్ చెల్లెలుగా నటిస్తుండగా, నయనతార హీరోయిన్ గా నటిస్తోంది.
-ఆచారం షణ్ముఖాచారి
(9492954256)
————————————————————————————————————
ఆచారం షణ్ముఖాచారిగారి పరిచయం:
పుట్టింది, పెరిగింది నెల్లూరు జిల్లా కావలిలో. కందుకూరు, తిరుపతి, పంత్ నగర్ (యు.పి)లో చదువులు. వ్యవసాయ విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేషన్. బ్యాంకింగ్ లో డిప్లొమాలు. 1971లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో వ్యవసాయాధికారిగా ఉద్యోగం చేరారు. 1977 లో ఆంధ్రా బ్యాంక్ లో చేరిక…వివిధ పదవుల నిర్వహించి, ఉన్నతాధికారిగా 2009లో ఉద్యోగ విరమణచేశారు. 11 సార్లు ఉత్తమ బ్యాంకర్ గా రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు. ఉద్యోగ విరమణానంతరం స్వచ్ఛంద పాత్రికేయునిగా సితార సినీ పత్రిక, తెలుగు వెలుగు, చతుర లో పన్నెండేళ్లుగా సినిమా విశ్లేషణాత్మక వ్యాసాలు అందించారు. వ్యవస్థాపక అధ్యక్షునిగా శ్రీ రావి కొండలరావుతో కలిసి ‘సాహిత్య సంగీత సమాఖ్య స్థాపన. వ్యవస్థాపక కార్యదర్శిగా పన్నెండు సినిమా పుస్తకాలకు ప్రకాశకులుగా వ్యవహరించారు. శ్రీ కొండలరావు మరణానంతరం ఆ సమాఖ్యకు ప్రస్తుతం అధ్యక్షునిగా సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం నివాసం హైదరాబాద్ లో.