తెలుగు నేల పై పాలపొంగుల స్రవంతి –
మెట్ట మాగాణుల పాడి పంటల కాంతి సంక్రాంతి
మనిషికి మన్నుతో మిన్నుతో మైత్రికి ప్రతీక
స్వేదం చిందించి చేసిన సేద్యంలో అందిన పంటలను కని పులకించిన
అన్నదాత ఆలపించు ఆనందగీతిక సంక్రాంతి
పురిటినొప్పులకోర్చి “ధాన్యలక్ష్మి”ని ప్రసవించిన ధరణికి
‘పురి’టి స్నానాల పండుగ సంక్రాంతి…
‘చూలింత’ – ‘బాలింత’గా మారిన నేల తల్లికి పల్లె జనం జరిపే జాతర సంక్రాంతి
జగతి జనులకు అన్నం పెట్టే మట్టి బలం సంక్రాంతి
వారిని పెంచి పోషించే పొలాలలో అన్నదాతల ఆనంద కోలాహలం’ సంక్రాంతి
మట్టిలో బంగారం పండించే రైతన్నల నేర్పు పేరు –
నారు ‘పైరు’గా మారిన మార్పు పేరు సంక్రాంతి
మంచి మార్పుకు మరో పేరు సంక్రాంతి…
మడులన్నీ ఇబ్బడి ముబ్బడిగా పండగా
పేదరైతులు జరుపుకునే అతి పెద్ద పండగ సంక్రాంతి
ముత్యాల ముగ్గుల నడుమ గోమయం గొబ్బిళ్లు –
ముద్దబంతి పూరేకలు జల్లిన అందమైన పూరిళ్ల వాకిళ్లు
కోళ్ల పందేలకై పల్లెటూర్లు” వచ్చి పోయే వాళ్ల సందళ్లు –
ఊరి పొలిమేర దేవత, దేవరల తిరునాళ్లు…
అరిసెలు, పొంగళ్లు, గారెలు, నాటు కోళ్లు, రేగిపళ్లు, పతంగులు
ఆవులు, ఎడ్లు, గేదెలు, గాదెలు కలగలిపితేనే సంక్రాంతి
మకరరాశి వైపు సూర్యునియాత్ర సంక్రాంతి –
ధాన్యరాశి వైపు కర్షకుని జైత్రయాత్ర సంక్రాంతి
అందరికీ అన్నం పెట్టే అక్షయపాత్ర సంక్రాంతి
మానసిక ఋగ్మతలకు మంచి సాంస్కృతిక మాత్ర సంక్రాంతి
హరిదాసు చిందులు – గంగిరెద్దు గంతులు
కనివిందు చేయు కమనీయ దృశ్యమాలిక సంక్రాంతి…
రైతుకు వ్యయప్రయాసల వ్యవ’సాయం’ ఫలించి అందించిన
అనిర్వచనీయమైన అనుభూతి సంక్రాంతి
మన సంస్కృతి – సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల భవ్య విభూతి సంక్రాంతి
జాతి, కులమతాలకతీతమైన సార్వజనిక సుఖసంతోషాల కాంతి సంక్రాంతి
కృషి వలన వచ్చు “ఖుషి” సంక్రాంతి…
-బి.ఎం.పి. సింగ్