జర్నలిజం కీర్తి – రాంభట్ల కృష్ణమూర్తి (1920-2020) శతజయంతి సంవత్సరం సందర్భంగా …
రాంభట్ల కృష్ణమూర్తిగారు నాకు తెలిసినంత వరకు ఏ కాలేజీలో చదువుకోలేదు. బహుశా ప్రాథమిక విద్య దాకా మాత్రమే పాఠశాలకు వెళ్లి ఉండవచ్చు. స్వయం కృషితో జ్ఞానార్జన చేశారు. గొప్ప మేధావి. అతి సాధారాణంగా కనిపించే సరదా మనిషి.
ఆయన కార్టూనిస్టు, జర్నలిస్టు, తత్వ శాస్త్ర అధ్యయనం చేసిన ఉపాధ్యాయుడు. వివిధ అంశాల మీద లోతైన అధ్యయనం చేశారు. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు ఆయన బోధించిన తత్వశాస్త్ర రాజకీయ పాఠశాలలో పాల్గొన్నాను.
రాంభట్ల కృష్ణమూర్తి గారు భారత్ సోవియట్ మిత్ర మండలి (ఇస్కస్) ప్రధాన కార్యదర్శిగా పని చేసేవారు.
రాంభట్ల కృష్ణమూర్తి, గజ్జెల మల్లా రెడ్డి గారు మంచి స్నేహితులు. వారిని సరదాగా జంటకవులని పిలిచేవారు. మల్లా రెడ్డి గారి వ్యంగ్య కవిత్వం అప్పట్లో సుప్రసిద్ధం. వయసు తారతమ్య లేకుండా, రాంభట్ల అందరితోనూ చాలా సరదాగా మాట్లాడేవారు. అందుకే విద్యార్థులు ఆయనతో చర్చించాలంటే ఆసక్తి, ఉత్సాహం చూపే వారు.
వారి అన్నగారు హైదరాబాద్ లో ప్రారంభించిన పరిశ్రమలో రాంభట్ల కొంత కాలం పని చేసానని చెప్పేవారు. రైస్ మిల్లులకు అవసరమైన ఇంజన్లు, ఆయిల్ ఇంజన్లు తయారు చేసేవారు. దానితో సాంకేతిక అంశాలపై కూడా ఆయనకు మంచి అవగాహన ఉండేది. మార్కెట్లో అమ్మే రేట్లో సగం కంటే తక్కువ ధరకు రైతులకు ఆయిల్ ఇంజిన్లు సరఫరా చేయవచ్చునని సోదాహరణంగా చెప్పేవారు.
ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఆయన యువ రచయితలను చాలా ప్రోత్సహించేవారు. అనేక మంది శిష్యులను తయారు చేశారు. బూదరాజు రాధాకృష్ణ గారు కూడా ఆయనకు మంచి స్నేహితులు.
విశాలాంధ్ర ప్రారంభ దశలో కార్టూన్లు గీసేవారు. తెలుగు పత్రికలలో కార్టూన్లు వేసే సంప్రదాయం లేని రోజుల్లో వ్యంగ్య చిత్రాలు గీసిన రాంభట్లే బహుశా తెలుగులో మొదటి రాజకీయ కార్టూనిస్టు అని మిత్రుడు వ్యాఖ్యానించడం నాకు గుర్తు. తరవాత ఎందువల్లో కార్టూన్ల జోలికి పోలేదు.
పని ఉన్నా లేకపోయినా ప్రతి రోజు హిమాయత్ నగర్ చౌరస్తాలో ఉన్న అ.ర.సం. కార్యాలయానికి, పార్టీ ఆఫీసుకు వచ్చి పోయేవారు. పార్టీ ఆఫీసు కార్యదర్శి కామ్రేడ్ రామచంద్ర రావు గారు ఆయనకు మరొక మంచి మిత్రులు.
హైదరాబాద్ లో రామోజిగారు ఈనాడు ప్రారంభించిన తరవాత ఆయన కోరికపై రాంభట్ల, గజ్జల మల్లారెడ్డి అందులో చేరారు. కొంతకాలం బాగానే గడిచినా ఈనాడు పత్రికలో సమ్మె జరిగినప్పుడు వారిద్దరూ పత్రికలో కొనసాగటంపై విమర్శలు వచ్చాయి. అదొక ఇబ్బందికరమైన పరిస్థితి. క్రమంగా రాంభట్ల దాంట్లోంచి బయటపడ్డారు. కానీ గజ్జెల మల్లారెడ్డి గారు మరి కొంత కాలం కొనసాగినట్లున్నారు. పార్టీకి ఆయన దూరమయ్యారు. ఆంధ్రభూమి, ఉదయం తదితర పత్రికల సంపాకుడిగా పని చేశారు.
“తెలుగునాట భక్తి రసం తెప్పలుగా పారుతోంది డ్రైనేజీ స్కీము లేక డేంజరుగా మారుతోంది” అని వ్యంగ్య కవిత్వం రాసిన మల్లారెడ్డి ఆ తరవాత అధికార భాషా సంఘం అధ్యక్ష పదవీ స్వీకరణ సందర్భంలో వేదమంత్రాల మధ్య బాధ్యతలు తీసుకోవటం విషాదకరం. మల్లారెడ్డి గారు దూరమైనా కృష్ణమూర్తి గారు మాత్రం చివరి వరకు మార్క్సిస్టు సిద్ధాంతంపట్ల, పార్టీపట్ల విశ్వాసంతో కొనసాగారు.
కృష్ణమూర్తి గారి కుమార్తె అరుణ విద్యార్థి ఉద్యమంలో చురుకుగా పాల్గొనేది. ఆయన ఆర్మేనియా పర్యటించి వచ్చిన తరవాత ఆ ప్రేరణతో కుమారుడికి ఆర్మేన్ అని పేరు పెట్టుకున్నారు. ఆయన శతజయంత్యోత్సవ సందర్భంగా మరొకసారి ఆయన స్మృతులు గుర్తుకు తెచ్చుకునే అవకాశం కలిగింది.
-సురవరం సుధాకర రెడ్డి
(కార్టూనిస్ట్ గానే మనకు తెలిసిన రాంభట్ల గారు చిత్రించిన గురజాడ గారి చిత్రం పైన చూడవచ్చు)
_________________________________________________________________________
ఫ్రెండ్స్ పత్రికలోని ఆర్టికల్స్ పై క్రింది కామెంట్ బాక్స్ లో స్పందించండి. మీ విలువైన సూచనలు, సలహాలు తెలియజేయండి.