అసామాన్య ‘రాజకీయ వ్యంగ్య చిత్రకారుడు ఆర్కే !

ఆర్కే లక్షణ్ శతజయంతి(1921 -2020 ) సందర్భంగా ప్రత్యేక వ్యాసం…..

భారతదేశంలో కార్టూన్ కళ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది కార్టూన్ త్రిమూర్తులు అనతగ్గ కేశవ శంకర్ పిళై (కేరళ), రాసీపురం కృష్ణస్వామి లక్ష్మణ్ (కన్నడ), ‘బాపు’ అను సత్తిరాజుల లక్ష్మీనారాయణ (ఆంధ్ర). శంకర్ మనదేశంలో రాజకీయ వ్యంగ్య చిత్రకళకు ఆదిపురుషుడు. ఆయన బాంబే క్రానికల్, ఫ్రీగ్రెస్ జర్నల్, శంకర్స్ వీక్లీలలో కార్టూన్లు గీచి ఖ్యాతి గడించారు. స్వాతంత్ర్యము రాకముందే శంకర్ అటు పరదేశీయుల, ఇటు స్వదేశీయులు అదరాభిమానం పొందారు. నూరు పైసల తెలుగు వాడైన బాపు మద్రాసులో స్థిరపడ్డా, ఆంధ్రపత్రికలో రాజకీయ కార్టూన్లతో తన వృత్తి ప్రారంభించి, తర్వాత వేలాది కార్టూన్లు గీచి, కార్టూనిస్టులకు మార్గదర్శి అయ్యారు, అదే కోవకు చెందిన ఆర్కే లక్షణ్ సుమారు ఆరు దశాబ్దాలు పైగా ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ లో చిరు చిత్రాలతో, దేశంలో పెను సంచలనం సృష్టించారు. ఈ ముగ్గురూ మన దక్షణ భారతదేశానికి చెందిన వారు కావడం మనకు గర్వకారణం..

కార్టూన్ల ద్వారా ప్రభుత్వంలో పాలకుల్లో, పత్రికల్లో, పౌరుల్లో, రాజకీయనాయకులో, సామాన్యుల్లో చైతన్యం కల్గించిన అసామాన్య వ్యంగ్యం చిత్రకారుడు ఆర్కే లక్షణ్, లలిత కళారంగంలో శిల్ప, చిత్రకళకు వున్న గుర్తింపు కార్టూనక్కు లేదు. శంకర్, ఆర్కే, బాపులాంటి కార్టూనిస్టు వల్లే కార్టూన్ ఒక కళగా గుర్తింపు పొందిందంటే అతిశయోక్తి కాదు. ఆర్కే 1921 అక్టోబర్ 24న మైసూర్ లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి కృష్ణస్వామి లక్ష్మణ్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు ఆరుగురు మగపిల్లల్లో ఆర్కేనారాయణ్ పెద్దవాడు కాగా, ఆర్కే లక్ష్మణ్ చిన్నవాడు. చదవడం, రాయడం రాకముందే ఆర్కే చిత్రాలు గీచేవాడు. ఇంటిగోడలు, కిటికీలు, తలుపులు ఎక్కడబడితే అక్కడ బొమ్మలు గీచేవాడు. ఆర్కే చిత్రకళా ప్రతిభను ఆయనకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడు గుర్తించి ప్రోత్సహించాడు. ముంబైకి చెందిన సర్ జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్డులో చేరడానికి ఆర్కే ప్రయత్నించినా, తగిన ప్రతిభ లేక నిరాకరించారు. మైసూరు విశ్వవిద్యాలయంలో పాలిటెక్స్, ఎకనామిక్స్, ఫిలాసఫి పాఠ్యాంశాలుగా బి.ఏ.పూర్తిచేశారు. చదువుకుంటూనే ఆయన బ్లిట్టీ, స్వరాజ్య పత్రికలకు కార్టూన్లు వేసేవారు. పౌరాణిక పాత్ర ఆధారంగా రూపొందించిన ‘నారద’ యానిమేటెడ్ చిత్రం కోసం ఆయన బొమ్మలు వేశారు. తన సోదరుడు ఆర్కే నారాయణ్ ‘ది హిందూ’ లో రాసే ‘మాల్గుడి డేస్’ కథలకు చిత్రాలు వేసేవారు. శంకర్ తను చెప్పిన ప్రీప్రెస్ జర్నల్ లో పూర్తిస్తాయి కార్టూనిస్టుగా చేరి, అక్కడ బాల్ ధాక్రే సహచరునిగా పనిచేశారు కొంతకాలం !

1951 సంవత్సరంలో ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కార్యాలయానికి వెళ్లి తనకు ఉద్యోగం కావాలని అడిగారు. ఆ సమయంలో ఆర్డు డైరెక్టర్ గా వున్నా వాల్టర్ లాంగ్ మహల్ (జర్మన్) ఆయన ప్రతిభ గుర్తించి కార్టూనిస్టు ఉద్యోగం ఇచ్చారు. అందులో ‘యూసెడ్ ఇట్’ శీర్షికతో మొదటి పేజీల్లో ‘చిరు కార్టూన్స్’ ప్రారంభించారు.

నోరులేని కామన్ మ్యాన్:
ఆర్కే వ్యంగ్య చిత్రాలు సునిశితంగా పరిశీలిస్తే తన ప్రతి చిత్రంలో గళ్లకోటు, ధోవతి, గాంధీ కళ్లద్దాలతో ఒక సామాన్యుడు కనిపిస్తాడు. మనదేశంలోని నిరుపేదల అవసరాలు, ఆకాంక్షలు నెరవేర్చాల్సిన నాయకులు, అధికారులు చేసే విచిత్ర వ్యాఖ్యలు, విన్యాసాలకు మూగసాక్షి ఈ సామాన్యుడు. ప్రధాని కార్యాలయం నుండి పంచాయతి కార్యాలయం వరకు ప్రతిచోట కనిపించే ఈ సామాన్యుడు రాజకీయనాయకుల్ని, అధికారుల్ని ఇరకాటంలో పెట్టడం ద్వారా, చావుల కష్టాల్ని కామన్‌మ్యాన్ పాత్రతో చెప్పడంతో ఆర్కే కృతకృత్యుడయ్యాడు. ఈ కామన్ మ్యాన్ పాత్రే ఆర్కేకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిందనడంలో సందేహంలేదు. అరవైఏళ్లలో ఒక్కమాట మాట్లాడకపోవడం సామాన్యుడి ప్రత్యేకత. అన్ని రాష్ట్రాల సంస్కృతిని ప్రతిభింబించేలా ఆర్కే కామన్‌మ్యాను రూపొందించారు. మనదేశంలోని మెజారిటీ ప్రజలకు, సామాన్య పౌరులకు ఈ కామన్మ్యా ను దగ్గర పోలికలున్నాయి. ఎంత అసాధారణ స్థాయిలో మోసాలు, అవినీతి, ఆరాచకం, హత్యలు, మానభంగాలు జరుగుతున్నా అన్ని భాదల్ని మౌనంగా భరిస్తూ, ఈలోకమింతే అని సరిపెట్టుకొంటూ జీవనయానం సాగిస్తుంటాడు. మనదేశంలోని సామాన్యుడే ఆర్కే కామన్యూన్. మీ కామన్‌మ్యాన్ నోరు విప్పడా? అని ఆర్కేను ప్రశ్నిస్తే “నా కామన్ మ్యాన్” ఎందుకు మాట్లాడుతాడు? దేశంలోని సామాన్య ప్రజలు మాట్లాడుతున్నారా సమస్యలపై సమరం చేస్తున్నారా ? అంటూ తన అశక్తతను వ్యక్తం చేసేవారు! ఆకాశం తన రంగు మార్చుకుంటుందా? ఆకులు, గట్టి, వాటి రంగు మార్చుకొంటున్నాయా? అలాగే నా కామన్‌మ్యాన్ మారడం కష్టం! అతనొక పర్మినెంట్ సింబల్ అనేవారు. 1988లో ప్రభుత్వం కామన్‌మ్యాన్ బొమ్మతో తపాలా బిళ్ళను విడుదల చేసింది. 2001 డిశంబర్ 19న పూనెలోని సింబియాసిస్ ఇనిస్టిట్యూట్ ఆవరణతో అడుగుల కామన్‌మ్యాన్ కాంశ్య విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఎయిర్ డెక్కన్ కామన్ మ్యాన్ లోగోను ఎంచుకొంది.

ఆర్కే హోటల్ రివేరా, ది మెసెంజర్ నవలలతో పాటు పలు చిన్న కథలు రాశారు. ‘ది టన్నెల్ ఆఫ్ టైం’ ఆయన స్వీయ చరిత్ర. పాత్రికేయం, సాహిత్యం , సృజనాత్మక కళల రంగంలో ఆయన చేసిన కృషికి 1984లో రామన్ మెగసెసీ అవార్డు అందుకున్నారు. ఇవికాక బి.డి. గోయంకా పురస్కారం, దుర్గారతన్ బంగారు పతకం వంటివి ఆయన సొంతమయ్యాయి. 1985లో లండన్లో ఆయన కార్టూన్లు ప్రదర్శన తొలిసారి జరిగింది. 2004లో మైసూర్ యూనివర్శిటీ నుండి డాక్టరేట్ అందుకున్నారు. కేంద్రప్రభుత్వం 1973లో పద్మ భూషణ్, 2005లో ‘పద్మ విభూషణ్’ తో సత్కరించింది.

చివరి కార్టూన్ : అంగార గ్రహంపైకి తాను సృష్టించిన సామాన్యుడు చేరుకున్నట్టుగా లక్ష్మణ్ డిశంబర్ 20న కార్టూన్ వేసి ‘ఇసో’కి బహుమతిగా పంపారు. 26 జనవరి 2015 సామాన్యులను శాశ్వతంగా వదిలి వెళ్ళిపోయూరు ఆర్కే లక్ష్మణ్..
“కార్టూనిస్ట్ అనేవాడు ఒక విమర్శకుడు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న సంఘటనలను వాస్తవ దృక్పధంతో విమర్శించడం. నడుస్తున్న ఆ సంగతులను కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం కార్టూనిస్టు ప్రాధమిక బాధ్యత అని చాటి చెప్పిన గొప్ప మానవతావాది ఆర్కే లక్ష్మణ్ మృతి భారతీయ సామాన్యులకు తీరనిలోటు.

-సుంకర చలపతిరావు

2 thoughts on “అసామాన్య ‘రాజకీయ వ్యంగ్య చిత్రకారుడు ఆర్కే !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap