రాంభట్ల కృష్ణమూర్తి (1920-2020) రాంభట్ల శతజయంతి సంవత్సరం
తొలి రాజకీయ కార్టూన్ కవిగా ప్రజా రచయితగా, జర్నలిస్టుగా, కమ్యూనిస్టువాదిగా 20వ శతాబ్దంలో ప్రత్యేక గుర్తింపు పొందిన కవి పండితుడు రాంభట్ల కృష్ణమూర్తి, పాఠశాలలో చదివినది 5వ తరగతే, కానీ వందలాది గ్రంథాలు పాఠశాల బయట పుక్కిట పట్టారు. సంస్కృతాంధ్ర, ఆంగ్ల, ఉర్దూ భాషలలో నిష్ణాతులుగా ఎదిగారు. ఆయన మెదడు ఒక అపూర్వ జ్ఞాపకాల విజ్ఞాన సర్వస్వమని, కదిలే గ్రంథాలయంగా ఆయనే అభివర్ణించేవారు.
ప్రముఖ చిత్రకారుడు, సాహితీవేత్త అడివి బాపిరాజు వద్ద రాంభట్ల చిత్రలేఖనం మెలకువలు కూడా నేర్చుకోవటానికి వెళితే ఆయన రాంభట్ల ను జర్నలిజంలోనికి దించారు. 1945-48 సంవత్సరాలలో “మీజాన్” పత్రికలో సహాయ సంపాదకులుగా పనిచేసారు. అదే సమయంలో దేశంలో మొదటిసారిగా ఫ్రూప్ రీడర్స్ హక్కుల గురించి జరిగిన 18 రోజుల సమ్మె ఫలితంగా ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసారు. తరువాత “విశాలాంధ్ర” లో చేరారు. ఆ సమయంలో ఆంధ్ర రాజకీయాల్ని, రాజకీయ నాయకుల్ని ఎద్దేవా చేస్తూ కృష్ణమూర్తి కార్టూన్లు వేస్తే, ఆ వ్యంగ్య వైభవాన్ని కవితలా “శశవిషానం” చూపేవారు.
ఎరుపు రంగు చూసే బెదిరిపోయే అమాయకున్ని ఉద్దేశించి – “చిలక ముక్కెరుపు, చిట్టీత పండెరుపు, అరుణోదయం ఎరుపు” అని ఎద్దేవా చేసేవారు. ఆ కార్టూన్లను పాఠకులు ఆశక్తిగా చూసేవారు. ఆ కార్టూన్ కవితల్ని ఆత్రంగా చదువుకొనేవారు. పాడుకొని నవ్వుకొనేవారు.
జోన్గా వాడుకొనేవారు. అవి ఆనాడు అంతగా ప్రజాదారణ పొందాయి. ఆ కార్టూన్లు, కవితలు రాంభట్లవని చాలామందికి తెలియదు. తరువాత అవి “శశవిషానం” గీతాలుగా గ్రంథ రూపంలో వచ్చాయి.
ఆ కాలంలో “వాసు” ఆంధ్రదినపత్రికలో అసంఖ్యాకంగా రాజకీయ వ్యంగ్య చిత్రాలు వేసేవారు. రాంభట్ల, వాసు, ల కార్టూన్లు పోటీపడి పాఠకుల మీద దాడిచేసేవి. రాజకీయంగా వీరిద్దరివీ భిన్న దృవాలు కావడం ఇందుకు కారణం.
కొంత కాలం తరువాత రాంభట్ల “విశాలాంధ్ర” నుంచి కూడా రాజీనామా ఇచ్చి కలం అమ్ముకొని బ్రతకబోనని శపధం చేసి మరి బయటికి వచ్చారు. ఆ తరువాత ఎన్నో అవకాశాలు వచ్చిన అంగీకరించలేదు. తన మనోభావాలు వదులుకోలేదు. రాజకీయాలు మార్చుకోలేదు. తన శక్తిసామర్థ్యాలు, అనుభవాన్ని కమ్యూనిస్టు పార్టీ రాజకీయ పాఠశాలలకు, ఇండో- సోవియట్ కార్యదర్శి పదవికి పరిమితమయ్యారు.
“ఈనాడు” ఆరంభమయ్యాక అందులో చేరి ఆ పత్రిక శిక్షణ కళాశాలకు ప్రిన్సిపల్ గా, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. మహాకవి గురజాడ “కన్యాశుల్కం” లోని మధురవాణి పాత్ర అంటే ఆయనకు ఎంతో ఇష్టం. ఆపాత్ర పేరును, వ్యాసాల్లోను సంపాదకీయాల్లో ఎక్కువ ప్రస్తావించేవారు.
సాహిత్య ఉద్యమంలో ఆయన చురుకుగా పాల్గొని ఎన్నో అభ్యుదయ రచనలు చేసారు. జనకథ, పారుటాకులు, వేల్పుల కథ, వేదభూమి ఆయన రచనల్లో మచ్చుతునకలు. పిడకల వేట, గరికపరకలు, మధనం శీర్షికలతో పలు పత్రికల్లో ఆయన ఎన్నో వ్యాసాలు వ్రాసారు. ప్రముఖ ఉర్దూ కవి ముఖ్యం కవిత్లో కొన్నింటిని తెలుగులోనికి అనువదించారు. సమకాలీన చరిత్రలో ముఖ్య ఘట్టాలకు ఆయన రచనలు అద్దంపట్టేవిగా ఉండేవి. ఆయన వ్రాసిన “సొంతకథ” కొంత వివాదాస్పదం అయినది.
తూర్పు గోదావరి జిల్లా, అమలాపుర సమీప కుగ్రామం అనాతవరం అగ్రహారం లో 1920 మార్చి 24 న జన్మించిన రాంభట్ల 2002 డిశంబరు 7 న హైద్రాబాద్లో కన్నుమూసారు.
– సుంకర చలపతిరావు సెల్: 9154688223