విజయవాడలో ఆగస్టు 29 వ తేదీన శ్రీ దుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. పి.వి. దుర్గావతి అధ్యక్షతన “కవయిత్రీ విజయం” అనే రూపక సాహితీ సదస్సు నిర్వహించబడినది. “కవయిత్రీ విజయం” అనే రూపకాన్ని రచించి, నిర్వహించినది జాతీయస్థాయి ఉత్తమ రచయిత్రి అవార్డుగ్రహీత శ్రీమతి మందరపు హైమవతి గారు.
ఈ రూపకంలోని పాత్రలన్నీ భావోద్వేగాలతో, ఆదర్శ భావాలతో, సమస్యా పరిష్కారాలతో పోషించబడ్డాయి. ముఖ్యంగా స్త్రీవాద కవయిత్రులను పరిచయం చేసారు. ప్రతి పాత్రను ఎంతో రసవంతంగా ఆవిష్కరించడం జరిగింది. తెలుగు సాహితీ ప్రక్రియలలో విశిష్టమైన రూపకాన్ని గిడుగు రామమూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా విద్యార్థులకు తెలియజేయడం ముదావహం. ఈ రూపకంలోని పాత్రలు – పాత్రధారులు :
*రచన, నిర్వహణ: శ్రీమతి మందరపు హైమవతిగారు
*చావలి బంగారమ్మ – ఆలపాటి సత్యవతి,
*వాణీ రంగారావు – పాటిబండ్ల కవిత,
*ఆదూరి సత్యవతి దేవి – డా. కాళ్ళకూరి శైలజ
*పుట్టా హేమలత – డా. ఓలేటి ఉమాసరస్వతి,
*కొండపల్లి కోటేశ్వరమ్మ – కర్రి రాధాకృష్ణ
*సావిత్రి – పంచాగ్నుల కృష్ణవేణి
*శివలెంక రాజేశ్వరీదేవి – చింతలూరి ఉమాదేవి
*రేవతీదేవి – యామినీ కృష్ణ బండ్లమూడి
*వర్రే రాణి – వైష్ణవి శ్రీ
వీరు ఈ రూపకం ద్వారా స్త్రీవాద రచయిత్రుల రచనల్లో స్త్రీ స్వేచ్ఛ, సమానత్వం, ఆత్మగౌరవం,
హక్కులు ప్రధానంగా కన్పింపజేశారు. ” స్త్రీని కేవలం కుటుంబానికే పరిమితమైన వ్యక్తిగా కాకుండా, తన స్వంత ఆలోచనలు, అభిప్రాయాలు, ఆశయాలు కలిగిన వ్యక్తిగా గుర్తించాలని కోరారు. ప్రతి పురుషుడితో సమానమైన హక్కులు, అవకాశాలు కల్పించాలని, స్త్రీ తన జీవితంపై స్వయంగా నిర్ణయాలు తీసుకొనే స్వేచ్ఛ కలిగి ఉండాలని, స్త్రీపై జరిగే వివక్ష,అణచివేత, హింస తొలగాలని, విద్య, ఉద్యోగ, సామాజిక రంగాల్లో స్త్రీకి సమాన అవకాశాలు ఉండాలని, స్త్రీతన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ స్వతంత్రంగా ఎదగాలని, స్త్రీ బలహీనురాలు కాదని, ఆమెకు స్వేచ్ఛ, సమానత్వం, పురుషులతో సమాన గౌరవం అవసరం” అనే సందేశాన్ని ఈ రూపకం ద్వారా విద్యార్థులకు తెలియజేశారు.
ఆద్యంతం ఆసక్తిభరితంగా జరిగిన తెలుగుభాషా దినోత్సవ కార్యక్రమములో కళాశాల ప్రిన్సిపాల్ డా. పి.వి. దుర్గావతి మేడం, తెలుగు విభాగాధిపతి డా. కె. సరళ, తెలుగు విభాగాధ్యాపకులు డాక్టర్. వి. మంజుల, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం గావించారు.
