కపూర్ వంశ రుషి… రిషి కపూర్

90 వ దశకం చివరిలో రిషికపూర్ హీరోగా నటించిన సినిమాలు రాణించలేదు. దానితో రిషి తన పంధా మార్చుకొని సపోర్టింగ్ పాత్రలకు పరిమితమయ్యాడు. పైగా అతని వయసు యాభై ఏళ్ళకు చేరడం కూడా ఒక ప్రతికూల అంశంగా మారింది. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన “ఏ హై జల్వా” (2000) సినిమాలో రిషికపూర్ సల్మాన్ ఖాన్ కు తండ్రిగా నటించాడు. సైఫ్ ఆలి ఖాన్ కు ఉత్తమ నటుడిగా జాతీయ బహుమతిని అందించిన ‘హమ్ తుమ్’ (2004) సినిమాలో అతని తండ్రిగా రిషి రాణించాడు. తరవాత “ఫన్నా” లో జుల్ఫీకర్ ఆలి బేగ్ గా, నమస్తే లండన్ లో మన్మోహన్ మల్హోత్రా గా, లవ్ ఆజ్ కల్ లో సైఫ్ ఆలి తండ్రి వీర్ సింగ్ గా, పాటియాలా హౌస్ లో బావూజీ గా మంచి పాత్రలు పోషించాడు. అలాగే బ్రిటీష్ ఫిలిం “సాంబార్ సల్సా”, “డోంట్ స్టాప్ డ్రీమింగ్” చిత్రాలలో కూడా నటించాడు. చాలా ఏళ్ళ తరవాత భార్య నీతూ సింగ్ తో “దో దూని చార్” లో దంపతులుగా నటించారు. రిషికపూర్ నీతూసింగ్ ని జనవరి 20, 1980 న పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ కలిసి జంటగా 15 సినిమాల్లో నటించారు. యువ హీరో రణబీర్ కపూర్ , రిద్ధిమా వీరి సంతానం. 2009లో రష్యన్ ప్రభుత్వం రిషికపూర్ సినీపరిశ్రమకు చేసిన సేవలకు గుర్తింపుగా ఘనంగా సన్మానించింది. నీతూసింగ్-రిషికపూర్లను ఉత్తమ జోడీగా నిర్ణయించి జీ సినీ అవార్డుల సంస్థ ఘనంగా సత్కరించింది. స్క్రీన్, ఫిలింఫేర్ సంస్థలు రిషికపూర్ కు జీవిత సాఫల్య పురస్కారాలు అందజేశాయి. ఇవి కాకుండా మరెన్నో సంస్థలు రిషికపూర్ కు ఉత్తమ సహాయనటుడి బహుమతులు అనేకసార్లు అందజేశాయి. మేరా నామ్ జోకర్ చిత్రంలో నటనకు రిషి జాతీయ బహుమతి అందుకున్నాడు.

ఖుల్లం ఖుల్లా…అన్ సెన్సార్డ్…

రిషికపూర్ ది కుండలు బద్దలు కొట్టినట్లు మాట్లాడే తత్త్వం. మనసులో మాటను చెబుతూ “ఖుల్లం… ఖుల్లా: రిషికపూర్ అన్ సెన్సార్డ్” పేరిట తన ఆత్మకథను 15, జనవరి 2017 న వెలువరించాడు. అందులో వెల్లడించిన కొన్ని నిజాలు కనుబొమలను ఎగరేసేవి కావడం విశేషం. పెళ్ళయిన తరవాత కూడా తన తండ్రి రాజ్ కపూర్ నటీమణి నర్గీస్ తో సంబంధాలు కొనసాగించేవాడని, అలాగే వైజయంతిమాలతో సంబంధాలు నెరపినప్పుడు తన తల్లి మెరైన్ డ్రైవ్ లో వున్న నటరాజ్ హోటల్ కు మకాం మార్చారని, ఆ తరవాత చిత్రకూట్ లోని అపార్ట్మెంట్ లో కొంతకాలం ఉన్నామని, దాంతో రాజకపూర్ వివాహేతర సంబంధాలకు చెక్ పెట్టారని పుస్తకంలో ధైర్యంగా పేర్కొనడం రిషి సత్యసంధత్వానికి నిదర్శనం.

“బాబీ” సినీ నిర్మాణ సమయానికి రిషి కి 21 ఏళ్ళు. ఆ సినిమా నిర్మాణానికి ముందే యాస్మిన్ మెహతా అనే ఒక పారసీక యువతితో డేటింగ్ జరిపాడు. బాబీ విడుదలై స్మాష్ హిట్ అయ్యాక డింపుల్ తో తనకు సంబంధం వున్నట్లు స్టార్ డస్ట్ పత్రిక రాయడంతో, ఆ పారశీక యువతి తననుండి దూరమైందని రిషి ఆ పుస్తకంలో రాశాడు. యాస్మిన్ మెహతా తనకు ఒక ఉంగరం బహుమానంగా ఇచ్చిందని, బాబీ షూటింగులో తను ఆ ఉంగరాన్ని డింపుల్ కు తొడిగానని, రాజేష్ ఖన్నా డింపుల్ ను పెళ్లాడబోతూ, ఈ విషయం తెలిసి ఆ ఉంగరాన్ని విసరికొట్టాడని పుస్తకంలో ధైర్యంగా పేర్కొన్నాడు.

