కలియుగ హరిశ్చంద్రుడు  – డి.వి.సుబ్బారావు

మధుర గాయకులు ఆంధ్రాతాన్సేన్ డి.వి.సుబ్బారావు గారి 31 వ వర్ధంతి సంధర్భంగా…

భుజాన మాసిన నల్లటి గొంగళి…
సంస్కారం లేని తలజుట్టు…
నుదిటి పై నల్లని గుడ్డ పీలికతో కట్టిన కట్టు..
కళ్ళల్లో దైన్యం..
శూన్యం లోకి చూపులు…
మాసిన గడ్డం..
ఆ గడ్డం కింద కర్ర…
భుజంపై నల్లని మట్టికుండ..
విచారవదనం…
కనుబొమలు చిట్లించి, మోమును కన్నీటి సాగరమున ముంచిలేపి అభినయం..
మహామహానటులకే ఆదర్శనీయం.
స్పష్టమైన పద ఉచ్ఛరణ… గంభీరమైన గాత్ర…
పాత్రకు తగ్గ అభినయం.. గద్గద స్వరంతో… హెచ్చుతగ్గులను సమ్మిళితం చేస్తూ గుండెల్ని పిండి… పిప్పిచేసేలా వుండే ఆలాపన. ఆయన నోటివెంట జాషువా పద్యాలు సెలయెరులా దుముకుతుంటే రంగస్థల కళాభిమానుల కేరింతలు ఆకాశహార్మనుల్లా వినిపించేవి…

1930లో బలిజేపల్లి లక్ష్మీకాంతం హరిశ్చంద్ర నాటకరూపాన్ని రచిస్తే, అందులో కాటిసీను పద్యాలు నవయుగ కవిచక్రవర్తి గుర్రం జాషువాగారి కలం నుంచి జాలువారాయి. ఈ పద్యాలన్నీ జీవిత పాఠాలను తేటతెల్లం చేస్తాయి. హరిశ్చంద్రుని పల్లెపల్లెకు, ప్రజల గుండెగదుల్లోకి తీసుకెళ్ళిన ఏకైక కళాకారుడు డీవీ. నాటకవైభవం కనుమరుగవుతున్నవేళ తిరిగి ఆ వైభవం బతికి బట్టకట్టాలంటే డీవీని స్మరించుకోవాల్సిందే.
సత్యం కోసం హరిశ్చంద్రుడు రాజ్యం వదిలాడు. కారడవుల బాట పట్టాడు. తుదకు ఆలు, బిడ్డల్ని తెగనమ్మాడు. తానూ అమ్ముడుబోయాడు. ఓ స్మశానస్థలికి చేరి కాటికాపరిగా మారాడు. ‘సత్యవాక్కును’ లోకానికి చాటాడు. ఇది సత్యహరిశ్చంద్రుని సంక్షిప్త జీవిత గాథ. ఈ కథను రంగస్థలం మీద సజీవ శిల్పంగా చెక్కినవాడు డి.వి. హరిశ్చంద్ర కథాంశాన్ని తన గాత్రంలో నింపుకొని తెలుగునేల నాలుగుచెరగులా కలియతిరిగి చాటిచెప్పిన ఏకైక నాటకరంగ మహానటుడు కూడా డీవీనే. ఆధ్రనాటకరంగ అభిమానులు ప్రేమగా పిలుచుకునే “డి.వి” సుబ్బారావు గారి పూర్తి పేరు దుబ్బు వెంకట సుబ్బారావు. డీవీ అంటేనే తెలుగువారికి బాగా గుర్తు. 1939 జూన్‌ 22న పాత గుంటూరు జిల్లా (ప్రస్తుతం ప్రకాశం జిల్లా) చీరాల తాలూకాలోని వేటపాలెంలో డీవీ జన్మించారు. తల్లిదండ్రులు దుబ్బు రాఘవయ్య-, మహాలక్ష్మమ్మ. వీరిది కొద్దిపాటి వ్యవసాయ కుటుంబం. వీరికి ఐదుగురు సంతానం. ఐదుగురిలో డీవీ జ్యేష్టుడు. వేటపాలెం ఎలిమెంటరీ పాఠశాలలో ప్రాథమిక విద్యవరకే అభ్యసించారు. చిన్నతనం నుంచి డీవీకి పద్యాలన్నా, రాగాల ఆలాపనన్నా మహాపిచ్చి. గ్రామ పొలిమేరల్లో పశువులను కాసేందుకు వెళ్ళినప్పుడు చేలగట్లపై చిందేస్తూ రాగాలు తీసేవాడట. కాస్త ఏళ్లు పైబడేకొద్దీ చుట్టుపక్కల గ్రామాలలో ఏ నాటకమాడినా వెళ్ళి చూసేవాడు. ఆనాడు గ్రామీణ ప్రాంతాలలో నాటకరంగానిదే పైచేయి. పద్యంమీద వున్న ఈ మక్కువతోనే డీవీ తన 12వ ఏటనే తెనాలి కి చెందిన రంగస్థల కళాకారులు వల్లూరి వెంకట్రామయ్య చౌదరి ట్రూప్‌లో చేరారు. ఆయనతో శిష్యరికం చేశారు. బాలనాగమ్మ నాటకంలో మాయలపకీరు వేషధారణలో వల్లూరి వారే స్టేట్‌ ఫస్ట్‌. ఆయన దగ్గర వుంటూ డీవీ బాలనాగమ్మలో బాలవర్ధిరాజుగా, కార్యవర్ధిరాజుగా, హరిశ్చంద్రలో లోహితుడిగా బాల పాత్రలు వేశాడు. అలా నాటకరంగంలో ఓనమాలు దిద్ది పలు ప్రధాన పాత్రలను పోషించే స్థాయికి చేరాడు.

రామరావణ యుద్ధంలో రాముడిగా, చింతామణిలో భవానిశంకరునిగా నటించారు. ఈ పాత్రలలో డీవీ రాణించినా, ఈ పాత్రలేవీ అంతగా డీవీకి పేరు తెచ్చిపెట్టలేదు. ఆ తరువాత బండారు రామారావు ప్రేరణతో ఆడిన హరిశ్చంద్ర నాటకం ఆయన నాటక నటనా కౌశాల్యానికి, పద్యగానానికి కీర్తి కిరీటంగా చెప్పవచ్చు. హరిశ్చంద్ర నాటకంలోని నాలుగు హరిశ్చంద్ర పాత్రలలో వేటసీను, అరణ్యసీను, వారణాశిలో కన్పించే మూడు పాత్రలు ఒక ఎత్తైతే కాటిసీనులో కన్పించే పాత్ర ఒక్కటే ఒక ఎత్తు. కాటిసీను అంటే డీవీనే. డీవీ అంటే కాటిసీను. డీవీకే కాటిసీనుపై పేటెంట్‌ రైట్స్‌ వున్నాయంటారు ఆయన అభిమానులు. 1930లో బలిజేపల్లి లక్ష్మీకాంతం హరిశ్చంద్ర నాటకరూపాన్ని రచిస్తే, అందులో కాటిసీను పద్యాలు నవయుగ కవిచక్రవర్తి గుర్రం జాషువాగారి కలం నుంచి జాలువారాయి. ఈ పద్యాలన్నీ జీవిత పాఠాలను తేటతెల్లం చేస్తాయి. భార్యాబిడ్డలు, కలిమిలేములు, సుఖదు:ఖాలు, జీవితవైరాగ్యం చివరకు స్మశానస్థలి గొప్పతనం గూర్చిన వర్ణనలు వుంటాయి. ఈ పద్యగానాన్ని డీవీ నాలుగున్నర శృతిలో ఆలపించేవారు. హరిశ్చంద్రుడు తన గూర్చి తాను ఈసడించుకుంటున్న వేళ.. డీవీ చేసే అభినయం నభూతో.. నభవిష్యత్‌.

హరిశ్చంద్రుని పల్లెపల్లెకు, ప్రజల గుండెగదుల్లోకి తీసుకెళ్ళిన ఏకైక కళాకారుడు డీవీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 23 జిల్లాలతో పాటు మద్రాసు, బెంగళూరు, కలకత్తా వంటి మహానగరాల్లో కూడా డీవీ హరిశ్చంద్ర నాటకాన్ని ఆడారు. దాదాపు 10వేల పైచిలుకు ప్రదర్శనలు ఇచ్చారు. డీవీ బృందంలో చంద్రమతిగా గూడూరు సావిత్రి (గూడూరు), భానుమతి (నరసరావుపేట), హేమలత (అద్దంకి) నక్షత్రకులుగా వై.గోపాలరావు (శ్రీకాకుళం), డి. ఆంజనేయశర్మ (కావలి), విశ్వామిత్రునిగా కె.వి.రమణారెడ్డి, సత్యకీర్తిగా శ్రీనివాసుల నాయుడు, హాస్యనటునిగా వెంకటప్పయ్య పాత్రలు ధరించారు. ఇప్పటికీ అనుచరగణం, శిష్యగణం ఆయనను స్మరించే ఈ నాటకాన్ని ఆడతారు. ఇప్పటికీ ఎంతోమంది కళాకారులు హరిశ్చంద్ర నాటకాన్ని ఆడుతున్నా, వారందరికి ఏకలవ్య గురువు డీవీ సుబ్బారావే. అభిమానులు డీవీని కలియుగ హరిశ్చంద్రుడు, ఆంధ్ర తాన్‌సేన్‌గా కొలిచేవారు.

Junior DV Subbarao


నాటకరంగస్థలి మీద ఎంతో అసమాన నటనాసార్వభౌమత్వాన్ని ప్రదర్శించిన డీవీకి ప్రభుత్వం నుంచి తగిన గుర్తింపు లభించకపోవటం బాధాకరం. ఆయన పేరిట అవార్డునో, రివార్డునో ఏర్పాటుచేయక పోవటమూ విచారకరం. కళాభిమానులు కొందరు వేటపాలెం, ఒంగోలు పట్టణాలలో ఆయన విగ్రహాలను నెలకొల్పారు.

వీరి మనవడు జూనియర్ డి.వి. సుబ్బారావు. తాతగారి వారసత్వాన్ని అందిపుచ్చుకుని తన 11 వ ఏటనే రంగస్థల ప్రవేశం చేసి హరిశ్చంద్ర పాత్రలో రాణిస్తున్నారు…దాదాపు 4 వేల ప్రదర్శనలతో ప్రేక్షకలోకం అభిమానాన్ని చూరగొన్నారు…

1989 నవంబరు 9న డీవీ కళామతల్లికి వీడ్కోలు చెప్పారు.

1 thought on “కలియుగ హరిశ్చంద్రుడు – డి.వి.సుబ్బారావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap