రజతోత్సవాల ‘సాయికళాస్రవంతి’ భారతదేశవ్యాప్తముగా పలు రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ వేదికల మీద దాదాపు 1000 పైబడి ప్రదర్శనలు ఇచ్చి పలు ప్రతిష్టాత్మక పురస్కారాలు, బహుమతులు పొంది తెలుగు నాటక గౌరవాన్ని ఇనుమడింప జేసిన సంస్థగ – తమ అనుబంధ సంస్థ యగు యన్టీఆర్ కళాపరిషత్ ద్వారా అఖిల భారత బహు భాషా నాటకపోటీలు, ఉత్సవాలు నిర్వహించి తెలుగు నాటక చరిత్రలోనే ఆ తరహా కార్యక్రమాలు నిరర్వహించిన తొలి సంస్థగా చరిత్ర సృష్టించిన సంస్థగా – తెలుగు నాటకచరిత్రలో తొలిసారిగా ప్రపంచనాటకోత్సవాలలో ఓ చారిత్రాత్మకనాటిక ప్రదర్శించి చరిత్ర సృష్టించిన సంస్థగా – బుద్ధం శరణం గచ్ఛామి వంటి పద్యనాటకాల్ని, రాగవాసిష్టం, హిరణ్యకశిప వంటి ఓల్డ్ క్లాసిక్స్న, కన్యాశుల్కం వంటి మహత్తర సాంఘిక నాటకాన్ని ప్రదర్శించిన సమాజముగా రసజ్ఞుల, విమర్శకుల మెప్పు పొందిన సంస్థగా – నేటిదాక రేపల్లె పరిసర ప్రాంతాలకు చెందిన దాదాపు 100 పైబడిన కళాకారులకు నటశిక్షణిచ్చిన చరిత్రగల సంస్థగా – తన ప్రస్థానాన్ని అత్యంత ఫలవంతముగా సాగిస్తున్నది మారుమూల తీరప్రాంతమైన రేపల్లెకు చెందిన సాయి కళాస్రవంతి. ఈ సంస్థ 19-11-2021కి రజతోత్సవాలను సంపూర్తి చేసుకుంది.
‘సాయికళా స్రవంతి’ పుట్టుపూర్వోత్తరాలను, పాతికేళ్ళ దాని ప్రస్థానాన్ని ఓసారి సింహావలోకనం చేసుకుంటే….. సుప్రసిద్ధ రంగస్థల నటప్రయోక్త, సాహితీవేత్త, చరిత్ర పరిశోధకులు మన్నె శ్రీనివాసరావు తన 13వ ఏట 1980లో చైతన్య సాంస్కృతిక యువజన సంఘం అనే నాటకసమాజాన్ని స్థాపించి, తొలుత ఎత్తుకు పై ఎత్తు నాటిక ద్వారా రచయితగ, నట దర్శకునిగ, సమాజనిర్వాహకునిగ ఏకకాలములో చతుర్ముఖీనుడై పదమూడో ఏటరంగప్రవేశం చేయటమైంది. పాఠశాలల పోటీలలో ఉత్తమ ప్రదర్శన, రచన, నటుడు బహుమతులను చేజిక్కున్న మన్నె, ఆయన సమాజం ఆపై వెనుతిరిగి చూచినది లేదు. ఆకాలంలో ఆ సమాజము నుంచి ప్రధానంగా విద్యార్ధి నిద్రలే, ఎత్తుకు పై ఎత్తు, పిచ్చివాళ్ళ సోషలిజం, సింహాచలం – భద్రాచలం (ఆశు నాటిక), మోడ్రన్ యముడు (ఏకపాత్ర), చాణక్య (ఏకపాత్ర), నడమంత్రపుసిరి, పశ్చాత్తాపం, గయోపాఖ్యానం(వార్ సీన్) ఇత్యాది నాటిక నాటకాలను మన్నె దర్శకత్వంలో నాటకపోటీలలోనూ శ్రీరామనవమి, దసరా వంటి ఉత్సవాలలోనూ వందలాదిమార్లు విజయవంతంగా ప్రదర్శింపబడటముతో నటవర్గమంతటికీ తగు గుర్తింపు వచ్చినది. ఒక్కో నాటిక ఒకే రోజు భిన్న వేదికల మీదనే కాక, ఒకే వేదికమీదనూ రెండు, మూడుమార్లు ప్రదర్శింపడిన సందర్భాలనేకం. వీటిలలో మన్నె శ్రీనివాసరావు వల్లభనేని మస్తాన్, గొల్లపూడి రామకృష్ణ, కాసరనేని మోహన్ చౌదరి, యలవర్తి వెంకటరామకృష్ణ, మునగాల వాణీప్రసాద్, ఉయ్యూరు కోటేశ్వరరావు, ఘంటా అంకినీడు ప్రసాదరావు ప్రభృతులు నటించేవారు. ఉత్తరకాలములో మన్నె శ్రీనివాసరావు బయట పెద్దలనుకూడా కలుపుకుని తన సారథ్యములోని చైతన్య సాంస్కృతిక యువజన సంఘము(1980)ని తమ నాట్యకళా గురుదేవులు కె.యస్.టి.