‘మట్టినీ ఆకాశాన్నీ నదినీ పర్వతాన్ని
కరుణనీ మానవతనీ ఒక సమూహం కోసం
ఏకాంతంగా ప్రేమించేవాడే కవి’
ఇలా సహృదయతతో ‘మాటల దానం’ మూడున్నర దశాబ్దాలుగా చేస్తూ, రాస్తూ పాఠకజన ప్రేమను పొందిన ‘అక్షరగోదావరి‘ రచయిత దాట్ల దేవదానం రాజు. ‘వేదంలా ప్రవహించే గోదావరి’ని ‘కథల గోదారి’గా ప్రవహింపజేసిన దేవదానంరాజు ఆ నదీ తీరంలోని యానాంలో జీవిస్తూ యానాం బ్రాండ్ అంబాసిడర్‌గా సాహిత్య లోకంలో గుర్తింపు, గౌరవం తెచ్చుకున్నారు. 20 మార్చి 1964న జన్మించారు. ఎం.ఎ. (ఆర్థికశాస్త్రం), ఎం.ఎ. (తెలుగు), ఎం. ఇడి. చదివి ఉపాధ్యాయ సత్కారాలను స్వీకరించారు. కవిత, కథ, చరిత్ర ప్రక్రియల్లో పలు రచనలు అందించిన మనకాలపు మంచి రచయిత దేవదానం రాజు, వానరాని కాలం, గుండె తెరచాప, మట్టికాళ్ళు, ముద్రబల్ల, లోపలి దీపం, నది చుట్టూ నేను, నాలుగోపాదం, పాఠం పూర్తయ్యాక, దోసిలిలో నది కవితా సంపుటాలు, దాట్ల దేవదానం రాజు కథలు, ‘కళ్యాణపురం’ యానాం కథలు, కథల గోదారి, సరదాగా కాసేపు కథా సంపుటాలు, యానాం చరిత్ర వీరు మనకందించిన సాహిత్య కానుకలు. దూరానికి దగ్గరగా (వంతెన కవితలు), సూరయ శాస్త్రీయం పుస్తకాలకు సంపాదకులు కూడా, వీరి రచనల్లో కొన్ని తమిళం, మళయాళం, ఆంగ్లం, ఫ్రెంచి, హిందీ భాషల్లోకి అనువాదమై ఆ పాఠకజన ఆమోదం అందుకున్నాయి. శిఖామణి సంపాదకత్వంలో దేవదానం రాజు షష్టిపూర్తి సంచిక ‘ఉదయిని’, సౌభాగ్య ‘సాత్విక భావాల సౌందర్యశిల్పి దాట్ల దేవదానం రాజు’ శీర్షికన రచించిన పరిశీలనా గ్రంథం వెలువడ్డాయి.
దేవదానం రాజు కళైమామణి, తెలుగురత్న పురస్కారాలు (పుదుచ్చేరి ప్రభుత్వం), సర్ ఆర్థర్ కాటన్ జలనిధి పురస్కారం, కొడవగంటి కుటుంబరావు కథా పురస్కారం, గుంటూరు జిల్లా రచయితల సంఘం రాష్ట్రస్థాయి పురస్కారం, అక్షర గోదావరి పురస్కారంతో పాటు మరికొన్ని సత్కారాలను పొందారు.
సాహిత్యరంగంలో యింతటి కృషిచేసిన దాట్ల దేవదానం రాజుకు మార్చి 24 న గుంటూరు బృందావన్ కాలనీ లో జరిగే సాహితీ సభలో అభ్యుదయ రచయితల సంఘం – గుంటూరు జిల్లా శాఖ అమరజీవి డాక్టర్ పరుచూరి రాజారామ్ సాహితీ పురస్కారాన్ని సగౌరవంగా అందజేస్తుంది.