తమ్మా శ్రీనివాసరెడ్డికి ప్రపంచ స్థాయి అత్యున్నత గుర్తింపు
రాయల్ ఫోటోగ్రాఫిక్ సొసైటీ (లండన్) ఫెలోషిప్.
ఫొటోగ్రఫీ రంగంలో నోబెల్ బహుమతిగా పరిగణింపబడే FRPS (ఫెలో, రాయల్ ఫొటోగ్రాఫిక్ సొసైటీ) గౌరవాన్ని తెలుగువాడైన భారతీయ ఫొటోగ్రాఫర్ తమ్మా శ్రీనివాసరెడ్డికి ప్రకటించారు. 1853వ సంవత్సరంలో లండన్ కేంద్రంగా ప్రారంభమైన రాయల్ ఫొటోగ్రాఫిక్ సొసైటీ ఫొటోగ్రఫీ రంగంలో విశేష కృషిచేసిన ఛాయాచిత్రకారులకు వివిధ అవార్డులను బహూకరిస్తూ వస్తోంది. వీటిలో అత్యున్నతమైనది ‘ఫెలోషిప్’. దీనికి ఈ సంవత్సరం ప్రపంచస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనపరచిన ప్రముఖ భారతీయ ఫొటోగ్రాఫర్ తమ్మా శ్రీనివాసరెడ్డి, బ్రిటిష్ ఫొటోగ్రాఫర్ డేవ్ వ్రాగ్ ఇరువురు ఎంపికయ్యారు. గత 170 ఏళ్లుగా కేవలం 18 మంది భారతీయులు మాత్రమే ఈ అవార్డును (ఫెలోషిప్) పొందారు. అందులో నేడు శ్రీనివాసరెడ్డి ఒకరుగా కలిశారు. కోవిడ్ మహమ్మారిని జయించే క్రమంలో భారత ప్రభుత్వం, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు, కోవిడ్ వారియర్స్ ప్రదర్శించిన అత్యున్నత సేవలను శ్రీనివాసరెడ్డి తన ఛాయాచిత్రాల ద్వారా చిత్రీకరించి, వాటిని రాయల్ ఫొటోగ్రాఫిక్ సొసైటీకి పంపారు. ప్రపంచంలోని అనేకమంది ఫొటోగ్రాఫర్లు ఇదే అంశంపై తమ చిత్రాలను పంపినా శ్రీనివాసరెడ్డి సమర్పించినవే అత్యున్నతంగా వున్నాయని, మనస్సులను, మనుషులను ఏకకాలంలో కదిలించాయని న్యాయనిర్ణేతలు ముక్తకంఠంతో ప్రకటించారు. శ్రీనివాసరెడ్డి సమర్పించిన 21 చిత్రాలను చిత్రమాలిక అత్యద్భుతమని ప్రకటించి, ఫెలోషిప్ అవార్డుకు శ్రీనివాసరెడ్డి నిస్సందేహంగా అర్హుడని ఏకగ్రీవంగా నిర్ణయించారు. కోవిడ్ మహమ్మారిపై ఆంధ్రప్రదేశ్, కర్నాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగిన కృషిని శ్రీనివాసరెడ్డి తన చిత్రాలలో ఆవిష్కరించారు.
తన ప్రాణాలకు తెగించి శ్రీనివాసరెడ్డి చూపిన చొరవను రాయల్ ఫొటోగ్రాఫిక్ సొసైటీ ప్రత్యేకంగా అభినందించింది. కోవిడ్19 మహమ్మారి బారినపడిన సామాన్యులను రక్షించడానికి భారతదేశంలో వివిధ ప్రభుత్వాలు, ఉద్యోగులు, స్వచ్ఛంద సేవకులు పడిన పాట్లను కళ్ళకు కట్టినట్లుగా శ్రీనివాసరెడ్డి చిత్రీకరించారు. ఐసియు వార్డుల్లో, వీధులలో, స్మశానవాటికల్లో వివిధ మారుమూల ప్రదేశాల్లో ఆవిష్కృతమైన హృదయవిదారక సన్నివేశాలను, అక్కడ సేవలందిస్తున్న కోవిడ్ వారియర్సను ఆయన తన ఛాయాచిత్రాలలో ప్రపంచం ముందుంచాడు.
శ్రీనివాసరెడ్డి ప్రదర్శించిన ఈ తెగువకు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించింది. ఇది కేవలం ఆయన ప్రతిభకు మాత్రమే పురస్కారం కాదు. ఈ శతాబ్దిలో సంభవించిన మహమ్మారిపై విజయానికి, జయించుటకు ప్రజాస్వామిక ప్రభుత్వాల కృషికి ఇది గుర్తింపు. తమ కుటుంబాలను సైతం విస్మరించి వ్యాధిపై పోరాడిన కోవిడ్ వారియరకు ఈ అరుదైన బహుమానం ఒక ఆత్మీయ పలకరింపు. జర్నలిజంలో భారతీయులు ప్రపంచస్థాయికి తీసిపోరని ఋజువుచెయ్యడానికి ఈ అవార్డు ఒక గుర్తింపు.
దాదాపు గత 40 సంవత్సరాలుగా శ్రీనివాసరెడ్డి ఫొటోగ్రఫీ రంగంలో, జర్నలిజంలో అనేకమందికి చిరపరిచితుడు. ఆయన పలు ప్రఖ్యాత దినపత్రికలు ఇండియాటుడేలకు చాలా కాలంపాటు సేవలందించారు. ఆయన కెమెరా పనితనం త్వరితంగా విశ్వవ్యాప్తమైంది. ప్రపంచంలోని వివిధ దేశాల సంస్థలు శ్రీనివాసరెడి పలు పురస్కారాలను అందుకున్నారు. భారతదేశంలో వివిధ ప్రభుత్వాలు, సంస్థలు ఆయన్ను సత్కరించి, గౌరవించాయి. గత 32 సంవత్సరాలుగా అంతర్జాతీయఫొటోగ్రఫి పోటీలలో పాల్గొని 183 బంగారుపతకాలు, 494 అవార్డులు, 890 ప్రశంసాపత్రాలుతో పాటు వీరు తీసిన 5847 ఛాయాచిత్రాలు ఎంపికై వివిధ అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శింపబడ్డాయి. గడచిన 20 సంవత్సరాలుగా ప్రపంచస్థాయిలో తొలిపదిమందిలో ఒకరుగా తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. అనేక సంస్థలనుండి గౌరవ పురస్కారాలను పొంది, ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలిచారు. ఫొటోజర్నలిజంలో 2007లో రామ్ నాథ్ గోయంకా మెమోరియల్ అవార్డును, ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 2012కి ఫొటోజర్నలిజంలో జీవితసాఫల్యపురస్కారంతో సత్కరించింది. 2015 సంవత్సరంలో అమెరికాలోని ప్రముఖ అంతర్జాతీయ ఫొటోగ్రఫి సంస్థ అయిన ఇమేజ్ కొలీగ్ సొసైటీ ఒకే ఏడాది 7 అంతర్జాతీయ పురస్కారాలు సాధించినందులకుగాను గ్రాండ్ మాస్టర్ అవార్డుతో సత్కరించింది.