ఆర్కే లక్ష్మణ్ కి అవార్డ్ – మోహన్ జ్ఞాపకాలు

A Terrible Journey with cartoonist Mohan
2002 ఫిబ్రవరిలో…
జర్నలిజం మీద కొత్త పుస్తకాలు వచ్చాయని తెలిసి ప్రెస్అకాడమీకి వెళ్లా… పొత్తూరి వెంకటేశ్వరరావు గారు ఛైర్మన్. ఆయనకు కార్టూనిస్టులంటే ప్రేమ.
‘ చెత్త వార్త ల మధ్య స్పేస్ లేక, త్రిబుల్ కాలమ్ కార్టూన్ సింగిల్ కాలమ్ కి కుదించుకు పోతుంది బ్రదర్..’ అంటూ అవేదన పడేవారు. అలా చెప్పి ఊరుకోకుండా, ఎక్కడెక్కడో పని చేసుకుంటున్న మమ్మల్ని పిలిచి. 2001లో పబ్లిక్ గార్డెన్లో ఓపెన్గా కార్టూన్ వేడుక లు జరిపారు. అదీ మా అనుబంధం!!
కొత్తగా వచ్చిన రెండు పుస్తకాలు చేతిలో పెట్టి…
‘ మన మోహనుడు ఎలా ఉన్నాడు ..?’ అన్నారు.
‘ బెంగళూర్లో ఆర్కే లక్ష్మణ్ కి అవార్డ్ ఇస్తున్నారు సార్. మమ్మల్ని కూడా పిలిచారు. లక్ష్మణ్ ని చూడాలని, మాట్లాడాలని మోహన్ సరదా పడుతున్నాడు. ఇద్దరం వెళ్లాలనుకున్నాం కానీ, నాకేమో ఇంకా సాలరీ రాలేదు…’ అని గొణిగాను.
‘ గొప్ప ఈవెంట్. భారతీయులు గర్వించ దగ్గ కార్టూనిస్టు. హ్యాపీగా వెళ్లి రండి బ్రదర్…’ అన్నారు పొత్తూరి.
నేను షాక్ నుండి తేరుకునే లోపే, ఇంటర్ కమ్ లో రాజశేఖర్ని పిలిచి వీరి దగ్గర లెటర్ తీసుకొని ట్రావెల్ ఏర్పాట్లు చూడండి అన్నారు. ఇపుడు రాజశేఖర్ ఏపీ ప్రభుత్వ అడ్వయిజర్ దేవుపల్లి అమర్ గారి దగ్గర పీఏగా ఉన్నారు.
సీన్ కట్ చేస్తే…
ఆ రోజు బెంగుళూర్లో ఉన్నాం.
సాయంత్రం అవార్డ్ ఫంక్షన్. అప్పటి సీఎం ఎస్ఎం కృష్ణ కర్నాటక ప్రభుత్వం తరుపున లక్ష్మణ్కి మర్యాదలు చేశారు.
ఉదయం గవర్నర్ బంగ్లా గెస్ట్ హౌస్లో మమ్మల్ని బ్రేక్‌ఫాస్ట్‌కి తీసుకెళ్లారు కన్నడప్రభ కార్టూనిస్టు వి.జి.నరేంద్రగారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్ట్స్ ట్రస్ట్కి ఆయనే హెడ్.ఈ కార్యక్రమం ఐఐసీ తరుపున ఆయనే చేస్తున్నారు.
మెత్తని దూదిలాంటి ఇడ్లీలను సాంబార్లో అపురూపంగా ఆస్వాదించాడు మోహన్.
‘లక్ష్మణ్ కూడా ఇక్కడే ఉన్నారు.. కాసేపు ఆయనతో ఇంటరాక్షన్…’ అన్నారు నరేంద్ర.
‘‘ కాకుల మీద వేసిన బ్లాక్ అండ్ వైట్ పెయింటింగ్‌లు ఆరా తీయాలి. క్రోక్విల్ గీతకు, బ్రష్ స్ట్రోక్ కి మధ్య ఉన్న రహస్యాన్ని కూపీలాగాలి… లక్ష్మణ్ అంటే నిన్న, నేడు, రేపు కార్టూన్లే.. ’’ అని నాతో అన్నాడు ఉంగరాల జుత్తును వేళ్లతో సర్దుకుంటూ.. మోహన్.
నరేంద్ర రూమ్ వైపు దారి చూపించాడు. లక్ష్మణ్ నల్ల ఫాంటూ, తెల్లషర్ట్‌తో,
లక్షణంగా సోఫాలో ఉన్నాడు.
