రసభరితం వయోలిన్ కచేరి

అమెరికాలో స్థిరపడి, తెలుగు సంస్కృతి మూలాలను అందిపుచ్చుకొన్న దండిభట్ల సామప్రియ, సోమనాథ్ ల వయోలిన్ సంగీత కచేరీ సనాతన సంగీత సంప్రదాయానికి అద్దం పడుతుందని ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ, అధ్యక్షులు, గోళ్ల నారాయణరావు అన్నారు. 10-01-2020,శుక్రవారం నాడు విజయవాడలో, కళాక్షేత్ర ది డాన్స్ అకాడమీ, ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ, కల్చరల్ సెంటర్ కలసి మధు మాలక్ష్మి ఛాంబలో నిర్వహించిన సంగీత స్రవంతి కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హజరై, అమెరికాలోని వర్జీనియాలో స్థిరపడిన విజయవాడ దంపతుల బిడ్డలైన చి. సామప్రియ దండిభట్ల, చి.సోమనాథ్ దండిభట్ల అక్కా తమ్ముళ్ల స్వరవాయులీన ప్రదర్శన అత్యంత ఆసక్తికరంగా సాగిందని, వారిని అభినందించారు.

ముందుగా హంసధ్వని రాగం, ఆదితాళంలో, శ్రీ ముత్తై భాగవతార్ కీర్తన ‘గంగణపతి’తో ప్రారంభమై, ముత్తుస్వామి దీక్షితారు కీర్తన ‘స్వామి నాథ పరిపాలయమాం’ నాట రాగం, ఆదితాళంలో, రెండో అంశంగా సభికులను ఆకట్టుకొంది. తరువాత వరుసగా, ఖమాస్ రాగం, ఆదితాళంలో ‘ బ్రోచేవారెవరురా’ సరస్వతీ రాగం, రూపక తాళం లో ‘సరస్వతీ నమోస్తుతే’ , శ్యామ శాస్త్రి కీర్తన ‘మరి వేరే దిక్కెవరమ్మా’, ఆనందభైరవి, మిశ్ర చాపు తాళం, నారాయణ తీర్థుల తరంగం, ‘గోవర్ధనధారా ‘ దర్బారు కానడ రాగం, ఆది తాళం, త్యాగరాజ స్వామి కృతి ‘భవనుత నా హృదయము’, మోహనరాగం, ఆది తాళం, అన్నమాచార్య కీర్తన,’ నారాయణతే నమో నమో’, బేహాగ్ రాగం, ఆది తాళం, సౌరాష్ట్ర రాగంలో ఆదితాళంలో, పవమాన’ తో ముగిసిన సంగీత కచేరి ఆహుతులను అలరించింది. ఈ కార్యక్రమానికి ప్రారంభంలో ఘంటసాల పవన్ కుమార్ శిష్య బృందం ప్రదర్శించిన నాట్యం అలరించింది. తదనంతరం దండిభట్ల సామప్రియ, దండిభట్ల సోమనాథ్ లను కల్చరల్ సెంటర్, సీఈవో, డా.ఈమని శివనాగిరెడ్డి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది హజరత్తయ్య గుప్తా, ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్టు సిల్విస్టర్, వేమూరి వెంకట విశ్వనాధ్, ఘంటసాల పవన్ కుమార్, మాలక్ష్మి సంస్థల సంచాలకులు చింపిరయ్య పాల్గొన్నారు.

SA: