కవిత్రయంలో చివరివాడైన ఎర్రన మహాకవి రచించిన నృసింహపురాణం ఓ అద్భుతమైన ప్రబంధం. బ్రహ్మాండ, విష్ణు పురాణాల్లో ఉన్న ప్రహ్లాదకథను తీసుకుని తనదైన రచనానైపుణ్యంతో విస్తరించి అందమైన ప్రబంధంగా తీర్చిదిద్దాడు ఎర్రన. ఈ ప్రబంధంలో కథ హిరణ్యకశిపుడి జననంతో ప్రారంభమై హిరణ్యకశిపుడి రాక్షస ప్రవర్తన, ప్రహ్లాదుడి జననం, విద్యాభ్యాసం, అతడి హరిభక్తి, నరసింహావతార ఆవిర్భావం, హిరణ్యకశిపుని వధ ప్రధానాంశాలుగా సాగుతూ అహోబల త్ర వర్ణనతో ముగుస్తుంది. ప్రతిపద్యంలో అందమైన పొందిక, చక్కటి కథాగమనం, రసపోషణ పాఠకులను ఇట్టే ఆకట్టుకుంటాయి. సహజ సుందరశైలితో ఎర్రన రాసిన ఈ పద్యప్రబంధానికి తేట తెలుగులో వ్యాఖ్యానం రచించి నేటి తెలుగు ప్రజలకు మరింత చేరువ చేశారు రచయిత రేమిల్ల వేంకట రామకృష్ణశాస్త్రి. మూల ప్రబంధంలో ఉన్న పద్యాలకు ప్రతిపదార్థంతో పాటు భావం ఇచ్చారు. అలాగే, సందర్భోచితంగా వచ్చే విశేషాలను కూడా వ్యాఖ్యాన రచయిత సరళమైన భాషలో రచించారు.
ఎర్రన హృదయాన్ని ఆవిష్కరిస్తూ సందంర్భానికి తగినట్లు వ్యాఖ్యాత చేసిన విశ్లేషణ తెలుగు కవిత్వపు సొబగుల్ని పాఠకులు మరింతగా ఆస్వాదించేలా చేస్తుంది. తేలికగా వ్యవహారభాషలో వ్యాఖ్యానం రాయటం వల్ల నేటితరం ప్రయాసలేకుండానే ఈ ప్రబంధాన్ని చదువుకోవచ్చు. మూలపద్యాలు కూడా ఇవ్వటం వల్ల పద్యప్రియులకూ ఆనందం కలుగుతుంది. మొత్తంగా సనాతన సాహిత్యాన్ని నేటితరం అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దిన రచయిత తెలుగుజాతికి మహాపకారం చేశారు. మంచి పుస్తకాన్ని పాఠకలోకానికి అందించిన శ్రీరాఘవేంద్ర పబ్లిషర్స్ అభినందనీయులు.
-డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, (8897 547 548)