స‌మ‌కాలీన స్త్రీనే నా సాహిత్య కేంద్రం – పి సత్యవతి

‘ఒక హిజ్రా ఆత్మకథ’  అనువాదంకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎన్నికయినారు.

”మహిళలు తమ మనోభావాలను స్వేచ్ఛగా వెల్లడించే పరిస్థితి కుటుంబంలోనే లేనప్పుడు సమాజంలో ఇంకెలా వస్తుంది?” అంటారు ప్రఖ్యాత కథారచయిత్రి పి సత్యవతి. ‘ఇంట్లో ప్రజాస్వామిక వాతావరణం ఉన్నప్పుడే మహిళలకు ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుంది. అప్పుడే ఆమె తన విముక్తి దిశగా మేల్కొంటుంద’ని చెబుతారు. సత్యవతి … ఐదు దశాబ్దాలకు పైగా తన కథలు, నవలలు, వ్యాసాలు, అనువాద రచనలతో వనితాలోకంలో చైతన్యపు వెలుగులు పంచుతున్నారు. ఆమె అనువాదం చేసిన ‘ఒక హిజ్రా ఆత్మకథ’కు ఇటీవలే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని లభించింది. సామాజిక మూలాలను మహిళా కోణంలో తడిమే సత్యవతి .. మహిళల ఆలోచనల సమరానికి అవసరమైన అక్షరాస్త్రాలను అందిస్తున్నారు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రచయిత్రి పోచిరాజు సత్యవతి ప్రత్యేకంగా… ‘జీవన’తో జరిపిన సంభాషణ ఆమె మాటల్లోనే …
మహిళల పట్ల ఎలాంటి ఆంక్షలూ లేని కుటుంబంలో పుట్టిపెరిగాను. గుంటూరు జిల్లా తెనాలి పక్కనే ఉన్న కొలకలూరులో 1940 జులై 2న పుట్టాను. నాన్న సత్యనారాయణ, అమ్మ కనకదుర్గ. నాకు సాహిత్యంతో పరిచయం అమ్మ వల్లే కలిగింది. అమె మంచి చదువరి. ఆరోజుల్లో ఎన్నెన్ని పుస్తకాలు ఆమె చదివేదో. అంతేకాదు మా ఊళ్లోనే ‘వెంకట్రాయ గ్రంథాలయం’ ఉండేది. అక్కడా చాలా పుస్తకాలు రెండో ప్రపంచ యుద్ధకాలంలో వచ్చిన సాహిత్యం లభ్యమయ్యేవి. ఇలాంటివన్నీ నేను కొలకలూరులో ఎస్‌ఎస్‌ఎల్‌సి పూర్తయ్యేలోపల చదివాను. నాన్నకు ఆయుర్వేద వైద్యునిగా మంచిపేరు ఉండేది. ఆయన చదివింది పదో తరగతేగానీ ఎక్కడెక్కడి పుస్తకాలో తెచ్చి నాతో చదివించేవారు. మాది సాధారణ మధ్య తరగతి కుటుంబం. ఆంక్షలు ఉండకపోవడమే కాదు, కులమతాల పట్టింపులు కూడా లేని కుటుంబం మాది. అది నాలో సమాజం పట్ల బాధ్యతాయుత సంస్కారానికి బీజం వేసింది.
ఆంగ్ల సాహిత్యంతో కరచాలనం
కొలకలూరులో ఎస్‌ఎస్‌ఎల్‌సి పూర్తయ్యాక హైదరాబాద్‌లోని కోఠి ఉమెన్స్‌ కాలేజీలో జాయినయ్యాను. మా మేనమామ పిఎస్‌ రావు. ఆయన ఇంగ్లీష్‌ లెక్చరర్‌. వివేకవర్ధని కాలేజీలో పనిచేసేవారు. ఆంగ్లసాహిత్యంపై మంచి పట్టుంది ఆయనకి. ఆ ఇంట్లో కూడా ప్రజాస్వామిక వాతావరణం ఉండేది. కుటుంబం అంటే ఇలా ఉండాలి అని మా అత్త, మేనమామలను చూసి అర్థం చేసుకోవచ్చు. ఆ రోజుల్లో రచయిత్రి మాలతీచందూర్‌ ‘ప్రమదావనం, పాతకెరటాలు’ వంటి శీర్షికలతో ఇంగ్లీషు నవలలు చాలావాటిని తెలుగులో పరిచయం చేసేవారు. ఆ వ్యాసాలను చదివి, ఇంగ్లీష్‌ నవలలు తీసుకొచ్చి చదివేదాన్ని. అందులో తెలియని పదాలను నోట్‌బుక్‌లో రాసుకుని, వాటికి డిక్షనరీలో అర్థాలు వెతికి అవీ రాసుకునేదాన్ని. మళ్లీ మళ్లీ ఆ నవల చదవడం ఇదో వ్యాపకంలా ఉండేది. ఉమెన్స్‌ కాలేజీలో బిఎస్సీ చదివినా, ఆ వెంటనే ఆంగ్లసాహిత్యంపై మక్కువతో బిఏ ఇంగ్లీషు లిటరేచర్‌ కూడా చదివాను. డిగ్రీ పూర్తయ్యాక మేనమామ కొడుకుతోనే నా వివాహం జరిగింది. తర్వాత కొంతకాలం ఆంధ్రప్రభలో సబ్‌ఎడిటర్‌గా పనిచేశాను. ఆ తర్వాత అదీ మానేసి, ఎంఏ ఇంగ్లీషు లిటరేచర్‌ని ఆంధ్రా యూనివర్శిటీలో పూర్తిచేశాను. విజయవాడ సయ్యద్‌ అప్పలస్వామి కళాశాలలో ఆంగ్ల అధ్యాపకురాలిగా ఉద్యోగంలో చేరాను. 1980 నుంచి 1996 వరకూ పిల్లలకు పాఠాలు బోధించడం ఇంగ్లీషు సాహిత్యం గురించే కావడం వల్ల అది మరింత బాధ్యతగా కొనసాగింది.
అరవయ్యో దశకంలో మొదలై …
సాహిత్యం పట్ల అభిరుచి, సమాజాన్ని వీక్షించే అనురక్తిలో భాగంగా 1960వ దశకం నుంచీ కథారచనని ప్రారంభించాను. 1960-70లలో గోరాశాస్త్రి ఎడిటర్‌గా ఉండే ‘తెలుగు స్వతంత్ర’ పత్రికలో పది కథలు రాశాను. తొలికథ 1964లో ఆదివారం కోసం రాశాను. ఈ కథలో ఆదివారమైనా స్త్రీకి సెలవు ఉండాలని, అది వ్యక్తిగతమైన పనులు చేసుకోడానికి అవసరమని స్పష్టం చేశాను. ‘మర్రినీడ’ అనే కథా సంపుటితో జూన్‌ 1975లో నన్ను రచయిత్రిగా నవభారత్‌ బుకహేౌస్‌ సాహితీలోకానికి పరిచయం చేసింది. నా రచనలు తెలుగు స్వతంత్ర తర్వాత ఆంధ్రజ్యోతి వారపత్రికలో వచ్చాయి. దాని ఎడిటర్‌ పురాణం సుబ్రహ్మణ్యశర్మ చాలా ప్రోత్సహించేవారు. వీటితో పాటు నా కథలు, ఇతర రచనలు ఆనందవాణి, కథాంజలి, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, జ్యోతి మాసపత్రిక, అనామిక, పుస్తకం, ఉదయం, రచన, ఆహ్వానం, విపుల, ఇండియా టుడే, వార్త, చినుకు, భూమిక, ఈనాడు, అరుణతార తదితర పత్రికల్లో ప్రచురితమయ్యాయి.
బాగా ఇష్టమైన నా కథ ‘దమయంతి కూతురు’
నేను రాసిన కథలన్నింటిలోనూ స్త్రీలే ప్రధాన పాత్రలు. అలాగని వాటిలో ఏదో ప్రత్యేకించిన చర్చలు కనిపించవు. కథనంలోనో, సంభాషణల్లోనో భాగంగా సమస్య వ్యక్తమయిపోతూ ఉంటుంది. ఆ సమస్యకి మూలం ఏమిటి, దానికి పరిష్కారం ఎలా అన్న ఆలోచనను పాఠకులలో రేకెత్తిస్తూ ఉంటాయి. నాకు బాగా ఇష్టమైన నా కథ ‘దమయంతి కూతురు’. దమయంతి అన్నావిడ కుటుంబాన్ని వదిలి వెళ్లిపోవడం అన్నదే కథలోని సన్నివేశం. ఆవిడ ఎందుకు వెళ్లిపోయింది? పసిపిల్లలని వదిలేసి అలా వెళ్లిపోవడం ఎంతవరకు సబబు? వంటి విషయాల గురించి పెద్దగా వివరాలు కథలో కనిపించవు. మానసిక క్షోభ అనుభవించలేక ఆమె వెళ్లిపోయి ఉంటుందనీ… ఆమె దూరమై పిల్లలు ఎంత బాధపడ్డారో, ఆమె కూడా అంతగానే బాధని అనుభవిస్తూ ఉండి ఉంటుందన్న సూచనని మాత్రమే ఉంటుంది. కానీ అలాంటి స్త్రీ పట్ల, ఆమె పిల్లల పట్లా సమాజపు అభిప్రాయాలు ఎలా ఉంటాయో మాత్రం ఈ కథలో స్పష్టంగా కనిపిస్తాయి. ఈ కథపై ప్రశంసలు ఎన్ని వచ్చాయో విమర్శలు కూడా అంత ఎక్కువగానే వచ్చాయి.
కవిత్వంపై మక్కువ ఉన్నా
కవిత్వమంటే నాకు చాలా ఇష్టం. కానీ ఇంతవరకూ ఒక కవిత కూడా రాయలేదు. కవిత్వ పుస్తకాల్ని ఎంతో ఇష్టంగా చదువుతా. కథలు, నవలలతో పాటు కొన్ని పత్రికల్లో కాలమ్స్‌ రాశాను. ‘రాగం భూపాలం’ పేరిట భూమిక పత్రికలో స్త్రీల సమస్యలను వివరిస్తూ కాలం రాశాను. ఆహ్వానం పత్రికలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్త్రీవాద సాహిత్యాన్ని పరిచయం చేశాను. దీని ద్వారా ప్రపంచ దేశాలలో ఉన్న స్త్రీల జీవితాలు ఆయా సాహిత్యాలలో ఎలా ప్రతిబింబించాయో తెలుగు పాఠకులకు దృష్టికి తెచ్చాను. నేను రాసిన వ్యాసాలన్నీ స్త్రీ కోణం నుంచే సాగుతాయి. ఇవి సమాజంలో, కుటుంబంలో… ప్రతిచోటా స్త్రీ జీవితంలోని నియంత్రణ, హింసను బయటపెడతాయి. ‘యాసిడ్‌ ప్రూఫ్‌ ఫేస్‌ మార్క్‌’ వ్యాసంలో సౌందర్య సాధనాలు సహజ అందాలను ఎలా నాశనం చేస్తున్నాయో వివరించాను. మతం అంచులకు నెట్టివేయబడిన స్త్రీల అంతరంగాన్ని పరిచయం చేస్తూ ‘జ్ఞానదాతకే జ్ఞానదాత సుజాత’ అనే వ్యాసం రాశాను. అన్ని మతాలలాగానే బౌద్ధం కూడా స్త్రీని దూరంగానే ఉంచింది. మత గురువులూ మమ్మల్ని అజ్ఞానంలో ఉంచటానికే ప్రయత్నిస్తే ఎలా? అని బుద్ధుడినే ప్రశ్నించిన సుజాత గురించి.. బౌద్ధమత సాహిత్యం ఆధారంగా జరగవలసిన పరిశోధనలను గురించి.. ఈ వ్యాసంలో ప్రస్తావించాను. ఇలాంటివే కాకుండా కొడవటిగంటి కుటుంబరావు, కేశవరెడ్డి… మొదలైన వాళ్ల రచనలపై వ్యాసాలు కూడా రాశాను.
నవలల్లో వీక్షిస్తే …
కథలు మాత్రమే కాదు. ఆరు నవలలు కూడా రాశాను. ఇవి కూడా ప్రధానంగా స్త్రీలకు చెందినవే. ఇవి 1973-1988ల మధ్య కాలంలో రాశాను. ‘పద్మవ్యూహం’ నవలలోని సరస్వతి పాత్ర ఆర్థిక, కుటుంబ పరిస్థితులు అనుకూలించక ప్రేమ రాహిత్యంతో బాధపడే స్త్రీ ఎటువంటి ప్రలోభాలకు లోనవుతుందో వివరిస్తుంది. ‘పడుచుదనం రైలుబండ’ి నవలలోని నాగమణి పాత్ర కూడా ఇలాంటిదే. ‘గొడుగు, ఆ తప్పు నీది కాదు’ నవలలు కూడా పూర్తిగా స్త్రీ చైతన్యానికి సంబంధించినవే. అన్నపూర్ణ నవలలో స్త్రీలలో స్వీయగౌరవం వృద్ధి చెందుతున్నా, సమాజంలో ఉన్న విలువలతో సమన్వయం సాధించలేక తత్తరపాటు పడటాన్ని చెప్తుంది.
అనువాదకురాలిగా ...
ఎన్నో కథలు, నవలలు రాసిన నాకు అనువాద రచన ‘ఒక హిజ్రా ఆత్మకథ’కు కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించడంపై చాలామంది మిత్రులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నేను చేసే అనువాదాలూ ప్రామాణికమైనవే ఎంచుకుని చేస్తాను. ముఖ్యంగా నేను చేసిన అనువాదాల్లో సిమోన్‌ ది బోవా రాసిన ‘సెకండ్‌ సెక్స్‌, ఇస్మత్‌ చుగ్తారు కథలు, అనేక రామాయణాలు, ఒక హిజ్రా ఆత్మకథ’ వంటివి మంచి సంతృప్తిని ఇచ్చాయి. నా రచనలు కూడా ఇంగ్లీషులో వచ్చాయి. సమకాలీన మహిళే నా సాహిత్యకేంద్రం. నా రచనలకు వచ్చే పురస్కారాలన్నీ సమాజం పట్ల నా బాధ్యతని మరింతగా పెంచుతున్నాయనే భావిస్తాను. 1997లో చాసో స్ఫూర్తి, మొదలుకొని తాజాగా కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు.. ఇవన్నీ నా సాహిత్యకృషిని మరింత ముందుకు తీసుకెళ్లాలనే సూచిస్తాయి.
వివక్షను ఎదిరించే చైతన్యం పెరగాలి
నేటి మహిళల్లో అడుగడుగునా ఎదురవుతున్న వివక్షను ఎదిరించే చైతన్యం పెరగాలి. ఈ పితృస్వామ్య సమాజంలో మహిళలకున్న కష్టాలకంటే వారే కొని తెచ్చుకుంటున్న కష్టాలు ఎక్కువైపోయాయి. సమాజం వారిమీద బలవంతంగా రుద్దే పీడన, అపచారాలు, అవమానాలకు అంతేలేదు. ఈ ముప్పేట దాడిని సమర్ధంగా ఎదుర్కోవాలంటే జరుగుతున్న దోపిడీ స్వరూపాన్ని, దోచుకునే విధానాలను ఎండగట్టాలి. వివక్ష విశ్వరూపాన్ని ప్రదర్శింపజేయాలి. ఇంట్లో అమ్మాయిల విద్యాబుద్ధులకు ఖర్చుచేసే దానికన్నా అనవసర ఆడంబరాలకు ఖర్చు చేసేదే ఎక్కువ. ఈ పరిస్థితి మారాలి.
– పి.సత్యవతి, రచయిత్రి,
స్త్రీల కోణంలోనే …
యాభై ఏళ్లు దాటిన నా సాహిత్యంలో అన్నీ మహిళల కోణంలోంచి రాసినవే. నవలలు, వ్యాసాలను మినహాయిస్తే ఇప్పటివరకూ యాభై కథలు రాశాను. అవి పలు సంపుటాలుగా వచ్చాయి. మధ్యతరగతి మహిళ మనస్తత్వాన్ని పురుషస్వామ్యం రకరకాల మాయోపాయాలతో బురిడీ కొట్టించడం, మహిళలు ఆ బాధనంతా పళ్ల బిగువున భరిస్తూ గడపడం మొదటి సంపుటిలోని కథల్లో ఉంటుంది. మహిళ ఆ క్లిష్టతా చట్రం నుంచి ఒక సంపూర్ణ మానవిగా ఎదగడానికి పడాల్సిన శ్రమ, ఆ క్రమంలో తెంచాల్సిన కట్టుబాట్ల సంకెళ్లని రెండో సంపుటిలో కథలుగా ఆవిష్కరించాను. ఈ మొత్తం జెండర్‌ ఆధిపత్యపు ప్రహసనాన్ని చాపకింద నీరులాగా సమాజం ఎలా నియంత్రిస్తుంటుందో, విషవలయపు విశ్వరూపమెలా ఉంటుందో సరికొత్త సాహిత్య టెక్నిక్‌ (మాజిక్‌ రియలిజమ్‌) తో మూడో సంపుటిలో కథలు స్పష్టం చేస్తాయి. తర్వాత వచ్చిన ‘ఇల్లు అలకగానే, మంత్రనగరి, మెలుకువ’ కథా సంపుటాలు, వీటన్నింటిలో నలభై కథల్ని ఎంపిక చేసి ‘విశాలాంధ్ర’ ‘సత్యవతి కథలు’పేరిట ప్రచురించింది. వీటన్నింటిలోనూ మహిళా జీవనదృశ్యాలే కథా వస్తువులు.

– సంభాషణ : బెందాళం క్రిష్ణారావు

SA: