పెళ్లి తర్వాత బ్రేక్ పడింది – రోజారమణి

“దాదాపుగా ఐదువందల యాభై సినిమాలకు పైగా డబ్బింగ్ చెప్పాను. పద్దెనిమిది సంవత్సరాలు చెప్పాను. దాదాపు నాలుగొందల హీరోయిన్లకు చెప్పాను. ప్రతి హీరోయిన్ లోనూ నన్ను నేను చూసుకునేదాన్ని” అని చెప్పారు సీనియర్ నటి రోజారమణి. మొదట నటిగా పేరు సంపాదించుకొని, పెళ్లి తర్వాత డబ్బింగ్ కళాకారిణిగా మారిన ఆమె కొన్నేళ్లుగా సినీ రంగానికి దూరంగా ఉంటున్నారు. సెప్టెంబర్ 16 ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా ’64కళలు.కాం’తో ఆమె పంచుకున్న అనుభవాలు…

-బాలనటిగా కెరీర్ ప్రారంభంలోనే ఎస్వీరంగారావులాంటి మేరునగధీరుడికి పోటీగా నటించారు. ఆ నాటి సంఘటనలు ఏమైనా గుర్తున్నాయా?
ఆయనతో నటించడం కంటే.. సినిమా గురించి చెప్పాలి.. ఏవీయం ప్రొడక్షన్స్లో ‘భక్త ప్రహ్లాద’ ఫుల్ లెంగ్త్ ఈస్ట్మన్ కలర్ పిక్చర్. అప్పట్లో ఆ ఫిల్మ్తో తీయడం చాలా కష్టం. ఎందుకంటే అది లండన్ నుంచి కొంచెం కొంచెంగా వచ్చేది. అటువంటి సినిమాలో ప్రహ్లాద లాంటి క్యారెక్టర్ రావడం నా అదృష్టం. నాకు సినిమా అంటే ఏంటో తెలియని వయసది. ఆ తర్వాత కుమరన్గారు ఒక పుస్తకం రాశారు. అందులో ప్రహ్లాద గురించి వివరంగా తెలియజేశారు. అది చదివాక నాకు విషయాలు తెలిశాయి. ‘ఒక టేక్ ఏదన్నా వేస్ట్ అయినా చాలా ఇబ్బంది పడేవాళ్లం’ అని అప్పుడు తెలిసింది. టైటిల్ రోల్తో చెయ్యడం అనేది నిజంగా నాకు ఆ దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నాను. ఆ చిత్రానికి జాతీయ స్థాయి అవార్డు అందుకున్నారు. ఆ సందర్భంగా మధురానుభూతులు ఏమైనా వున్నాయా? ప్రహ్లాద సినిమా పూర్తవ్వగానే చెట్టియార్ గారు మొదటి రీల్ నా ఒళ్ళో పెట్టి శ్రీవేంకటేశ్వరస్వామి వారికి కళ్యాణం చేయించారు. . అది వాళ్ళ పద్దతి అట. ఫస్ట్ ఈస్ట్మన్ కలర్ ఫుల్ మైథాలజీ ఫిల్మ్. మోస్ట్ ఎక్స్ పెన్సివ్ మూవీ. ఆ ఫిల్మ్ తీసుకువెళ్ళి అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ గారికి – ప్రొజెక్షన్ వేసి చూపించారు. ఆయన వయస్సురీత్యా మూడు గంటల సినిమాని చూడలేక సగం సినిమా చూసి మిగతా సగం మర్నాడు చూస్తా అన్నారు. ఆయన సినిమా చూసి ‘ఎవరు ఈ బోయ్, అచ్చం ప్రహ్లాద లానే ఉన్నాడు? అని అన్నారట. ‘బోయ్ కాదు సర్ గర్ల్’ అని చెప్పి, మీకు చూపిస్తాం. మీ ఆశీర్వాదాలు అందించమంటే.. సరే తప్పకుండా రమ్మనండి అన్నారట. వెంటనే నిర్మాత నాకు నా కుటుంబ సభ్యులకు ఫ్లైట్ టికెట్లు వేసి రప్పించారు. నేను, నాన్నగారు ఇద్దరం కలిసి వెళ్ళాం. ఆ సగం సినిమా నాతో కలిసి రాష్ట్రపతితోపాటు ఆయన ముఖ్యులు పది మంది కలిసి చూశాం. ఆయన నన్ను ఆశీర్వదించారు. అది నాకు అవార్డు కంటే ఎక్కువ. రాష్ట్రపతి నుంచి నాకు పిలుపు రావడం మర్చిపోలేను. నా జీవితంలో ముఖ్యంగా గర్వపడేవి రెండే రెండు. ఒకటి ఆయనతో కలిసి సినిమా చూడడం. మరొకటి నేను మొదటిసారి స్కూల్ కి వెళ్ళి టీచర్ ని చూడకుండా దేశమంతా ‘టీచర్స్ డే’ జరుపుకునే రాధాకృష్ణగారి దగ్గరికి వెళ్లడం. అది నాకు చాలా మెమరబుల్ ఇన్సిడెంట్. బాలనటిగా ఆ తర్వాత చాలా సినిమాలు చేశాను. దాదాపు అన్ని భాషల్లో నటించాను. శివాజీ గణేషన్గారితో ఎనిమిది చిత్రాల్లో నటించాను. ఆ తర్వాత నటిగా సక్సెస్ చిత్రాలు చేశారు. కానీ మీరనుకున్నంత స్థాయి వచ్చిందనుకుంటున్నారా? వచ్చింది కదా. నేను చాలా చిత్రాల్లో నటించాను. ‘ఓ సీత కథ’, ‘సొమ్మొకడిది సోకొకడిది’, ‘భారతంలో ఒక అమ్మాయి’.. ఇలా వీటిలో హీరోయిన్ గా చేశాను. తమిళ్, కన్నడలో చేశాను. ఇవన్నీ చేస్తున్న టైంలో నాకు మ్యారేజ్ చేసేశారు. పెళ్లికి నాకు ఇరవైఒక్క సంవత్సరాలు. దాంతో కాస్త బ్రేక్ పడింది.

-డబ్బింగ్ ఆర్టిస్టుగా ఎలా మారారు ?
పెళ్లి తర్వాత బాబు పుట్టాక నాకు డబ్బింగ్ అవకాశాలు ఎక్కువగా వచ్చాయి. దాంతో బిజీ అయిపోయాను. డబ్బింగ్ కూడా సరదాగా చేద్దామని చేస్తే అది నాకు ప్రొఫెషన్ అయిపోయింది. దాదాపుగా ఐదువందల యాభై సినిమాలకు పైగా డబ్బింగ్ చెప్పాను. పద్దెనిమిది సంవత్సరాలు చెప్పాను. దాదాపు నాలుగొందల హీరోయిన్లకు చెప్పాను. నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం అంటే చాలా ఇష్టం. ఆ రోజుల్లో నటిస్తున్నప్పుడు డబ్బింగ్ ఉండేది కాదు. ఏదో ఒకటి రెండు చిత్రాల్లో డబ్బింగ్ ఉండేదంతే. అప్పుడు కూడా నన్ను డబ్బింగ్ అడిగేవారు.. నా వాయిస్ బావుంటుందని. నేనే చెప్పేదాన్ని కాదు.. ఎందుకు మన టాలెంట్ ని వేరే వాళ్ళకు ఇవ్వడం అని. బాబుని స్కూల్ కి పంపే టైంలో మురళీమోహన్ గారు సుహాసినికి డబ్బింగ్ చెప్పమని అడిగారు. అప్పుడు సరే అని చెప్పాను. అలా రాధ, రాధిక, యమున, రజిని, శోభన.. ఇలా ఎంతో మందికి డబ్బింగ్ చెప్పాను.

-మీరు ఆనందపడిన సందర్భాలు ?
నాకు బాగా ఆనందం అనిపించిన విషయం ఏమిటంటే మొదట సారి ‘లైఫ్ టైం ఎచీవమెంట్ అవార్డు’ ‘సంతోషం’ సురేష్ గారు ఇచ్చారు. ‘మా’ అసోసియేషన్ పెట్టి 25 సంవత్సరాలు అయిందని నన్ను సన్మానించారు. అలాగే డబ్బింగ్ అసోసియేషన్ పెట్టి 25 సంవత్సరాలు అయిందని అందులో కూడా నన్ను సన్మానించారు. ఇవన్నీ నాకు చాలా గ్రేట్ మెమొరీస్. అలాగే చెన్నైలో ఇండస్ట్రీ హండ్రెడ్ ఇయర్స్ ఫంక్షన్లో జయలలిత ఆధ్వర్యంలో సన్మానించారు. రంగారావుగారు జయంతి ఫంక్షన్ లోనూ సన్మానించారు. తర్వాత ఆయనపై రాసిన పుస్తకం చిరంజీవిగారి చేతుల మీదుగా తీసుకున్నాను. ‘భక్తప్రహ్లాద’లో నటించడం వల్ల నాకు ఇచ్చారు. ఎంజీఆర్ 100 ఇయర్స్ ఫంక్షన్ లో నాకు చీర పెట్టి షీల్డ్ ఇచ్చారు. ఇటీవలే హైదరాబాద్లో మేనేజర్స్ ఎగ్జిక్యూటివ్ వాళ్లు కూడా సన్మానించారు. ఇండస్ట్రీలో దాదాపు 52 సంవత్సరాలు అయింది. కాకపోతే అంతకంటే సంతోషమైన విషయం ఏమిటంటే యాభై ఏళ్ల క్రితం నేనే చేసిన సినిమా గుర్తు పెట్టుకుని నన్ను గౌరవించడం చాలా ఆనందం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap