నాన్నకు అంకితం… రావి కొండలరావు

రావి కొండలరావు  గారి పేరిట ప్రత్యేక తపాలా స్టాంప్ విడుదల

ఫిబ్రవరి 25, హైదరాబాద్ , సాయంత్రం నాలుగు గంటలకు జి‌.వి.ఎస్. రాజు గారు మైకు పుచ్చుకొని వేదిక మీదకు అతిథేయి శ్రీమతి సంధ్యారాణి గారిని తొలుత వేదికమీదకు ఆహ్వానించగా, నిర్వాహకవర్గ సభ్యురాలు పుష్పగుచ్చాన్ని అందజేసింది. తరవాత వరసగా అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శిగా సేవలందించి పదవీవిరమణ చేసిన శ్రీ మోహన్ కందా (ఐ‌ఏ‌ఎస్), తెలంగాణ రాష్ట్ర గౌరవ సలహాదారు శ్రీ కె.వి. రమణాచారి (ఐ‌ఏ‌ఎస్) గార్లను రాజుగారు వేదిక మీదకు ఆహ్వానించి పుష్పగుచ్చాలతో సత్కరింపజేశారు. చివరగా శ్రీ రావి కొండలరావు గారిని వేదిక మీదకు ఆసీనులు గావించి పూలమాల, సిల్కు శాలువాతో ఆహ్వానం పలికారు. స్వాగత వచనాలు శ్రీ రాజుగారు చెబుతూ ఈ సమావేశపు ముఖ్యోద్దేశాన్ని వివరించారు. సినిమా రంగంలో సుమారు యాభై సంవత్సరాలు తన నటనా కౌశలంతో చేరగిపోని ముద్ర వేయించుకున్న కొండలరావు గారి గురించి చెబుతూ… ఎప్పటినుంచో కొండలరావు గారి పేరిట ఒక ప్రత్యేక తపాలా కవర్ విడుదల చేయాలని రాజు గారు చొరవతీసుకొని పోస్ట్ మాస్టర్ జనరల్ గారికి కొండలరావు గారి విశిష్టతను వివరించి చెప్పగా, అందుకు వారు సానుకూలంగా స్పందించారని అందుకు పోస్ట్ మాస్టర్ జనరల్ గారికి రాజు గారు కృతజ్ఞతలు తెలిపారు. సంధ్యారాణి గారు మాట్లాడుతూ ‘’కొండలరావు గారి పేరిట ప్రత్యేక తపాలా చంద్రిక విడుదల చేయడం నాకు యెంతో సంతోషంగా వుంది. ప్రతిభాశాలులైన మహనీయులను, కళలను, చారిత్రాత్మక ఘట్టాలను గౌరవిస్తూ భావితరాలకు ఉపయోగపడేలా పోస్టల్ కవర్లు, స్టాంపులు విడుదల చేయడం తపాలాశాఖ యెన్నో యేళ్లుగా చేస్తున్న ఒకరకమైన సేవ. అందులో భాగంగా ఒక గొప్ప నాటక రచయిత, సహజ నటుడు, అవిశ్రాంత పాత్రికేయుడు, దర్శకుడు గా పేరుప్రతిష్టలు సంపాదించుకున్న కొండలరావు గారి పేరిట ప్రత్యేక తపాలా చంద్రికను రూపొందింపజేసి, ఈరోజు ఇందరు గొప్ప వ్యక్తుల సమక్షంలో విడుదలచేయడం నాకు గర్వకారణం. కొండలరావు గారిది మా పోస్టల్ కుటుంబమే. వారి తండ్రి చిదంబరం గారు స్వాతంత్ర్యసిద్ధి  సాధించక మునుపే మా తపాలా శాఖలో వివిధ హోదాలలో పనిచేసి 1940 లో పోస్టల్ సూపరింటెండెంట్ గా పదవీ విరమణ చేశారు. వారి సంతానంలో మరికొందరు మా తపాలాశాఖలో ఇంకా పనిచేస్తూ వుండడం మా అదృష్టం. కొండలరావు గారు సంపూర్ణ ఆరోగ్యంతో నూరు సంవత్సరాలు జీవించి ఈ కళారంగానికి ఇంకా యెన్నో సేవలు అందించాలని కోరుకుంటున్నాను’’ అని అభిలషించారు.