శాయి గౌరవార్ధవం సాయికళాస్రవంతి పేరిట 19-11-1996న నామాంతరం చేసారు. నాటినుంచి ఈ సంస్థ నాటకప్రయోగంలోని అన్ని వైవిధ్య ప్రక్రియలను ప్రదర్శిస్తూ యశోవంతంగా ముందుకు సాగుతున్నది. ఈ సంస్థ ద్వారానే రేపల్లె కీర్తిప్రతిష్ఠలు కళారంగాన తొలిసారిగా జాతీయ, అంతర్జాతీయస్థాయిలో వెలుగులోకి వచ్చాయి. ఈ సంస్థ ప్రధానంగా జీవనగీత (1999), సమ్రాట్ అశోక(2000), హుష్ కాకి (1997), కొక్కొరోకో(1996), హిరణ్యకశిప(2004), బుద్ధం-అశోకం(2005), బుద్ధం శరణం గచ్ఛామి (2008), రాగ వాసిష్ఠం(2009), కన్యాశుల్కం ఇత్యాది నాటికనాటకాలను ప్రదర్శించుతూ విశేష ఖ్యాతి గడించుతున్నది. జీవనగీత, సమ్రాట్ అశోక, హుష్ కాకి, వేద(నా)భూమి ఇత్యాది నాటికలను జగదల్ పూర్, కటక్, అలహాబాద్, డెహ్రీ ఆన్ సోనే, ముద్గల్ పూర్ వంట్యనేక పలు రాష్రతర ప్రాంతాల్లో జరిగిన బహు భాషా నాటక పోటీలలో, ఉత్సవాలలో ప్రదర్శించి బహుమతులు, పురస్కారాలు పొందుట జరిగింది. సమ్రాట్ అశోక’ నాటికను 7వ ప్రపంచ నాటకోత్సవాలు (కటక్-2000)లో ప్రదర్శింపబడి ఏడు గౌరవపురస్కారాలు పొందటం యావత్ తెలుగునాటకరంగానికే గౌరవకారకంగా నిలిచింది. ఈ సంస్థ ఎదుగులకు శ్రీనివాసరావు సాగించిన నిర్మాణాత్మక కృషికి, అధ్యక్షులుగా వ్యవహరించుతూ సంపూర్ణ అండదండలను అందించుతూ ‘గుమ్మడి రాధాకృష్ణమూర్తి(తొలి అధ్యక్షులు), దొప్పలపూడి సుబ్బారావు(పెనమర్రు), పుట్టగంటి వేంకటసుబ్బారావు(వేమూరు), డా. చేబ్రోలు సూర్యం(అవనిగడ్డ) ప్రభృతలులు నిర్వహించిన పాత్ర గణనీయమైంది.
ఈ నాటకాలలో మన్నె శ్రీనివాసరావు, వల్లభనేని మస్తాన్, పోలూరు సుబ్బారావు, కుంచె వెంకటేశ్వరరావు, వీర్ల వెంకటేశ్వర రావు, వంకమామిడి మోహనరావు, మాజేటి వరప్రసాద్, పులి అజయ్ బాబు ఇత్యాది స్థానికులతోపాటు స్థానికేతర రంగస్థల దిగ్గజాలగు అన్నపురెడ్డి శివరామరెడ్డి(నూతక్కి), సినీ రంగస్థల నటులు కాకరాల, పుల్లేటికుర్తి వీరభద్రాచారి(బందరు), నర్సింగ్ ప్రసాద్, కాటి ఆగష్టీన్ బాబు(బాపట్ల)’ ప్రభృతులు నటించారు. ఈ సమాజానికి ప్రధాన సంగీతసారథి చిల్క ప్రసాద్. ఈ సమాజముద్వారా మన్నె శ్రీనివాసరావు గురుత్వములో నేటివరకు శతాధిక కళాకారులు నటశిక్షణ పొందుట విశేషం. , తమ సంస్థ రజత్సోవాల వేళ అధ్యక్షులుగా పోలూరు సుబ్బారావు, ఉపాధ్యక్షులుగా కుంచె వెంకటేశ్వరరావు నర్సింగ్ ప్రసాద్, కార్యదర్శిగామన్నెశ్రీనివాసరావు, సంయుక్తకార్యదర్శిగా వల్లభనేని మస్తాన్, కోశాధికారిగా సబ్బినేని రాంబాబు – కార్యవర్గ సభ్యులుగా ముండ్రటి శేషతల్పసాయి, నన్నం నాంచారయ్య(ఫ్రాన్సిస్), వెల్లటూరి సువర్ణాచారి, గుంటి సాంబశివరావు, గొరికపూడి దావీదు, అడ్డగడ శివభాస్కరరావు, లంకిరెడ్డి బసివిరెడ్డి, రేపల్లె వెంకటేశ్వరరావు, పులి అజయ్ బాబు, మన్నె తారకరామ మోక్షజ్ఞతేజలు ఏకగ్రీవముగా ఎన్నుకోబడ్డారు. భవిష్యత్ ప్రణాళికలు : తమ సంస్థ రజతోత్సవాల సందర్భంగా తాము చేపట్టనున్న కార్యక్రమాలను నూతన కార్యవర్గం ప్రకటించింది. ఔత్సాహిక కళాకారులకు నటన, దర్శకత్వాలలో ఉచిత శిక్షణ – తెలుగుభాషా పరిరక్షణకు కృషి చేయడంలో భాగంగా ఔత్సాహికులైన వర్ధిష్ణువులకు పద్యరచన, వచనరచన, నాటకరచనలలో ఉచిత శిక్షణ – ప్రస్తుతం రూపొందించిన మన చరిత్ర ఘనతలని చాటిన బుద్ధుడు, అశోకుడు జీవితచరిత్రలతోపాటు రామానుజాచార్య, ఆర్యచాణక్య వంటి మహనీయుల జీవితగాధలను నాటకాలుగా మలచి వర్తమాన తరానికి చరిత్రను చేరువ చేయడం.
-కళాసాగర్