రానా, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘విరాటపర్వం’. ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుగుతుంది.
ఈ చిత్రానికి కొంతమంది హాలీవుడ్, బాలీవుడ్ టెక్నీషియన్లు, ఆర్టిస్టులు పనిచేస్తుండటం విశేషం. ఈ సినిమాలోని ప్రధాన ఆకర్షణల్లో యాక్షన్ సన్నివేశాలు ఒకటి. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘ఉరీ: ద సర్జికల్ స్ట్రైక్’కు పనిచేసిన హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ స్టీఫెన్ రిచెర్ ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్‌లకు రూపకల్పన చేశారు.
యాక్షన్ సహా అన్ని రకాల సన్నివేశాలకు రానా, ఇతర తారాగణం పూర్తిస్థాయిలో శ్రమిస్తుండగా, ఉన్నతస్థాయి నాణ్యతా ప్రమాణాలతో నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
‘నీదీ నాదీ ఒకే కథ’ ఫేమ్ వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో ప్రియమణి ఒక కీలక పాత్రలో కనిపిస్తారు. డి. సురేష్‌బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ ఫేమస్ నటి నందితా దాస్, ఈశ్వరీరావు, జరీనా వహాబ్ ప్రధాన పాత్రలు చేస్తున్నారు. హాలీవుడ్‌కు చెందిన డానీ సాంచెజ్-లోపెజ్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
ఈ వేసవిలో ‘విరాటపర్వం’ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.