నీళ్ల మీద ‘రంగోలి’ రేవతి స్పెషల్

నీళ్ల మీద రంగవల్లులు దిద్దుతూ వినూత్నమైన కళకు శ్రీకారం చుట్టింది ఆంధ్రప్రదేశ్ లోని కలిదిండి కి చెందిన చెందిన సమ్మెట రేవతి. ఆకర్షణీయమైన రంగుల ముగ్గులతో ఇప్పటివరకూ వందకు పైగా దేవతామూర్తుల రూపాలను నీళ్ల మీద సృష్టించారామె. చిత్రకళలో ప్రవేశం వున్న రేవతి తన వేస్తున్న బొమ్మలను యూట్యూబ్లో పోస్ట్ చేద్దామని ‘Revathi Artist‘ పేరుతో ఛానల్ ప్రారంభించారు. ఈ కళ పట్ల ఏర్పడిన మక్కువ గురించీ, యూట్యూబ్-ఇస్టాగ్రాం ద్వారా సోషల్ మీడియాలో పొందుతున్న ఆదరణ గురించీ తెలుసుకుందాం…

చిన్నప్పటి నుంచి బొమ్మలుగీసే రేవతి ముగ్గులు కూడా బాగావేసేది. చిన్నప్పుడు వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న రామాలయం ముందు పండుగలాంటి ప్రత్యేకమైన రోజుల్లో రంగులతో రంగవల్లులు దిద్దుతూ ఉండేది. అలా ముగ్గు వేసిన తర్వాత చేతులు శుభ్రం చేసుకోవడం కోసం నీళ్లు పక్కనే పెట్టుకుంటూ ఉందేది. అయితే ఒకసారి ముగ్గు వేస్తున్న సమయంలో తన చేతిలో నుంచి రంగు ముగ్గు జారి నీళ్లలో పడిపోయింది. అది నీళ్ల మీద తేలుతూ ఉండడంతో నీళ్ల మీద రంగవల్లులు దిద్దితే ఎలా ఉంటుంది? అనే ఆలోచన వచ్చింది రేవతి కి. అలా 2024 ఫిబ్రవరిలో నీళ్ల మీద ముగ్గులేసే ఫ్లోటింగ్ బీజాలు పడ్డాయి. అంతకు ముందు ఆరేళ్ల నుంచీ ఆర్ట్ పీడియోలను యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నప్పుటికీ శివ రాత్రి నాడు, నీళ్ల మీద వేసిన శివుడి రంగోలితో మంచి ఆదరణ వచ్చింది. పలువురు ఫలానా దేవుడి బొమ్మ వేయండి అంటూ సోషల్ మీడియా ద్వారా ఆమెను అడుగుతుంటారు. తాజాగా కొమురవెల్లి మల్లన్న రంగోలీ వేయమని ఎంతో మంది అమెను అడిగారు. కానీ, ఆంధ్రలో పుట్టి పెరిగిన రేవతి కి తెలంగాణా కొమురవెల్లి మల్లన్న గురించిన అవగాహన లేదు. దాంతో గూగుల్ లో వెతికి మల్లన్న స్వామి రూపురేఖలను గమనించి, ఆ తర్వాత రంగోలికి వేసింది. అలాగే అభిమానుల కోరిక మేరకు స్థానిక దేవతలు గ్రామ దేవల రంగోలీలు కూడా వేస్తుంది. ఇలా ఇప్పటివరకూ వందకు పైగా దేవతా రంగోలీలు వేసింది.

