డాక్టర్ రమణ యశస్వి గారు పేరు గాంచిన గొప్ప ఆర్థోపెడిక్ డాక్టర్ గా, ప్రముఖ రచయితగా, సేవాతత్పరునిగా అందరికీ సుపరిచితులు. వీరు ఆర్థోపెడిక్ డాక్టర్ గా ఎంతోమంది నిరుపేదలకు వైద్యమందిస్తున్నారు. మరోపక్క తన కవితా సంపుటాలతో సమాజానికి ఆదర్శవంతమైన మెసేజ్ ని అందిస్తున్నారు. ఇంకా ఎంతోమంది నిరుపేదలకు ఆర్థిక సహాయం, వీల్చైర్స్, నిత్యావసర సరుకులు అందజేస్తూ వారి జీవితాల్లో వెలుగు నింపుతున్నారు. ఇలా అన్నీ తానై అన్నిటా తానై వెలుగొందుతూ “నానీలు రెక్కలు” తిమ్మిరి బిళ్ళలు న్యూమరిక్కులు, మిణుగురులు” లాంటి వివిధ రకాల కవితా సంపుటాలను సాహితీ పూతోటలో అందంగా విరబూయించారు. అలాగే వారి మాతృమూర్తి శ్రీమతి సంక తులసమ్మ గారి షష్టిపూర్తి సందర్భంగా తులసిదళాలు పేరుతో వారి మాతృమూర్తి మీద ఉన్న ప్రేమనంతా రంగరించి అద్భుతమైన “తులసి దళాలు” వచన కవితా సంపుటిని సరికొత్త రీతిలో విరబూయించారు. మనం దైవాన్ని ఎంత పవిత్రంగా ఆరాదిస్తామో తులసీమాతని కూడా అంతే పవిత్రంగా ఆరాధిస్తాం, పూజిస్తాం. అలాగే డాక్టర్ రమణ యశస్వి గారు వారి మాతృమూర్తిని కూడా తులసి మాత కన్నా ఎక్కువగా ఆరాధిస్తూ తన అభిమాన ధనాన్ని కురిపించారు ఈ తులసిదళాలు కవితల్లో. వీరు ఈ కవితా సంపుటలో ప్రతి కవితలో అంత్యప్రాసగా నాలుగవ లైనులో “ఓ తులసి తల్లి! మా కల్పవల్లి!!”అంటూ మకుటంగా మలిచారు.
తులసి దళాలు మొదటి కవితలో దేవుడు అన్ని చోట్లా ఉండలేక అమ్మని సృష్టించాడు అందునా మా అమ్మని ప్రత్యేకించి సృష్టించాడు అని ఓ తులసి తల్లి! మా కల్పవల్లి!! అంటూ అమ్మ పై ప్రేమ జల్లులు కురిపించారు. ఇంకా అమ్మ లేక ఈ లోకం ఎలా అల్లాడుతుందో చెప్తూనే, నేను ఈ లోకంలోకి వచ్చింది నీ వల్లే. నీ రుణం తీర్చుకోలేనిది ఓ తులసి తల్లి! మా కల్పవల్లి!! అంటూ అభివర్ణించారు. ఓ కవితలో భాషకందనoత గొప్పగా అమ్మ చూపే ప్రేమను చెబుతూనే వారి తల్లి చేసే సేవ గుణాన్ని చెప్తూ కాలానుగుణంగా వచ్చే ప్రకృతి ప్రసాదించినవన్నీ దానం చేసే గొప్ప ఫ్రెండు అంటూనే పూలలో దారం ఇమిడి పోయినట్లుగానే నువ్వు కూడా ఫ్రెండ్ గా ఇమిడిపోయావంటూ అభివర్ణించారు.
“అసలే బాల్య వివాహం / మొగుడు కదిలే ప్రవాహం / అత్తే మొగుడు సహా/ ఓ తులసి తల్లి! మా కల్పవల్లి!!” కవితలో అమ్మ ప్రవాహం లాంటి భర్తతో ఆంక్షలు విధిస్తున్నా కూడా ఎంతో ఓర్పుగా కలసిపోయి కల్పవల్లి లా ఉంటుందని అమ్మలోని ఓర్పు, నేర్పుని చక్కగా చెప్పారు. మరో అద్భుతమైన కవిత “మనసు పాదరసం/ మాట చెరుకురసం/ అమ్మ మాట వింటే పోతుంది నీరసం / తులసి తల్లి! మా కల్పవల్లి!!” ఈ కవితలో అమ్మలోని మాధుర్యాన్ని చాలా చక్కగా ఆవిష్కరించారు. అమృతతుల్యమైన వాక్కులతో తియ్య తియ్యగా మధురంగా ఉన్న అమ్మ మాటలు వినంగానే తీయని మాటలతో మంచి బలం చేకూరుతుంది అని ఎంతో అద్భుతంగా చెప్పారు చక్కని మకుటాన్ని అమ్మకు అన్వయించి. మరో చక్కని కవిత “అత్తను తెచ్చింది దారికి / ఇద్దరూ ఒకటయ్యారు చివరికి తల్లీకూతుళ్ళు అనిపించారు లోకానికి / తులసి తల్లి! మా కల్పవల్లి!!” అంటూ అత్తా కోడళ్ళ అనుబంధాన్ని చాలా చక్కగా చెప్పారు. మంచి మాటలతో మార్చి తల్లీకూతుళ్ల అనుబంధానికి చక్కని ప్రతీకగా నిలిపింది ఈ తులసి తల్లీ అంటూ బంధాలు అనుబంధాల్ని చక్కగా చెప్పారు. “ఊళ్ళో ఎవరి పనైనా నాన్నదే / పాపం అరగని చెప్పులది / ఇంట్లో భారం అమ్మదే / ఓ తులసి తల్లీ! మా కల్పవల్లి!!” అంటూ ఈ కవితలో ఎప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ అందరి కష్టాలు తన కష్టాలుగా భావించి సేవలు అందిస్తారు. తులసి “మా” లాగా అంటూనే నాన్న సేవాభావాన్ని, అమ్మ బాధ్యతని ఎంతో గొప్పగా చెప్పారు ఈ చిన్ని కవితలో.
మరో అద్భుతమైన కవిత అమ్మ కష్టానికి నిదర్శనం. “నీవు మా కోసం కరిగిన కొవ్వొత్తి/ అలనాడు నువ్వు పంపించావు మిర్చి, పత్తి / ధారపోశావు సమస్త శక్తి/ ఓ తులసి తల్లి! మా కల్పవల్లి!!” కవితలో చక్కని భావం దాగి ఉంది. కొవ్వొత్తి తాను కరిగిపోతూ కూడా ఎదుటి వారి వెలుగు రేఖల్ని పంచుతున్న చందాన అమ్మ కుటుంబం కోసం పిల్లల కోసం శ్రమశక్తినంతా దారపోసి పొలం పనులు చేసిన మా అమ్మ కల్పవల్లి అంటూ ఎంతో గొప్పగా అభివర్ణించారు. మరో అద్భుతమైన కవితలో తాను డాక్టర్ అవ్వాలనే కోరిక తీర్చిన మాతా పితరులను నాన్నకి జ్ఞానోదయమయింది. అమ్మ కి పెరిగిన తెలివితేటలు. రెండువెరసి తనకి మెడిసిన్లో సీటు వచ్చిందని వారిని తులసి తల్లితో పోల్చి అభినందించారు కవి డాక్టర్. అలాగే మరో చక్కని కవిత కొడుకు ఎముకల డాక్టర్/ కోడలు స్త్రీల డాక్టర్/ నువ్వు సమాజానికి డాక్టర్ వి / ఓ తులసి తల్లి! మా కల్పవల్లి!! అనే ఈ కవితలో శారీరక వ్యాధులను నయం చేసే మా ఇద్దరి కంటే మానసిక బాధలను ఇట్టే పోగొట్టి సమాజానికి ఆదర్శవంతమైన ఆమె గొప్ప డాక్టర్ అంటూ కవి అమ్మని అభినందించారు. అమ్మ లోని సేవా గుణాన్ని తెలుపుతూ మరో అద్భుతమైన కవితలో హిల్లరి అమెరికా ప్రెసిడెంట్ కాలేకపోయినా అమ్మ ఎప్పుడో మహిళా మండలి ప్రెసిడెంట్, గాంధీ మార్గం ప్రెసిడెంట్ గా మారి సేవలందించిందని చక్కగా కొనియాడారు ఈ కవి డాక్టర్. అందమైన అద్భుతమైన కవిత “వాన చుక్కలు కలిస్తే నది /ప్రేమ చుక్కలు కలిస్తే జీవనది /అమ్మ బేషరతుగా ప్రేమామృతం పంచుతుంది/ ఓ తులసి తల్లి! మా కల్పవల్లి!!” అంటూ జీవనదిలా ప్రేమామృతాన్ని పంచే తులసిదళం లాంటి కల్పవల్లి మా అమ్మ అంటూ ఎంతో ప్రేమగా చెప్పారు డాక్టర్ రమణ యశస్వి.
ఇంకా ఈ కవితా సంపుటిలో “మా అమ్మ మమ్మి కాదు, అక్షరాల బంగారు బొమ్మ. అలుపెరగని జాబిలమ్మ అనురాగాల జిరాక్స్ మిషన్. అమ్మలకే నడకలు నేర్పిన మదర్ అమ్మ” అంటూ అమ్మ పై అనురాగాల జడివానల జల్లులు కురిపించారు ఈ కవి. ఇలా అమ్మపై ఔన్నత్యాన్ని, అభిమానాన్ని చాటుతూ ఇంకా ఎన్నో మరెన్నో ఈ కవితా సంపుటిలో పొందుపరిచారు. ఇలా అద్భుతమైన కవితా సంపుటాల్ని అందిస్తున్న ఈ కవితా శస్త్రచికిత్సా నిపుణులు డాక్టర్ రమణ యశస్విగారు పురస్కారాల పరంపరలో భాగంగా “రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రతిష్ఠాత్మకమైన కళారత్నసాగర్ పురస్కారాన్ని, ఆల్ ద బెస్ట్ అకాడమీ హైదరాబాద్ వారి నుంచి వైద్య సేవారత్న పురస్కారం చారిటబుల్ ట్రస్ట్ నుంచి సేవా పురస్కారం ఉత్తమ వైద్యోపాధ్యాయ” లాంటి ఎన్నో చక్కని పురస్కారాలను సొంతం చేసుకొని అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఆకాశమంత అభిమానంతో ఇలా అమ్మ పై మమకారం, మాధుర్యాన్ని, అనురాగపు అభిమాన ధనాన్ని గల గల పారే సెలయేరులా ప్రవహింపజేసి కవి తేనెకన్న తీయనైన ప్రేమని అమ్మలందరికి ఆదర్శవంతంగా వుండే విధంగా అమ్మపై చాటుతూ తులసిదళాలు అంత పవిత్రంగా భావించి అమ్మపై ఆకాశమంత ప్రేమతో “తులసీ దళాలు” కవితా సంపుటిని సాహితీ ప్రియులకు అందించిన కవి డాక్టర్ కళారత్న డాక్టర్ రమణ యశస్విగారు ఈ సమాజానికే ఆదర్శవంతం, కవి డాక్టర్ గారికి నా శుభాకాంక్షలు, జేజేలు.
–పింగళి భాగ్యలక్ష్మి,
కాలమిస్టు, రచయిత్రి.