బిగ్-బి అమితాబ్ బచన్ కుమార్తె శ్వేత ద్వారా రిషి కుటుంబానికి బంధుత్వముంది. “కభి కభి”(1976) సినిమాలో వీరిద్దరూ నటిస్తున్నప్పుడు అమితాబ్ ముభావంగానే వుండేవారని, తన ప్రక్కన రెండవ హీరోగా నటిస్తున్న నటులగురించి అమితాబ్ సఖ్యత కనబరిచేవారు కాదని చెబుతూ, అందుకు ఉదాహరణగా “దీవార్”(శశికపూర్), “అమర్ అక్బర్ అంథోని” (వినోద్ ఖన్నా, శత్రుఘ్న సిన్హా) సినిమాలు ఉదహరించాడు.

పాళీ హిల్స్ లో తన బంగాళా ప్రక్కనే నివసించే గుల్జార్ తన ఆత్మకథను చదివితే సంతోషిస్తానని ఆ పుస్తకంలో రాశాడు. కారణం… రిషి నటించిన ఏ ఒక్క సినిమాకి గుల్జార్ పాటలు రాయలేదు. నీతూసింగ్ ను పెళ్ళాడాక రిషి నటించిన సినిమాలు చాలా ఫ్లాపులు కావడంతో ఆమెను దూషించేవాడినని, తరవాత బాధపడి ఆమెను మన్నించమని కోరిన క్షణాలు ఎన్నో వున్నాయని కూడా రిషికపూర్ తన ఆత్మకథలో పేర్కొనడం అతని గొప్పతనంగానే చెప్పుకోవాలి.

అమితాబ్ బచన్ తనతో “కభి కభి” సినిమాలో నటించేటప్పుడు చాలా గుర్రుగా ఉండేవాడని, అందుకు కారణం “జంజీర్” సినిమాలో నటనకు తనకు రావలసిన ఫిలింఫేర్ బహుమానాన్ని “బాబీ” సినిమాతో రిషి తన్నుకుపోయాడనే భావనలో అమితాబ్ వుండడం అని ఆత్మకథలో పేర్కొన్నాడు. నిజానికి ఆ బహుమతి అమితాబ్ కే దక్కాల్సిందని, అయితే దాన్ని మూడువేల రూపాయలు లంచమిచ్చి కొనుక్కున్నాననే నిజాన్ని ఒప్పుకోవడం రిషికపూర్ హుందాతనాన్ని, నిఖార్సయిన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది.

మరిన్ని విశేషాలు…

రిషీకపూర్ కు కుండలు బద్దలు కొట్టినట్లు మాట్లాడడం అలవాటని ముందుగా చెప్పాను. ఆమధ్య రిషికపూర్ చేసిన ట్వీట్ కొందరి అనుమానాలకు తావిచ్చింది. డింపుల్-రాజేష్ ఖన్నా కూతురు ట్వింకిల్ కు రిషి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ “బేబీ…బాబీ సినిమాలో ‘అక్సర్ కోయి లడకీ ఇస్ హాల్ మే, కిసీ లడకే సే సోలహ్ సాల్ మే’ పాటను చిత్రీకరిస్తున్న సమయంలో నువ్వు మూడు నెలల పసికందుగా నీ తల్లి గర్భంలో ఆ పాటను ఆలకిస్తూ వున్నావు. నీకు జన్మదిన శుభాకాంక్షలు” అని ట్వీట్ చేశాడు. ఈ సందేశాన్ని ఆసరాగా తీసుకొని, “ట్వింకిల్ ఖన్నా పుట్టింది రాజేష్ ఖన్నాతో పెళ్లయాకా, లేక ముందుగానేనా” అంటూ కొందరు తుంటరివాళ్ళు ప్రశ్నించారు. రిషీకి కోపమొచ్చింది. “బాబీ సినిమా నిర్మాణ దశలో డింపుల్ టీనేజిలో ఉండగానే రాజేష్ ఖన్నా కాకాతో మార్చి 73 లో ఆమెకు పెళ్లయింది. దీంతో చిత్ర నిర్మాణానికి అంతరాయం కలిగింది. బాబీ సినిమా 28 సెప్టెంబరు 1973 న విడుదలైంది. ట్వింకిల్ బేటీ 29, డిసెంబరు 1973 న జన్మించింది” అంటూ ఆ తుంటరులకు గట్టి సమాధానమిచ్చారు.

“ఆరోజుల్లో మీరు మంచి యువ రొమాంటిక్ హీరో కదా” అని ఎవరో అడిగిన ప్రశ్నకు “సినిమాల్లో రొమాన్స్ చేసేవాళ్ళు, హీరోయిన్ తో పాటలు పాడేవారు, విలన్లతో ఫైటింగులు చేసేవారు హీరోలు కాలేరు. అగ్నిమాపక సిబ్బంది, సైనికులు, రక్షణ పోలీసులు, వైద్యులే నిజమైన హీరోలు” అంటూ అద్భుతమైన జవాబిచ్చాడు.

