ప్రసిద్ధ తెలుగు రచయిత బండి నారాయణస్వామిని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరించింది.
రాయలసీమ జీవితాలపై రచించిన ‘శప్తభూమి’ నవల 2019కిగాను ఈ అవార్డుకు ఎంపికైంది. అలాగే, మరో తెలుగు ప్రముఖుడు పెన్నా మధుసూదన్ కావ్యం ప్రజ్ఞాచక్షుసం’ సంస్కృత విభాగంలో పురస్కారానికి ఎంపికయింది. ఇద్దరు తెలుగువారు ఒకే ఏడాది కేంద్ర సాహిత్య పురస్కారం అందుకోనుండటం విశేషం. కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ సాహిత్యేతర విభాగంలో అవార్డుకు ఎంపికయ్యారు.
ఈ మేరకు కేంద్ర సాహిత్య అకాడమీ బుధవారం పేర్కొంది. విజేతలకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ఢిల్లీలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో రూ. లక్ష నగదు, తామ్రపత్రం అందిస్తారు. 1952 జూన్ 8న అనంతపురంలో నారాయణస్వామి జన్మించారు. ఎం.ఏ. తెలుగు చేసిన ఆయన, సింగిల్ టీచర్ స్కూళ్ళ లోను, ఉన్నత పాఠశాలలోనూ చరిత్ర బోధించారు. 1987 నుంచి రచనలు చేస్తున్నారు. 40 కథలు రచించారు. ‘గదలాడ తండాయి’, ‘మీరాజ్యం మీరేలండి’, రెండుకలల దేశమ్’, శస్త్ర భూమి’ నవలలు రాసారు. రాయలసీమ చరిత్ర నేపథ్యంగా రాసిన నవల ‘శప్తభూమి’. రాయలకాలం తర్వాత దాదాపు 18వ శతాబ్దం నాటి అనంతపుర సంస్థానంలో జరిగిన అధికార రాజకీయాలు, అప్పటి సామాజిక జీవితం, సీమనేలలో కక్షలు, కార్పణ్యాలు ఈ నవల లో చిత్రితమయ్యాయి. ఇదే నవలకు 2017 సంవత్సరానికిగా ను ‘తానా’ పురస్కారం లభించింది. కథాకోకిల, అప్పాజోస్యుల విష్ణుభొట్ల, కొలకలూరి, ఎన్టీఆర్ పురస్కారాలు కూడా ఆయన పొందారు. ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి అనంతపురం జిల్లా తరఫున కేంద్ర సాహిత్య పురస్కారం తొలిసారి అందుకోగా, బండి నారాయణస్వామి రెండోవారు. యోగి పై కావ్య గానం..
సంస్కృత సాహిత్య పరామర్శలో విశేష కృషి చేస్తున్న పెన్నా మధుసూదన్ తెలుగువారే. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లిలో జన్మించారు. శ్రీ వేంకటేశ్వర వేదాంత సంస్కృత కళాశాలలో డిగ్రీ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ, ఎంఫిల్, పీహెచ్డీ పూర్తి చేశారు. రవ్వా శ్రీహరి, పుల్లెల శ్రీరామచంద్రుడు వద్ద శిష్యరికం చేశారు. అభినవగుప్తుడి గీతా భాష్యంపై ఎంఫిల్, నారాయణతీర్థ యోగాభాష్యంపై పిహెచ్డి చేశారు. మహారాష్ట్రకు చెందిన యోగి సంత్ గులాబి రావు మహారాజ్ జీవితం, తాత్వికతపై పెన్నా 850 సంస్కృత శ్లోకాలతో ప్రజ్ఞాచక్షుసం పేరుతో కావ్యం రాశారు. కేవలం 34 సంవత్సరాలు మాత్రమే జీవించిన ఈ యోగి తత్వశాస్త్రం, ఆయుర్వేదం, భక్తి, సంగీతంపై 184 పుస్తకాలు రచించారు. పెన్నా 2000 సంవ త్సరం నుంచి నాగపూర్‌లోని కవికులగురు కాళిదాస్ సంస్కృత వర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. 40 పుస్తకాలు ప్రచురించారు. వలస నిశీథిపై శశి చూపు..
కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశి థరూర్ రచన ‘యాన్ ఎరా ఆఫ్ డార్క్ నెస్’ ఆంగ్ల విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికైంది. భారతదేశంలో వలసకాలపు అణచివేతను, రాజకీయార్థిక విధానాలను ఈ పుస్తకంలో థరూర్ చర్చించారు. హిందీ కవి నంద్ కిశోర్ ఆచార్య ‘చెత్తే హుయే అప్నే కో సహా 7 భాషలకు చెందిన 7 కవితా సంపుటులకు ఈసారి అవార్డులు లభించాయి. ఇంకా.. నవల, ఆత్మకథ, జీవితచరిత్ర తదితర ప్రక్రియల్లోనూ అవార్డులకు ఎంపికయ్యారు.