
ఢిల్లీలో జరిగిన ‘సాహిత్య అకాడమీ’ వారు నిర్వహించిన సాహిత్యోత్సవ లో పాల్గొన్న మందరపు హైమావతిగారి అనుభవాలు.
ప్రయాణాలు ఎప్పుడూ ప్రమోదకరాలు, ప్రహ్లాదకరాలు. ఏ మెరుపులూ లేని దైనందిన జీవితంలో ఉత్సాహకరమైనవీ, ఉల్లాసకరమైనవీ. ఈమధ్య అలాంటి ప్రయాణమే ఢిల్లీలో ‘సాహిత్య అకాడమీ’ వారు నిర్వహించిన సాహిత్యోత్సవ కార్యక్రమం. దేశం నలుమూలల నుంచి అనేకమంది కవులు, రచయితలు, సాహిత్య వేత్తలు హాజరయ్యారు. మార్చి, 7 నుంచీ 12 వరకూ 6 రోజుల పాటు జరిగిన కార్యక్రమంలో కవి సమ్మేళనాలు, సెమినార్లు అస్మిత, కథాసంధి., రచయితతో ముఖాముఖి, దళిత, భక్తి, ఆదివాసీ, సాహిత్య సదస్సులు, కథాపఠనాలు మొదలగు విభిన్న కార్యక్రమాలు జరిగాయి. ఎటు చూసినా సాహిత్య వేత్తలు, కవులు, రచయితల ఫోటోలు.
అక్కడ నుంచి వచ్చి చాలా రోజులైనా ఇంకా అక్కడే వున్న భావన. కవిత్వం వింటున్నట్టు, మిత్రులతో మాట్లాడుతున్నట్లు అవే అవే జ్ఞాపకాల దొంతరలు.
నా కవిసమ్మేళన కార్యక్రమం “టేస్టీసౌండ్” ఎన్. కిరణ్ కుమార్ సింగ్ గారి అధ్యక్షతన జరిగింది. ఈ కవి సమ్మేళనంలో సిధ్ధార్ధ్ శంకర్ (అస్సామీ). రంగకిబాక్ (ఖాశీ) టి.కె. సంతోష్ కుమార్(మళయాళం), తిరుప్రసాద్(నేపాలీ), అక్షతరాజ్(తుళు) లతో నేనూ పాల్గొన్నాను.”ఈ దేహం ఎవరిది”, “కూరగాయల మ్మాయి”, “వంటింటి సూర్యోదయాలు” కవితలు చదివాను. వీటిని కల్లూరి శ్యామల గారు ఇంగ్లీష్ లోకి అనువదించారు.

మర్నాడు స్వర్ణకిలారిగారు, పెండ్యాల గాయత్రి గార్ల కథాపఠనం. ఒకేసారి ఆరు వేరు వేరు చోట్ల కార్యక్రమాలు జరగడంతో అన్నీవినలేము. టీ విరామ సమయంలో అనేకమంది కవులను కలవడం బాగుంది. “కలవడమేగదా కవిత్వమంటే” అన్ని శివారెడ్డి గారి మాటలు గుర్తొచ్చాయి. ఆ రెండు రోజుల్లో సభలకు వచ్చిన శ్రీ కొలకలూరి ఇనాక్ గారినీ, సాహిత్య అకాడమీ కార్యదర్శి శ్రీ కె. శ్రీనివాసరావుగారినీ, శేషారత్నంగారి నీ, శ్రీ దాసరి అమరేంద్ర గారినీ, శ్రీ పత్తిపాక మోహన్ గారినీ కలిసాను. చివరి రోజు సుబోధ్ సర్కార్ గారితో ముఖాముఖి కార్యక్రమం అద్భుతం. తన కవిత్వం గురించి జీవితం గురించి చేసిన ఆయన ప్రసంగం శ్రోతలను మంత్రముగ్ధులను చేసింది.
“నా కవిత్వం చదివితే 30 సంవత్సరాల నా దేశచరిత్ర తెలుస్తుందని” అన్నారు ఆయన. ఆ తర్వాత జంతర్ మంతర్, గురుద్వార్, లోడీ గార్డెన్, ఎర్రకోట, లైబ్రరీ చూసాను. ఎన్నో ఆనందానుభూతులనుఇచ్చిన ఇంత పెద్ద ఉత్సవంలో పాల్గొనడానికి అవకాశమిచ్చిన సాహిత్య అకాడమీ కార్యదర్శి శ్రీ నివాసరావుగారి కీ, ప్రసేన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఆత్మీయ ఆతిధ్య మిచ్చిన బి.బి.సి. రామమోహన్ గారికీ, నేను అడగగానే ఆంధ్రా అసోసియేషన్ లో వసతి కల్పించిన గౌరవనీయులు శ్రీ దేవరకొండసుబ్రహ్మణ్యం గారికీ మనఃపూర్వక కృతజ్ఞతలు.
-మందరపు హైమావతి