Rishi kapoor

2007లో రిషి “డోంట్ స్టాప్ డ్రీమింగ్” అనే ఇంగ్లీష్ చిత్రంలో నటించాడు. షమ్మి కపూర్ కుమారుడు ఆదిత్య రాజ్ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. రొమాంటిక్ హీరోగా రిషికపూర్ నటించినన్ని హిందీ సినిమాలు మరేనటుడూ నటించలేదు. అతడు నటించిన నూట ముప్పైకి పైగా చిత్రాల్లో వందకు పైగా చిత్రాలు రొమాంటిక్ హీరోగానే. రొమాంటిక్ హీరోగా రిషి నటించిన ఆఖరి సినిమా “ది బిజినెస్ ఆఫ్ లవ్”. అయితే అనివార్య కారణాలవలన ఈ సినిమా 2000 సంవత్సరం దాకా విడుదలకు నోచుకోలేదు. కరణ్ జోహార్ నిర్మించిన “అగ్నిపీఠ్” సినిమాలో రిషి విద్రోహకారుడిగా నటించాడు. తొంభయ్యవ దశకం చివర్లో రిషి నటించిన సినిమాలు పరాజయం చవి చూశాయి. దాంతో 2000 తరవాత సహాయక పాత్రల పోషణకు రిషి పరిమితమయ్యాడు.

రిషికపూర్ హీరోగా నటించిన “హెన్నా” అనే చిత్రం రాజ్ కపూర్ దర్శకత్వం వహించిన ఆఖరి సినిమా. రాజ్ కపూర్ మరణంతో ఆ సినిమాను రిషి అన్న రణధీర్ కపూర్ పూర్తిచేశాడు. “మేరా నామ్ జోకర్” సినిమాకు ముందే రిషి కెమెరా ముందుకు వచ్చాడు. రాజ్ కపూర్ నిర్మించిన “శ్రీ 420” సినిమాలో “ప్యార్ హువా ఇకరార్ హువా” పాటలో చిన్నపిల్లాడిగా తప్పటడుగులు వేస్తూ కనిపిస్తాడు.

“ఖేల్ ఖేల్ మే”, “కభి కభి”, “అమర్ అక్బర్ ఆంథోని”. “దూస్రా ఆద్మీ” వంటి సినిమాల్లో రిషికపూర్ సరసన హీరోయిన్ గా నీతూసింగ్ నటించింది. తరవాత 1980 లో రిషికపూర్ హీరోయిన్ నీతూసింగ్ ను ప్రేమించి పెళ్ళాడాడు. అప్పుడు రిషి వయసు 29 ఏళ్ళు. తను నీతూ ని వివాహమాడాలనుకుంటునట్లు చెప్పేందుకు నీతూ తల్లిదండ్రుల ఇంటికి పూర్తి జ్వరంతో వుండగా వెళ్ళాడు. నీతూ తల్లిదండ్రులు ఆ స్థితిలో వచ్చిన రిషి ప్రేమకు ఫిదా అయిపోయి పెళ్ళికి ఒప్పేసుకున్నారు.

తండ్రి రాజ్ కపూర్, సోదరుడు రణధీర్ కపూర్ లాగే తను కూడా దర్శకుడుగా రాణించాలని అక్షయ్ ఖన్నా, ఐశ్వర్యరాయ్ లతో 1999 లో “ఆ అబ్ లౌట్ చలే” అనే సినిమా నిర్మించి చేతులు కాల్చుకున్నాడు. తరవాత దర్శకత్వం జోలికి వెళ్ళలేదు. తన సోదరులు రణధీర్, రాజీవ్ కపూర్లతో కలిసి రిషికపూర్ “ప్రేమ గ్రంద్” అనే సినిమా నిర్మించాడు. తమ్ముడు రాజీవ్ కపూర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇన్ని సినిమాల్లో నటించిన రిషికపూర్ కు దక్కిన ఫిలింఫేర్ బహుమతి “బాబీ” సినిమాలో నటనకు గెలుచుకున్నది. సారీ… గెలుచుకుంది కాదు తెలియని వయసులో కొనుక్కుంది. ఈ విషయాన్ని ఇటీవలే విడుదలైన తన ఆత్మకథలో నిష్కపటంగా ఒప్పుకోవడం రిషికపూర్ గొప్పతనమని చెప్పాలి. 2018లో ఋషి కపూర్ కు లుకేమియా వ్యాధి సోకింది. అమెరికాకు వెళ్ళి వైద్యం తీసుకొని ఆరోగ్యవంతునిగా సెప్టెంబర్ 2019 న ముంబై చేరుకున్నాడు. అయితే 2019 ఏప్రిల్ నెలలో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. దాంతో రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో చేరాడు. అయితే లుకేమియా వ్యాధి తిరగబెట్టడంతో ఏప్రిల్ 30, 2020 న 67 ఏళ్ల వయసులో రిషి కపూర్ కన్ను మూశాడు.

-ఆచారం షణ్ముఖాచారి
(94929 54256)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap