ఎందరో కళాకారులకు పుట్టినిల్లయిన రవీంద్రభారతి హైదరాబాదు నగరం లో ఒక సాంసృతిక కళా భవనము. ప్రతీ కళాకారుడు జీవితంలో ఒక్కసారయినా ఆ వేదికపై తన పదర్శనివ్వాలని కల కంటాడు. కళలతో అనుబంధం వున్న ప్రతీ తెలుగు కళాకారుడు, కళాభిమానులు రవీంద్రభారతిని ఎదో ఒక సందర్భంలో సందర్శించి వుంటారనడంలో సందేహం లేదు. రవీంద్రభారతిలో నిత్యమూ ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమము జరుగుతూ ఉంటుంది. దీనిని తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ నిర్వహిస్తున్నది. శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ రవీంద్రభారతిని పర్యవేక్షిస్తున్నారు.
నిర్మాణ నేపథ్యం: రవీంద్రనాథ్ ఠాగూర్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ నగరంలో అప్పటి ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి 1960, మార్చి 23వ తేదీన రవీంద్రభారతికి శంకుస్థాపన చేశారు. భారత ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ చేతుల మీదుగా రవీంద్రభారతి 1961, మే 11న ప్రారంభించబడింది.మంచి ప్లానింగ్, పార్కింగ్ సదుపాయాలు, చుట్టూ ప్రహరీలతో కట్టబడిన ఈ భవనము చూపులకు కనువిందు చేస్తూ ఉంటుంది. దీని వాస్తు శిల్పి మహ్మద్ ఫయజుద్ధీన్. మొదట్లో ప్రభుత్వమే రవీంద్రభారతి నిర్వహణను చూసుకునేది. 1963లో స్వయంప్రతిపత్తి హోదా కల్పించడంతో 1989 వరకు మేనేజ్‌మెంట్ కమిటీ ఆధ్వర్యంలో దీని నిర్వహణ కొనసాగింది. 1989 నుంచి రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖకు అప్పగించడంతో, ఆ శాఖ సంచాలకులే దీని నిర్వహణ బాధ్యతలను చూసుకుంటున్నారు.
-ఇది మొత్తం ఏ సి (సెంట్రల్ ఏయిర్ కండిషన్ సిస్టం) చేయబడిన ఆడిటోరియం.
-స్టేజి ప్రక్కన కల గ్రీన్ రూమ్స్ అన్ని సదుపాయాలు కలిగి ఉంటాయి. క్షణాలలో స్టేజి అలంకరణ మార్పు చేస్తుంటారు.
-అందమైన ఉద్యానవనములు, ఫౌంటెన్స్, చుట్టూ ఉన్నాయి.
-ఒకేసారిగా వెయ్యి మంది కూర్చుని చూసే వీలు కల అతి పెద్ద ఆడిటోరియం.
-సమావేశాలకోసం సమావేశ మందిరం ఉంది. దీనిలో 150మంది కూర్చోవచ్చు.
-సినిమా ప్రదర్శనల కోసం పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ ఏర్పాటుచేయబడింది. దీనిలో 112 సీట్లు ఉన్నాయి.
-రవీంద్రభారతి ప్రాంగణంలో ఘంటసాల కళా వేదిక ఉంది.
-దీనిని రెండు అంతస్తులుగా నిర్మించారు.
-ముందు వైపు హాలులో రవీంద్రనాధ్ ఠాగూర్ విగ్రహము ఉంది.
-దీని తలుపులు, ప్రక్క గోడలు అన్నిటికి నాణ్యమైన కలపను వాడారు
జానపద, గ్రామీణ, ఆదివాసీ, శాస్త్రీయ కళారూపాల ప్రదర్శకు దశాబ్దాలపాటు వేదికగా నిలవడంతోపాటు సంప్రదాయ నాటక ప్రదర్శనకు, ఆధునిక నాటక ప్రయోగానికి కేంద్రంగా నిలిచిన రవీంద్రభారతికి ఇంటాక్ హైదరాబాద్ చాప్టర్ వారు 2017, ఏప్రిల్ 18న ఇంటాక్ వారసత్వ అవార్డును అందించారు.
కళాభవన్ర: వీంద్రభారతికి అనుసంధానిస్తూ వెనుకగా కళాభవన్ అనే భవనము నిర్మించారు. దీనిలో చిత్ర ప్రదర్శనలు, ఎగ్జిబిషన్స్, వస్త్ర ప్రదర్శనలు, ఇతర కళా ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి.