సంగీత సాహిత్య చిత్రకళాపూర్ణచంద్రుడు, విశ్వకవీంద్రుడు

విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో పరిచయం చేయాలన్న సంకల్పంతో 64కళలు.కాం సమర్పిస్తున్న “ధృవతారలు” రెగ్యులర్ ఫీచర్లో ఆయా మహానుబావుల జన్మదిన సందర్భాలలో వారిని జ్ఞాపకం చేసుకుందాం.

ధృవతారలు – 31

భారతీయ జనగణానికి జనగణమన… జాతీయ గీతం ఇచ్చిన భారత జాతీయ గీతపిత మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్. వీరి గీతాంజలికి ప్రపంచం యావత్తు అంజలి ఘటించి ఆసియా ఖండంలోనే అఖండమైన రచనగా కీర్తిస్తూ బ్రహ్మరథం పట్టి – నోబుల్ బహుమతి ఇచ్చింది. ఆసియా ఖండంలోనే నోబుల్ బహుమతి పొందిన తొలి భారతీయుడు రవీంద్రుడన్న ఖ్యాతిని ఇచ్చింది. చిన్ననాటి నుండి ప్రకృతిని ఆరాధించే ప్రవృత్తి కలిగిన రవీంద్రుడు బడి నాలుగు గోడల మధ్య ఇరుక్కుపోయే చదువుల పట్ల విరక్తుడై, ఆరుబయట పచ్చని ప్రకృతి మధ్య చదువులు కొనసాగించే పద్ధతిపట్ల ఆసక్తుడై విశ్వభారతి విశ్వవిద్యాలయం అనే శాంతినికేతనాన్ని స్థాపించి, ఈ విద్యావిధానానికి ప్రపంచ ప్రసిద్ధిని ఆపాదించి పెట్టిన గురుదేవుడు, భోల్ పూర్ బ్రహ్మచర్యాశ్రమం స్థాపించి భారతీయ తపోజీవనానికి అనుగుణంగా దాన్ని నడిపించాడు. అభిలాష్, కభీకహాని వంటి కవితలను రచించాడు. రాజా ఓ రాణి, విసర్జన్ వంటి నాటకాలను రచించాడు. సోనార్ తరి అంటూ ఏడు సంపుటాలలో తన రచనలను సాగించాడు. బంగదర్శన్ అనే పత్రికకు సంపాదకత్వం వహించాడు. బెంగాల్ విభజన సమయంలో తన రచనలు, ఉపన్యాసాల ద్వారా నిరసనను తెలియజేస్తూ ఆంగ్లేయులపై ఆగ్రహించాడు. ఆనాటి ఆంగ్లేయులు జరిపిన జలియన్ వాలాబాగ్ సామూహిక హత్యాకాండకు నిరసన తెలియజేస్తూ తన “నైట్” బిరుదాన్ని త్యజించాడు. చిత్రకారుడు, సంగీతకారుడు, రచయిత, దార్శనికుడు, బహుముఖ ప్రజ్ఞావంతుడు. గాంధేయవాది విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ నేటికీ మన ధృవతార.

(రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మదినం 07 మే 1861)

 

SA: