
శ్రీ రావి కొండలరావు స్మారక నగదు (రూ.25,000) పురస్కారం అందుకున్న రంగస్థల నటుడు రాము
రంగస్థల పౌరాణిక నాటక పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి, దాదాపు నాలుగు వేలకు పైగా పౌరాణిక నాటకాలలో విశ్వామిత్ర, దుర్యోధన, అర్జున, భీమ, బలరామ, సాత్యకి, వీరబాహు, కాలకౌశిక వంటి పాత్రల్లో తనదైన ముద్ర వేసి రాణించిన నటులు శ్రీ సత్యవరపు రాము గారిని సాహిత్య సంగీత సమాఖ్య, హైదరాబాద్ వారు రూ. 25,000 నగదు పురస్కారంతో గౌరవించి సన్మానించారు. ప్రముఖ చలనచిత్ర దర్శకులు శ్రీ రేలంగి నరసింహారావు గారు ఈ పురస్కారాన్ని అందజేశారు. ప్రముఖ నటులు శ్రీ రావి కొండలరావు గారి సంస్మరణార్థం 2021 లో ఈ స్మారక నగదు పురస్కారాన్ని సాహిత్య సంగీత సమాఖ్య సంస్థ హైదరాబాద్ లో ప్రవేశపెట్టింది. శ్రీ కొండల రావు గారి 92 వ జయంతి సందర్భంగా 2024 సంవత్సరానికి ఈ పురస్కారాన్ని రంగస్థల నటుడు, విజయనగరం జిల్లా, రాజాం మండలం, ఆగూరు గ్రామానికి చెందిన శ్రీ సత్యవరపు రాముగారికి హైదరాబాదులో అందజేశారు. ప్రాథమిక విద్యకు శ్రీరాము గారు దూరమైనా, రంగస్థల నటన వైపు మొగ్గు చూపారు. ఉత్తర ఆంధ్ర దేశంలో ప్రదర్శించే అసంఖ్యాక పౌరాణిక నాటకాలకు క్రమంతప్పక హాజరవుతూ, సంస్కృత సమాసాలతో నిండివుండే పౌరాణిక పద్యాలు, సంభాషణలు, స్వరాలను వినికిడిజ్ఞానంతో గుర్తుపెట్టుకుంటూ, అలవోకగా వాటిని ఉచ్చరించడం అభ్యాసం చేసి దాదాపు నాలుగు వేల నాటకాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించి నాటక అభిమానుల ప్రశంసలు అందుకున్నారు. ఇది అంత సులువైన విషయం కాదు. కానీ శ్రీ రాము గారి విషయంలో ఈ అసాధ్యమైన విషయం సుసాధ్యమైంది.
శ్రీ రాము గారు వృత్తిరీత్యా వ్యవసాయ కార్మికులు. సాగు చేసేందుకు పొలం లేకున్నా చిన్నకారు కౌలు రైతుగా జీవనం సాగించడం…. తీరిక సమయాలలో నాటక రంగ సేవ చేయడం వంటి రెండు విషయాలు శ్రీ రాము గారిని సాహిత్య సంగీత సమాఖ్య ప్రవేశపెట్టిన శ్రీ రావి కొండలరావు స్మారక నగదు పురస్కారం స్వీకరించడానికి అర్హతలుగా నిలిచి సత్కారానికి వెలుగు బాటలు పరిచాయి. జాతీయ స్థాయి రంగస్థల నటులు శ్రీ చప్పా అప్పారావు గారి శిష్యరికంలో నటనకు మెరుగులు దిద్దుకున్న శ్రీ రాము గారు పద్మశ్రీ గోపాలరావు, డి.వి. సుబ్బారావు వంటి మేటి నటులకు దీటుగా హావభావాలతో ప్రేక్షకులను సమ్మోహన పరిచేవారు. తను నమ్ముకున్న భూమి తల్లిని మరువకుండా వ్యవసాయ పంటలు పండించటానికి తన పూర్తి సమయాన్ని కేటాయిస్తూ, పంటల విరామ సమయాలను నాటకాలకోసం వినియోగిస్తూ రెండంచల జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. తన యాభై ఐదేళ్ల జీవితంలో దాదాపు ముప్పై ఐదేళ్లుగా నాటక రంగానికి సేవ చేస్తున్నారు. అర్జునుడు పాత్రకు శ్రీ రాము గారికి పరిషత్ నాటకాలలో ఉత్తమ నటుడు బహుమతి లభించింది. శ్రీ రాము గారికి భార్య, ముగ్గురు కుమార్తెలు వున్నారు. ఈ పురస్కారం తన గురుతర బాధ్యతలను పెంచింది అని శ్రీ రాము గారు ఈ సందర్భంగా తెలియజేశారు.
–ఆచారం షణ్ముఖాచారి

Ravi Kondalarao Memorial Award presented to Actor Ramu garu
రంగస్థలంపై రాము గారి ప్రతిభాపాటవాలను, పద్యనాటకాంపై ఆయన దీక్షాదక్షతలనే కాకుండా
ఆయన ప్రస్తుత ఆర్దిక స్థితిగతులను వివరిస్తూ 64.కళలు. కం వెలుగులోనికి తెచ్చారు! కళాసాగర్
గారి వివరణ ఆయన పేద కళాకారులను ఆదుకొనవలెననెడి వారి సంకల్పం ఈ నగదు పురస్కారం ద్వారా సఫలీకృతం అయింది!!!
రాము గారికి శుభాకాంక్షలు!
కళాసాగర్ గారికి ధన్యవాదాలు!
సాహతీ సంగీత సమాఖ్య, హైదరాబాద్ వారికి
అభినందనలు!!
రాము గారికి ఆభినందనలు… 👍👍👍👍