భక్తిశ్రద్ధలతోనే…
నీళ్ల మీద ముగ్గు వేయడం ఒకింత కష్టమేనని చెప్పాలి. ముగ్గు బరువుగా ఉంటుంది కాబట్టి చటుక్కునే పోవేస్తే నీళ్లలో మునిగిపోతుంది. కాబట్టి నీళ్ల మీద తేలేలా ముగ్గును నెమ్మదిగా పోయాలి. బొమ్మ వేసే ముందు తనెలాంటి సాదనా చేయనని, వేయబోయే దేవతా చిత్రాన్ని ధరించిన నగలను పది నిమిషాల పాటు గమనించి నీళ్ల మీద రంగోలీ మొదలు పెట్టేస్తూ ఉంటానంది. ముగ్గు వేసే సమయంలో ఏకాగ్రత దెబ్బతినకుండా ఉండడం కోసం భక్తి పాటలు వింటుంది. దేవునికి ఉపయోగించే సామాగ్రిని కూడా దైవసమానంగానే భావించాలని సనాతన ధర్మం చెప్తుంది. కాబట్టి రంగోలీ కోసం నీళ్లు నింపే స్టీలు పళ్లెం, ముగ్గు భరిణీలను పూజా సామానుతో సమానంగా భావిస్తానంటుంది. రంగోలీ పూర్తి అయిపోయిన తర్వాత ఆ నీళ్లను ఎవరూ తొక్కకుండా పార్కులో ఓ మూలన పోరబోస్తుంది. అడుగున వేడుకున్న ఇసుకను కూడా దగ్గర్లోని కాల్వల్లో కలిపేస్తుంది. అలాగే రంగోలీకి ముందూ, తర్వాత సదరు దేవతలకు నమస్కారం చేసుకుంటుంది.

రెండు లక్షల మంది సబ్ స్క్రైబర్లు..!
అమ్మవార్ల బొమ్మలైనా, ఇతర దేవతల బొమ్మలైనా బొమ్మ మొత్తం పూర్తయిన తర్వాత చివర్లో బొట్లు పెట్టి ముగించం ఈమెకు అలవాటు. అలా ఒకసారి నాలుగున్నర గంటల పాటు కష్టపడి నీళ్ల మీద వేంకటేశ్వర స్వామి వారి రంగోలీ వేసింది, కానీ చివర్లో నామం పెట్టి సమయంలో, కాస్త ఎక్కువ ముగ్గు జారి పడిపోవడంతో ఆ ప్రదేశం నుంచి నీళ్ళు బయటకు వచ్చేయడం మొదలుపెట్టాయి. ఎంత సరిదిద్దే ప్రయత్నం చేసినా వీలు పడలేదు. దాంతో తనుకు ఏడుపొచ్చేసింది. అయినా వీడియోలో ఎడిట్ చేసి యూట్యూబ్లో పోస్ట్ చేసుకోవచ్చు. కానీ అందుకు తనకు మనస్కరించలేదు. మళ్లీ ఆ నీళ్ళను ఒంపేసి, మరొక నాలుగున్నర గంటల పాటు కష్టపడి” అదే బొమ్మను సృష్టించింది. ఆ బొమ్మతో యూట్యూబ్లో లక్ష మంది సబ్ స్క్రిబర్స్ పూర్తవడం ఎంతో సంతోషాన్ని కలిగించింది అంటుంది. ప్రస్తుతం తనకు రెండు లక్షల మంది యూట్యూబ్/ ఇస్టాగ్రాం లో 30 వేల మంది సబ్ స్క్రిబర్స్ ఉన్నారు. పేవర్ లేదా కాన్వాస్ మీద వేసే బొమ్మలు శాశ్వతంగా ఉండిపోతాయి. కాని నీళ్ళ మీద వేసే రంగోలెలను అలా ఉంచుకోలేం. మరొక రంగోలీ వేయాలంటే, ఆ నీళ్లను ఒలిపేసి తాజా నీళ్లను నింపుకోక తప్పదు. ఇదెంతో బాధాకరమైన విషయం అయితే ఒకటి కావాలంటే మరొకటి వదులుకోక తప్పుడు కాబట్టి మరొక కొత్త రంగోలీ కోసం పాత రంగోలీని తొలగిస్తున్నట్లు నాకు నేను సర్దిచెప్పుకుంటూ ఉంటాను అంటారు రేవతి. “నిజానికి రంగోలీని తొలగించేటప్పుడు బాధ కలగకుండా ఉంచడం కోసం. రంగోలీని కలిపే దృశ్యాన్ని వీడియో తీసి, దాన్ని రీవర్స్ చేసి యూట్యూబ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను” అంటుంది.

కూచిపూడి నాట్యం లో ప్రవేశం వున్న రేవతి మెట్టినిల్లు హైదరాబాద్. నటిగా కూడా పలు సీరియల్స్ లోనూ, సినిమాల్లోనూ నటిస్తున్నారు.

రేవతి యూట్యూబ్ వీడియోలు ఇక్కడ చూడండి…
https://www.youtube.com/watch?v=5zF7P7OvDh4&t=21s
https://www.youtube.com/watch?v=SQar4FEuyhM

–కళాసాగర్

Share via
Copy link
Powered by Social Snap