తరవాత అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య కార్యదర్శిగా మహామహులైన ముఖ్యమంత్రుల వద్ద పనిచేసి ఆ పదవీకే వన్నె తెచ్చిన విశ్రాంత ఐ‌ఏ‌ఎస్ అధికారి మోహన్ కందా గారు మాట్లాడుతూ ‘’కొండలరావు గారితో నా పరిచయం ఇప్పటిది కాదు. నేను కూడా సినిమాలలో చిన్నా చితకా వేషాలు వేశాను. రచనా సంస్కృతి నాకు కూడా వుండడంతో మా సాన్నిహిత్యం బాగా పెరిగింది. కొండలరావు గారి సినిమాలు నేను చాలా చూశాను. విజయచిత్ర వంటి పత్రికా నిర్వాహకుడుగా బిజీగా వుంటూనే, క్యారక్టర్ నటుడుగా నలభై ఐదేళ్లు చిత్రరంగంలో ఆరు వందలకు పైగా సినిమాలలో నటించి మెప్పించడం గొప్పవిషయం. పైగా దంపతులిద్దరూ చాలా సినిమాలలో కలిసి నటించడం చిన్న విషయం కాదు. మామూలుగా అరవై యేళ్ళు రాగానే రిటైర్మెంట్ తీసుకోకుండా ఇంకా పత్రికారంగ సేవను, సినిమా నటనను కొనసాగించడం అందరికీ లభించే అదృష్టం కాదు. అందుకు కొండలరావు గారికి పూర్తి అర్హత వుంది. ఇటీవలే మా వైద్య వృత్తిలో వుండే స్నేహితులకోసం కొండలరావు గారి తో మా గృహసముదాయంలో ఒక సమావేశం యేర్పాటు చేశాను. ఆరోజు సమావేశంలో రావుగారు అందరినీ కటుపుబ్బగా నవ్వించి  వారికి ఆటవిడుపు కల్పించారు. రోజూ రోగుల ఆరోగ్యం కాపాడేందుకు ఆ వైద్యులు రాత్రనకా పగలనాకా శ్రమించి పనిచేస్తుంటే కొండలరావు గారు వంటి పెద్దలు తన వినోదంతో అలరించడం నిజంగా వారికి ఆటవిడుపే కదా! నేను ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన సంధ్యారాణి గారికి కృతజ్ఞుడను’ అంటూ ముగించారు. ఇక తనదైన గంభీర కంఠంతో మెప్పించే తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, విశ్రాంత ఐ‌ఏ‌ఎస్ అధికారి కె.వి. రమణాచారి గారు మాట్లాడుతూ ‘’రావి కొండలరావు గారు నాకు గురుతుల్యులు. కాలేజీలో చదువుకునేటప్పుడు వారు రచించిన ‘కుక్కపిల్ల దొరికింది’ నాటకంలో నేను కూడా నటించాను. ఆయన రచనా శైలి విభిన్నంగాను, సరళంగాను వుంటుంది. నాతో ఎప్పుడూ వారు టచ్ లోనే వుంటారు. వారంటే నాకు చాలా గౌరవం. ఈరోజు ప్రత్యేక తపాలా చంద్రిక విడుదల కార్యక్రమంలో నేను పాల్గొండం నా అదృష్టం. గతంలో స్మారక తపాలా బిళ్ళలు, ఫస్ట్ డే కవర్లు దివంగతులైన మహనీయులకు ఇచ్చేవారు. కానీ ఆ సత్కార భాగ్యం పంచుకునే, ఆనందించే అవకాశం వారికి దక్కలేదు. నిష్ణాతులైన వారిని ఇటువంటి గౌరవంతో సత్కరించే కార్యక్రమాలు వారు జీవించి వున్నప్పుడు నిర్వహిస్తే, ఆ గౌరవం స్వీకరించేటప్పుడు  గ్రహీతల ఆనందోత్సాహాలు వేరుగా వుంటాయి. ఇప్పుడు చూడండి ఈ కొండలరావు మహనీయుని ముఖంలో యెంతటి ఆనందం, ఉద్వేగం కనపడుతూ వుందో!. సంద్యారాణి గారు ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం ముదావహం అంటూ ముగించారు. తరవాత ప్రత్యేక తపాలా చంద్రికను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమ రూపశిల్పి దంపతులు శ్రీరాజు గారు, వారి సతీమణి  వేదికమీద ఆసీనులైన అతిథులందరికీ సిల్కు శాలువాలు, జ్ణాపికలు, ఇచ్చి సత్కరించారు. ఈ సందర్భంగా కవర్ డిజైన్ రూపొందించడంలో సహకరించిన ప్రముఖ చిత్రకారులు, అక్షరశిల్పి శ్రీ పెమ్మరాజు రవి కిషోర్ గారిని వేదికమీదకు ఆహ్వానించి పుష్పాలంకృతులను చేసి, సిల్కు శాలువతో సత్కరించారు.

