రామానాయుడు 86వ జయంతి

శతాధిక చిత్ర నిర్మాత, మూవీ మొఘల్, ” దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, దగ్గుబాటి రామానాయుడు 86వ జయంతి జూన్ 6. ఈ సందర్భంగా ఆయన జయంతిని సినీ ప్రముఖులు ఘనంగా నిర్వహించారు. రామానాయుడు గారి పెద్ద కుమారుడు సురేష్ బాబు అభినందనలతో వంశీ గ్లోబల్ అవార్డ్స్ ఇండియా, సంతోషం ఫిల్మ్ న్యూస్, ఇండియన్ సోషల్ క్లబ్ ఒమన్, తెలుగు కళా సమితి సంయుక్త ఆధ్వర్యంలో పద్మభూషణ్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సినీ నిర్మాత, దాదాసాహెబ్ అవార్డు గ్రహీత, మూవీ మొఘల్, మాజీ ఎంపీ డాక్టర్ దగ్గుబాటి రామానాయుడి 86వ జయంతిని జూన్ 6న ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభించారు. జూమ్ లో వర్చువల్ గా జరిగిన ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు సందేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దగ్గుబాటి సురేష్ బాబు మాట్లాడుతూ.. “నాన్న చాలా సినిమాలు తీశారు. అయితే ఎంతో విలువలతో ఆయన సినిమాలు తీశారు. టైమ్ గురించి ఎంతో డిసిప్లిన్ కలిగిన వ్యక్తి. ఎంతో నిజాయితీగా కలిగిన వ్యక్తి. ప్రేక్షకులందరి ఆదరణ వల్లే నాన్నగారు గొప్ప నిర్మాతగా ఎదిగారు. మీ ఆదరణతోనే నేను కూడా నిర్మాతగా కొనసాగుతున్నా. ఇండస్ట్రీ మద్దతు ఇలాగే ఉండాలని కోరుతున్నా” అన్నారు.
మురళీ మోహన్ మాట్లాడుతూ.. సినిమా అనేది ఒక అద్భుతమైన సంఘటన. డాక్టర్, లాయర్, ఇంజనీర్ అవ్వాలంటే క్వాలిఫికేషన్ అవ్వాలి. కానీ ఒక సినిమా నిర్మాత అవ్వాలంటే దానికి ఒక క్వాలిఫికేషన్ లేదు. డబ్బులంటే చాలు అని చాలామంది అనుకుంటారు. కానీ రామానాయుడుగారు అలా కాదు. సినిమా గురించి అన్ని విషయాలు తెలుసునే ఆయన నిర్మాతగా మారారు. కారంచేడులోని వ్యవసాయం కుటుంబంలో పుట్టిన రామానాయుడు గారు తక్కువ కాలంలోనే గొప్పస్థాయికి వెళ్లారు. అనురాగం అనే సినిమాకు నలుగురు పార్టీ లో ఒకరిగా వెళ్లి అన్నీ అర్థం చేసుకుని తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ స్థాపించారు. మొదటి సినిమాగా ఎన్టీయార్ గారితో రాముడు-భీముడు సినిమా తీశారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఎన్నో సినిమాలు తీసిన రామానాయుడు గారు నిర్మాతగా గొప్ప స్థాయికి చేరారు. మూవీ మొఘల్ గా పేరు తెచ్చుకున్నారు. రామా నాయుడు గారు సినిమా తీయాలంటే ముందు మంచి కథ కావాలి. తర్వాత కథకు తగ్గట్టు నటీనటులను ఎంపిక చేసేవారు. సెట్లో అందరికంటే ముందు ఆయన ఉండేవారు. ఎవరికి ఏం కావాలో అన్నీ దగ్గరుండి చూసుకునేవారు. ఆయనతో కలిసి చాలా సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. అలాంటి రామానాయుడుగారి ఒక ఆలోచన వచ్చింది.

భారతదేశంలో ఎన్ని భాషలున్నాయో అన్నింటిలోనూ సినిమాలు తీశారు. దాదాపు 130 సినిమాలను ఆయన నిర్మించారు. ఒక నిర్మాతగా, స్టుడియో ఓనర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా అన్నింటా నిష్ణాతులై డాక్టరేట్సంపాదించుకున్నారు. రాష్ట్ర అవార్డులతో పాటు నేషనల్ అవార్డులు సంపాదించుకున్నారు. పద్మశ్రీ, పద్మభూషణ్ వచ్చింది. అలాగే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా అందుకున్నారు. అలాంటి రామానాయుడు గారు మనముందు లేకపోవడం దురదృష్టకరం. ఆయన ఇంకా చాలా ఆరోగ్యంగా, చాలా బాగున్నారు.. ఇంకా మంచి సినిమాలు తీస్తారని అనుకుంటుంటే మనందరినీ విడిచి వెళ్లిపోయారు. ఆయన సామాజిక చిత్రాలు కూడా తీశారు.

సూప్ అనే సినిమాలో హీరోగా నటించారు. దానికి నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. ఆయన రాజకీయాల్లోకి రావాలని ఎన్టీయార్ గారు ఇచ్చిన పిలుపుతో ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. నేను సినిమా తీయాలని ఎవరైనా నా దగ్గరకు వస్తే ముందు రామానాయుడు గారి దగ్గరకు వెళ్లి ఒక ఏడాది అసిస్టెంట్ గా చేయండి అని చెప్పేవాణ్ణి, ఇండస్ట్రీ నుంచి ఎవరు వెళ్లినా చాలా ఆత్మీయంగా పలకరించేవారు. వేషాలు విషయంలో, ఆర్థికంగా ఎంతోమందికి సాయం చేసిన ఒక మంచి మనసున్న వ్యక్తి రామానాయుడు గారు. భారతీయ సినిమాకు ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టిన గొప్ప మహానుభావుడు. ఆయన ఏలోకంలో ఉన్నా సంతోషంగా ఉండాలని, ఆయన ఆశీస్సులు మనకు ఉండాలని కోరుకుంటున్నా” అన్నారు.

నటుడు కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ.. “రామానాయుడుగారు బతికి ఉంటే బర్త్ డే చాలా గ్రాండ్ గా జరిగేది. రామానాయుడిగారి గురించి చెప్పాలంటే ఎంతైనా చెప్పొచ్చు. ఆయన మనసున్న మంచి నిర్మాత. నిర్మాత అనే పదానికి నిర్వచనం ఎవరంటే రామానాయుడుగారే గుర్తొస్తారు. ఆయన చేతిలో ఎంతో మంది దర్శకుడు పరిచయం అయ్యారు. అందులో నేను కూడా ఉండడం నా అదృష్టం. నువ్వులేక నేను లేను సినిమాకు నాకు అవకాశం ఇచ్చారు. ఇండస్ట్రీలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన నిర్మాత. ఎత్తులుజిత్తులు తెలీని నిర్మాత. కుటుంబ విలువలకు ఎంతో గౌరవం ఇచ్చే నిర్మాత. తన కుటుంబంతో కలిసి ఒక సినిమా చేద్దామనే కోరిక ఉండేది. ఆ కోరిక ఆయనకు తీరలేదు. సినిమా కోసం ఆయన ఏమైనా చేసేవారు. ఇచ్చిన మాట కోసం ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టేవారు. కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అని నిరూపించిన కృషీవలుడు. మిస్ యూ నాయుడు గారు” అన్నారు.
సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్ మాట్లాడుతూ.. “రామానాయుడుగారితో నా అనుబంధం రాముడు-భీముడు సినిమాతో మొదలైంది. బృందావనం సినిమా రికార్డింగ్ అప్పుడు నాయుడు గారు మొత్తం పాట వినిపించమన్నారు. చాలా బాగుందని మెచ్చుకున్నారు. ఆ సినిమా 100 రోజుల ఫంక్షన్ అప్పుడు నాయుడు గారి చేతుల మీదుగా షీల్డ్ అందుకున్నా. ఇచ్చినమాట నిలబెట్టుకున్న గొప్ప వ్యక్తి రామానాయుడు గారు.” అన్నారు.

రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ.. “రామానాయుడగారి అమృతహస్తాల మీదుగా చిత్ర పరిశ్రమలో పనిచేయనున్నవాళ్లలో నేను ఒక్కడినని చెప్పుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. 26 ఏళ్ల క్రితం 1990 మే 20న తాజ్ మహల్ చిత్రంలోని మంచుకొండల్లో చిత్రమా అనే పాట ద్వారా నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. నా ప్రవేశానికి మార్గం సుగమం చేసిన నిర్మాత, నా తండ్రిలాంటి వారు రామానాయుడు గారు. నా 26 ఏళ్ల ఈ సుదీర్ఘ ప్రయాణానికి కారణం రామానాయుడు గారు. ఆ రోజు ఆయన నేర్పిన పాఠం వల్ల అందరికీ మంచి పాటలు ఇస్తున్నాను.” అన్నారు. మండలి బుద్ధ ప్రసాద్ ప్రసాద్ మాట్లాడుతూ.. “తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఒక మహోన్నతమైన గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి రామానాయుడు.. వరల్డ్ రికార్డ్స్ లో తెలుగు చలన చిత్ర పరిశ్రమను నమోదు చేసిన వ్యక్తి ఆయన. తెలుగు పరిశ్రమను ఎంతోగానో ప్రభావితం చేసిన వ్యక్తి. శతాధిక చిత్రాల నిర్మాతగానే కాకుండా మకుటం లేని మహారాజుగా వెలుగొందిన వ్యక్తి రామానాయుడు గారు.” అన్నారు.

ఇంకా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో రామానాయుడి గురించి తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమాన్ని సంతోషం సురేష్, ట్రినెట్ లైవ్ యూట్యూబ్ చానెళ్లు లైవ్ ప్రసారం చేశాయి. లైవ్ ప్రోగ్రామ్ మిస్ అయిన వారు సంతోషం సురేష్ య్యూట్యూబ్ చానెల్‌కు వెళ్లి చూడవచ్చు.
-సురేష్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap