సత్యభామగా సంజయ్ ‘నవ జనార్దన పారిజాతం’

నటరాజ రామకృష్ణ ‘నృత్యరత్న’ తొలి జాతీయ పురస్కారంతో కళాకృష్ణకు ఘన సత్కారం

సత్యభామ వేషం ధరించి అతను అరుదైన దరువులు ప్రదర్శిస్తుంటే కళాప్రియుల హృదయాలు తన్మయత్వం చెందాయి. సత్యభామగా అంతర్జాతీయ గుర్తింపు పొందిన హాంగ్ కాంగ్ కు చెందిన సంజయ్ వడపల్లి ఆంధ్ర నాట్య శైలిలో నవజనార్దన పారిజాతం ప్రదర్శించి కొన్ని కొత్త దరువులతో ఆకట్టుకున్నారు. వడపల్లి కల్చరల్, ది డ్యాన్సింగ్ బెల్స్ నృత్య సంస్థ ఆధ్వర్యంలో శనివారం(4-4-2026) సాయంత్రం హైదరాబాద్, సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వ విద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియంలో సంజయ్ వడపల్లి ఆంధ్రనాట్యం ప్రదర్శన కనుల పండువగా జరిగింది. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, హరికథ భాగవతారిణి పద్మశ్రీ ఉమా మహేశ్వరి, అన్నమయ్య పరిశోధకులు డా. గంధం బసవ శంకరరావు, డా. మహ్మద్ రఫీ, డా. పద్మ మోహన్, సునీల గొల్లపూడి, పేరిణి శ్రీనివాస్ తదితరులు పాల్గొని జ్యోతి ప్రకాశనం చేసి లాంఛనంగా సంజయ్ నృత్య ప్రదర్శనను ప్రారంభించారు.

వడపల్లి కల్చరల్, డ్యాన్సింగ్ బెల్స్ సంస్థ తొలిసారి ప్రవేశపెట్టిన డాక్టర్ నటరాజ రామకృష్ణ నృత్యరత్న జాతీయ పురస్కారంతో కేంద్ర సంగీత నాటక అకాడమి అవార్డు గ్రహీత, నటరాజ రామకృష్ణ మానస పుత్రుడు ఆచార్య డాక్టర్ కళాకృష్ణను ఘనంగా సత్కరించారు. ఈ అవార్డు కింద 20 వేల రూపాయల నగదు, జ్ఞాపిక శాలువా బహూకరించారు. ఇకపై ప్రతి యేటా విశిష్ఠ ప్రతిభ కనబరచే నాట్య గురువును నటరాజ రామకృష్ణ నృత్యరత్న జాతీయ పురస్కారంతో సత్కరిస్తామని సంజయ్ వడపల్లి తెలిపారు.

సంజయ్ వడపల్లి అభినవ సత్యభామగా అద్భుత ప్రదర్శన చేశారని డా. ఏనుగు నరసింహారెడ్డి ప్రసంశించారు. నవ జనార్దన పారిజాతంలో విష్ణుమూర్తి మోహిని అవతారం ధరించి అమృతాన్ని దేవతలకు అసురులకు పంచిపెట్టిన ఘట్టాన్ని సంజయ్ వడపల్లి హృద్యంగా రసరమ్యంగా ప్రదర్శించారు. ముఖ్యంగా శ్రీకృష్ణుడు సత్యభామ మధ్య కలహ కారక సంవాద ఘట్టం విశేషంగా ఆకట్టుకుంది. సత్యభామ పాత్రలో సంజయ్ ప్రదర్శించిన విరహ వేదన, చెలికత్తెతో రాయబారం, చివరకు వేడుకోలు సన్నివేశంలో అతను ఆమెగా ప్రదర్శించిన లయ లాస్య వయ్యార విన్యాసాలు అలరించాయి. సత్యభామ రాజస దర్పం, చాతుర్య శైలి, మృదు మధురస లాలిత్యం, హొయలు నడక వయ్యారం, హావ భావ విన్యాసాలతో సంజయ్ తన నృత్య కళా వైభవాన్ని చాటుకుని ప్రేక్షకుల కళ్ళను కట్టిపడేసారు.

వృత్తిపరమైన జీవితం:
సంజయ్ వడపల్లి ఒకవైపు నృత్య కళలో రాణిస్తూనే, వృత్తిపరంగా ఆయన ప్రస్తుతం హాంగ్ కాంగ్‌లోని హెచ్.ఎస్.బి.సి (HSBC) బ్రాంచ్‌లో అసోసియేట్ డైరెక్టర్‌గా ఉన్నత బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వీరు హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య లాంటి సంస్థలు నిర్వహించే ఉగాది తదితర సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ తన నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరిస్తుంటారు.

నట్టువాంగం డాక్టర్ కళాకృష్ణ చేయగా, బెంగళూరుకు చెందిన రమా జగన్నాధ్ గాత్ర సహకారం అందించారు. మృదంగంతో బి.జనార్దన్, వయోలిన్ తో మహావాది వాసుశాస్త్రి, వేణువుతో దత్తాత్రేయ వాయిద్య సహకారం అందించి రక్తి కట్టించారు. ఈ సందర్భంగా సంజయ్ వడపల్లిని నర్తనం సంస్థ ప్రతినిధులు పద్మ మోహన్, సునీల గొల్లపూడి ఘనంగా సన్మానించి అభినందించారు. టి. రమేష్ ఆహార్యం, చేగొమ్మ పవన్ కుమార్ వ్యాఖ్యానం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

డా. మహ్మద్ రఫీ
ఫోటోలు : సతీష్ కుమార్

Share via
Copy link
Powered by Social Snap