మాతో పాటు కొందరు లోకల్ కార్టూనిస్టులు కూడా ఉన్నారు. వాళ్లు కన్నడంలో ఏదో అడుగుతుంటే , లక్ష్మణ్ ముక్తసరిగా సమాధానం చెబుతున్నాడు.
రోజూ పాకెట్ ‌ కార్టూన్‌తో దేశమంతా నవ్వించే ఆయన మాత్రం కొంచెం సీరియస్ మనిషి.
ఇంతలో మా గురించి నరేంద్ర పరిచయం చేశారు.
మోహన్ చాలా వినయంగా ఇంగ్లీషులో ఏదో అడిగారు…
లక్ష్మణ్ ఇలా ఫన్నీగా చెప్పారు…
‘ Cartooning is the art of insult and ridicule ‘ .
‘ I am grateful to our politicians. They have not taken care of the country, but me.’
తరువాత మోహన్ తెలుగు పొలిటికల్ కార్టూనింగ్ గురించి, యానిమేషన్ గురించి వివరిస్తున్నాడు.
నాకు తెలిసినంతలో మోహన్ అంత ఒబీడియంట్గా మాట్లాడటం ఎన్నడూ చూడ లేదు.
లక్ష్మణ్ పక్కనున్న ఆయన భార్య కమల ఆసక్తిగా వింటుంది కానీ,లక్ష్మణ్‌లో ఏ ఫీలింగ్ కనిపించ లేదు.
ఇక వదిలేయి గురూ.. అన్నట్టు మోహన్ని గోకాను కానీ, ఆగేలా లేడు.
లక్ష్మణ్ని ఎలాగైనా ఇంప్రస్ చేసి తీరాలని, ఆఖరుకి ‘బాపు’ అనే ఆయుధం బయటకు తీశాడు. కార్టూన్‌కి బాపు అద్దిన సొగసులను , ఆయన తీసిన సినిమా ల గురించి కూడా వివరించగా .. లక్ష్మణ్ సీరియస్ గా దవడ కింద ఆరచేతిని పెట్టుకొని చిటికెన వేలును నోటికి అడ్డంగా పెట్టుకున్నాడు తప్ప ఎక్స్‌ప్రెషన్‌లో మార్పు లేదు.
అంతా విని….చివరికి…
‘ ….. సో వాట్ ?’ అని అని కూల్‌గా అడిగాడు లక్ష్మణ్.
మోహన్ గారి సరదా అలా ముగిసింది.
బయటకు వస్తుంటే కమల గారు నన్ను పిలిచారు.
‘ మోహన్ సార్ని ఏమీ అనుకోవద్దని చెప్పండి. లక్ష్మణ్ కి తెలుగు కార్టూన్ల గురించి తెలీదు. సినిమాలు అస్సలు చూడరు..’ అని తెలుగులో చల్లగా చెప్పింది.
మీరు తెలుగు వారా…? అని నేను ఆశ్చర్య పోతుంటే , ‘మా సోదరి హైదరాబాద్‌లో ఉంటారు.’ అన్నారామె. ( ఆ తరువాత ఎప్పుడో శ్రీనగర్ కాలనీలో మళ్లీ లక్ష్మణ్ దంపతును కలిశాను.. అది వేరే ముచ్చట.)
ఆ మధ్యాహ్నం విధాన సభ ఎదురుగా, కబ్బన్ పార్క్ ప్రెస్ క్లబ్‌లో పాంప్రెట్ ఫిష్ ఫ్రైకి ఆర్డర్ ఇచ్చాక మోహన్ చల్ల బడ్డారు.
‘ మన దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా… తెలుగు పత్రికల్లో కూరుకు పోవడం వల్ల ఇలాంటి కుయ్యాలకు మన గురించి మనం చెప్పుకోవాల్సిన స్ధితి ..ఏదేమైనా లక్ష్మణ్ ఇండియన్ లైన్ కింగ్ అబ్బా…వాడికి ఆమాత్రం‌ ఆర్ట్ ‌టెంపర్‌ ఉంటుంది…’’ అని కింగ్ ఫిషర్ అందుకున్నాడు మోహన్.
‘ మీ క్యాఫ్సన్ లెస్ కార్టూన్లన్నీ బుక్ గా వేసి దేశమంతా మార్కెట్ చేద్దాం.. వర్కవుట్ అయితే మనోళ్లందరి కార్టూన్లతో మరోటి ఇంగ్లీషులో …’ అన్నాను.
‘ ఈ పని మస్ట్ గా చేయాలి. హైదరాబాద్ వెళ్లాక ఇదే పనిలో ఉందాం… అరే కావేరీ నీళ్లలో పెరిగిన చేపలు భలేటేస్ట్.. మరో ప్లేట్ చెప్పవచ్చుగా..’ అన్నాడు.
ఈ సీన్ ఇలా కట్ అయ్యాక…
ఆ బుక్ సంగతి ఆయన మర్చిపోయాడు. నా పనుల్లో పడి నేనుకూడా పట్టించుకోలేదు..
అలా …2010 లోకి వచ్చేశాం…
ఇలాంటి సమ్మర్లోనే అనుకుంటా మోహన్ నుండి కాల్ …
ఖైరతాబాద్ విశేశ్వరయ్య విగ్రహం వెనుక వైపున్న గల్లీలో ఫ్లాట్.
‘ ది బిగ్ నో అండ్ ది స్మాల్ ఎస్ ’ చదువుతున్నాడు , చెయిర్లో వెనక్కి వాలి…
‘‘ కార్టూన్ కబుర్లు తరువాత ఇప్పటి వరకు మరోటి రాలేదు . కొత్తగా వేసిన కార్టూన్లు, ఆర్టికల్స్‌తో ఈ సారి భీభత్సమైన మల్టికలర్ బుక్ తీయాలి….’’ అన్నాడు పక్క గదిలోంచి వస్తూ ప్రకాశ్ .
‘ అరె చిన్నా, ఆవిష్కరణ ప్రెస్‌క్లబ్‌లో ప్లాన్ చేయండిరా… ? ’’ అన్నాడు బుక్ లోంచి తల బయటకు పెట్టి మోహన్.
బుక్ ప్రింటింగ్ కి డబ్బు కావాలి. స్పాన్సర్స్ కావాలి.ఎలా అని ఆలోచించాం. చివరికి…యాడ్స్ తీసుకుందాం అని ముగ్గురం డిసైడ్ అయ్యాం. మర్నాటికి రంగుల యాడ్ టారిఫ్ తయారైంది. అది పట్టుకొని కొన్ని కంపెనీలకు తిరిగాం కానీ, వర్కవుట్ కాలేదు.
చాలా మందిని అడగ్గా…ఓ 30 వేలు వచ్చినట్టు గుర్తు.
‘ఇలా కాదబ్బా… నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. ప్రకాశ్‌కి పబ్లిక్‌తో పరిచయాలు తక్కువ…’’
సోమాజీగూడ ప్రెస్ ‌క్లబ్‌లో చెట్టుకింద కూర్చున్నాక, గ్లాసులో రాలిన చింతాకును వేలితో తీసిపారేస్తూ అన్నాడు మోహన్.
ఈ లోపు ఆయన ఫ్రెండ్ ఒకరు మాతో జాయిన్ అయ్యాడు.. మా కబుర్లన్నీ విని ఊరుకోకుండా … భద్రాచలం పేపర్ మిల్‌లో మా వాడొకడు పనిచేస్తున్నాడు. మీకు ఎంత పేపర్ కావాలో చెప్పండి, లారీల్లో తెప్పిస్తా … ? అన్నాడు.
ఆ మాటలెందుకో మోహన్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. ఆయన ముఖంలో అంతులేని సంతోషం …
‘ రెస్పాన్స్ అంటే అది…. సో… ఇక నీదే లేట్ …’ అన్నట్టు నా వైపు చూశాడు కళ తప్ప కామర్స్ తెలీని మోహన్.
ఆర్టిస్టుకు సహజంగా లోకం పోకడు తెలీదని విన్నాను కానీ, ఆ విషయంలో మోహన్ మాస్టర్ డిగ్రీ చేశాడు అన్పించింది.
ఒక కార్టూన్ సంకలనం తీయ డానికి 8 ఏళ్లుగా నడుస్తున్న స్టోరీ … దీన్ని ఆపక పోతే మరెవడో వచ్చి ఈ బుక్ కోసం ప్రింటింగ్ మిషన్ కూడా కొంటానంటాడనే డౌట్ వచ్చింది. దీన్ని ఎలాగైనా బ్రేక్ చేయాలి.
ఆర్టిస్టులను అభిమానించే ఒక సీనియర్ ఐఏఎస్ ‌ ఆఫీసర్‌తో మా కష్టాలన్నీ చెప్పుకున్నాను.
‘ మోహన్ గారిని తీసుకొని రండి… మాట్లాడదాం…’’ అని ఆయన దయతో మాకు ఆప్పాయింట్ మెంట్ ఇచ్చారు.
అలా కొన్ని కార్టూన్లు,యానిమేషన్ సిడిలు తీసుకొని బయలు దేరాం…
సెక్రటేరియట్ గేట్ దగ్గర మమ్మల్ని ఆపేశారు.
‘ కారులో మోహన్ అనే స్టార్ ఉన్నాడని వాడికి చెప్పబ్బా…’ బ్యాక్ సీట్లో వెనక్కి వాలుతూ అన్నాడు మోహన్.
నా మీడియా కార్డు చూపించాక లోపలికి పంపారు . సమతా పక్క బ్లాక్లో కారు ఆపి దిగాను. మోహన్ దిగే ప్రయత్నం చేస్తుంటే, ‘‘ ఆ సార్.. ఉన్నారోలేదో చూసి వస్తా.. మీరు కారులోనే రెస్టు తీసుకోండి..’’ అని పేషీకి వెళ్లి కలిశాను.
‘ మోహన్ గారు రాలేదా…?’ అన్నారాయన వెంటనే…
‘ వచ్చారు సార్ .. కానీ…’’ అని ఏదో చెప్ప బోగా ఆయన నవ్వేసి అర్ధం అయినట్టు చూశారు.
‘తెలుగు కార్టూనింగ్‌లో లెజండర్ మోహన్. సాక్షి టీవీలో యానిమేషన్స్ చూశాను.. బ్రిలియంట్ వర్క్ … ’ అని నా చేతిలోని టారిఫ్ లెటర్స్ తీసుకొని కొన్ని కార్పొరేషన్లకి ఎండార్స్ చేశారు. పీఏని పిలిచి ఫాలో అప్ చేయండి అని చెప్పారు.
ఈ లోపు చల్లని బటర్‌మిల్క్‌ వచ్చింది.

‘ ప్రపంచంలో గొప్ప ఆర్టిస్టుందరికీ చిన్నబలహీనతలు ఉంటాయి కానీ, మనం వారి టాలెంట్ మాత్రమే గౌరవించాలి.. ఇప్పటి వరకు వేసిన డ్రాయింగ్స్‌ని డాక్యుమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ముందు ఈ బుక్ రిచ్‌గా ప్రింట్ చేయండి. అవసరమైతే మళ్లీ రండి..’ అన్నారు.
ఆ సారు మాటలు మజ్జిగ కంటే హాయిగా ఉన్నాయి.
నా కైతే…ఒక పెద్ద భారం దిగినట్టు అనిపించింది.
కిందికి వచ్చి కారులో కూర్చున్నా…
సక్సెస్,హోదా,పేరూ గురించి ఎలాంటి బెంగ లేని మా లెజెండర్ సీట్లో వెనక్కు వాలి కూల్‌గా నిద్రిస్తున్నాడు.
ఆయన ఒక గొప్ప డ్రీమర్.
వారం తరువాత వర్క్ ఆర్డర్స్ వచ్చాయి.
అవన్నీ ఒక ఫైల్లో పిన్ చేసి ప్రకాశ్ చేతిలో పెట్టాను. ప్రింట్ అయ్యాక రెండు కాపీల తో వర్క్ ఆర్డర్ జిరాక్స్ జత చేసి పంపితే వారు చెక్ రిలీజ్ చేస్తారు. ఈ ఫైల్ జాగ్రత్తగా ఉంచండి అన్నాను.
ఆ విధంగా కార్టూన్ కబుర్లు రెండో భాగం ప్రింటింగ్‌కి లైన్ క్లియర్ అయింది.
‘ మొత్తం మీద సాధించావబ్బా…. అరె చిన్నా , బుక్ డిజైన్ కంప్లీట్ చేయించి, నవ్య ప్రెస్‌కి పంపరా…?’ అని కవర్ డిజైన్ వేయడం స్టార్ట్ చేశాడు మోహన్.
భరించ దగిన, ఒక అందమైన అరాచకం మోహన్ !!
( ఇది ఇక్కడితో ఆపేస్తేనే హాయిగా ఉంటుంది….)

-శ్యాం మోహన్

1 thought on “ఆర్కే లక్ష్మణ్ కి అవార్డ్ – మోహన్ జ్ఞాపకాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap