తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక మరియు రసరంజని సంయుక్త నిర్వహణలో… రసరంజని 33 వ వార్షికోత్సవం సందర్భంగా మార్చి 25 నుండి 27 వరకు, మూడురోజుల పాటు హైదరాబాద్ రవీంద్రభారతి లో జరుగుతున్నాయి.
తెలుగు నాటక వికాసానికి బహుముఖంగా తోడ్పడాలనే ఆశయంతో రసరంజని సంస్థ ‘కన్యాశుల్కం’ నాటక పదర్శనతో 1993 మార్చి 8 న ప్రారంభమయింది. కేవలం పదిరూపాయల ప్రవేశ రుసుమును వసూలు చేసే సంప్రదాయాన్ని ప్రారంభించి ప్రతినెలా ఒక నాటక ప్రదర్శన ముఖ్యకార్యకమంగా గత 33 సంవత్సరాలుగా అవిరళకృషి చేస్తూ ఏటా వేడుకలు చేసుకుంటోంది. సభ్యుల నాటకాలే కాక ఇతర ప్రఖ్యాత నాటక సమాజాల వారి నాటకాలను నిరాటంకంగా రసరంజని ప్రదర్శింపచేస్తోంది.
నాటక సాహిత్యంలో ‘క్లాసిక్స్’గా పరిగణించే కన్యాశుల్కం, ముద్రారాక్షసం, ప్రతాపరుద్రీయం వంటి నాటకాలతో బాటు ఆధునిక నాటకకర్తల ప్రఖ్యాత నాటకాలు మరోమొహంజదారో, డామిట్ కథ అడ్డం తిరిగింది. శ్రీనాధుడు, అనగనగా ఒకరోజు, జనమే జయం, దేవుడు చేసిన బొమ్మ, ప్రజానాయకుడు ప్రకాశం, నచికేత వంటి నాటకాలతో సహా, పెద్దలూ జాగ్రుత్తి, నాటకం బూటకం, కరి మింగిన వెలగపండు, చైర్మన్ వంటి సమకాలీన సమస్యల నాటకాలను స్వయంగా రసరంజని సంస్థ ప్రదర్శించింది.
రసరంజని ఏటా జరుపుతున్న నాటకోత్సవాలు, నెలనెలా నాటక ప్రదర్శనలు ప్రేక్షకజన ప్రశంసలకి, ఆనందానికి కారణం అవుతున్నాయి- సంతోషమే. కానీ, ఎక్కడో ఏదో వెలితి, గుండెల్లో కలుక్కుమనే ఒక చిన్న బాధ- ప్రేక్షకులు టికెట్టు కొనుక్కొని వచ్చి నాటకం చూడాలి అనే మా ఉద్దేశం పూర్తిగా నెరవేరలేదు. అవిశ్రాంతంగా కృషి చేస్తున్నా అనుకున్నంత సంఖ్యలో ప్రేక్షకులు నాటకానికి రావడంలేదు. ఏ కార్యక్రమము చేసినా జనం పల్చగానే ఉంటున్నారు. ఇది మా మాటే కాదు. ఇతర సంస్థలు కూడా ఇదే అభిప్రాయాన్ని తరచుగా వ్యక్త పరుస్తున్నాయి. లోపం మనలోనా! లేక మారుతున్న ప్రేక్షకుల అభిరుచులా!
కళ కళకోసం కాదు జనం కోసం-ఎన్నో సంస్థలు తమ తమ పరిధులలో కార్యక్రమాలు చేస్తున్నా అవి సామాన్య జనాలకు అంతగా రుచించడం లేదు. నాటకరంగ సంస్థలు, భావ సారుప్యం ఉన్న ఇతర సంస్థలు, ఒక వేదిక మీద చేరి, ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని కనుగొనే దిశగా సత్వరమే ఆలోచించాలి, అడుగేయాలి. అటువంటి ప్రయత్నం జరిగిననాడు రసరంజని సహకారం తప్పక ఉంటుంది. ఆ యజ్ఞంలో మేము కూడా భాగస్వాములమౌతాము. ఏ కార్యక్రమమైనా దిగ్విజయం అవుతుంది.
ఈ సంవత్సరం రసరంజని వ్యవస్థాపక అధ్యక్షులు హెచ్.జె.దొర గారిని, మరియు ప్రస్తుత ఉపాధ్యక్షులు, పూర్వ కార్యదర్శి శ్రీ ముట్నూరి కామేశ్వరరావు గారిని కోల్పోవడం అత్యంత బాధాకరం. వారిద్దరి మృతి మాకు తీరని లోటు. ఉత్సాహవంతులైన సభ్యులు, అనుభవజ్ఞులైన పెద్దల సహకారముతో “రసరంజని” తన కార్యకమాలను విజయవంతంగా నిర్వహిస్తుంది. 33వ వార్షికోత్సవ సందర్భంగా సదా మీ ఆదరాభిమానాలు కోరుకుంటున్నాము.
కేతినీడి నటరాజ్, కార్యదర్శి
