–‘గ్రామీణ భారతం’ పేరుతో 33 మంది చిత్రకారుల ఒక రోజు చిత్రకళా ప్రదర్శన
-చిత్రకళా పోటీలలో విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతి ప్రదానోత్సవం
–ఉదయం అసక్తికరంగా ఆర్టిస్ట్ మధు ‘ఆక్రిలిక్ కలర్స్ పోర్ట్రైట్ డెమో’
________________________________________________________________________
ప్రకృతి రమణీయత.. గ్రామీణుల జీవన సౌందర్యం.. పల్లెపడుచు అందాలు.. సంస్కృతి, సంపద్రాయాలను చిత్రకారులు తమ చిత్రాల ద్వారా మనోహరంగా, ఎంతో హృద్యంగా ఆవిష్కరించారు. ఒక్కో చిత్రం చూస్తుంటే.. అయా విషయాలు దృశ్యరూపంలో మన కళ్ల ముందు ఆవిష్కృతమవుతాయి. అలాంటి పదుల సంఖ్యలో చిత్రరాజాలు ఒకే చోట కొలువుదీరాయి. వీక్షకులకు కనువిందు చేశాయి.
‘క్రియేటివ్ హార్ట్స్’ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ తొమ్మిదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం (29-9-2024) ఉదయం కాకినాడ, న్యూ సెంచరి స్కూల్ ఆడిటోరియంలో జాతీయస్థాయి చిత్రకళా ప్రదర్శనను డి-న్యూస్ అధినేత సూర్య ఆకొండి ప్రారంభించారు. చిత్రకారులను ప్రోత్సహించేందుకు, కొత్త తరాన్నికి చిత్రలేఖనంపై ఆసక్తి పెంచేందుకు ఏలూరుకు చెందిన ప్రముఖ చిత్రకారుడు డి. మధు సూదనరావు ఆక్రిలిక్ కలర్స్ పోర్ట్రైట్ ఎలా చేయాలో? డెమో ద్వారా చూపించారు.
‘గ్రామీణ భారతం’ చిత్రాకళా ప్రదర్శన: గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా చిత్రకారులు వేసిన అపురూప వర్ణచిత్రాలు నగర ప్రజలను కట్టిపడేశాయి. చెరువులో పిల్లల జలకాలాటలు, పల్లెటూరిలో అమ్మాయి ఎండుగడ్డి మోపు నెత్తిన పెట్టుకుని వెళుతున్నట్టు, మహిళలు వరినాట్లు పెట్టుట, మత్సకారులు గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల వద్ద చేపలు అమ్ముతున్నట్లు, తల్లీ కూతురు తల్లో పేలు చూసుకోవడం, రైతు పొలం దున్నుతున్నట్టు, మహిళ తన ఇంటి వద్ద ఆవుకు పాలు పితుకుతున్నట్టు, గొర్రెల కాపరి కొలేజ్ చిత్రం, గ్రామీణ ప్రాంతంలో మహిళలు బిందెలతో చెరువుల నుంచి నీరు తీసుకెళుతున్నట్టు, సంక్రాంతి పండగ వేళ హరిదాసుకు బియ్యం వేస్తున్న చిన్నారి, ఉగాది పండుగ… ఇలా చిత్రకారులు తమ ప్రతిభకు అడ్డం పడుతూ గీసిన చిత్రాలు ఈ ప్రదర్శనలో చూపరుల మనస్సులు హత్తుకున్నాయి. గ్రామీణ భారతం అనే అంశంపై నిర్వహించిన ఈ చిత్రకళా ప్రదర్శనలో వివిధ రాష్ట్రాల నుండి పాల్గొన్న 33 మంది కళాకారుల చిత్రాలు ఈ ప్రదర్శనలో ఉంచారు. అనంతరం చిత్రప్రదర్శనలో పాల్గొన్న చిత్రకారులకు బహుమతులు అందించారు. ఈ ప్రదర్శనను పెద్ద ఎత్తున సందర్శకులు తిలకించారు.
ముగింపు కార్యక్రమం: మధ్యాహ్నం 3 గంటలకు సీనియర్ చిత్రకారులకు సత్కారాలు, విజేతలకు బహుమతి ప్రదానోత్సవం జరిగింది. ఈ సభలో ముఖ్య అతిథులుగా ‘క్రియ’ సెక్రటరి జగన్నాథ రావు, ‘న్యూ సెంచరి స్కూల్’ ప్రిన్సిపాల్ శ్రీమతి నీహారిక సముద్రాల, ‘డి-న్యూస్’ అధినేత సూర్య ఆకొండి, సభాధ్యక్షులుగా ’64కళలు.కాం’ పత్రిక ఎడిటర్ కళాసాగర్ యల్లపు, ‘క్రియేటివ్ హార్ట్స్’ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఫౌండర్ ఆకొండి అంజి పాల్గొన్నారు.
సీనియర్ చిత్రకారులకు సత్కారాలు: ఈ ప్రదర్శనలో పాల్గొన్న సీనియర్ చిత్రకారులైన మంచెం సుబ్రహ్మణ్యేశ్వర రావు(కాకినాడ), ఆర్టిస్ట్ మధు (ఏలూరు) గార్లను, సీనియర్ ఆర్టిస్ట్ కంపారపు నాగేశ్వరరావు (కిర్లంపూడి)గారికి, సీనియర్ ఆర్టిస్ట్ శ్యాంసుందర్ (కాకినాడ), ఎం. రాధాకృష్ణ (ఆర్ట్ టీచర్), మహాలక్ష్మి, క్రాఫ్ట్ టీచర్ (కాకినాడ) గార్లను ఘనంగా సత్కరించారు.
అనంతరం చిత్రకళా ప్రదర్శనలో పాల్గొన్న 33 మంది చిత్రకారులకు అతిథుల చేతుల మీదుగా జ్ణాపికలు అందజేశారు. తర్వాత చిత్రకళాపోటీల్లో విజేతలకు బహుమతులందజేశారు.
–కళాసాగర్ యల్లపు
గ్రామీణ భారతం పేరిట, క్రియెటివ్ హార్ట్స్ నిర్వహించిన చిత్రకళా ప్రదర్శన కళాప్రియులను బాగా ఆకట్టుకుందనడంలో సందేహం లేదు. పట్టణ ప్రాంత ప్రజలకేగాక, నేటి ఆధునీకతను సంతరించుకున్న యువతకూ తెలియని అనేక జీవనవిధానాలను ఔరా అనిపించే విధంగా చిత్రాలున్నాయి. సీనియర్ చిత్రకారులను సన్మానించడం, యువ చిత్రకారులను ప్రోత్సహించడం, విధ్యార్థులకు ఆర్ట్ అండ్ క్రాఫ్టు కృత్యంలలో ఆసక్తినీ, అనురక్తిని కలిగించడానికి అనేక పోటీలు నిర్వహిస్తున్న ఆకుండి అభినందనీయులు.
Thank you sir, Editor
పట్టణపు పశిపిల్లలకు పల్లె వాసనల మాధుర్యం తెలియడం లేదు. కళల ద్వారా వాటిని ఈ రోజు
అంతరించిపోతున్న ప్రాచీన సంప్రదాయాలుగా
చూపించుకోవలసి వస్తుంది… ఎగసి పడే గోధూళి
మట్టి వాసన, పంటల చిగురులను తాకి వీచే పసరు
వాసనలు , గడుగ్గాయల చెరువు గట్టు ఆటలు, వయసు విసుర్లు , మూతి వంకరలు , వాలు జడలు,
పూలజడలు, రెండు జడలు, కొప్పు ముడులు, తాతల
చమత్కారాలు , పడతుల విసుర్లు…. కోతికొమ్మచ్చి ఆటలు, పంటపొలాల్లో ఒంటరి తుంటరి పనులు,….
పండుగల్లో రంగవల్లులు, గ్రామీణ ఆటలు, మరదళ్ళతో టూరింగ్ సినిమాలు, డాన్స్ ప్రో గ్రాములు… సైకిల్ అడ్డ తొక్కుడు, …. మనిషి నాలుగు దశల పరిణామాలను
ఈ తరం చూడలేక పోతుంది. కళలు నిత్యనూతన
జవసత్వాలతో వీటిని కాపాడుతూ ఉండాలి. మీ ఈ ప్రయత్నము అద్భుతము… మీకు, కళాకారులందరికీ
అభినందనలు.
Thank you sir, Editor