తరవాత శ్రీ రావి కొండలరావు గారు స్పందించారు. ‘’ఈ సమావేశంలో యెందరో మహానుభావులు కొలువుతీరి వున్నారు. వారి సమక్షంలో నా స్పందన తెలిపేందుకు మాటలు రావడంలేదు. గతంలో నేను ఎన్నో పురస్కారాలు, నంది బహుమతులు, బిరుదులు అందుకున్నాను. అయినా వాటిని నేను యెప్పుడూ, ఎక్కడా చెప్పుకోలేదు. అయితే ఈరోజు నా పేరిట తపాలాశాఖ వారు ప్రత్యేక చంద్రికను ఆవిష్కరించడంతో నాజన్మ చరితార్ధకమైనదని ప్రగాఢంగా నమ్ముతున్నాను. కారణం…. ఈ పురస్కారం కేవలం నాకు మాత్రమే పరిమితమైనది కాలేదు. ‘రావి’ కుటుంబ సభ్యుల మకుటంలో ఇది ఒక అరుదైన తురుపు ముక్క, కలికితురాయి. నా తండ్రి జీవితం తపాలా శాఖతో ముడిపడి వుంది. ఆయనకు ఉద్యోగమంటే దైవారాధనతో సమానం. అందుకే కామోసు, వారు ఎక్కడ పనిచేసినా మంచి గౌరవాన్ని అందుకున్నారు. ముఖ్యంగా స్వాతంత్ర్యం రానిరోజుల్లో వారు తపాలా సంస్థకు పనిచేసి మన్నన పొందారు. 1932లో మా నాన్నగారు సామర్లకోటలో పోస్టు మాస్టరుగా పనిచేస్తున్నప్పుడు నేను పుట్టాను. ఉద్యోగరీత్యా అనేక పట్టణాలల్లో తిరిగి శ్రీకాకుళంలో మా నానగారు పోస్టల్ సూపరింటెండెంటుగా పదవీ విరమణ చేశారు. ఆ వూరిలోనే మేము స్థిరపడ్డాము.  మద్రాసు చేరి పత్రికారంగంలో వివిధ పదవులు చేపట్టాను. మిత్రులు కొడవటిగంటి కుటుంబరావు, ముళ్ళపూడి వెంకటరమణ, డి.వి. నరసరాజు, పొన్నలూరి బ్రదర్స్, సముద్రాల రాఘవాచార్యులు, కమలాకర కామేశ్వరరావు, బి.ఎన్.రెడ్డి, బి.నాగిరెడ్డి, చక్రపాణి, ఆరుద్ర వంటి మహనీయుల సహకారంతో అటు పత్రికారంగంలో, ఇటు నాటక, సినీ రంగంలో కూడా అరుదైన గౌరవాన్ని పొందగలిగాను. ఎన్.టి. రామారావు గారు తను నిర్మించిన 8 సినిమాలలో నన్ను పిలిచి వేషాలు ఇవ్వడం నా క్రమశిక్షణకు నిదర్శనం. నాకు వున్నంతలో తృప్తి చెందడం అలవాటు. భేషజాలకు, విమర్శలకు దూరంగా వుండడం నానైజం. నా భార్య దివంగత రాధాకుమారితో కలిసి 127 సినిమాలలో భార్యాభర్తలుగా నటించి ప్రపంచ రికార్డును సాధించాం. అది ఒక తృప్తి. గురజాడ వారి కన్యాశుల్కం నాటకాన్ని యధాతధంగా, ఒక్క సంభాషణ కూడా మార్చకుండా బుల్లితెరకు ధారావాహికం నిర్మించడం, దానికి 9 నంది బహుమతులను పొందగలగడం నా కృషికి దక్కిన ప్రతిఫలం. అలాగే నా నిజాయితీని, వ్యక్తిత్వాన్ని నమ్మి విజయా సంస్థ అధిపతులు ‘బృందావనం’, ‘భైరవద్వీపం’ వంటి సినిమాల నిర్మాణ బాధ్యతలు నాకు అప్పజెప్పడం నాకు సంతృప్తినిచ్చిన అంశం. అలాగే విమర్శలకు, గాసిప్ లకు తావులేని విధంగా 26 సంవత్సరాలు ‘విజయచిత్ర’ సినీ పత్రికకు సారధ్యం వహించడం కూడా నాకు తృప్తిని ఇచ్చే విషయం. బాపు-రమణ, ఆరుద్ర, అక్కినేని, ఎన్టీఆర్ లతో నా అనుబంధం అనిర్వచనీయం. నా పేరిట ప్రత్యేక తపాలా చంద్రికను ముద్రించబోతున్నామని ప్రముఖ ధ్వన్యనుకరణ నిపుణులు శ్రీ జి.వి.ఎస్. రాజు గారు చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాను. ఆ ఆలోచనను కార్యరూపంలోకి తీసుకొని వచ్చిన సంధ్యారాణి గారికి నేను ఋణపడి వుంటాను. ఈ తపాలా చంద్రికను మా తండ్రి చిదంబరం గారికి అంకితమిస్తున్నాను. ఈ కార్యక్రమానికి సహకరించిన మిత్రులు, అతిథులు, పాత్రికేయులు అందరికీ పేరుపేరునా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను’’ అంటూ ముగించారు. తరవాత సత్కార కార్యక్రమాన్ని, జ్ణాపికల బహూకరణను, ప్రత్యేక తపాలా చంద్రిక ఆల్బమ్ ల ఆవిష్కరణ అంశాలను నిర్వాహకులు రాజుగారు సమర్ధవంతగా నిర్వహించి వందన సమర్పణ కావించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap