మద్ది గ్రామ ముద్దు బిడ్డ! పద్యనాటకాన పెరుగు గడ్డ!

సామవేదం వారింట త్రికాల సంధ్యావందనాలతో తండ్రి రామచంద్రరావు గారు రంగస్థలం నటులకు శిక్షణ ఇస్తున్న వేళ తండ్రి పట్ల భయము, భక్తి, వినయ విధేయతలు గల శ్రీరాముడు లాంటి ఆరేళ్ల బాలుడు” గా వీనుల విందైన హార్మోనియం శబ్ధానికి ముగ్ధుడై దూరంగా తలుపు సందుల్లో నుంచి చూస్తూ, ఆస్వాదిస్తూ, అనుకరణతో కూనిరాగాలు తీసిన నాటి భావి కళాకారుడతడు.

కొడుకు ఆసక్తిని ఓరకంటితో పారజూసిన తండ్రి ఒక్కసారిగా రారా! వచ్చి పాడరా! పాడు.
ఊ! అంటూ హార్మోనియం పీకలపై ఆరున్నర సృతిలో తిలక్ రాగ స్వరాలు పలికించాడు. తండ్రి ప్రోత్సాహం తోడయ్యే సరికి ఇంతకన్నా ఆనందమేమున్నదని భావించి,
శ్రీ రఘు:”రామచంద్రా” అంటూ రామనామ జపముతో ఆంజనేయుడి పద్యాలు తండ్రి చెప్పినట్లు చదివి “పువ్వు పుట్టగానే పరిమళించిందన్నట్లు” రంగస్థల పద్య పఠనం చేశాడు.

అతడే ఆ బాలుడే మన నేటి
రంగస్థలాన అష్టాదశ పాత్రధారి!!
అలుపెరుగని కళా బాటసారి!!
విందాం ఒక్క సారి!!
విశాఖపట్నం జిల్లా వినయ విధేయ విప్రుడు!!
పద్మనాభం మండల పంతులు!!,
మద్ది గ్రామం ముద్దు బిడ్డ!! –
పద్యనాటకాన పెరుగు గడ్డ!!
సమతా భావాల సమాహారం!!
డాక్టర్ సామవేదం బాలసుబ్రహ్మణ్యంగారు!!.

అందరికీ మామ చందమామ లాగే మద్ది గ్రామంలో అందరికీ మామయ్య, బాబాయ్, నాన్న, తాతయ్య తానై ఆత్మీయంగా వరసలతో సరసంగా, సరదాగా పలకరిస్తూ, అనురాగాన్ని, ఆప్యాయతను, గౌరవాన్ని పొందుతున్న పెద్దాయన. తారతమ్యాలు చూపడం తెలియని సహృదయుడు. గ్రామమంతా గౌరవించే జనాభిమానం బాలు గారి సొంతం.


జీవన ప్రస్థానం: సామవేదం బాలసుబ్రహ్మణ్యం గారు 1963 లో జన్మించారు. తల్లి దండ్రులు సామవేదం రామచంద్రరావు, పార్వతమ్మ గార్లు. పి.యు.సి. వరకు చదువుకొని పౌరోహిత్యం వృత్తిలో స్థిరపడ్డారు.

నట జీవితం: వృత్తి పౌరోహిత్యం అయినప్పటికి పద్యనాటకాన్ని ప్రాణంగా ప్రేమించే బాలు గారు తొలిసారిగా విశ్వా మిత్రుడు, కేశవుడు పాత్రలకు రంగస్థల రంగు రాసుకున్నాడు. నాటి నుండి నేటి వరకు తన నాటక ప్రస్థానంలో అష్టాదశ పాత్రలు (1. విశ్వామిత్రుడు, 2. కాలకౌశికుడు, 3. బిల్వమంగళుడు, 4. వశిస్టుడు, 5. సహదేవుడు, 6. హరిశ్చంద్రుడు, 7. నక్షత్రకుడు, 8. అక్రూరుడు, 9. వీరబాహుడు, 10. శ్రీ కృష్ణుడు, 11. విలన్, 12. బలరాముడు, 13. నారదుడు, 14. కేశవుడు, 15. పుష్పదంతుడు, 16. మాతాంగకన్య, 17. దుర్యోధనుడు, 18. సత్యకీర్తి) నటించి, నేపథ్యగాయకుడుగా గానం చేసి, కళారంగంలో ప్రత్యేకమైన ముద్ర వేసుకొని, ఎన్నో మైలు రాళ్లు దాటుతూ, ఎంతోమంది హార్మోనిస్ట్ లను పోషిస్తూ, రంగస్థలాన మహామహులతో పరిచయాలు కల్గి, వారితో కలిసి ప్రదర్శనలు ఇస్తూ, ఎంతో మంది కళాకారులను వృద్దిలోకి తేవడంలో ఆయన కృషి అభినందనీయం. ఉత్తరాంధ్రలో ఎంతో మంది మట్టిలో మాణిక్యాలు లాంటి కళాకారులను తేనె తెలుగు చానల్ “కళాభిషేకం” ద్వారా బాహ్య ప్రపంచానికి చూపించడంలోను, ప్రోత్సహించడం కోసం 500 కళాభిషేక ప్రశంసాపత్రాల తయారు చేయించి ఆ ప్రాంత కళాభిషేకం కార్యక్రమానికి CEO అంజనప్ప గారితో కలిసి సూత్రధారిగా, వారి అంతులేని సహకారం వెలకట్టలేనిది.

అవార్డులు:
కీ.శే. శ్రీ సూరంపూడి సోమరాజు గారి అధ్వర్యంలో “రంగసింహ” అని బిరుదు ప్రదానం, “ఉత్తమ డైరెక్షన్”, “ఉత్తమ నటుడు”, “ఉత్తమ నాటకం” అవార్డులు, శ్రీ సాయికళానికేతన్, విశాఖపట్నంవారి సౌజన్యంతో కళాభారతిలో “ప్రథమ బహుమతి” పొందారు.

కళా ప్రోత్సాహం: నాటకరంగం పది కాలాలపాటు వెలసిల్లాలన్న తపనతో నేటికీ రిహార్సల్స్ ఆపకుండా శ్రీ లోకిరెడ్డి కృష్ణమూర్తి గారిని హార్మోనిస్ట్ గా పోషిస్తూ, పోటీ నాటకాలు ఎక్కడ జరిగినా తనకు తెలిసిన కళాకారులను పదుల సంఖ్యలో ప్రదర్శనలో పాల్గొనేలా ప్రోత్సహించడం, పరిషత్ పోటీ నాటకాలకు గుణ నిర్ణేతగా వ్యవహరించడం, ఆపదలో ఉన్న కళాకారులకు చేతనైనంత సాయం చేసే మానవతావాది. నెగెటివ్ లో కూడా పాజిటివ్ ను వెతుక్కొనే నైజం గల్గి, వృత్తి – ప్రవృత్తులకు సమ ప్రాధాన్యతను ఇస్తూ, ఇల్లంతా వందలాది అవార్డులు, సన్మానాలు, మెమెంటోలతో వెలిగింపజేసుకున్న సామవేదం గారు ధన్యులు.

ఆకాంక్ష: ఎటువంటి పారితోషికానికి ఆశపడకుండా నాటి నుండి నేటి వరకు ఎన్నో ప్రదర్శనలిచ్చారు. నాటకం ద్వారా ద్వారా ఎంత వచ్చినా కళారంగానికే వినియోగించారు. కళారంగంలో వచ్చిన కష్టనష్టాలను ఆనందముగా స్వీకరించి, ప్రతీ ఒక్కరినీ కలుపుకుంటూ ఎంతో మందికి నాటక విద్యను నేర్పించి కళారంగంలో అభివృద్ధితో ఉన్నత శిఖరాలను అధిరోహించి ప్రజల మన్ననలు పొందారు. “తుదిశ్వాస విడిచే వరకు కళామతల్లి సేవచేస్తూ” రానున్న భావితరాలకు పౌరాణిక విద్యను అందించాలని.. మీ అందరి ఆదరాభిమానాలను పొందాలన్నది వీరి ఆకాంక్ష. వీరి కాంక్ష నెరవేరాలని, నాటకరంగాన మరింతగా వెలుగొందాలని ఆశిస్తూ….

-ఎస్. అంజనప్ప ( తేనె తెలుగు చానల్ నిర్వహకులు)

2 thoughts on “మద్ది గ్రామ ముద్దు బిడ్డ! పద్యనాటకాన పెరుగు గడ్డ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap