నయన మనోహరం ‘నృత్య’ నాటక సౌరభం

తెలంగాణ సంగీత నాటక అకాడమి ఆధ్వర్యంలో ఆదివారం(24-8-25) హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన నృత్య నాటక సౌరభం రసజ్ఞ ప్రేక్షకుల కళ్ళను కట్టిపడేసింది. వర్ణ ఆర్ట్స్ నాట్య గురువు స్మితా మాధవ్ బృందం ప్రదర్శించిన భరత నృత్యాంశాలు నయన మనోహరంగా ఆకట్టుకున్నాయి. తొలుత పుష్పాంజలితో ప్రారంభించి భారతీయ ఆత్మను భరతనాట్యంలో చాటిచెప్పారు. అనంతరం వ్యాస మహాభారతం ఆదిపర్వంలోని భక్తి రసాలను “ఆత్మావత్ సర్వ భూతేషు” నృత్య రూపకం ఆద్యంతం అద్భుతంగా సాగింది. ప్రేమభక్తి, దేశభక్తి, మానవతావాదం అన్నిటిని కళ్ళకు కట్టేలా ప్రదర్శించి హర్షద్వానాలందుకున్నారు. చక్కని నృత్య రూపకల్పన, రిథమిక్ సంగీతం అద్భుతంగా కుదిరాయి. అన్ని రంగాల్లోను మహిళలు ముందున్నారని “యత్ర నార్యస్తు పూజ్యంతే” తిల్లానా అంశంలో మహిళా శక్తిని చాటి చెప్పారు. స్మితా మాధవ్ నృత్య దర్శకత్వం వహించి నర్తించిన ఈ నృత్యాంశాలలో ఆమెతో పాటు భార్గవి పరమేశ్వరన్, అదితి నారాయణన్, నయన గులాటి తదితరులు ప్రదర్శించారు.

అనంతరం స్వర్గీయ గరికపాటి ఉదయభాను అనువదించి రూపకల్పన చేసి దర్శకత్వం వహించిన ప్రఖ్యాత నాటకం చరణదాస్ చోర్ జానపద నాటకాన్ని భూమిక కళాకారులు ప్రదర్శించి గొప్ప సందేశాన్ని చాటారు. హబీబ్ తన్విర్ హిందీలో చేసిన నాటకాన్ని తెలుగులో తీర్చిదిద్ది మూడు నందులు కైవసం చేసుకున్న ఈ నాటకంలో దొంగల్లోనూ మంచి దొంగలు ఉంటారని చాటి చెప్పింది. దొంగ తనకంటూ కొన్ని నియమాలు పెట్టుకోవడం ద్వారా తన జీవితం ఎలా మలుపులు తిరిగిందో ఎంతగా నష్టపోయాడో ఈ నాటకం కళ్ళకు అద్దింది.

ఈ సందర్భంగా జరిగిన అభినందన సభలో తెలుగు విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ వెలుదండ నిత్యానందరావు, గోథె జెంత్రం డైరెక్టర్ అమితా దేశాయ్, తెలంగాణ ఆర్య వైశ్య కార్పొరేషన్ అధ్యక్షురాలు కల్వ సుజాత పాల్గొని కళాకారులను సత్కరించారు. తెలంగాణ సంగీత నాటక అకాడమి విలక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోందని అభినందించారు. తెలంగాణ సంగీత నాటక అకాడమి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా డాక్టర్ అలేఖ్య పుంజాలను ఘనంగా సత్కరించారు. సంవత్సరం కాలంలో అనేక కార్యక్రమాలు నిర్వహించామని, భవిష్యత్ లో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని డాక్టర్ అలేఖ్య పుంజాల సంతోషం వ్యక్తం చేశారు. ఎం. దక్షిణామూర్తి వ్యాఖ్యాతగా వ్యవహరించగా, ఆర్.వినోద్ కుమార్ పర్యవేక్షించారు.

–డా. మహ్మద్ రఫీ
ఫోటోలు : రోషన్

Share via
Copy link
Powered by Social Snap