‘పి.వి. రమణ’ కు రావి కొండలరావు స్మారక పురస్కారం

ఏప్రిల్ 2, 2022 శనివారం హైదరాబాద్ లో శ్రీ శుభకృత్ నామ తెలుగు నూతన సంవత్సర ఉగాది పర్వదినాన 2022 సంవత్సరానికి శ్రీ రావి కొండలరావు స్మారక నగదు పురస్కారం ఘంటసాల గాయకులు శ్రీ పి.వి. రమణ, కాకినాడ గారికి ప్రదానం చేశారు.

ముఖ్య అతిథులుగా నరహరి మాస్టర్ గారు, చెన్నై (వెయ్యి సినిమాలకు పైగా మ్యూజిక్ కండక్టర్ గా, రెండు వేల సినిమాలకు పైగా మ్యూజీషియన్ గా సేవలు అందించిన ప్రముఖులు)… మూర్తిచందర్ గారు, చెన్నై (ప్రఖ్యాత సంగీతదర్శకులు మాస్టర్ వేణు గారి తనయులు & ప్రముఖ పియానో వాద్యకారులు), ప్రత్యేక అతిథులుగా ఘంటసాల శంకర్ గారు, చెన్నై (ఘంటసాల వెంకటేశ్వరరావు గారి తనయులు) మరియు కలగ కృష్ణమోహన్ గారు, హైదరాబాద్ (ఆకాశవాణి, హైదరాబాద్ లలిత విభాగ విశ్రాంత డైరెక్టర్) పాల్గొన్నారు.

ఇది అమరగాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి శతజయంతి సంవత్సరం. ఘంటసాలకు రావి కొండలరావు కు అవినాభావ సంబంధం వుంది. ఘంటసాల ఫిబ్రవరి 11 న స్వర్గలోక ప్రాప్తి పొందితే, రావి కొండలరావు ఆదేరోజు సామర్లకోటలో 1932 న జన్మించారు. ఒకరు అమర గాయకులైతే, మరొకరు బహుముఖ ప్రజ్ఞాశాలి. కొండలరావు ఉద్యోగార్ధం మద్రాసు వెళ్లినప్పుడు ఘంటసాల పాడిన కొన్ని పాటలకు వాహినీ రికార్డింగ్ థియేటర్ లో కోరస్ పాడారు. కొండలరావుకన్నా ఘంటసాల 10 యేళ్ళు పెద్ద. విజయచిత్ర సినిమా పత్రికకు సంపాదకులుగా వ్యవహరిస్తున్నప్పుడు విజయా-వాహిని రికార్డింగ్ థియేటర్ లో ఘంటసాల పాటల రికార్డింగ్ జరుగుతుంది అంటే, కొండలరావు అక్కడ హాజరు! ఘంటసాల మరణించినప్పుడు ఆయన పార్థివ శరీరాన్ని శ్మశానానికి మోసిన కొద్దిమందిలో కొండలరావు ప్రధములు. ఘంటసాల వర్ధంతి ఫిబ్రవరి 11 న కావడంతో కొండలరావు తన జన్మదిన వేడుకలను ఆ రోజు జరుపుకోవడం మానివేసి, తిధుల ప్రకారం వసంత పంచమినాడు జరుకుంటూ వచ్చారు. ఘంటసాల-కొండలరావుల స్నేహబంధం అలా విడదీయరానిదిగా మిగిలిపోయింది. కొండలరావు గారు హైదరాబాద్ లో స్థిరనివాసం యేర్పాటు చేసుకున్నతర్వాత సాహిత్య సంగీత సమాఖ్య పేరిట ఒక ట్రస్టును ప్రారంభించారు. వారు అధ్యక్షులుగా, నేను కార్యదర్శిగా వ్యవహరిస్తూ కొన్ని మంచి మంచి కార్యక్రమాలను నిర్వహించాము. కొండలరావు గారు 2020 జూలై 28 న మరణించిన తర్వాత నేను, సర్వశ్రీ పురాణం రమణ, సయ్యద్ నిసార్ అహమద్, పి. రాజేంద్రకుమార్, పోలిశెట్టి నాగేశ్వరరావు, అద్దేపల్లి శ్రీమన్నారాయణ, గబ్బిట కృష్ణమోహన్ కలిసి కొండలరావు గారి పేరిట ఒక స్మారక పురస్కారాన్ని నెలకొల్పాము. 28-07-2021 న ప్రధమ వర్ధంతి సందర్భంగా రంగస్థల హార్మనిస్టు తీట్ల రాజబాబు కు తొలిపురస్కారంగా పదివేల రూపాయల నగదుతోబాటు పదిహేను వేలరూపాయల టేబుల్ హార్మోనియం బహూకరించాము. మా శ్రేయోభిలాషులు శ్రీ వేలూరు శ్రీనివాసులు, నెల్లూరు గారు నగదు పురస్కార ప్రాయోజకులుగా ముందుకొచ్చారు. 2022 సంవత్సర పురస్కారాన్ని ఘంటసాల శతజయంతిని పురస్కరించుకొని ఘంటసాల గాయకునికి ఈ పురస్కారాన్ని అందజేస్తే సముచితంగా వుంటుందని మా కార్యవర్గం నిర్ణయించి అందుకు అర్హతగల గాయకునిగా కాకినాడ పట్టణానికి చెందిన పి.వి. రమణ గారిని ఎంపిక చేశాము. వీరికి ఇరవై వేల రూపాయల నగదు పురస్కారం ఇచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించగా నెల్లూరుకు చెందిన వేలూరు శ్రీనివాసులు గారు, నెల్లూరుకే చెందిన నా మానస పుత్రిక మధుబాల, అల్లుడు గోతం ప్రసాద్ గారు, సిడ్నీ (ఆస్ట్రేలియా) నగరానికి చెందిన డాక్టర్ వుటుకూరి వెంకట సత్యరాయణ గారు ముందుకొచ్చి తలా పదివేల రూపాయల విరాళాలు పంపించారు. గబ్బిట కృష్ణమోహన్, మాధవపెద్ది సురేశ్, మేడమ్ డాక్టర్ లలితవాణి గార్లు చెరి ఐదు వేల రూపాయలు అందజేశారు. అలాగే, ఏ.డి.ఎన్.వి.ప్రసాద్, శ్రీ పురాణం వెంకట రమణ, ఓలేటి శ్రీనివాస భాను తలా ఒక చెయ్యివేసి ఏర్పాట్లు చక్కగా చేసేందుకు సహకరించారు. ఇక మా కార్యవర్గ సభ్యుల కంట్రిబ్యూషన్ సంగతి చెప్పాల్సిన పనిలేదు. ఈ సంబరం జరుపుకునేందుకు సిద్దార్థ నగర్ (నార్త్) కాలనీ అధ్యక్షులు సురేంద్రబాబుగారు అద్వితీయ సహకారం అందించారు.

ఉగాది పర్వదినాన సాయంకాలం నాలుగు గంటలకే సూర్యభగవానుడు కరుణించి వాతావరణాన్ని చల్లపరిచాడు. వేదికవద్ద కల్లాపి చల్లించి చక్కగా కుర్చీలు సర్దించారు నిర్వాహకులు, మన కోశాధికారి పోలిశెట్టి నాగేశ్వరరావు గారు. పార్కు నిండా చెట్లు వుండడంతో సాయంత్రం ఐదు గంటలకే వాతావరణం ఆహ్లాదకరంగా అమరింది. వేదిక మీద కార్పెట్ పరిచి, ఉగాది సంబరం, సా.సం.స ఫ్లెక్స్ బ్యానర్లు రెపరెపలాడుతూ ఆహూతులకు స్వాగతం పలుకుతుండగా…. ఇది సంగీత సంబరమని తెలిసిందేమో పక్షులు చెట్లమీదనుంచి కుహూరావాలు పలుకుతున్నాయి. ఒక్కొక్కరే పార్కులోకి ప్రవేశిస్తున్నారు. సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభం కావలసిన కార్యక్రమం అనివార్యకారణాలవలన ఏడు గంటలకు మొదలైంది.. కాలనీ వాసులైన ప్రముఖ తెలుగు పండితులు గారు శ్రీ శుభకృత్ నూతన తెలుగు సంవత్సర పంచాంగ శ్రవణాన్ని మొదలుపెట్టి రాశి ఫలాలను విపులంగా వివరించారు. తదనంతరం కాలనీ అధ్యక్షులు సురేంద్రబాబు గారు వేదపండిట్ గారిని సత్కరించారు. సా.సం.స అధ్యక్షులు వేదిక మీదకువచ్చి సభకు నమస్కరించి అమర గాయకుడు ఘంటసాలకు, కొండలరావు గారి ఆత్మలకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలపాటు ఆహూతులు అందరిచేత మౌనం పాటింపజేశారు. వెంటనే ఘంటసాల గానామృతం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముందుగా కాకినాడ నుంచి వచ్చిన సత్కార గ్రహీత పి.వి. రమణ గారిని సా.సం.స అధ్యక్షులు షణ్ముఖాచారి సభకు పరిచయం గావించారు. వెనువెంటనే పాటల కార్యక్రమం మొదలైంది. ముందుగా ‘శుక్లాం బరధరం’ శ్లోకాన్ని, ‘వాతాపి గణపతిం భజే’ అనే పాటను రమణ గారు భక్తిభావంతో ఆలపించారు. తర్వాత ఘంటసాల ఆలపించిన భగవద్గీతలో ఐదు శ్లోకాలను వినిపించారు. ఇక అక్కడనుంచి గానరసఝరి గంగా ప్రవాహంలా యేరులై పారింది. ఉగాది నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ‘భలే మంచిరోజు పసందైన రోజు’ (జరిగిన కథ)పాటను, దాని తర్వాత ‘ఆనందనిలయం’ చిత్రంలో ’పదిమందిలో పాటపాడినా అది అంకితమెవరో ఒకరికే’ పాటను రమణ ఆలపించారు. ఘంటసాల స్వీయ సంగీతదర్శకత్వంలోను, వివిధ సంగీత దర్శకుల సారధ్యంలో ఆలపించిన పాటలను రమణ వినిపించారు. వాటిలో కొన్ని…. ‘దేవదేవ నారాయణ పరంధామ పరమాత్మా (శ్రీకృష్ణార్జున యుద్ధం), ‘ఈశ్వరీ జయమునీవే’ (రాజకోట రహస్యం), ‘నీలకంధరా దేవా’ (భూకైలాస్), ‘శివశంకరీ శివానంద లహరి’ (జగదేకవీరుని కథ), ‘ఆడవే జలకమ్ములాడవే’ (విచిత్రకుటుంబం), ‘మహేశా పాపవినాశా’ (కాళహస్తి మహాత్మ్యం), ‘జగమే మారినది మధురముగా ఈవేళా’ (దేశద్రోహులు), ‘ఈ పగలు రేయిగా పండువెన్నెలగా’ (సిరిసంపదలు), ‘నీ లేత గులాబీ పెదవులతో’ (ఘంటసాల చివరి చిత్రం-మా ఇంటి దేవత) వంటి అద్భుతమైన పాటలు రమణ పాడారు. అన్ని పాటలూ ఏకబిగిన ఒక్కరే పాడటం కష్టం కాబట్టి ఘంటసాల సంగీత నిర్దేశకత్వంలో గాయనీమణులు ఆలపించిన కొన్ని పాటలను మధ్యమధ్యలో శ్రీమతి మహాలక్ష్మి వినిపించింది. అవి… ‘లలితభావ నిలయా’ (రహస్యం), ‘ఆహ నా పెళ్లియంట’ (మాయాబజార్), ‘సన్నగ వీచే చల్లగాలికి (గుండమ్మ కథ), ‘కలనైనా నీవలపే’ (శాంతినివాసం). చివరగా మహాలక్ష్మి పాడిన శభాష్ రాముడు చిత్రంలో ‘రేయిమించెనోయ్ రాజా’ పాటతో పాటల కార్యక్రమం ముగిసింది. ఈ పాటల మధ్యలో కాలనీ వాసి కుమారి శ్రియ కూచిపూడి నాట్యంతో అలరించింది. ఆ వెంటనే రమణ గారికి కొండలరావు స్మారక పురస్కారం అందజేయడం జరిగింది. ముఖ్య అతిథులు నరహరి మాస్టర్, మూర్తి చందర్ లు రమణగారిని పూలమాలాంకృతులను గావించి కాశ్మీరు శాలువతో సత్కరించి ఇరవై వేల రూపాయల నగదు పురస్కారం అందజేశారు. నరహరి గారు ఆరోజుల్లో పాటల రికార్డింగు జరిపిన విధానాన్ని చక్కగా వివరించారు. మూర్తిచందర్ గారు సభను ఆశ్చర్యపరుస్తూ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి తనయుడు ఘంటసాల శంకర్ గారిని వేదికమీదకు తీసుకొనివచ్చారు. వెంటనే సభికులు అందరూలేచి శంకర్ గారికి వందనాలు సమర్పించారు. “నాన గారి శతజయంతి జరగడం ఒక ఎత్తైతే, నానగారు పాడిన అద్భుతమైన పాటలను వినే అదృష్టం నాకు ఈరోజు ఇక్కడ దక్కింది. రమణ గారు పాడుతుంటే నానగారు పాడిన భావనే నాకు కలిగింది‘’ అంటూ సంతోషం వ్యక్తపర్చారు. కలగ కృష్ణమోహన్ గారు, కార్టూనిస్ట్ సరసి గారు ముఖ్య అతిథులకు సత్కార కార్యక్రమం నిర్వహించారు. విజయవాడ నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన విశ్రాంత ఆంధ్రరాష్ట్ర ఉన్నతాధికారి ఎం. రాజుగారు పునర్జన్మ చిత్రంలో ఘంటసాల పాడిన ‘ఎవరివో నీ వెవరివో’ పాటను ఆలపించి అలరించారు. కార్యక్రమాన్ని సజావుగా శ్రీ సయ్యద్ నిసార్ అహమద్, పోలిశెట్టి నాగేశ్వరరావు, పి. రాజేంద్రకుమార్, చల్లా సుబ్బారాయుడు గార్లు నిర్వహించగా, దూరదర్శన్ విశ్రాంత ప్రయోక్త శ్రీమతి విజయ దుర్గ, సినీ హిస్టోరియన్ శ్రీమతి లక్ష్మి ప్రియగార్లు గాయని మహాలక్ష్మి ని సత్కరించారు. వేడివేడి విందు భోజనంతో కార్యక్రమం ముగిసింది. పోలిశెట్టి నాగేశ్వరరావు గారు వందన సమర్పణ చేశారు. శుభం భూయాత్.

ఆచారం షణ్ముఖాచారి
అధ్యక్షులు, సా.సం.స

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link
Powered by Social Snap