జాతీయ స్థాయిలో మెరిసిన తెలుగు కళాకారులు!
2024, 2025 సంవత్సరాలకు గాను ప్రతిష్టాత్మక పురస్కారాలు!!
భారతీయ కళలు, సంస్కృతీ సంప్రదాయాలను ప్రోత్సహించడంలో అత్యున్నత సంస్థ అయిన ‘కేంద్ర సంగీత నాటక అకాడమీ’ ఎట్టకేలకు 2024, 2025 సంవత్సరాలకు గాను ప్రతిష్టాత్మక పురస్కారాలను ప్రకటించింది. నాటకం, సంగీతం, నృత్యం తదితర లలిత కళల్లో విశేష కృషి చేసిన ఎందరో మహానుభావులను ఈ అవార్డులు వరించాయి. ఈ జాబితాలో గుమ్మడి గోపాలకృష్ణ, రత్తయ్య శర్మ, రాజేశ్వరి సాయినాధ్, వోలేటి రంగమణి వంటి ఉద్ధండులైన తెలుగు కళాకారులకు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది.
పురస్కారాల ప్రకటన – నేపథ్యం
గత మార్చి నెలలోనే 2024, 2025 సంవత్సరాలకు సంబంధించిన అవార్డుల ఎంపిక జరిగింది. అయితే, ఎంపికపై కొన్ని విమర్శలు రావడంతో జాబితాను వెల్లడించవద్దంటూ కేంద్ర హోం శాఖ నుంచి ఆదేశాలు అందాయి. దాంతో ఆగిన ఈ ప్రక్రియ, ఇన్నాళ్లకు కొన్ని మార్పులు చేర్పులతో పూర్తి కాబడి తుది జాబితా విడుదలైంది. జాతీయస్థాయిలో వివిధ కళా రంగాలకు సంబంధించి మొత్తం కింది విధంగా ఎంపికలు జరిగాయి:
కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డులు: 108 మందికి
ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కారాలు: 106 మందికి
గౌరవ ఫెలోషిప్ (అకాడమీ రత్న): 7 గురికి
బహుమతి వివరాలు:
భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా ఢిల్లీలో జరిగే ప్రత్యేక ప్రదానోత్సవంలో విజేతలకు ఈ పురస్కారాలను అందజేస్తారు. బహుమతుల వివరాలు ఇలా ఉన్నాయి:
గౌరవ ఫెలోషిప్ (అకాడమీ రత్న): ఒక్కొక్కరికి రూ. 3 లక్షల నగదు మరియు తామ్రపత్ర సత్కారం.
కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం: ఒక్కొక్కరికి రూ. 1 లక్ష నగదు మరియు తామ్రపత్రం.
యువ పురస్కారం: ఒక్కొక్కరికి రూ. 25 వేల నగదు మరియు తామ్రపత్రం.
తెలుగు రాష్ట్రాల పురస్కార గ్రహీతలు: జాతీయ స్థాయిలో ప్రకటించిన ఈ పురస్కారాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎందరో కళాకారులు తమ సత్తా చాటారు. సంవత్సరాల వారీగా విజేతల వివరాలు:
2024 వ సంవత్సరానికి ఎంపికైన వారు:
గుమ్మడి గోపాలకృష్ణ (రంగస్థల నటన)
శ్రీమతి రాజేశ్వరి సాయినాథ్ (భరతనాట్యం)
శ్రీమతి వోలేటి రంగమణి (నృత్య కళాసేవ)
డా. వీణా మూర్తి విజయ్ (కూచిపూడి – బెంగళూరు)
శ్రీమతి టి.ఎస్. సత్యవతి (సంగీతం)
సూర్యనారాయణ కుమార (నృత్యం, సంగీతం – కూచిపూడి)
2025 వ సంవత్సరానికి ఎంపికైన వారు:
శ్రీ రత్తయ్య శర్మ (కూచిపూడి)
శ్రీ కొమండూరి శేషాద్రి (సంగీతం – గాత్రం)
శ్రీ డి. శ్రీనివాస్ (సంగీతం – వీణ)
డా. పంతుల రమ (సంగీతం – గాత్రం)
ఎస్. కుమార్ (కూచిపూడి – భాగవతుల మేళా)
పి. నాగజ్యోతి, పి. సీతాజ్యోతి (కూచిపూడి – సంయుక్తంగా)
శిందే చలపతిరావు (జానపదం – తోలుబొమ్మలాట)
ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కారాలు:
కళా రంగంలో విశేష ప్రతిభ కనబరుస్తున్న యువతీ యువకులను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఇచ్చే ‘ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కారాలకు’ తెలుగు నేల నుండి ఈ కింది వారు ఎంపికయ్యారు:
వేదాంతం సిద్దేంద్ర (కూచిపూడి)
సాత్విక పెన్నా (ఆంధ్రనాట్యం)
లహరి కొలచెల (సంగీతం)
పి. అజయ్ శ్రీనివాస్ చక్రవర్తి (కూచిపూడి)
బి. సుచిత్ర (హరికథ)
పావని పసుమర్తి (సంగీతం)
షేక్ మెహబూబ్ సుభాని (మాండోలిన్)
బి.ఎస్. ప్రశాంత్ (మృదంగం)
సంగీత నాటక అకాడమీ అవార్డుల్లో తెలుగు కళాకారులకు పెద్దపీట దక్కడం మన సంస్కృతికి, కళలకు జాతీయ స్థాయిలో దక్కిన అరుదైన గౌరవం. దశాబ్దాలుగా కళలనే నమ్ముకుని, వాటి అభివృద్ధికే అంకితమైన ఈ మహానుభావులకు పురస్కారాలు దక్కడం ప్రతి తెలుగువాడు గర్వించదగ్గ విషయం. ఇది రాబోయే యువ కళాకారులకు ఎంతో స్ఫూర్తిదాయకం.
కర్ణాటక రాష్ట్రం నుంచి ఈ అవార్డులకు ఎంపికయిన తెలుగు వారిలో డా. వీణా మూర్తి విజయ్: కూచిపూడి (బెంగళూరు, కర్ణాటక), శ్రీమతి టి.ఎస్. సత్యవతి: సంగీతం (ప్రధానంగా కర్ణాటక నేపథ్యం) ఉన్నారు.
-కళాసాగర్
