ఆధునిక భారతీయ ఆధ్యాత్మిక ఋషి

విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో పరిచయం చేయాలన్న సంకల్పంతో 64కళలు.కాం సమర్పిస్తున్న “ధృవతారలు” రెగ్యులర్ ఫీచర్లో ఆయా మహానుబావుల జన్మదిన సందర్భాలలో వారిని జ్ఞాపకం చేసుకుందాం.

ధృవతారలు – 18

మౌనంతో, ధ్యానంతో నూతన ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ఆవిష్కరించిన ఆధునిక మౌని శ్రీ రమణ మహర్షి. తమిళనాట జన్మించిన రమణ మహర్షి పదహారేళ్ళ పిన్న వయసులోనే తన మనస్సును తపస్సువైపు మళ్లించి మానవాళికి అద్వైత వేదాంతాన్ని అందిం చిన ఋషిపుంగవుడు. ఓ దగ్గర బంధువు ద్వారా అరుణాచల పుణ్యక్షేత్రం మాటవిని, అదెక్కడుందో తెలుసుకొని ఇంటితో తన ఒంటికున్న బంధాలను తెంచుకొని, ఆధ్యాత్మిక చింతన వైపు ఆసక్తి పెంచుకొని, తన భావి జీవితపు భవ్యధామం అరుణాచలంలోనే గడిపాడు. ‘పెరియ పురాణం’ చదివి దానివలన ఎంతో ప్రభావితుడైన రమణ తొలుత అరుణాచలంలోని 1000 స్తంభాల మంటపంలో ఆ పిదప పాతాళ లింగం చెంత అచంచలమైన తపస్సును సాగించడానికి పూనుకున్నాడు. అలా పలు ప్రాంతాల్లో తన మౌన ధ్యానాన్ని కొనసాగించిన ఈయన శ్రీ గణపతి శాస్త్రి అనే వేద పండితునిచే భగవాన్ రమణ మహర్షిగా పిలవబడ్డాడు. అక్షర మలర్ మాలై రచించి, తన శిష్యులకు దాన్నందించాడు. ముందుగా మనల్ని తెలుసుకోవాలంటూ ‘నాన్నీర్’…? నేను ఎవరు? అన్నది తెలుసుకోమన్నాడు. ఆ పిదపే మనకు భగవంతుడెవరనేది తెలుస్తుందన్నాడు. జ్ఞాన మార్గానికై అద్వైత వేదాంతాన్ని, ఉపనిషత్ సారాంశాన్ని బోధించాడు. ఎందరో పాశ్చాత్యులను సైతం ఆకట్టుకున్న మన యోగి రమణ మహర్షి నేటికీ మన ధృవతార !

(రమణ మహర్షి జన్మదినం 30 డిశంబర్ 1879)

SA: