సాయిమాధవ్ బుర్రా – అంతర్వాహిని

సినీ మాటల రచయిత గా పేరొందిన సాయిమాధవ్ బుర్రా లో ఎంత మంచి కవి వున్నాడో ఈ కవిత చెబుతుంది….

దారి కనిపించటం లేదు..
కన్నీళ్లడ్డమొస్తున్నయ్..
తుడుచుకుందామంటే కుదరటంలేదు..
ఇవి కనిపించేకన్నీళ్లు కావు..
ఎదిరించి ఏడవలేక దాచుకున్న ఏడుపు తాలూకు అజ్ఞాత అశ్రుధారలు..
ఈ ప్రపంచపు మృతకళేబరాన్ని ఆసాంతం ముంచెత్తుతున్న అదృశ్య భాష్పతరంగాలు.
ప్రతిక్షణం నాకన్నీళ్లతో యుద్ధం చేస్తూనే వున్నా
నాకన్నీళ్లవేటుకు బలవుతూనేవున్నా..
మళ్లీ మళ్లీ నాకన్నీళ్లకే నేను పుడుతూవున్నా..
ఇప్పుడు నాకో సూర్యుడు కావాలి..
మండలేని మనసులమీద మండుటెండలు ప్రసరించే
‘చండభానుడి అండ కావాలి…
నాకో సమవర్తి కావాలి..
‘చచ్చాకొచ్చే సమవర్తి నాకక్కర్లేదు..
బతకటానికి సాయం చేసే సమవర్తి కావాలి..
అస్తిపంజరాల అస్తిత్వం కోసం రక్తమాంసాలు దోచుకునే
ఈ భూమండలాన్ని సమూలంగా
ప్రక్షాళన చేసి పాలించే సమవర్తి కావాలి..
వంగిపోయిన మానవసమాజాన్ని నిట్టనిలువున నిలబెట్టగల
ఒక్క వెన్నెముక కావాలి..
అంతవరకూ దారి కనపడదు…
రేపటికి అడ్డంగా ప్రవహిస్తున్న కన్నీళ్లు కూడా కనపడవు…

– సాయిమాధవ్ బుర్రా 

SA: